ఇతిహాసములు భాగవతము ఏకాదశ స్కంధము
క. తారల నెన్నఁగ వచ్చును
భూరేణుల లెక్కపెట్టఁ బోలును ధాత్రిన్‌
నారాయణ గుణకథనము
లారయ వర్ణింపలేరు హర బ్రహ్మాదుల్‌.
61
వ. ఇట్లు గావున నాత్మసృష్టం బైన మనంబునఁ, బంచభూత నికరం బను పురం
బొనరించి, యందు నిజాంశంబునం బ్రవేశించి, సగుణ నిష్ఠుం డై,
నారాయణాభిధానంబునుం గల ఋషీశ్వరుం డగు పరమేశ్వరుండు వెలుఁ గొందెను.
అతని దశేంద్రియంబులచేతఁ బాలితంబు లైన దేహంబులు ధరియించి, జగద్రక్షకత్వ
సంహారకత్వాది గుణంబులు గలుగుటం జేసి, గుణనిష్ఠుం డై, రజ స్సత్త్వ తమో
గుణంబుల బ్రహ్మ విష్ణు రుద్రమూర్తు లనం బరఁగి, త్రిగుణాత్మకుం డనంబడు
నారాయణాఖ్యుని చరిత్రం బెఱింగించెద. ఆకర్ణింపుము.
62
క. ధర్ముండు దక్షపుత్రిక
నిర్మలమతిఁ బెండ్లి యాడి నెఱిఁ బుత్రుని స
త్కర్ముని నారాయణఋషి
నర్మిలిఁ గనె నతఁడు బదరికాశ్రమమందున్‌.
63
తే. అట్టి నారాయణాహ్వయుం డైన మౌని
బదరికాశ్రమ మందు నపార నిష్ఠఁ
దపముఁ గావింప బలభేది దలఁకి మదిని
మీనకేతను దివిజకామినులఁ బనిచె.
64
వ. వారు నారాయణాశ్రమంబునకు నతని తపోవిఘ్నంబు సేయ వచ్చునప్పు డ వ్వనంబు, సాల
రసాల బిల్వ కదళీ ఖర్జూర జంబు జంబీర చందన పున్నాగ మందారాది వివిధ వృక్ష
నిబిడంబును, బుష్ప ఫల భరిత శాఖావనమ్ర తరు లతా బృందంబును, మాధవీ కుంజ
మంజరీపుంజ మకరందపాన మత్త మధుకర నికర ఝంకారరవ ముఖరిత హరిదంతరంబును,
గనకగమల కల్హార విలస త్సరోవిహరమాణ చక్రవాక బక క్రౌంచ మరాళ దంపతి
మండల మండితంబును, మృణాళ భోజనాసక్త సారసచయ చంచూపుట విపాటిత కమల
ముకుళ కేసరవిసర వితత ప్రశస్త సరోవరంబును నై, వెలయు. అ వ్వనంబున నిందువదన
లందంద మందగమనంబులం జెందు ఘర్మజలబిందు బృందంబులు నఖాంతంబుల నోసరింపుచు
డాయం జనునప్పుడు.
65
చ. మదనుని బాణజాలమున మగ్నతఁ బొందక ధైర్యవంతుఁ డై
ముదితల వాఁడిచూపులకు మోహము నొందక నిశ్చలాత్ముఁ డై
హృదయమునందు నచ్యుతు రమేశు ననంతు జగన్నివాసుని\న్‌
వదలక భక్తి నిల్పుకొని వారికి ని ట్లనె మౌని పెంపున\న్‌.
66
క. జంభారి పంపునను మీ
రంభోరుహ వదనలార! యరుదెంచితి రా
శుంభ ద్విహారవాంఛా
రంభంబునఁ దిరుగు డనిన లజ్జించి వెసన్‌
67
సీ. దేవమౌనీశ! నీ దివ్యచారిత్రంబు నెఱిఁగి సన్నుతి సేయ నెవ్వఁ డోపుఁ
బుత్ర మిత్ర కళత్ర భోగాదులను మాని తపము గావించు సద్ధర్ములకును
విఘ్నముల్‌ చెందునే విశ్వేశుఁ గొల్చిన యతనికి నంతరాయంబు గలదె
కామంబు క్రోధంబు గలిగిన తపములు పల్వలోదకముల భంగిఁ గావె
 
తే. నిన్ను వర్ణింప నలవియే నిర్మలాత్మ!
