ఇతిహాసములు భాగవతము ఏకాదశ స్కంధము
క. ఇవి దెలియవలయు నాకును
బ్రవిమలమతి వానిఁ దెలియఁబలుకు మనంగ\న్‌
వివరము విను మని కృష్ణుఁడు
సవినయుఁడగు నుద్ధవునికిఁ జయ్యన చెప్పె\న్‌.
98
వ. ఇ వ్విధంబున, భూమివలన సైరణయు, గంధవహునివలన బంధురం బగు
పరోపకారంబును, విష్ణుపదంబువలనఁ గాలసృష్ట గుణసాంగత్యంబు
లేమియు, నుదకంబు వలన నిత్యశుచిత్వంబును, నగ్నివలన నిర్మలత్వంబును,
నిశాకర ప్రభాకరులవలన నధికాల్ప సమత్వ జీవగ్రహణ మోక్షణంబులును,
గపోతంబువలనఁ గళత్ర పుత్ర స్నేహంబును, నజగరంబువలన స్వేచ్ఛాసమాగ
తాహారంబును, వననిధివలన నుత్సాహ శోషణంబులును, శలభంబువలన
శక్త్యనుకూల కర్మాచరణంబును, భృంగంబువలన సార మాత్రగ్రహణ
విశేషంబును, స్తంబేరమంబువలనం గాంతా వైముఖ్యంబును, సరఘవలన
నిరంతర సారసంగ్రహ గుణంబును, హరిణంబువలనఁ జింతాపరత్వంబును,
జలచరంబువలన జిహ్వాచాపల్యంబును, బింగళవలన యథాలాభ సంతుష్టియుఁ,
గురరంబువలన మోహపరిత్యాగంబును, డింభకువలన విచారపరిత్యాగంబును,
కుమారికవలన సంగత్యాగంబును, శరకారునివలనం దదేక నిష్ఠయు,
దందశూకంబువలనం బరగృహవాసంబును, నూర్ణనాభివలన సంసార
పరిత్యాగంబును, కణుందురువలన లక్ష్యగత జ్ఞానంబు విడువకుండుటయు, ననంగల
వీని గుణంబు లెఱింగి, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యంబు లను
నరిషడ్వర్గంబుల జయించి జరామరణ విరహితంబుగా వాయువు వశంబు చేసి,
గాత్ర పవిత్రంబు కొరకు షట్కర్మ నిరతుం డై, పుర నగర గ్రామంబులు
పరిత్యజించి, పర్వతారణ్యంబుల సంచరింపుచు, శరీర ధారణార్థంబు
నియమిత స్వల్పభోజనుం డై, ఖేదమోదంబులు సరియకా భావించి, లోభమోహంబులు
వర్జించి, నిర్జితేంద్రియుం డై నన్నెకాని యొం డెఱుంగక, యాత్మనిష్ఠచేఁ
బవిత్రాంతఃకరణుం డైన యోగి నాయందుఁ గలయు. కావున.
99
క. మోహితుఁ డై వసుకాంక్షా
వాహినిలోఁ జిక్కి క్రూరవశుఁ డై యెవ్వం
డూహాపోహ లెఱుంగక
దేహము నలఁగంగఁ జేయు దీనత నొందు\న్‌.
100
వ. ఇందుకుఁ బురాతనవృత్తాంతంబు గలదు. సావధానచిత్తుండ వై వినుము. మిథిలా
నగరంబునఁ బింగళ యను గణికారత్నంబు గలదు. దానివలనఁ గొంత పరిజ్ఞానంబు
గొంటి. అ దె ట్లనిన, న మ్మానిని వసుకాంక్షజేసి, యాత్మసఖుని మొఱంగి, ధనం
బిచ్చువానినిం జేకొని, నిజ నికేతనాభ్యంతరంబునకుం గొని, చని రాత్రి నిద్ర
లే కుండుచుం, బుటభేదన విపణి మార్గంబులఁ బర్యటనంబు సలుపుచు, నిద్రాలస్య
భావంబున జడను వడి, యర్థాపేక్షం దగిలి, తిరిగి, యలసి, యాత్మసుఖంబు సేయు
నాతండే భర్త యని చింతించి, నారాయణు నిట్లు చింతింప, నతని కైవల్యంబు
చేరవచ్చు నని విచారించి, నిజ శయనాది స్థానంబులు వర్జించి, వేగిన
వాసుదేవ చరణారవింద వందనాభిలాషిణి యై, దేహంబు విద్యుత్ప్రకారం బని
చింతించి, పరమతత్త్వంబునందుఁ జిత్తంబు గీలుకొలిపి, ముక్తురా లయ్యె. అని యెఱింగించి.
101
AndhraBharati AMdhra bhArati - itihAsamulu - bhAgavatamu - EkAdaSa skaMdhamu - bammera pOtana poetana pothana potanAmAtya pOtanAmAtyuDu ( telugu andhra )