ఇతిహాసములు భాగవతము ఏకాదశ స్కంధము
క. గజరాజ వరదు గుణములు
త్రిజగ త్పావనము లగుటఁ దేటపడంగా
సుజన మనోరంజకముగ
విజితేంద్రియ! వినఁగ నాకు వేడుక పుట్టె\న్‌.
49
వ. అనిన విని, యంతరిక్షుం డను ఋషి శ్రేష్ఠుం డి ట్లనియె. 50
క. పరమ బ్రహ్మ మనంగాఁ
బరతత్త్వ మనంగఁ బరమపద మనఁగను నీ
శ్వరుఁ డనఁ గృష్ణుఁ డన జగ
ద్భరితుఁడు నారాయణుండు దా వెలుఁగొందు\న్‌.
51
వ. అవ్యక్త నిర్గుణ పరబ్రహ్మంబునందుఁ దనకు విపర్యయంబుగా జననం బైన జ్ఞానంబె
విష్ణుమాయ యనంబడు. పరమేశ్వరుం డట్టి మాయచేత జగంబు నిర్మించి, నిశ్చింతుం
డై యుండు. ఇంద్రియార్థ భ్రమణంబు సేసెడు దుర్మతులకు సుషుప్త్యా ద్యవస్థలు వరుసను
గలుగుట గాక, పరమేశ్వరునిఁ బొందరామి యను నాలుగవ యవస్థయుఁ గలుగు.
స్వప్నంబునందు గ్రాహ్య గ్రాహక గ్రహణంబులను త్రివిధ భేదంబులుం గలిగియుండు.
ఈ చందంబున నవిద్యాంధకార సంవృతం బై, మూఁడు విధంబులఁ బర్యవసించు
మనోరథంబు స్వప్నావస్థయం దణఁగిన క్రియఁ, ద్రివిధం బగు మాయయు, నాత్మయందు
లీనం బగు. పరమేశ్వరుండు మొదలం బృథివ్యాధి మహాభూతమయం బైన సృష్టినిఁ
గలుగఁ జేసి, యందుఁ బంచభూతాత్మకం బైన యాత్మ కేకాదశేంద్రియంబులచేతఁ
భేదంబు పుట్టించుచు, గుణంబులచేత గుణంబులంగీకరించుచు, నాత్మయందుఁ బ్రద్యోదిత
గుణంబులవలన గుణానుభావంబు చేయుచున్న వాఁ డయి, సృష్టినాత్మీయంబుగా భావించును.
దేహి, కర్మమూలంబున నైమిత్తిక కర్మంబు లాచరింపుచుఁ దత్ఫలం బంగీకరించి, దుఃఖైక
వశుం డై వర్తించు. పెక్కు దుఃఖంబులం బడి, యీ దేహి, కర్మఫల ప్రాప్తుం డగుచు, భూత
సంప్లవ పర్యంతంబు పరవశుండై, జన్మమరణంబులం బొరలుచుండు. అంత్యకాలం బాసన్నం
బైన, ద్రవ్య గుణ స్వరూపం బగు జగంబు ననాదినిధనం బగు కాలంబు ప్రకృతిం బొందించును.
అటమీఁద శతవర్షంబులు వర్షంబు లేమిచే నత్యుగ్ర లోకలోచను తేజంబున సకలలోకంబులు
దహింపబఁడు. అంత నధోలోకంబున నుండి సంకర్షణ ముఖ జనితానలం బూర్ధ్వ
శిఖాజాలంబుల వాయు సహాయం బై, దిక్కులయం దెల్లఁ బ్రవర్తించు. అటమీఁద సంవర్తక
వలాహక గణంబులు శతవత్సరంబులు సలిలధారాపాతంబుగా వర్షంబులు గురియు. అందు
విరాడ్రూపంబు లీనం బగు. అంత నీశ్వరుండు నింధనాగ్నిరూపంబున నవ్యక్తంబుఁ
ప్రవేశించు. తదనంతరంబ ధరణీ మండలంబు వాయుహృత గంధం బై, కబంధరూపంబు
దాల్చు. ఆ జలంబు హృతరసం బై, తేజోరూపంబు నొందు. ఆ తేజంబు తమోనిరస్తం బై,
వాయువం దణుగు. ఆ గంధవహుండును స్పర్శవిరహితుం డై, యాకాశంబు నందు సంక్రమించు.
