ఇతిహాసములు భాగవతము ఏకాదశ స్కంధము
క. దేహము నిత్యము గా దని
మోహముఁ దెగఁగోసి శుద్ధ మునివర్తనుఁ డై
గేహము వెలువడి నరుఁడు
త్సాహమునం జెందు ముక్తిసంపద ననఘా!
102
వ. మఱియు, నొక్క పురాతన పుణ్యకథ వినుము. కనకావతీపురంబున నొక్క ధరాసురుని
గన్యకారత్నంబు గలదు. అ వ్వధూతిలకంబు రత్నసమేతంబు లగు కంకణంబులు
ధరియించి, బంధుజనంబులకు నాతిథ్యంబు గావించుకొఱకు, శాలితండులంబులను
రహస్యంబుగా ముసలంబుఁ జేకొని దంచునప్పుడు, కంకణంబు లతిరావంబుగా
మ్రోయుచుండ, న ప్పరమపతివ్రత యందుకు నసహ్యపడి, యన్నియు డులిచి, యొక్కటి
నిలిపె. అ ట్లేకచిత్తంబునం దత్తఱపడక భగవదాయత్తం బైన యేక చిత్తంబునం
బ్రసన్నచిత్తు లై, నరులు ముక్తు లగుదురు. అట్లు గాన, నవిద్యావిద్యలు నా మాయగా
విచారించి, కేవల పశుమార్గులుగాక షడ్గుణైశ్వర్య సంపన్ను లైన యోగీంద్రుల
పగిది, సుఖంబు గోరక యుండు వారలు ముక్తులగుదురు. సర్వంబును విష్ణుమాయఁగాఁ
దెలియుము. అని యుద్ధవునికిం జెప్పిన, నతండు, దేవా! నీ రూపం బేలాగునం
గానవచ్చు. అనిన, నతం డి ట్లనియె. భక్తి భావనా పరాయణుం డై,
కృపాపరతంత్రుం డై, మితభాషణుం డై, బొంకక, కర్మంబుల మదర్పణంబుగాఁ
జేసిన యతండు భాగవతుండు. మత్కథలును మజ్జన్మకర్మంబులును వినుచు, మత్సేవకు
లయిన భాగవతులం జూచి, తన గృహంబునకుం గొనిపోయి, మజ్జన పూజన భోజన
శయన వినయ ధ్యానంబులం బరితుష్టులం జేసిన యతండును భాగవతుం డనంబడు.
ఇ ట్లెంతకాలంబు జీవించు నంతకాలంబు నడపు నతండు మద్రూపమున వైకుంఠనిలయంబు
నొందు. అదియునుం గాక, గంధ పుష్ప ధూప దీప నైవేద్యంబుల లక్ష్మీసమేతుండ నై,
శంఖ చక్ర గదా శార్ఙ్గాది యుక్తుండ నైన నన్ను శుక సనకాది యోగీంద్రులు,
నంబరీష విభీషణ రుక్మాంగదులు మొదలుగాఁగల భాగవతులు, శాస్త్రాచార
చోదితులు గాక, భక్తిభావనా విశేషంబున న న్నేమఱక, నిత్యంబును జింతనాయుక్తు
లై నన్నెఱింగిరి. మధురానగరంబునకు హలాయుధ సమేతుండ నై యే నరుగుచో
గోపిక లోపికలు లేక భక్తి యోగంబునం జింతించి, ముక్త లైరి. ఇది భక్తి యోగ
ప్రకారంబు. అని యుద్ధవునికిం జెప్పిన.
103
క. ధ్యానం బే క్రియ నిలుచును
ధ్యానం బే రీతి దగు నుదాత్తచరిత్రా!
ధ్యాన ప్రకార మంతయు
నూనంబుగఁ జెప్పుమయ్య! యుర్వీరమణా!
104
వ. అని యడిగిన, న య్యాదవేంద్రుం డి ట్లని పలుకం దొణంగె. దారు మధ్య భాగంబున ననలంబు
సూక్ష్మరూపమున వర్తించుచందంబున, నందం బై, సకల శరీరులయందు నచ్ఛేద్యుండును,
నదాహ్యుండును, నశోష్యుండును నైన జీవుండు వసియించియుండు. అనిన, నుద్ధవుం డి ట్లనియె.
సనక సనందనాది యోగీంద్రులకు యోగమార్గం బే రీతి నానతిచ్చితివి. అది యే విధం
బానతీవే. అని, యభ్యర్థించిన, నతం డి ట్లనియె. వారలు చతుర్ముఖు నడిగిన, నతండు
నేనును దెలియనేర ననిన, వారలు విస్మయం బందుచుండ, నే నాసమయంబున హంస స్వరూపుండ
నై, వారల కెఱింగించిన తెఱంగు వినుము. పంచేంద్రియంబులకు దృష్టం బైన పదార్థం
బనిత్యంబు. నిత్యదృష్టి బ్రహ్మం బని తెలియ వలయు. దేహి కర్మార్జిత దేహుం డై, సంసార
మమతల నిరసించి, నిశ్చల జ్ఞాన యుక్తుం డై, మత్పద ప్రాప్తుం డగు. స్వప్న లబ్ధ
పదార్థంబు నిజముగాని క్రియఁ గర్మానుభవ పర్యంతంబు కళేబరంబు వర్తించు. అని,
సాంఖ్యయోగంబున సనకాదులకు నెఱింగించిన విని, బ్రహ్మ మొద లైన దేవత లెఱింగిరి.
