ఇతిహాసములు భాగవతము ఏకాదశ స్కంధము
క. వినుము నృపాలక సెప్పెద
ఘన మై విలసిల్లు పూర్వకథ గల దదియు\న్‌
మును ద్వారక కేతెంచియు
నొనరఁగ నారదుఁడు కృష్ణు నొయ్యనఁ గాంచెన్‌.
29
వ. దేవముని కృష్ణ సందర్శనార్థం బరుగుదెంచి, తద్గృహాభ్యంతరమున కరిగిన,
వసుదేవుం డ మ్మునీంద్రుని నర్ఘ్య పాద్యాది విధులం బూజించి, కనకాసనాసీనుం
గాంచి, యుచిత కథా వినోదంబులం బ్రొద్దు పుచ్చుచు ని ట్లనియె. ఏ నరుండు
నారాయణ చరణ సరసీరుహ భజన పారాయణత్వంబు నిరంతరంబు నొందఁ డట్టి
వానికి మృత్యువు సన్నిహితం బై యుండు. నీ దర్శనంబునం గృతార్థుండ నైతి.
అచ్యుతానంత గోవిందాది నామస్మర ణై కాగ్రచిత్తు లైన మీవంటి పుణ్యపురుషుల
సమాగమంబున లోకులు సుఖాశ్రయు లై యుండుదురు. దేవతా భజనంబు సేయువారిని
గీర్వాణులు ననుగ్రహింతురు. అట్లు సజ్జనులును, దీనవత్సలులు నగువారలు పూజనాది
క్రియలచే నా దేవతలను భక్తి సేయుదురు. కావున శ్రీ మన్మహాభాగవత
కథాసమూహంబులం గల ధర్మంబు లడిగెద. ఏ యే ధర్మంబులు శ్రవణ సుఖంబులుగా
వినిన, దండధర కింకర తాడనంబులం బడక, ముకుంద చరణారవింద వందనాభిలాషు
లై, పరమపద ప్రాప్తు లగుదు, రా ధర్మంబు లానతిమ్ము. తొల్లి గోవిందునిం బుత్రునిఁ గా
గోరి, ముక్తిమార్గం బెఱుంగలేక దేవతామాయం జేసి, చిక్కి, చిత్తవ్యసనాంధకారం
బగు సంసారంబునం దగులువడి యున్నవాఁడ. హరికథామృతంబు వెల్లిగొల్పుము. అట్లైన
సుఖంబు గల్గు. అనిన, వసుదేవ కృతప్రశ్నుం డైన నారదుండు వాసుదేవ కథా
ప్రసంగ సల్లాప హర్షసమేతుం డై, సంతసం బంద ని ట్లనియె.
30
క. నను నీవు సేయు ప్రశ్నము
జన సన్నుత! వేద శాస్త్ర సారాంశం బై
ఘన మగు హరి గుణకథనము
విను మని వినుపింపఁ దొణఁగె వేడ్క దలిర్ప\న్‌.
31
క. అతి పాపకర్ము లైనను
సతతము నారాయణాఖ్య శబ్దము మదిలో
వితతంబుగఁ బఠియించిన
చతురులఁ గొనియాడఁ గమలసంభవు వశమే.
32
వ. అట్లు గావునఁ బరమేశ్వర భక్తిజనకం బై, కైవల్యపద ప్రాప్తికరం బై, యొప్పుచున్న
విదేహర్షభ సంవాదంబు నాఁ బరఁగు నొక పురాతన పుణ్యకథా విశేషం బెఱింగించెద.
సావధాన మనస్కుండ వై యాకర్ణింపుము. అని యి ట్లనియె.
33
తే. వినుము స్వాయంభువుం డను మనువునకును
రమణ నుదయించె నఁట ప్రియవ్రతు డనంగఁ
దనయుఁ డాతని కాగ్నీధ్రుఁ డనఁగ సుతుఁడు
జాతుఁ డయ్యెను భువన విఖ్యాతుఁ డగుచు.
34
వ. ఆ యాగ్నీధ్రునకు నాభి యను ప్రాజ్ఞుం డగు తనూభవుం డుదయించి, బలిచక్రవర్తితో
మైత్రింజేసి, ధరణీభారంబు పూని, యాజ్ఞాపరిపాలనంబున నహిత రాజన్య రాజ్యంబుల
స్వవశంబులు గావించుకొని యుండె. అంత నా నాభికి సత్పుత్రుం డైన ఋషభుండు పుట్టె.
