ఇతిహాసములు భాగవతము ఏకాదశ స్కంధము
ఋషభకుమారు లగు చమస కరభాజనులు సేసెడు పరమార్థోపదేశము
సీ. హరి ముఖ బాహూరు వర పదాబ్జములందు వరుసఁ జతుర్వర్ణ వర్గసమితి
జనియించె నందులో సతులును శూద్రులు హరిఁ దలంతురు కలిహాయనముల
వేద శాస్త్ర పురాణ విఖ్యాతు లయి కర్మకర్త లై విప్రులు గర్వ మెసఁగి
హరిభక్తిపరులను హాస్యంబు సేయుచు నిరయంబు నొందుట నిజము గాదె
 
తే. మృదుల పక్వాన్నములను దా మెసఁగఁగోరి
జీవహింసకుఁ జనువానిఁ జెందు నఘము
హరి నుతించక స్త్రీలోలుఁ డైనవాఁడు
నరకవాసుండు నగుచుండు ననవరతము.
74
వ. అట్లు గావున, గృహ క్షేత్ర పుత్ర కళత్ర ధన ధాన్యాదులందు మోహితుం డయి,
ముక్తి మార్గంబు లప్రత్యక్షంబు లని, నిందించువాఁడును, హరిభక్తి విరహితుండును,
దుర్గతిం గూలుదురు. అని మునివరుం డానతిచ్చిన, విదేహుం డి ట్లనియె.
75
ఆ. ఏ యుగంబునందు నేరీతి వర్తించు
నెట్టి రూపువాఁడు నె వ్విధమున
మును నుతింపఁబడెను ముని దేవ గణముచే
విష్ణుఁ డవ్యయుండు విశ్వవిభుఁడు?
76
వ. అనిన విని, యందుఁ గరభాజనుం డి ట్లనియె. నానావతారంబులును, నానా రూపంబులును,
బహువిధ వర్ణంబులునుం గలిగి, రాక్షసులను సంహరించి, దుష్ట జన నిగ్రహంబును, శిష్టజన
పరిపాలనంబును జేయుచుం, గృతయుగంబున శుక్లవర్ణుం డై, చతుర్బాహుం డై, జటా
వల్కలకృష్ణాజినోత్తరీయ జపమాలికా దండకమండలు ధరుం డై, హరి, నిర్మల తపో
ధ్యానానుష్ఠాన గరిష్ఠు లైన పురుష శ్రేష్ఠులచేత హంసుండు, సుపర్ణుండు,
వైకుంఠుండు, ధర్ముండు, అమలుండు, యోగీశ్వరుండు, ఈశ్వరుండు, పురుషుండు, అవ్యక్తుండు,
పరమాత్ముండు అను దివ్యనామంబులం బ్రసిద్ధి వహించి, మొదటియుగంబున గణుతింపంబడు.
త్రేతాయుగంబున రక్తవర్ణుం డై, బాహుచతుష్క మేఖలాత్రయ విశిష్టుం డై,
హిరణ్యకేశుండును, వేదత్రయ స్వరూపుండును, స్రుక్‌ స్రువా ద్యుపలక్షణ శోభితుండును నై,
విష్ణు యజ్ఞ పృశ్నిగర్భ సర్వదే వోరుక్రమ వృషాకపి జయంతోరుగాయాఖ్యల
బ్రహ్మవాదులచేత నుతియింపంబడు. ద్వాపరంబున శ్యామల దేహుండును, బీతాంబర
ధరుండును, బాహుద్వ యోపశోభితుండును, దివ్యాయుధ ధరుండును, శ్రీవత్స కౌస్తుభ
వనమాలికా విరాజమానుండును, మహారాజోపలక్షణుండును నై, జనార్దన వాసుదేవ
సంకర్షణ ప్రద్యుమ్నానిరుద్ధ ఋషి పురుష మహాత్మ విశ్వ నారాయణ విశ్వరూప
సర్వభూతాత్మకాది నామంబుల వెలసి, మూర్ధాభిషిక్తుల చేత సన్నుతింపంబడు.
కలియుగంబునఁ గృష్ణ వర్ణుండును, గృష్ణనామకుండు నై, భక్త సంరక్షణార్థంబు
పుండరీకాక్షుండు, వివిధ యజ్ఞంబులచే సంకీర్తనాదులచేతం బ్రస్తుతింపంబడు.
