ఇతిహాసములు భాగవతము ద్వాదశ స్కంధము
క. దినదినమును ధర్మంబులు
ననయము ధర నడఁగిపోవు నాశ్చర్యముగా
విను వర్ణ చతుష్కములో
నెనయఁగ ధనవంతుఁ డైన నేలు ధరిత్రి\న్‌.
9
క. బలవంతుఁ డైనవాఁడే
కులహీనుం డైన దొడ్డ గుణవంతుఁ డగు\న్‌
గలిమియు బలిమియుఁ గలిగిన
నిలలోపల రా జతండె యే మనవచ్చు\న్‌.
10
వ. అట్లుగాన, జనంబులు లోభు లై, జారత్వ చోరత్వాదులచేత ద్రవ్యహీను లై,
వన్యశాక మూల ఫలంబులను భుజింపుచు, వన గిరి దుర్గంబులం గృశీభూతు లై,
దుర్భిక్ష శీతవాతాతప క్షుధాతాపంబుల చేత భయపడి, ధైర్యహీను లై,
యల్పాయుష్కులు, నల్పతర శరీరులు నై యుండ, రాజులు చోరు లై, సంచరింపుచు,
నధర్మ ప్రవర్తను లై, వర్ణాశ్రమ ధర్మంబులు వదలి, శూద్రప్రాయు లై,
యుండెదరు. అంత నోషధు లల్పఫలదంబులు, మేఘంబులు జలశూన్యంబులు, సస్యంబులు
నిస్సారంబులు నగును. ఇట్లు ధర్మ మార్గంబు లేకయున్న యెడ, ముకుందుండు దుష్టనిగ్రహ
శిష్టపరిపాలనంబు కొరకు, శంబలగ్రామంబున విష్ణుయశుం డను విప్రునకుఁ
బుత్రత్వంబు నొంది, కల్క్యవతారుం డై, దేవతాబృందంబులు నిరీక్షింప, దేవదత్త
ఘోటకారూఢుం డై, దుష్ట మ్లేచ్ఛ జనంబులఁ దన మండలాగ్రంబున
ఖండీభూతులం జేయు. అప్పుడు ధాత్రీమండలంబు విగత క్రూరజన మండలం బై
తేజరిల్లును. అంత నరులు విష్ణుధ్యాన వందన పూజాది విధానాసక్తు లై,
నారాయణపరాయణు లై వర్తిల్లెదరు. ఇట్టులా కల్క్యవతారంబున నిఖిల జనులు
ధన్యు లయ్యెదరు. అంతటఁ గృత యుగ ధర్మం బై నడచుచుండు. చంద్ర భాస్కర
శుక్ర గురువు లేక రాశిగతు లయినం, గృతయుగం బై తోఁచు. రాజా! గత
వర్తమాన భావికాలంబులు, భవజ్జన్మంబు మొదలు పంచదశాధికోత్తర శతసహస్ర
హాయనంబు లై, నందాభిషేక పర్యంతంబు నుండు, అంత నారాయణుం డఖిల
దుష్టరాజధ్వంసంబు గావించి ధర్మంబు నిలిపి, వైకుంఠ నిలయుం డగు. అని చెప్పిన.
11
క. మునినాథ! యే విధంబున
ఘనతరముగఁ జంద్రసూర్య గ్రహముల జాడల్‌
చనుఁ గాల వర్తన క్రమ
మొనరఁగ నెఱిఁగింపవయ్య! ముదము దలిర్ప\న్‌.
12
వ. అనిన, నట్లకాక యని చెప్పఁ దొడంగె. వినుము. సప్తర్షి మండలాంతర్గతంబు లయిన,
పూర్వఋక్షద్వయ సమ మధ్యంబునందు, నిశాసమయంబున, నొక్క నక్షత్రంబు గానుపించిన,
నా కాలంబు మనుష్య మానంబున శతసంవత్సర పరిమితం బయ్యె నేని, నా సమయంబున
జనార్దనుండు నిజపదంబునం బొదలు. ఆవేళనె ధాత్రీమండలంబు కలిసమాక్రాంతం బగు.
కృష్ణుం డెంతకాలంబు భూమి యందుఁ బ్రవర్తించు, నంతకాలంబు కలి సమాక్రాంతంబు
గాదు. మఘా నక్షత్రంబందు సప్తర్షులు నేఘస్రంబున జరియింతు రా ఘస్రంబునఁ గలి
ప్రవేశించి వేయు నిన్నూరు వర్షంబు లుండు. అంత నా ఋషిసంఘంబు పూర్వాషాఢ
కరిగినం గలి ప్రవృద్ధంబు నొందు. ఏ దివసంబున హరి పరమపద ప్రాప్తుం డయ్యె న
ద్దివసంబునందె కలి ప్రవేశించి, దివ్యాబ్జ సహస్రంబులు చనిన యనంతరంబ, నాలుగవ
పాదంబునఁ గృతయుగ ధర్మంబు ప్రాప్తం బగు.
13
చ. నరవర! తొంటి భూపతుల నామ గుణంబులు వృత్త చిహ్నముల్‌
సిరియును రూపసంపదలు చెన్నగు రాజ్యము లాత్మ విత్తముల్‌
వరుస నణంగెఁ గాని యట వారల కీర్తులు నిర్మలంబు లై
యురవడి భూమిలో నిలిచి యున్నవి నేఁడును రాజశేఖరా!
14
వ. శంతను ననుజుం డగు దేవాపియు, నిక్ష్వాకువంశజుం డగు మరుత్తును, యోగ యుక్తు లై,
కలాపగ్రామ నిలయు లై, కలియుగాంతంబునందు వాసుదేవ ప్రేరితు లై, ప్రజల నాశ్రమాచారంబులు
దప్పకుండ నడపుచు, నారాయణ స్మరణంబు నిత్యంబునుం జేసి కైవల్య పదప్రాప్తు లగుదురు.
ఇ వ్విధంబున నాలుగు యుగంబుల రాజులును, నే నెఱింగించిన పూర్వరాజన్యులును, వీ
రందఱును సమస్త వస్తు సందోహంబులయందును మమతం బొంది, యుత్సాహ వంతు లై
యుండి పిదప, నీ భూతలంబు వదిలి, నిధనంబు నొందుదురు. కావునఁ గాలంబుజాడ
యెవ్వరికిం గానరాదు. కీర్తి సుకృత దుషృతంబులు వెంట నంటం గలయవి. ఇదియునుం గాక
మత్పూర్వులు హరి ధ్యానపరవశు లై, దయా సత్య శౌచ శమ దమాదిక ప్రశస్త గుణంబులం
బ్రసిద్ధు లై నడచిరి. అట్లు గావున.
15
క. ధర్మము సత్యముఁ గీర్తియు
నిర్మలదయ విష్ణుభక్తి నిరుపమ ఘన స
త్కర్మ మహింసావ్రతము
న్నర్మిలి గలవారె పుణ్యు లవనీనాథా!
16
తే. ఈ జగం బేలు తొల్లిటి రాజవరులు
కాలవశమున నాయువుల్‌ గోలుపోయి
నామమా త్రావశిష్టు లైనారు కాన
సలుపవలవదు మమత నెచ్చట నృపాల!
17
AndhraBharati AMdhra bhArati - itihAsamulu - bhAgavatamu - dvAdaSa skaMdhamu - bammera pOtana poetana pothana potanAmAtya pOtanAmAtyuDu ( telugu andhra )