అతండు హరిదాసుం డై సుతశతకంబు వడసె. అం దగ్రజుం డైన భరతుం డను మహానుభావుండు
నారాయణ పరాయణుం డై, యిహలోక సుఖంబులం బరిహరించి, జన్మత్రితయంబున ఘోరతపం
బాచరించి, నిర్వాణ సుఖపారవశ్యంబున సకలబంధ విముక్తుం డై, వాసుదేవ పదంబునుం
బొందె. అతని పేర భారతవర్షం బను భూఖండ నామ వ్యవహారంబు నెగడి, జగంబులం
బ్రసిద్ధం బయ్యె. మఱియు నందుఁ దొమ్మండ్రు కుమారులు బల పరాక్రమ ప్రభావ రూప సంపన్ను
లై, నవఖండంబులకు నధిష్ఠాత లైరి. వెండియు, వారలలో నెనుబది నెనుబదియొక్కండ్రు
కుమారులు నిత్య కర్మానుష్ఠాన పరతంత్రు లయి, విప్రత్వం బంగీకరించిరి. అందుఁ గొందఱు
శేషించిన వారలు, కవి హ ర్యంతరిక్ష ప్రబుద్ధ పిప్పలాయన హవిర్హోత్ర ద్రమీళ చమస
కరభాజను లనం బరఁగు తొమ్మండుగు రూర్ధ్వ రేతస్కు లయి, బ్రహ్మవిద్యా విశారదు లగుచు,
జగత్త్రయంబునుం బరమాత్మ స్వరూపంబుగాఁ దెలియుచు, ముక్తు లై, యవ్యాహత గమను లగుచు,
సుర సిద్ధ సాధ్య యక్ష గంధర్వ కిన్నర కింపురుష నాగలోకంబులందు స్వేచ్ఛావిహారంబు
సేయుచు, నిరంతరానందంబు వడసి యుండ, నొక్కనాఁడు.
35
క. జగదేకనాథు గుణముల
మిగులఁగ సంస్మరణతోడ మీఱిన భక్తి\న్‌
బగలును రాత్రియు సంధ్యలు
దగిలి జితేంద్రియులు నయిన తపసులు ధాత్రి\న్‌.
36
క. ఊహింపఁ బుణ్యుఁ డయిన వి
దేహుని యజ్ఞాంతమందు నేతెంచినచో
గేహము వెడలి యెదుర్కొని
మోహవివర్జితులఁ బుణ్యముని సంఘముల\న్‌.
37
తే. అర్ఘ్యపాద్యాది విధులను నర్థితోడఁ
బూజఁ గావించి వారలఁబొలుపు మిగుల
నుచిత పీఠంబులందుల నునిచి యెలమి
నవ మునిశ్రేష్ఠులను భూమినాయకుండు.
38
క. వారల కి ట్లను మీరలు
గారవమున విష్ణుమూర్తిఁ గయికొన్న మహా
భూరి తపోధన వర్యులు
సారవిహీనంబు లయిన సంసారముల\న్‌.
39
క. ఏరీతిఁ గడవ నేర్తురు
క్రూరులు బహు దుఃఖ రోగ కుత్సితబుద్ధుల్‌
నీరసులు నరులు గావున
నారయ సుజ్ఞానబుద్ధి నానతి యీరే.
40
ఋషభకుమారుం డగు కవి విదేహునకు పరమార్థోపదేశము చేయుట
వ. మఱియు, సకల జంతుసంతానంబుకంటె మానుషాకారంబు నొందుట దుర్లభంబు. అంతకంటె
నారాయణ చరణయుగళ స్మరణ పరాయణు లగుట దుష్కరంబు. కావున, నాత్యంతికం
బైన క్షేమం బడుగవలసె. పరమేశ్వరుండు ప్రపత్తి నిష్ఠులకు సారూప్యం బెట్లొసంగు
న త్తెఱం గానతిండు. అనిన విని, విదేహభూపాలునకు హరికథామృత పానాతిపరవశు
లయిన మునిసమాజంబునందుఁ గవి యను మహానుభావుం డి ట్లని చెప్పఁ దొణంగె.
అరిషడ్వర్గంబునందు నేషణత్రయంబు చేతం దగులువడి, మాత్సర్యయుక్త చిత్తుం డగునట్టి
వాని కెవ్విధంబున నచ్యుత పాదారవింద భజనంబు సంభవించు? విశ్వంబును, నాత్మయు
వేఱుగా భావించు వానికి భీరుత్వం బెట్లు లేదు? అవిద్యాంధకార మగ్నులకు హరిచింతనం
బెట్లు సిద్ధించు? అట్టి నరుండు తొంటి కళేబరంబు విడిచి, పరతత్త్వం బె బ్భంగిఁ జేరు?
