ఇతిహాసములు భాగవతము ఏకాదశ స్కంధము
యాదవు లన్యోన్య కలహంబున మడియ శ్రీకృష్ణ బలరాములు వైకుంఠంబున కరుగుట
తే. అంతట ను గృష్ణుఁ డేమయ్యె నరసిచూడ
యదువు లెట్టులు వర్తించి రేర్పడంగ
ద్వారకా పట్టణం బె వ్విధమున నుండె
మునిజనశ్రేష్ఠ! యానతీ ముదముతోడ.
117
వ. అనిన రాజునకు శుకుం డి ట్లనియె. వాసుదేవుం డన్యాయ ప్రవర్తకు లగు దుష్టుల
సంహరించి, న్యాయప్రవర్తకు లగు శిష్టులఁ బరిపాలనంబు చేసి, బలరామ
సమేతంబుగా ద్వారకానగరంబు వెడలినం గని, యాదవులు దమలోఁ దాము
మదిరాపాన మత్తు లై, మత్సరంబున నుత్సాహకలహంబునకుం గమకించి, కరి
తురగ రథ పదాతి బలంబులతో ననర్గళంబుగా యుద్ధసన్నద్ధు లై, యుద్ధంబునకుం
జొచ్చి, మునిశాప కారణంబున నుత్తుంగంబు లైన తుంగ సమూహంబులం బడలు వడం
బొడుచుచునుం దాఁకు నప్పుడు, నవియును వజ్రాయుధ సమానంబు లై తాఁకిన,
భండనంబునం గడికండంబు లై యొరగు కబంధంబులును, వికలంబు లైన యంగంబులును,
విభ్రష్టంబు లైన రథంబులును, వికటంబు లైన శకటంబులును, వ్రాలెడి
యశ్వంబులును, మ్రొగ్గెడి గజంబులు నై, య య్యోయోధనంబున నందఱుం బొలియుటకు నగి,
నగధరుండును రాముండునుం జని చని, యంత నీలాంబరుండు వేఱొక త్రోవం బోయి,
యోగమార్గంబున ననంతునిం గలసె. అ ప్పరమేశ్వరుండును మఱియొక మార్గంబునం జని,
యొక్క నికుంజపుంజంబు చాటున విశ్రమించుటం జేసి, చరణంబు వేఱొక చరణంబుమీఁద
సంఘటించి, చంచలంబుగా వినోదంబులు సలుపు సమయంబున, నొక్క లుబ్ధకుండు
మృగవధార్థంబుగా వచ్చి, దిక్కులు నిక్కి నిరీక్షింపుచుండ, వృక్షంబు చాటున
న ప్పరమపురుషుని చరణంబు హరిణ కర్ణంబు గాఁబోలు నని, దానిఁ గని,
శరంబు శరాసనంబునందు సంధానంబుచేసి, యేసిన, నతండు హాహారవంబునం
గదలుచుండ న ప్పరమేశ్వరుని సన్నిధానంబునకు వచ్చి, జగన్నాథుంగాఁ దెలిసి,
భయంబున, మహాపరాధుండను, బాపచిత్తుండను, గుటిలప్రచారుండ నని, యనేకవిధ
దీనాలాపంబులం బలుకుచు, బాష్పజలధారాసిక్త వదనుం డైన, సరోజనేత్రుండు
వానిం గరుణించి, యి ట్లనియె. నీ వేల జాలింబడెదు. పూర్వజన్మ కర్మంబు లెంతవానికి
నైన ననుభావ్యంబులు గాని, యూరకపోవనేరవు. నీవు నిమిత్తమాత్రుండ వింతియ.
అని వానికిం దెలిపిన, వాఁడు మహాపరాధు లైన వా రూరక పోవరు. దేవ బ్రాహ్మణ
గురు ద్రోహులకు నిలువ నెట్లగు? అని పవిత్రాంతఃకరణు డై, ప్రాయోపవేశంబునం
బ్రాణంబులు వర్జించి, వైకుంఠ పదప్రాప్తుం డయ్యె. అప్పుడు.
118
క. దారుకుఁడు గనియె నంతటఁ
జారు నిరూఢావధాను సర్వజ్ఞు హరి\న్‌
మేరుసమధీరు దనుజవి
దారుని నేకాంతపరునిఁ దద్దయు వేడ్క\న్‌.
119
వ. కని, యత్యంత భయ భక్తి తాత్పర్యంబుల ముకుళిత కరకమలుం డై, యి ట్లనియె. 120
తే. నిన్నుఁ జూడని కన్నులు నిష్ఫలములు
నిన్ను నొడువని జిహ్వ దా నీరసంబు
నిన్నుఁ గానని దినములు నింద్యము లగుఁ
గన్నులను జూచి మమ్మును గారవింపు.
121
వ. అనుచు, నా దారుకుండు నిర్వేదనపరుం డై, యి ట్లని విన్నవించె. యాదవ సముద్రం బడంగె.
బంధు గురు మిత్ర జనంబు లక్కడక్కడం బోయిరి. ద్వారకకుం బోయి, సుహృజ్జనంబులం గూడి,
యే మందు. అని పలుకు నవసరంబున, దివ్యాయుధంబులును, దివ్యరథ రథ్యంబులును,
నంతర్ధానంబు నొందె. నారాయణుండును వానితో, అక్రూర విదురులకు నీ వృత్తాంతం బంతయుఁ
జెప్పుము. సవ్యసాచిం గని, స్త్రీ బాల గురు వృద్ధజనంబులఁ గరిపురంబునకుఁ గొని
చనుమనుము. పొమ్ము. అనిన, వాఁడును మరలి చని, కృష్ణుని వాక్యంబులు సవిస్తరంబుగాఁ
జెప్పె. అట్లు చేయ, నక్షణంబ ద్వారకానగరంబు పరిపూర్ణజలం బై మునింగె.
అంత, నెవ్వరికిం జనరాక యుండె.
122
AndhraBharati AMdhra bhArati - itihAsamulu - bhAgavatamu - EkAdaSa skaMdhamu - bammera pOtana poetana pothana potanAmAtya pOtanAmAtyuDu ( telugu andhra )