ఇతిహాసములు భాగవతము ఏకాదశ స్కంధము
వ. బ్రహ్మాదిదేవతా ప్రార్థనంబునం జేసి, ధాత్రీభారంబు నివారించితి. ఇంక ద్వారకా నగరంబు
నిందుకు సప్తమ దివసంబున సముద్రుండు ముంపంగలవాఁడు. యదు క్షయంబునుం
గాగలయది. అంతటం గలియుగంబు ప్రాప్తం బయ్యెడి. అందు మానవులు
ధర్మవిరహితులును, నాచారహీనులును, నన్యాయపరులును, నతిరోషులును,
మందమతులును, నల్పతరాయువులును, బహురోగపీడితులును, నిష్ఫలారంభులును,
నాస్తికులు నై, యొండొరుల మెచ్చక యుందురు. కావున నీవు సుహృ ద్బాంధవ
స్నేహంబు వర్జించి, యింద్రియ సౌఖ్యంబులఁ బొరయక, క్షోణితలంబునం గల
పుణ్యతీ ర్థావగాహనంబు సేయుచు, మానస వా గక్షి శ్రోత్ర ఘ్రాణేంద్రియ
గృహ్యమాణం బగు వస్తుజాతంబు నశ్వరంబుగా నెఱుంగుము. పురుషుండు నానార్థ
కామంబుల నంగీకరించి, నిజ గుణదోషంబుల మోహితుం డై యుండు. కావున,
హస్తిపకుండు గంధనాగంబులను బంధించు చందంబున, నింద్రియంబులను
మనోవికారంబులను నిగ్రహించి, యీషణ త్రయంబును వర్జించి, మోదఖేదంబుల
సముండవుగా వర్తింపుచు, నీ జగంబంతయు నాత్మాధిష్ఠితంబుగా నెఱింగి,
మాయాదుల నాత్మ తత్త్వాధీనంబులుగలుగఁ దెలియుచు, జ్ఞానవిజ్ఞాన యుక్తుండ
వై, యాత్మానుభవ సంతుష్టుండ వై, విశ్వంబును నన్నుగా భావించి,
వర్తింపవలయు. అని, వాసుదేవుం డానతిచ్చిన, నుద్ధవుండు భక్తివినయంబులం
గరంబులు మొగిడ్చి, మహాత్మా! సన్న్యస్త లక్షణంబు దుష్కరంబు. పామరు లగువా
రాచరింపలేరు. నీ మాయచేత భ్రాంతు లై, చేయునది తెలియని సాంసారికులు
భవాబ్ధిం గడచి, యెట్లు ముక్తి వడయుదురు. భృత్యుండ నైన నామీఁది
యనుగ్రహంబునం జేసి యానతిమ్ము. బ్రహ్మాది దేవతా సముదయంబును బాహ్య
వస్తువుల భ్రాంతు లై, పర్యటనంబు సేయుదురు. నీ భక్తు లైన పరమభాగవతులు
న మ్మాయావిరసనంబు సేయుదురు. గృహిణీ గృహస్థుల కైన, యతుల కైనను,
నిత్యంబును నీ నామ స్మరణంబు మోక్ష సామ్రాజ్యప్రదంబు. కావునఁ బరమేశ్వర!
నీదు చరణంబుల శరణంబు నొందెద. కృపారసంబు నాపై నిగుడింపుము.
అని, ప్రియసేవకుం డైన యుద్ధవుండు వలికిన, నతనికిఁ గంసమర్దనుం డి ట్లనియె.
అట్లు పురుషున కాత్మకు నాత్మయె గురు వని యెఱుంగుము. కుపథంబులకుం జనక,
సన్మార్గవర్తి యై, పరమం బయిన మ న్నివాసంబునకుం జనుము. సర్వ మూలశక్తి
సంపన్నుండ నైన నన్ను సాంఖ్యయోగపరులు నిరంతర భావంబులందుఁ బురుష
భావంబుగా భావించి, తలంపుచుండుదురు. మఱియు, నేక ద్వి త్రి చతుష్పాద బహు
పాదాపాదంబులు నై యుండు జీవజాలంబులలోన ద్విపాదంబులు గల మనుష్యులు మేలు.
వారలలోన నిరంతర ధ్యాన గరిష్ఠు లైన యోగీంద్రు లుత్తములు. వారలలో సందేహపరులచే
నగ్రాహ్యుండగు నన్ను, సత్త్వగుణ గ్రాహ్యునిఁగా నెఱింగి, నిజ చేతః పంకజంబునందు
జీవాత్మ పరమాత్మల నేకంబుగాఁ జేసి, శంఖ చక్ర గదా ఖడ్గ శార్ఙ్గ కౌమోదకీ కౌస్తుభాభరణ
యుక్తుంగాఁ దలంపుచు నుండు వారలు, పరమ యోగీంద్రు లనియును, పరమ జ్ఞాను
లనియును జెప్పి, మఱియు, నవధూత యదు సంవాదం బను పురాతనేతి హాసంబు గలదు.
