ఇతిహాసములు భాగవతము ఏకాదశ స్కంధము
తే. రూపు లేని నీకు రూఢిగా యోగులు
రూపు నిల్పి నిన్ను రుచిర భక్తిఁ
గొల్చి యుండ వారి కోర్కెల నిచ్చెద
వేమిలాగు మాకు నెఱుఁగఁ బలుకు.
114
వ. అని యుద్ధవుం డడిగిన, నారాయణుం డి ట్లనియె. నేను సర్వవర్ణంబులకు సమం బయిన
పూజాప్రకారం బెఱింగించెద. ఆచారంబునం జేసి, యొక్క స్వరూపంబును, బాషాణ
మృణ్మయ దారువులం గల్పించి, నారూపంబుగా నిల్పుకొని, కొందఱు పూజింతురు. కాంస్య,
త్రపు, రజత, కాంచన, ప్రతిమా విశేషంబు లుత్తమంబులు. ఇట్లు నా రూపంబులందు
మద్భావం బుంచి, కొల్చిన వారలకుఁ నేఁ బ్రసన్నుండ నగుదును. ఈ లోకంబున
మనుష్యులకు ధ్యానంబు నిలువనేరదు. కావునం బ్రతిమా విశేషంబు లనేకంబులు
గలవు. వానియందు సౌందర్య సారంబులును, మనోహరంబులును నైన రూపంబుల నే నుందు.
కావున దుగ్ధార్ణవ శాయిగా భావించి, ధౌతాంబరాభరణ మాల్యానులేపనంబులను,
దివ్యాన్నపానంబులను, షోడశోపచార పూజా ప్రకారంబులను, రాజోపచారంబులును,
బాహ్యపూజా విధానంబులను నాచరించి, మనస్సంకల్పితంబు లయిన పదార్థంబులు
సమర్పించి, నిత్యంబును నాభ్యంతర పూజావిధానంబులఁ బరితుష్టునిం జేసి,
దివ్యాంబరాభరణ మాల్యాను శోభితుండును, శంఖ చక్ర కిరీటా ద్యలంకార
భూషితుండును, దివ్యమంగళ విగ్రహుండునుం గాఁ దలంచి, ధ్యాన పరవశుం డయిన
యతండు నాయందులం గలయు. ఉద్ధవా! నీవు నీ ప్రకారంబు గరిష్ఠనిష్ఠాతిశయంబున
యోగనిష్ఠుం డ వై, బదరికాశ్రమంబుఁ జేరి మత్కథితం బైన సాంఖ్యయోగం
బంతరంగంబున నిలుపుకొని, కలియుగావసాన పర్యంతంబు వర్తింపుము. అని య ప్పరమేశ్వరుం
డానతిచ్చిన, నుద్ధవుండు నానందభరి తాంతరంగుం డై, తత్పాదారవిందంబులు
హృదయంబునం జేర్చి కొని, పావనం బయిన బదరికాశ్రమంబునకు నరిగె. అని శుకుండు
పరీక్షిన్నరేంద్రునకుం జెప్పుటయును.
115
క. చెప్పిన విని రాజేంద్రుఁడు
చొప్పడ శ్రీకృష్ణుకథలు చోద్యము గాఁగ\న్‌
జెప్పినఁ దనియదు చిత్తం
బొప్పుగ మునిచంద్ర! నాకు నుత్తము లొప్ప\న్‌.
116
AndhraBharati AMdhra bhArati - itihAsamulu - bhAgavatamu - EkAdaSa skaMdhamu - bammera pOtana poetana pothana potanAmAtya pOtanAmAtyuDu ( telugu andhra )