ఇతిహాసములు భాగవతము ఏకాదశ స్కంధము
క. వర్ణాశ్రమ ధర్మంబులు
నిర్ణయముగ నానతిమ్ము నీరజనాభా!
కర్ణ రసాయనముగ నవి
వర్ణింపుము వినెద నేఁడు వనరుహనేత్రా!
106
వ. అనినఁ గృష్ణుండు నాలుగు వర్ణంబుల యుత్పత్తియు, నాలుగాశ్రమంబుల కిట్టిట్టి వర్ణంబు
లనియును, నాలుగువేదంబులం జెప్పిన ధర్మంబులును, బ్రవృత్తి నివృత్తి హేతువు లగు
పురాణేతిహాస ధర్మశాస్త్రంబులును, వైరాగ్య విజ్ఞానంబులును, నివి మొదలుగాఁ గల
వన్నియు నెఱింగించి, "సర్వధర్మాన్‌ పరిత్యజ్య మా మేకం శరణం వ్రజ" అను
నుపనిషత్తుల్యం బగు గీతావచన ప్రకారంబున, నెవ్వఁ డేనియు నాయందుల మతిఁ దగిలి
వర్తించు వాఁడు నే నని పలుకంబడు. పెక్కు విధంబుల వాదంబు లేల? ఎందునుం దగులువడక
నామీఁద తలంపు గలిగి వర్తింపుము. అనిన, నుద్ధవుం డి ట్లనియె.
107
క. తెలియనివి కొన్ని చెప్పితి
తెలియఁగఁగల వెల్ల నింకఁ దెలుపుము కృష్ణా!
వల నెఱిఁగి తెలియవలయును
నలినాసనజనక! భక్తనతపదయుగళా!
108
వ. అని యుద్ధవుం డడిగినఁ, బుండరీకాక్షుండు నీ ప్రశ్నంబులు దుర్లభంబు లైనను, వినుము.
నియమ శమ దమాదులు తపంబు లనంబడు. సుఖదుఃఖంబులు స్వర్గనరకంబు లనంబడు.
అవి యెవ్వి యనిన, మౌనవ్రత బ్రహ్మచర్య క్షమా జపతపంబులును, నతిథి సత్కారంబులును,
నరహితంబును, నివి మొదలయినవి నియమంబులు. ఇంద్రియనిగ్రహంబును, శత్రు మిత్ర సమత్వంబును,
శమం బనఁ బరఁగు. మూఢజనులకు జ్ఞానోపదేశార్థంబుగఁ గామ్యత్యాగంబును,
సమదర్శనంబును, వైష్ణవసమూహంబులందు భక్తియుఁ, బ్రాణాయామంబునఁ జిత్త శుద్ధి
నొంది, నిత్యతృప్తుఁ డౌటయు దమంబు. ఇట్టి నియమాది గుణసహితత్వంబును, మద్భక్తి
సాహిత్యంబును, ననునదియె సుఖంబు. న న్నెఱుంగక తమోగుణంబునం బరఁగుటయే దుఃఖం
బనంబడు. బంధు గురు జనంబు లనియెడు భేదబుద్ధి నొంది, శరీరంబు నిజ గృహంబుగా
భావించినవాఁడె దరిద్రుండు. ఇంద్రియ నిరసనుండును, గృపణగుణ విరక్తుండు నైన వాఁడే
యీశ్వరుండు. నాయందుఁ దలంపు నిలిపి, కర్మ యోగంబునందును, భక్తియోగంబునందును,
వాత్సల్యంబు గలిగి, జనకాదులు కైవల్యంబుఁ జెందిరి. భక్తి యోగంబునంజేసి, శబరీ
ప్రహ్లాద ముచుకుందాదులు పరమపద ప్రాప్తు లైరి. అది గావున, నిది యెఱింగి, నిరంతర
భక్తి యోగం బధికంబుగా మనంబున నిలుపుము. మృణ్మయం బైన ఘటంబున జలంబులు
జాలుగొను తెఱంగున, దినదినంబునకు నాయువు క్షయం బై, మృత్యువు సన్నిహితం బై వచ్చు.