ఆ విష్ణుపదంబును విగత శబ్దగుణంబు గలది యై, యాత్మయం దణంగు. ఇంద్రియంబులును,
మనంబును, బుద్ధియు, వికారంబులతోడ నహంకారంబుఁ బ్రవేశించు. ఆ యహంకారంబు
స్వగుణయుక్తం బై, పరమాత్మనుం జేరు. ఇట్లు త్రివర్ణాత్మక యై, సర్గ స్థితి లయకారిణి
యగు మాయ ఇట్టిది యని, తత్స్వరూప మహాత్మ్యంబులు వివరించిన, నరపాలుం డి ట్లనియె.
52
ఉ. జ్ఞానవిహీన మైన నరసంఘము గానఁగరాని మాయఁ దా
లోన నడంచి యెట్లు హరి లోకముఁ జెందుదు రంతయుం దగ\న్‌
భూనుత! సత్యవాక్య గుణ భూషణ! యి క్కథ వేడ్కతోడుత\న్‌
బూనుక చెప్పు మన్నను బ్రబుద్ధుఁడు నిట్లను గారవంబున\న్‌.
53
ఋషభకుమారులలోఁ బ్రబుద్ధ పిప్పలాహ్వయులు సెప్పెడు పరమార్థోపదేశము
వ. సూర్యోదయాస్తమయంబులం బ్రతిదినంబు నాయువు క్షయంబు నొంద, దేహ కళత్ర మిత్ర
భ్రాతృ మమత్వ పాశబద్ధు లై విడివడు నుపాయంబు గానక, సంసారాంధకారమగ్ను
లై, గతాగతకాలంబుల నెఱుంగక, దివాంధంబు లగు జంతుజాలంబుల భంగి, జన్మ జరా
రోగ విపత్తి మరణంబు లందియు, శరీరంబ మే లనుచుఁ బ్రమోద మోహ మదిరాపాన
మత్తు లై, విషయాసక్తతం జిక్కి తమ్ముం దా రెఱుంగక యుండి, విరక్తి మార్గంబు దెలియక
వర్తించు మూఢులగు జనంబుల పొంతలం బోవక, కేవల విష్ణుభక్తి భావంబు గల
సద్గురులం బ్రతిదినంబును భజియించి, సాత్త్వికంబు, భూతదయయును, హరి
కథామృతపానంబును, బ్రహ్మచర్య వ్రతంబును, విషయంబుల మనంబు చేరకుండుటయు,
సాధు సంగంబును, సజ్జన మైత్రియు, వినయసంపత్తియు, శుచిత్వంబు, తపంబును, క్షమయు,
మౌనవ్రతంబును, వేద శాస్త్రాధ్యయన త దర్థానుష్ఠానంబును, నహింసయు, సుఖదుఃఖాది
ద్వంద్వసహిష్ణుతయు, నీశవ్రుని సర్వగతునిఁగా భావించుటయు, ముముక్షుత్వంబును, జనసంగ
వర్జనంబును, వల్కలాది ధారణంబును, యదృచ్ఛాలాభ సంతుష్టియు, వేదాంత
శాస్త్రార్థ జిజ్ఞాసుత్వంబును, దేవతాంతర నిందా వర్జనంబును, గరణత్రయ శిక్షణంబును,
సత్యవాక్యతయు, శమదమాది గుణవిశిష్టత్వంబును, గృహారామ క్షేత్ర కళత్ర పుత్ర విత్తాదుల
హరికర్పణంబు సేయుటయు, నితరదర్శన వర్జనంబు సేయుటయును, భాగవతోత్తమ
ధర్మంబులు. అని చెప్పి, యి ట్లనియె.
54
క. హరిదాసుల మిత్రత్వము
మురరిపు కథ లెన్నికొనుచు మోదముతోడ\న్‌
హరుషాశ్రు పులకితుం డయి
పురుషుఁడు హరిమాయ గెలుచు భూపవరేణ్యా!
55
వ. అనిన రాజేంద్రుండు వారల కి ట్లనియె. భాగవతులారా! సకలలోక నాయకుం డగు,
నారాయణుఁ డనం బరఁగిన పరమాత్ముని ప్రభావంబు వినవలతు. ఆనతిండు.
