ఇతిహాసములు భాగవతము ద్వాదశ స్కంధము
భవిష్య న్నరపాలరాజ్య పరిపాలన కాలనిర్ణయాను వర్ణనము
క. శ్రీమరుదశనపతి శయన!
కామిత ముని రాజయోగి కల్పద్రుమ! భూ
కామ! ఘన జనక వరనృప
జామాతృవరేశ! రామచంద్రమహీశా!
1
వ. మహనీయ గుణగరిష్ఠు లగు న మ్మునిశ్రేష్ఠులకు నిఖిలపురాణవ్యాఖ్యాన వైఖరీ
సమేతుం డయిన సూతుం డిట్లనియె. అట్లు పరీక్షిన్నరేంద్రునకు శుకయోగీంద్రుండు వాసుదేవ
నిర్యాణపర్యంతంబు తజ్జన్మకర్మంబులు సెప్పిన విని, సంతసం బంది, య న్నరపాల పుంగవుండు,
మహాత్మా! నారాయణ కథాప్రపంచంబును, దద్గుణంబులును, నాచారవిధియును, జీవాత్మ
భేదంబును, హరిపూజా విధానంబును, జ్ఞానయోగ ప్రకారంబును, మొదలయినవి యెఱింగించి,
జ్ఞానవంతుంగాఁ జేసి, మన్నించితివి. ఇంక భావికార్యంబు లన్నియు నెఱింగింపుము.
అనిన శుక యోగీంద్రుం డి ట్లనియె.
2
అధ్యాయము - 1
క. నరవర! యీ ప్రశ్నమునకు
సరి చెప్పగఁరాదు నాదు సామర్థ్యముచేఁ
బరికించి నీకుఁ జెప్పెదఁ
గర మొప్పఁగ భావి కాలగతులన్‌ వరుసన్‌.
3
వ. అందు రాజుల ప్రకారం బెఱింగించెద, బృహద్రథునకుం బురంజయుండు వుట్టును.
వానికి శునకుం డనెడువాఁడు మంత్రి యై, పురంజయునిం జంపి, తాను రాజ్యం
బేలుచుండ, నంతఁ గొంతకాలంబున కతనికిం గుమారుఁ డుదయించిన, వానికిం
బ్రద్యోతననామం బిడి, యతనికిం బట్టంబు గట్టును. ఆభూభుజునకు విశాఖయూపుం
డుదయించఁ గలఁడు. అతనికి నందివర్ధనుండు జనియించు. ఈ యేవురు నూట
ముప్పదియెనిమిది సంవత్సరంబులు వసుంధరాపరిపాలనంబునం బెంపు వడయుదురు.
తదనంతరంబున, శిశునాభుం డను పార్థివుం డుదయించు. ఆ మూర్ధాభిషిక్తునకుఁ
గాకవర్ణుండు జనియించు. ఆ రాజన్యునకు క్షేమచర్ముఁ డుదయించఁ గలఁడు.
ఆ పృథ్వీపతికి క్షేత్రజ్ఞుఁడును, నతనికి విధిసారుండును, విధిసారున కజాత
శత్రుండును, నా భూపాలునకు దర్భకుండును, దర్భకునికి నజయుండును, నతనికి
నందివర్ధనుండును, నతనికి మహానందియు ననంగల శైశునాభులు పదుగురు నరపాలకు
లుద్భవించి, షష్ట్యుత్తర త్రిశతహాయనంబులు కలికాలమందు ధరాతలం బేలెదరు.
అంతట మహానందికి శూద్రస్త్రీ గర్భంబున నతిబలశాలి యైన మహాపద్మపతి యను
నందుండుదయించు. అతనితో క్షత్త్రియవంశం బణఁగిపోఁగలదు. ఆ సమయంబున
నరపతులు శూద్రప్రాయు లై, ధర్మవిరహితు లై, తిరుగుచుండ, మహాపద్మునకు సుమాల్యుండు
మొద లయిన యెనమండ్రు కుమారు లుదయించెదరు. వారు నూఱు సంవత్సరంబులు క్షోణీతలం
బేలెదరు. అంతటఁ గార్ముకుండు మొదలుగా రాజనవకంబు నందాఖ్యలం జనియించు.