రమణ లోఁగొను మా యపరాధ మనుచు
సన్నుతించిన నతఁడు ప్రసన్నుఁ డగుచుఁ
దనదు సామర్థ్య మెఱిఁగింపఁ దలఁచి యపుడు.
68
వ. అ మ్మునీశ్వరుండు పరమాశ్చర్య నిధానంబుగా నిజ తనూరుహంబుల వలనం ద్రికోటి
కన్యకా నివహంబుల నుద్భవింపం జేసిన, గంధర్వ విబుధ కామినీ సముదయంబులు
పరమాద్భుత భయంబులు మనంబులం బొడమ సన్నుతించి, య వ్విలాసినీ సమూహంబులో
నూర్వశి యను దానిం గొని చని, పాకశాసను సభాభవనంబునం బెట్టి, తద్వృత్తాంతంబంతయు
విన్నవించిన, నాశ్చర్యయుక్త హృదయుం డై, సునాసీరుం డూరకుండె. ఇట్టి నారాయణ
మునీశ్వరు చరిత్రంబు వినువారలు, పరమ కల్యాణగుణవంతు లగుదురు. అని చెప్పిన.
69
తే. ఋషభునకు నాత్మయోగ మీ రీతిఁ జెప్పి
యచ్యుతుఁడు భూమిభారము నడఁప నంత
సొరిది నవతారములు దాల్చి సొంపుమీఱ
రాత్రిచరులను జంపె నీరసముతోడ.
70
వ. అట్టి పరమేశ్వరుని లీలాగృహీతంబు లగు, మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన,
రామ, రఘురామ, రామ, బుద్ధ, కల్క్యా ద్యవతారంబు లనేకంబులు గలవు. శేష భాషా
పతుల కైన వర్ణింప నలవిగాదు. మఱియును. 71
సర్వలఘు సీ. నవ వికచ సరసిరుహ నయనయుగ! నిజచరణ గగనచర నది! నిఖిల నిగమ వినుత!
జలధిసుత కుచకలశ లలిత మృగమద రుచిరపరిమళిత నిజహృదయ! ధరణిభరణ!
ద్రుహిణముఖ సురనికర విహిత నుతికలిత గుణ! కటిఘటిత రుచిరతర కనకవసన!
భుజగ రిపు వరగమన! రజతగిరిపతి వినుత! సతత వృత జప నియమసరణి చరిత!
 
తే. తిమి! కమఠ! కిటి! నృహరి! ముదిత బలినిహి
త పద! పరశుధర! దశవదన విదళన!
మురమథన! కలికలుష సుముదప హరణ!
కరివరద! ముని నర సుర గరుడ వినుత!
72
వ. ఇ వ్విధంబునం బ్రవర్తిల్లిన శ్రీమన్నారాయణమూర్తి లీలావిలాసంబు లనంతంబులు గలవు.
మనో వా క్కాయ కర్మంబుల హరిపూజనంబు సేయక, విపరీత గతులం దిరుగుచుండు జడుల
కె వ్విధంబున గతి గలుగు>? అనిన, న ప్పుడమిఱేఁడ ప్పరమపురుషులం జూచి, యట్టి జడులు
ముక్తినొందు నుపాయం బెట్టులు. అంతయు నెఱింగింపుము. అనిన, చమసుం డి ట్లనియె.
73
AndhraBharati AMdhra bhArati - itihAsamulu - bhAgavatamu - EkAdaSa skaMdhamu - bammera pOtana poetana pothana potanAmAtya pOtanAmAtyuDu ( telugu andhra )