ఇతిహాసములు భాగవతము ఏకాదశ స్కంధము
క. సుర గరుడ ఖచర విద్యా
ధరహర పరమేష్ఠిముఖ సుధాశనులు మునుల్‌
సరసిజనయనుని గనుఁగొన
నరుదెంచిరి ద్వారవతికి నతిమోదమున\న్‌.
83
క. కని పరమేశుని యాదవ
వనశోభిత పారిజాతు వనరుహనేత్రుం
జనకామిత ఫలదాయకు
వినుతించిరి దివిజు లపుడు వేదోక్తులతో\న్‌.
84
తే. అఖిలలోకేశ! సర్వేశ! యభవ! నీవు
నుదయ మందుట భూభార ముడుపు కొఱకుఁ
బంచవింశోత్తర శతాబ్ద పరిమితంబు
నయ్యె విచ్చేయు వైకుంఠ హర్మ్యమునకు.
85
వ. అనినఁ గమలభవ భవముఖ నిఖిల సురగణంబుల వచనంబు లి య్యకొని, కృష్ణుండు
వారలతోడ యాదవుల కన్యోన్య వైరానుబంధంబులు గల్పించి, వారల హతంబు గావించి,
భూభారం బడంచి, యిదె వచ్చెదం బొం డని చెప్పి, వీడ్కొలిపినఁ గమలాసనాది
బృందారకులు నిజస్థానంబులకుం జనిరి. అంత.
86
శ్రీకృష్ణుండు దుర్నిమిత్తంబులం గని యాదవులను బ్రభాసతీర్థమునకుఁ బంపుట
సీ. కాక ఘూకంబులు కనక సౌధములలోఁ బగలు వాపోయెడి బహువిధముల
నశ్వవాలంబుల సకల ముద్భవ మయ్యె నన్నంబు మొలిచె మహాద్భుతముగ
శుకశారికలు రాత్రి సొగసె విస్వరముల జంతువు వేఱొక్క జంతుఁ గనియె
నొగిఁ బౌరగృహముల నుల్కలు నుదయించె బెరసెఁ గావిరి రవిబింబ మపుడు
 
తే. గాన నుత్పాతములు చాలఁ గానఁబడియె
నరయ నిం దుండవలవదు యదువులార!
తడయ కిపుడ ప్రభాస తీర్థమున కరుగుఁ
డనుచు శ్రీకృష్ణుఁ డెంతయు నానతిచ్చె.
87
క. నారాయణు వచనముల క
పారం బగు సమ్మదమున బలములతోడ\న్‌
దార సుత మిత్రయుతు లై
వారణ హయ సమితితోడ వడి నేఁగి రొగి\న్‌.
88
శ్రీకృష్ణమూర్తి యుద్ధవునికి పరమార్థోపదేశము చేయుట
వ. అంత. 89
క. జ్ఞానమున నుద్ధవుఁడు దన
మానసమున నెఱిఁగి శ్రీరమాధిప! హరి! యో
దీనజన కల్పభూజమ!
శ్రీనాయక! దిక్కు నీవె శ్రితభయహరణా!
90
వ. ఇట్లు నుతియించి, దేవా! నీవు యదుక్షయంబు గావించి, చన నే మే విధంబున నిర్వహింతుము.
నీ సహచరుల మై, గడపిన మజ్జన భోజన శయనాసనాది కృత్యంబులు మఱవ వచ్చునే.
అని యుద్ధవుం డాడిన వాసుదేవుం డి ట్లనియె.
91
AndhraBharati AMdhra bhArati - itihAsamulu - bhAgavatamu - EkAdaSa skaMdhamu - bammera pOtana poetana pothana potanAmAtya pOtanAmAtyuDu ( telugu andhra )