హరిరామ నారాయణ నృసింహ కంసారి నళినోదరాది బహువిధ నామములచే
బ్రహ్మవాదులును, మునీంద్రులును, నుతియింపుదురు. మఱియును.
77
తే. ద్రవిడదేశంబునందులఁ దామ్రపర్ణి
సహ్యజా కృతమాలాది సకలనదుల
నెవ్వఁడేనియు భక్తితో నేఁగి యచటఁ
బొదలి తర్పణ మొగిఁ జేయఁ బుణ్య మొదవు.
78
వ. ఇ వ్విధంబునం బ్రశంసింపం దగిన కావేర్యాది మహానదీ పావన జలస్నాన
పాన దానంబులను, విష్ణుధ్యాన కథా సుధార సానుభవంబుల న్నిరూఢు లగు
భాగవతోత్తములు గలిగి రేనియుం, జెడనిపదంబు బొందుదురు. అని, ఋషభకుమారులు
భగవత్‌ ప్రతిబింబంబు లయిన, పరమపురుషులువోలె, విదేహ జనపాలునకు నిశ్రేయస
పదప్రాప్తికరంబు లయిన, భగవద్భక్తిధర్మంబు లుపదేశించి, యంతర్ధానంబు
నొందిరి. మిథిలేశ్వరుండును సుజ్ఞానయోగం బంగీకరించి, నిర్వాణ పదంబు నొందె.
ఈ యుపాఖ్యానంబు వ్రాసినఁ, బఠించిన, వినిన, నాయు రారోగ్యైశ్వర్యంబులు
గలిగి, పుత్ర పౌత్రవంతు లయి, సకల కలికల్మష రహితు లై, విష్ణులోక నివాసు
లగుదురు. అని, నారదుండు వసుదేవునకుం జెప్పి, మఱియు.
79
సీ. కమలాక్ష పదభక్తికథనముల్‌ వసుదేవ! విని యఘంబులఁ బాసి వెలసి తీవు
భువనప్రసిద్ధిగాఁ బొలుపొందు సత్కీర్తి కైవల్యలక్ష్మియుఁ గలుగు మీఁద
నారాయణుండు నీ నందనుం డను మోహమెడలించి విష్ణుఁగా నెఱిఁగి కొలువు
మతఁడు నీ తనయుఁ డై యవతరించుటఁ జేసి సిద్ధించె దేహసంశుద్ధి నీకు
 
తే. సరస సల్లాప సౌహార్ద సౌష్ఠవమునఁ
బావనం బైతి శిశుపాల పౌండ్ర నరక
ముర జరాసంధ యవనులు ముదముతోడ
వాసుదేవునిఁ జెందిరి వైరు లయ్యు.
80
క. దుష్టజన నిగ్రహంబును
శిష్ట ప్రతిపాలనంబు సేయ\న్‌ హరి దా
సృష్టి నవతార మొందెను
స్రష్టృముఖానేక దివిజసంఘము వొడగ\న్‌.
81
బ్రహ్మాది దేవతలు శ్రీకృష్ణుని వైకుంఠమునకుఁ బిలువ వచ్చుట
వ. అట్లు గావున లోకరక్షణార్థంబు కృష్ణుం డవతార మెత్తె. అని, హరి భక్తి పరంబు లగు
నుపాఖ్యానంబులు నారదుం డుపన్యసించిన విని, విస్మితచిత్తు లై, దేవకీ వసుదేవులు
కృష్ణునిం బరమాత్మునిఁగా విచారించిరి. అని, శుకుండు రాజునకుం జెప్పిన, నతండును,
"మునీంద్రా! యదువుల నే ప్రకారంబున హరి హరియించె. సపరివారులగు బ్రహ్మ రుద్రేంద్ర
దిక్పాలక మునీంద్రులు ద్వారకా నగరప్రవేశం బెట్లు చేసిరి. ఏమయ్యె. మఱియుం బరమేశ్వర
కథామృతంబు వీను లలరం జవిగొనియు దనివి సనదు. భక్త రక్షకుం డగు హరి చారిత్రం బే
రీతిం జాఁగె. తర్వాతి వృత్తాంతం బంతయు నెఱింగింపుము." అనిన శుకుం డి ట్లనియె.
82
AndhraBharati AMdhra bhArati - itihAsamulu - bhAgavatamu - EkAdaSa skaMdhamu - bammera pOtana poetana pothana potanAmAtya pOtanAmAtyuDu ( telugu andhra )