అనిన, పిప్పలాహ్వయుం డి ట్లనియె.
56
సీ. నరవర! విను జగన్నాథుని చారిత్ర మెఱిఁగింతు నీ మది కింపు మిగుల
లస దుద్భవ స్థితి లయ కారణం బయి దేహేంద్రియాదులఁ దిరము గాఁగఁ
జొనుపు నెప్పుడు పరంజ్యోతి స్వరూపంబు జ్వాల లనలునందుఁ జనని పగిది
నింద్రియంబులు నాత్మ నెనయవు శబ్దంబు పొరయక సుషిరంబుఁ బొందు సత్య
 
తే. మనఁగ సత్త్వ రజ స్తమోమయగుణంబు
మహ దహంకార రూప మై మహిమ వెలయుఁ
జేతనత్వంబు గల దీని జీవమందు
రిదియ సదస త్స్వరూప మై యెన్నఁబడును.
57
వ. దీనికిం బెక్కైనది పరమాత్మగా నెఱింగి, కమలసంభవాదులు నుతియింతురు. ఇట్టి పరమాత్మ,
స్థావర జంగమంబుల నధిష్ఠించి, వృద్ధిక్షయంబులం బొందక, నిమిత్తమాత్రంబునం దరు
లతాదులందు జీవంబు లేక, తదంతరస్థుం డై వర్తించు. అంత సర్వేంద్రియావృతం బైన
యాకారంబు నష్టం బైన, మనంబునుం బాసి, శ్రుతివిరహితుం డై, తిరుగుచుండు. నిర్మల
జ్ఞానదృష్టి గలవానికి భాను ప్రభాజాలంబు తోఁచినక్రియను, సుజ్ఞానవంతుండు
హరిభక్తిచేత గుణ కర్మార్థంబు లైన చిత్తదోషంబులు భంజించి, భగవత్సదనంబుఁ
జేరు. అనిన, విని, రా జి ట్లనియె.
58
క. పురుషుం డే యే కర్మము
పరువడిఁ గావించి పుణ్యపరుఁ డై మనుఁ దా
దురితములఁ దొరఁగి మురరిపు
చరణయుగం బెట్లు చేరు సన్మునివర్యా!
59
ఋషభకుమారులలో నావిర్హోత్ర ద్రమీళులు తెలుపు పరమార్థోపదేశము
వ. అనిన విని, యం దావిర్హోత్రుం డి ట్లనియె. కర్మాకర్మ ప్రతిపాదకంబు లగు శ్రుతి వాదంబు
లలౌకిక వర్ణితంబులు. అట్టి యామ్నాయంబులు సర్వేశ్వర స్వరూపంబులు గాన విద్వాంసులు
న్నెఱుంగ లేరు. అవి కర్మాచారంబు లనం బడు. మోక్షంబు కొరకు నారాయణ భజనంబు
పరమపావనంబు. వేదోక్తంబుల నాచరింపక, ఫలంబులకు వాంఛ సేయువార లనేక
జన్మాయుతంబులం బడయుదురు. మోక్షంబు నపేక్షించువాఁడు విధిచోదిత మార్గంబున హరిం
బూజింప వలయు. అట్టి పూజాప్రకారం బెట్లనినఁ, బవిత్ర గాత్రుం డై, జనార్దను సన్నిధిం
బూతచిత్తుం డై, విధ్యుక్త ప్రకారంబునఁ జక్రధరుని ధ్యానించి, గంధ పుష్ప ధూప
దీప నైవేద్యంబులు సమర్పించి, సాష్టాంగ దండప్రణామంబు లాచరించి, భక్తి భావనా
విశేషుం డగు నతండు హరిం జేరు. అని చెప్పిన విని, విదేహుం డి ట్లనియె. ఈశ్వరుం డేయే
కర్మంబుల నాచరించె నంతయు నెఱింగింపుము. అనిన ద్రమీళుం డి ట్లనియె.
60
AndhraBharati AMdhra bhArati - itihAsamulu - bhAgavatamu - EkAdaSa skaMdhamu - bammera pOtana poetana pothana potanAmAtya pOtanAmAtyuDu ( telugu andhra )