కావున, నిది యెఱింగి, నిరంతరంబును న న్నేమఱక తలంచు నతండు నాకుం బ్రియుండు.
109
క. గర్భమునఁ బరిజ్ఞానము
నిర్భర మై యుండు జీవునికిఁ దుది నతఁ డా
విర్భూతుఁ డైనఁ జెడు నం
తర్భావంబునను బోధ మంతయు ననఘా!
110
వ. అట్లు గావున, జనుండు బాల్య కైశోర కౌమార వయోవిశేషంబుల వెనుకనైన న
న్నెఱింగెనేనిఁ, గృతకృత్యుం డగు. సంప ద్గర్వాంధుఁ డైన, నంధకార కూపంబునం బడు.
వానిని దరిద్రునిఁగా జేసిన జ్ఞాని యై, యస్మత్పాదారవింద వందనాభిలాషి యై ముక్తుం
డగు. అట్లు గావున దేహాభిమానంబు వర్జించి, యైహికాముష్మిక సుఖంబులం గోరక, మనంబుఁ
గుదియించి, యేప్రొద్దు న్నన్నుఁ దలంచువాఁడు వైకుంఠపద ప్రాప్తుం డగు. నేను నతని విడువం
జాలక, వెంట నరుగుదు. నారదాది మునులు, భక్తిభావనంబునంజేసి, నాస్వరూపం బై మనిరి.
అని యుద్ధవునకుం జెప్పిన, నుద్ధవుం డి ట్లనియె.
111
క. అయ్యా! దేవ! జనార్దన!
నెయ్యంబున సృష్టికర్త నేర్పరి యై తా
నొయ్యన నడపును నెవ్వఁడు
చయ్యన నెఱిఁగింపు నాకు సర్వజ్ఞనిధీ!
112
వ. అనుటయు, హరి యుద్ధవునకుం జెప్పె. ఇట్లు మత్ప్రేరితంబు లై, మహదాది గుణంబులు కూడి,
యండం బై, యుద్భవించె. ఆ యండంబు వలన నే నుద్భవించితిని. అంత నా నాభివివరంబున
బ్రహ్మ యుదయించె. అంత సాగరారణ్య నదీ నద సంఘంబులు మొదలుగాఁగల జగన్నిర్మాణంబు
నతని వలనం గల్పించితిని. అంత శతానందునకు, శతాబ్దంబులు పరిపూర్ణం బయిన, ధాత్రి
గంధంబందడంగును. ఆ గంధం బుదకంబునం గలయును. ఉదకంబు రసంబున లీనం బగును.
ఆ రసంబు తేజోరూపం బగును. ఆ తేజంబు రూపంబున సంక్రమించును. ఆ రూపంబు వాయువందుం
గలయు. వాయువు స్పర్శ గుణ సంగ్రాహ్యం బైన, నా స్పర్శగుణం బాకాశంబున లయం బగును.
ఆ యాకాశంబు శబ్దతన్మాత్రలచే గ్రసియింపఁ బడిన, నింద్రియంబులు మనో వైకారిక
గుణంబులం గూడి, యీశ్వరునిం బొంది, యీశ్వరరూపంబుఁ దాల్చు. ఏను రజ స్సత్త్వ తమోగుణ
సహితుండ నై, త్రిమూర్తులు వహించి, జగ దుత్పత్తి స్థితి లయ కారణుండ నై వర్తించుదు.
కావున నీ రహస్యంబు నీకు నుపదేశించితి. పరమ పావనుండవుఁ బరమ భక్తి యుతుండవుఁ
గమ్మని చెప్పె. అంత.
113
AndhraBharati AMdhra bhArati - itihAsamulu - bhAgavatamu - EkAdaSa skaMdhamu - bammera pOtana poetana pothana potanAmAtya pOtanAmAtyuDu ( telugu andhra )