ఆ నవనందుల నొక భూసురోత్తముం డున్మూలనంబు సేయు. అప్పుడు వారు లేమిని మౌర్యులు
గొంతకాలం బీ జగతీతలంబు నేలుదురు. అత్తఱి నా భూదేవుండు చంద్రగుప్తుం డను వాని
నందరాజ్యమునందు నభిషిక్తునిఁగాఁ జేయఁ గలఁడు. అంత నా చంద్రగుప్తునకు
వారిసారుండును, వానికి నశోకవర్ధనుండును, నతనికి సుయశస్సును, వానికి సంయతుండును,
న మ్మహనీయునకు శాలిశూకుండును, నతనికి సోమశర్ముండును, వానికి శతధన్వుండును,
న వ్వీరునకు బృహద్రథుండు నుదయించెదరు. మౌర్యులతోఁ జేరిన యీ పదుగురును,
సప్తత్రింశ దుత్తరశతాబ్దంబులు నిష్కంటకంబుగా భూపరిపాలనంబు సేసెదరు.
ఆ సమయంబున బృహద్రథుని సేనాపతి యగు పుష్యమిత్రుఁడు శుంగాన్వయుఁ డతని
వధించి, రాజ్యంబు గైకొను. అతనికి నగ్నిమిత్రుం డను నరపతి పుట్టఁ గలవాఁడు.
వానికి సుజ్యేష్ఠుండును, సుజ్యేష్ఠునకు వసుమిత్రుండును, నతనికి భద్రకుండును,
భద్రకునకుఁ బుళిందుండును, నాశూరునకు ఘోషుండును, వానికి వజ్రమిత్రుండును,
అతనికి భాగవతుండును, వానికి దేవహూతియు జనియించెదరు. ఈ శుంగులు పదుగురును
ద్వాదశోత్తరశత హాయనంబు లుర్వీపతు లయ్యెదరు. అంతమీఁదట నల్పగుణు లైన
కణ్వులు భూమినిఁ బాలింతురు. శుంగకుల కంజాతుం డయిన దేవహూతిని గణ్వుఁడును,
నమాత్యుండు నగు వసుదేవుం డనువాఁడు వధియించి రాజ్యంబేలు. వానికి భూమిత్రుండును,
నా మహానుభావునకు నారాయణుండును గలిగెదరు. కణ్వవంశజు లయిన వీరలు మున్నూట
నలువదేను సంవత్సరంబులు మేదినీతలం బేలుదురు. మఱియును.
4
క. చతురత నీ క్షితి నేలియు
మతి మోహము విడువలేక మానవనాథుల్‌
సతతముఁ దమ కీ కాలం
బతిచంచల మగుట నెఱుఁగరయ్య! మహాత్మా!
5
క. నరపతుల మహిమ నంతను
నురగాధిపుఁ డైన నొడువ నోపఁడు ధాత్రిం
జిరకాల మేలి యిందే
పరువడి నణఁగుదురు వారు భ్రాంతులు నగుచున్‌.
6
క. గజతురగాది శ్రీలను
నిజ మని నమ్మంగరాదు నిత్యమును హరి\న్‌
గజగిజ లేక తలంచిన
సుజనులకును నతనియందుఁ జొరఁగావచ్చు\న్‌.
