ఇతిహాసములు భాగవతము ఏకాదశ స్కంధము
వ. అప్పరమేశ్వరుండును శతకోటి సూర్య దివ్యతేజో విభాసితుం డై వెడలి, నారదాది
మునిగణంబులును, బ్రహ్మరుద్రాది దేవతలును, జయ జయ శబ్దంబులతోడం గదలి రా
నిజపదంబున కరిగె. నారాయణ విగ్రహంబు జలధిప్రాంతంబున జగన్నాథ స్వరూపం
బై యుండె. అని శుకుండు పరీక్షిన్నరేంద్రునకుం జెప్పె. అని చెప్పి.
122
క. ఈ కథ విన్నను వ్రాసినఁ
బ్రాకటముగ లక్ష్మి యశము భాగ్యము గలుగు\న్‌
జేకొని యాయువు ఘనుఁ డై
లోకములో నుండు నరుఁడు లోకులు వొడగన్‌.
123
క. రాజీవసదృశనయన! వి
రాజిత శుభదాభిదేయ! రాజవినుత! వి
భ్రాజితకీర్తి లతావృత!
రాజీవభవాది జనక! రఘుకుల తిలకా!
124
మాలిని. ధరణిదుహితృ రంతా! ధర్మమా ర్గావగంతా!
నిరుపమ నయవంతా! నిర్జరారాతి హంతా!
గురు బుధ సుఖకర్తా! కోసల క్షోణిభర్తా!
సురభయ పరిహర్తా! సూరి చేతోవిహర్తా!
125
గద్య. ఇది శ్రీపరమేశ్వర కరుణాకలిత కవితావిచిత్ర కేసనమంత్రి పుత్ర సహజ పాండిత్య
పోతనామాత్య ప్రియశిష్య వెలిగందల నారాయణాఖ్య ప్రణీతం బైన, శ్రీ మహాభాగవతం
బను మహాపురాణంబునందుఁ గృష్ణుండు భూభారంబు వాపి, యాదవుల కన్యోన్య
వైరానుబంధంబు గల్పించి, వారల హతంబు గావించుటయు, విదేహర్షభ సంవాదంబును,
నారాయణముని చరిత్రంబును, నాల్గుయుగంబుల హరి నాల్గు వర్ణంబు లై వర్తించుటయు,
బ్రహ్మాదిదేవతలు ద్వారకానగరంబునకుం జని, కృష్ణుం బ్రార్థించి, నిజపదంబునకు
రమ్మనుటయు, నవధూత యదు సంవాదంబును, నుద్ధవునకుఁ గృష్ణుండు నానావిధంబు లైన
యుపాఖ్యానంబు లెఱింగించుటయు, నారాయణ ప్రకారం బంతయు దారుకుం డెఱింగి వచ్చి,
ద్వారకావాసులకుం జెప్పుటయుఁ, గృష్ణుండు దన దివ్యతేజంబుతోఁ బరమాత్మం గూడుటయు నను
కథలు గల యేకాదశస్కంధము సంపూర్ణము.
 
AndhraBharati AMdhra bhArati - itihAsamulu - bhAgavatamu - EkAdaSa skaMdhamu - bammera pOtana poetana pothana potanAmAtya pOtanAmAtyuDu ( telugu andhra )