వారల వలన భూలోకంబునందుఁ బ్రసిద్ధం బయ్యె. అది గావున నీవును నెఱింగి కొని
పుణ్యాశ్రమంబులకుం జనుము. అస్మదీయ భక్తియుక్తు లను హరిపరాయణులను నిరసింపక,
యట్టి భాగవతుల చరణ రజఃపుంజంబు తన శరీరంబు సోఁకఁజేయు నతండును,
ముద్రాధారణ పరులకును హరి దివ్యనామంబును ధరియించు వారలకును నన్నోదికంబులు
నిడు నతండును, వాసుదేవభక్తులం గని హర్షించు వాఁడును, భాగవతులు. అని చెప్పి,
మఱియు, సర్వసంగ పరిత్యాగంబుచేసి, యొం డెఱుంగక, నన్నే తలంచు మానవునకు భుక్తి
ముక్తి ప్రదాయకుండ నై యుండుదు. అని యానతిచ్చిన నుద్ధవుండు, జ్ఞానమార్గం బేరీతి
యానతీవలయు. అనిన, హరి యి ట్లనియె. ఏకాంతమానసుం డై, హస్తాబ్జం బూరుద్వయంబున
సంధించి, నాసాగ్రంబున నీక్షణంబు నిలిపి, ప్రాణాయామంబున నన్ను హృదయగతుంగాఁ
దలంచి, యష్టాదశ ధారణాయోగసిద్ధు లెఱింగి, యందు నణిమాదులు ప్రధానసిద్ధులుగాఁ
దెలిసి, యింద్రియంబుల బంధించి, మనం బాత్మయందుఁ జేర్చి, యాత్మ నాత్మతోఁ గీలించిన
బ్రహ్మపదంబుఁ బొందు భాగవతశ్రేష్ఠు లితర ధర్మంబులు మాని, నన్నుం గాంతురు. తొల్లి
పాండునందనుం డగు అర్జునుండు యుద్ధరంగంబున విషాదంబు నొంది, యిట్ల యడిగిన,
నతనికి నేఁ జెప్పిన తెఱంగు నెఱింగించెద. భూతంబులందు నాధారభూతంబును, సూక్ష్మంబుల
యందు జీవుండును, దుర్జయంబులయందు మనంబును, దేవతలయందుఁ బద్మగర్భుండును,
వసువులయందు హవ్యవాహుండును, నాదిత్యులందు విష్ణువును, రుద్రులందు నీలలోహితుండును,
బ్రహ్మలయందు భృగువును, ఋషులలోన నారదుండును, ధేనువులయందుఁ గామధేనువును,
సిద్ధులలోనం గపిలుండును, దైత్యులలోఁ బ్రహ్లాదుండును, గ్రహంబులలోఁ గళానిధియును,
గజంబులలో నైరావతంబును, హయంబులలో నుచ్చైశ్శ్రవంబును, నాగంబులలోన వాసుకియును,
మృగంబులలోనఁ గేసరియును, నాశ్రమంబులందు గృహస్థాశ్రమంబును, వర్ణంబులలోన
నోంకారంబును, నదులయందు గంగయును, సాగరంబులలో దుగ్ధసాగరంబును, నాయుధంబులలోఁ
గార్ముకంబును, గిరులయందు మేరువును, వృక్షంబులలో నశ్వత్థంబును, నోషధులలోన
యవలును, యజ్ఞంబులయందు బ్రహ్మయజ్ఞంబును, వ్రతంబులం దహింసయు, యోగంబులందు
నాత్మయోగంబును, స్త్రీలలోన శతరూపయును, భాషణంబులలోన సత్యభాషణంబును,
ఋతువులందు వసంతాగమంబును, మాసంబులలో మార్గశీర్షంబును, నక్షత్రంబులలో
నభిజిత్తును, యుగంబులయందుఁ గృతయుగంబును, భగవదాకారంబులందు వాసుదేవుండును,
యక్షులలోఁ గుబేరుండును, వానరులయం దాంజనేయుండును, రత్నంబులయందుఁ బద్మరాగంబును,
దానంబులలో నన్నదానంబును, దిథులయం దేకాదశియు, నరులయందు వైష్ణవుం డై
భాగవతప్రవర్తనం బ్రవర్తించు వాఁడును, నివి యన్నియు మద్విభూతులుగా నెఱుంగుము.
అని, కృష్ణుం డుద్ధవున కుపన్యసించిన, వెండియు నతం డి ట్లనియె.
105
AndhraBharati AMdhra bhArati - itihAsamulu - bhAgavatamu - EkAdaSa skaMdhamu - bammera pOtana poetana pothana potanAmAtya pOtanAmAtyuDu ( telugu andhra )