7
వ. మఱియును, గణ్వవంశజుఁ డగు సుశర్ముం డను రా జుదయించిన, వాని హింసించి,
తద్భృత్యుం డంధ్రజాతీయుం డయిన వృషలుం డధర్మమార్గవర్తి యై,
వసుమతీచక్రం బవక్రుం డై యేలు. అంత వాని యనుజుండు కృష్ణుం డనువాఁడు
రాజై నిలుచు. ఆ మహామూర్తికి శాతకర్ణుండును, వానికి పౌర్ణమాసుండును,
నతనికి లంబోదరుండును, వానికి శిబిలకుండును, నతనికి మేఘస్వాతియును,
వానికి దండమానుఁడును, వానికి హాలేయుం డగు నరిష్టకర్మయు, నతనికిఁ
దిలకుండును, నతనికిఁ బురీషసేతుండును, వానికి సునందనుండును, నా
రాజశేఖరునకు వృకుండును, వృకునకు జటాపుండును, జటాపునకు శివస్వాతియు,
వానికి నరిందముండును, నా భూమీశునకు గోమతియును, వానికిఁ బురీమంతుండును,
నతనికి దేవశీర్షుండును, వానికి శివస్కందుండును, నతనికి యజ్ఞశీలుండును,
నా భవ్యునకు శ్రుతస్కందుండును, వానికి యజ్ఞశత్రుఁడును, వానికి విజయుండును,
విజయునకుఁ జంద్రబీజుండును, నతనికి సులోమధియును, నిట్లు పెక్కం డ్రుదయించి,
నన్నూట యేఁబదియాఱు సంవత్సరంబులు ధాత్రిం బాలించెదరు. అంతట నాభీరు
లేడుగురు, గర్దభులు పదుండ్రును, గంకవంశజులు పదార్గురు, యవను లెనమండ్రు,
బర్బరులు పదునలుగురు దేశాధీశు లై యేలెదరు. మఱియు\న్‌ మురుండులు పదుముగ్గురును,
బదునలుగురు మౌనులును, వెయ్యిన్ని తొమ్మన్నూట తొమ్మిది హాయనంబులు గర్వాంధు లై
యేలెదరు. అటమీఁద న మౌలివంశజు లగు పదునొకండుమంది త్రిశతయుతం బైన
వత్సరంబులు మత్సరంబున నేలెదరు. ఆ సమయంబునఁ గైలికిలు యను యవనులు
భూపతు లగుదురు. అందు భూతనందుండును, యవభంగిరుండును, శిశునందుండును,
దద్భ్రాత యగు యశోనందుండును, బ్రవీరకుండును, వీరలు వీరు లై, షడుత్తరశత
హాయనంబు లేలెదరు. అంత నా రాజులకుఁ బదుముగ్గురు కుమారు లుదయించి, యందు
నార్గురు బాహ్లిక దేశాధిపతు లయ్యెదరు. కడమ యేడ్గురును కోసలాధిపతు
లయ్యెదరు. అంత వైడూర్యపతులు నిషధాధిపతు లై యుండెదరు. పురంజయుండు
మగధదేశాధిపతి యై పుట్టు. అంత నతండు పుళింద యదు మద్రదేశ వాసు
లగు హీనజాతి జనులు బ్రహ్మజ్ఞాన హీను లై, హరి భక్తి విరహితు లై యుండ,
వారికి ధర్మోపదేశంబు చేసి, నారాయణభక్తి నిత్యంబు నుండునట్లుగాఁ
జేసి, బలపరాక్రమవంటుం డై, క్షత్త్రియవంశంబు లడంచి, పద్మావతీ నగర
పరిపాలకుం డై, గంగానది మొదలు ప్రయాగవఱకుఁ గల భూమి నేలఁగలఁడు.
సౌరాష్ట్ర, అవంతి, ఆభీర, అర్బుద మాళవదేశాధిపతులు వ్రాత్యబ్రాహ్మణు లయి,
శూద్రప్రాయు లై, యుండఁ గలరు. వారు సింధుతీరంబులను, జంద్రభాగా ప్రాంతంబులను,
కాంచీ కాశ్మీర మండలంబు నేలెదరు. మఱియు నత్తఱి శూద్రులును, మ్లేచ్ఛులును,
బ్రహ్మతేజో హీను లయిన బ్రాహ్మణులును, భూభాగంబులం బరిపాలింతురు. మఱియు,
వీరలు రాజరూపు లయిన మ్లేచ్ఛు లై, ధర్మ సత్య దయా హీను లై, క్రోధ
మాత్సర్యంబుల, స్త్రీ బాల గో ద్విజాతుల వధియింప రోయక, పరధన పరస్త్రీ
పరు లై, రజ స్తమో గుణరతు లై, యల్పజీవు లై, యల్పబలు లై, హరి చరణారవింద
మకరంద రసాస్వాదులు గాక, తమలో నన్యోన్య వైరానుబంధు లై, సంగ్రామరంగంబుల
హతు లయ్యెదరు. ఆ సమయంబునం బ్రజలు తచ్ఛీల వేష భాషాదుల ననుసరించి
యుండెదరు. కావున.
8
AndhraBharati AMdhra bhArati - itihAsamulu - bhAgavatamu - dvAdaSa skaMdhamu - bammera pOtana poetana pothana potanAmAtya pOtanAmAtyuDu ( telugu andhra )