చెప్పెద నాకర్ణింపుము.
91
అవధూత యదు సంవాదము
ఉ. పంకజనాభుఁ డుద్ధవుని పైఁ గల కూర్మినిఁ జెప్పె నొప్ప నెం
దంకిలి లేక యన్ని దిశలందుఁ జరింపుచు నిత్యతృప్తుఁ డై
శంకర వేషధారి యొక సంయమి యా యదురాజుఁ జేర నే
వంకను నుండి వచ్చి తన వానికి ని ట్లనె నర్థి నేర్పడ\న్‌.
92
క. అవధూత వల్కె నంతటఁ
బ్రవిమల విజ్ఞానవిపుణ భవ్యులు గురువుల్‌
తవిలిన నిరువది నలువురు
నవని\న్‌ విజ్ఞాని నైతి నని పల్కుటయు\న్‌.
93
వ. అంత యదుప్రవరుం డి ట్లనియె. దేహి లోభమోహాదుల వర్జించి, జనార్దనుని
నేవిధంబునఁ జేరవచ్చు? నెఱింగింపుము. అనిన, నతం డి ట్లనియె.
94
సీ. పరధన పరదార పరదూషణాదులఁ బరవస్తు చింతఁ దాఁ బరిహరించి
ముదిమిచే రోగము లుదయింప కటమున్న తనువు చంచలతను దగులకుండ
బుద్ధి సంచలతచేఁ బొదలక యటమున్న శ్లేష్మంబు గళమునఁ జేరకుండ
శక్తియుక్తులు మది సన్నగిల్లకమున్న భక్తిభావనచేతఁ బ్రౌఢుఁ డగుచు
 
తే. దైత్యభంజను దివ్యపాదారవింద
భజన నిజ భక్తిభావనఁ బ్రాజ్ఞుఁ డగుచు
నవ్యయానందమును బొందు ననుదినంబు
నతఁడు గర్మవిముక్తుఁ డౌ ననఘచరిత!
95
ఉ. దారలయందుఁ బుత్ర ధన ధాన్యములందు ననేకభంగులం
గూరిమిచేయు మర్త్యుఁ డతిఘోర వియోగజ దుఃఖమగ్నుఁ డై
నేరుపు దక్కి చిక్కువడి నీతి వివేకవిహీనుఁ డై మనో
భారముతోఁ గపోతపతిభంగి నిజంబుగఁ బోవు నష్ట మై.
96
వ. ఇందు నొక్క యితిహాసంబు గలదు. మహారణ్యంబున నొక్క కపోతంబు దార సమేతంబుగా
నొక్క నికేతనంబు నిర్మించి, యన్యోన్య మోహాతిరేకంబునఁ గొంతకాలంబునకు
సంతానసమృద్ధి గలది యై, యపరిమితంబు లైన పిల్లలు దిరుగాడుచుండఁ, గొన్ని
మాసంబులు భోగానుభవంబునం బొరలుచుండం, గాల వశంబున నొక్క లుబ్ధకుం
డురులొడ్డిన, నందు దారాపత్యంబులు దగులుపడిన, ధైర్యంబు వదలి, మోహాతిరేకంబునం
గపోతంబు గళత్ర పుత్ర స్నేహంబునం దాను నందుఁ జొచ్చియు, నధిక చింతాభరంబునం
గృశీభూతం బయ్యె. కావున నతితీవ్రం బైన మోహంబు గొఱగాదు. అట్లుగాన, నిరంతర
హరి ధ్యానపరుం డై, భూమి పవన గగన జల కృపీటభవ సోమ సూర్య కపోత
తిలిత్స జలధి శలభ ద్విరేఫ గజ మధుమక్షికా హరిణ పాఠీన పింగళా కురర
డింభక కుమారికా శరకృ త్సర్ప లుతా సుపేశకృత్తుల సముదయంబు నుండి వాని
గుణంబు లెఱింగికొని, యోగీంద్రులు మెలంగుదురు. అనిన.
97
AndhraBharati AMdhra bhArati - itihAsamulu - bhAgavatamu - EkAdaSa skaMdhamu - bammera pOtana poetana pothana potanAmAtya pOtanAmAtyuDu ( telugu andhra )