ముకుళీకృత నేత్రుం డైన నరుండు మార్గభ్రమణంబునఁ దొట్రుపాటువడి చను చందంబున,
విజ్ఞాన విమలహృదయ భక్తిభావనా వశంబు లే కున్నఁ బరమ పదంబు వీరి కె
వ్విధంబునం గలుగు? అని యడిగితివి గావునఁ జెప్పెద. సావధానుండ వై యాకర్ణింపుము.
41
క. కరణ త్రయంబు చేతను
నరుఁ డే కర్మంబు సేయు న య్యై వేళ\న్‌
హరి కర్పణ మని పలుకుట
పరువడి సుజ్ఞానమండ్రు పరమ మునీంద్రుల్‌.
42
వ. జ్ఞానాజ్ఞానంబులందు సంకలితుం డైన స్మృతివిపర్యంబు నొందు. అట్లు గావున గురుదేవతాత్మకుం
డై బుద్ధిమంతుం డైన మర్త్యుండు, శ్రీవల్లభు నుత్తమోత్తమునిఁగాఁ జిత్తమునఁ జేర్చి,
సేవింపవలయు. స్వప్నమనోరథేచ్ఛాద్యవస్థలయందు సర్వసంకల్ప నాశం బగుటంజేసి,
వానిఁ గుదియంబట్టి, నిరంతర హరిధ్యానపరుం డైన వానికిఁ గైవల్యంబు సులభంబునం
గరతలామలకం బై యుండు.
43
సీ. సంతతంబును గృష్ణ సంకీర్తనంబులు వీనుల కింపుగా వినఁగవలయు
హరినామ కథనంబు హర్షంబు తోడుతఁ బాటల నాటలఁ బరఁగవలయు
నారాయణుని దివ్య నామాక్షరంబులు హృద్వీథి సతతంబు నెన్నవలయుఁ
గంజాక్షు లీలలు గాంతారముల నైన భక్తియుక్తంబుగాఁ బాడవలయు.
 
తే. వెఱ్ఱిమాడ్కిని లీలతో విశ్వమయుని
నొడువుచును లోకబాహ్యత నొందవలయు
నింతయును విష్ణుమయ మని యెఱుఁగవలయు
భేద మొనరింపవలవదు మేదినీశ!
44
ఋషభకుమారు లగు హరియు నంతరిక్షుండును సేసెడు భాగవత స్వరూపోపదేశము
వ. అనిన విదేహభూపాలుండు, భాగవతధర్మం బెద్ది, యే ప్రకారంబునం బ్రవర్తించు?
అట్టి భాగవత చిహ్నంబు లెవ్వి? ఇంతయు నెఱింగింప మీర యర్హులరు. అనిన, నందులో
హరి యను మహాత్ముం డి ట్లనియె.
45
తే. సర్వభూతమయుం డైన సరసిజాక్షుఁ
డతఁడె తన యాత్మయం దుండు ననెడివాఁడు
శంఖ చక్ర ధరుం డంచుఁ జనెడువాఁడు
భక్తిభావాభిరతుఁడు వో భాగవతుఁడు.
46
క. వర్ణాశ్రమ ధర్మంబుల
నిర్ణయ కర్మములఁ జెడక నిఖిల జగత్సం
పూర్ణుఁడు హరి యను నాతఁడె
వర్ణింపఁగ భాగవతుఁడు వసుధాధీశా!
47
వ. ఇట్లు సర్వసంగపరిత్యక్తుం డై, నిఖిలాంతరాత్మకుం డైన పరమేశ్వరుం డరుణ గభస్తి
కిరణ సహస్రంబుల లోకత్రయంబునందు బావనంబు చేయుచందంబున, నందనందనుని
చరణారవింద రజఃపుంజంబులచేతం బవిత్రంబు సేయుచు, సురాసుర జేగీయమానం బైన
జనార్దన పాదారవిందంబునకు వందనాభిలాషుఁ డై, భక్తియు లవమాత్రంబునుం
జలింపనీక, సుధాకరోదయంబున దివాకరజనిత తాపంబు నివారణం బైన భంగి,
నారాయ ణాంఘ్రి నఖ మణి చంద్రికా నిరస్త హృదయ తాపుండు, నాత్మీయ భక్తి
రచనానుబంధ బంధురుండును నై, వాసుదేవ చరణసరోరుహ ధ్యానానంద పరవశుం
డగు నతండు, భాగవత ప్రధానుండు. అని యెఱింగించిన, విని విదేహుం డి ట్లనియె.
48
AndhraBharati AMdhra bhArati - itihAsamulu - bhAgavatamu - EkAdaSa skaMdhamu - bammera pOtana poetana pothana potanAmAtya pOtanAmAtyuDu ( telugu andhra )