ఇతిహాసములు భాగవతము ద్వాదశ స్కంధము
వ. గర్వాంధు లైన నరపతులం జూచి, బూదేవి హాస్యంబు సేయు. శత్రుక్షయంబు చేసి
యెవ్వరికి నీక, తామె యేలుచుండెద మనియెడి మోహంబునం బితృ పుత్ర భ్రాతలకు
భ్రాంతి గల్పించి, యన్యోన్య వైరానుబంధంబులం గలహంబు చేసి, రణరంగంబులం
దృణప్రాయంబులుగా దేహాదులు వర్జించి, నిర్జరలోక ప్రాప్తు లయిన పృథు
యయాతి గాధి నహుష భరతార్జున మాంధాతృ సగర రామ ఖట్వాంగ దుందుమార
రఘు తృణబిందు పురూరవ శ్శంతను గయ భగీరథ కువలయాశ్వ కకుత్స్థ
నిషధాదు లగు రాజులును, హిరణ్యకశిపు వృత్ర రావణ నముచి శంబర భౌమ
హిరణ్యాక్ష తారకాదు లయిన దైత్యులును, ధరణి మమత్వంబునం జేసికదా కాలవశంబున
నాశంబు నొందిరి. ఇది యెంతయు మిథ్య గాన సర్వంబునుం బరిత్యజించి, జనార్దన
వైకుంఠ వాసుదేవ నృసింహాది హరినామామృతపానంబు నిరంతరంబు చేసి,
జరారోగ వికృతులం బాసి, హరి పదంబు నొందుము. అని చెప్పి.
18
తే. ఉత్తమశ్లోకుఁ డన నెవ్వఁ డున్నవాఁడు
సన్నుతుం డగు నెవ్వఁడు సకలదిశల
నట్టి పరమేశ్వరునిఁ జిత్తమందు నిలిపి
తద్గుణంబులు వర్ణింపు ధరణినాథ!
19
యుగధర్మ ప్రాకృతాది ప్రళయచతుష్టయ వివేచనము
వ. అనిన, శుకయోగీంద్రునకు రాజేంద్రుం డి ట్లనియె. కలియుగం బతిపాప సమ్మిళితంబు గాన
దురితంబు లేలాగున నరు లొందకుండెదరు. కాలం బే క్రమంబున నడచు. గాలస్వరూపకుం
డయిన హరిప్రభావం బేలాగునం గానంబడు. ఈ జగజ్జాలం బె వ్విధంబున నిలుచు. అని
యడిగిన, రాజునకు శుకయోగీంద్రుం డి ట్లనియె. కృత త్రేతా ద్వాపర కలియుగంబు లను
యుగచతుష్టయంబును, గ్రమముగాఁ బ్రవర్తించు. ధర్మంబునకు సత్య దయా తపో దానంబులు
నాలుగు పాదంబు లై నడచు. శాంతి దాంతి వర్ణాశ్రమాచారంబులు మొదలయినవి కలిగి,
ధర్మంబు మొదటియుగంబున నాలుగు పాదంబులం బరిపూర్ణం బై ప్రవర్తిల్లు. శాంతి దాంతి
కర్మాచరణాది రూపం బగు ధర్మంబు మూఁడు పాదంబుల రెండవ యుగంబునం ప్రవర్తిల్లు.
విప్రార్చనా హింసా వ్రత జపానుష్ఠానాది లక్షణంబులు గలిగి ధర్మంబు రెండు పాదంబుల
మూఁడవ యుగంబునం దేజరిల్లు. మఱియు, జనులు కలియుగంబున ధర్మరహితులును,
అన్యాయకారులును, క్రోధ మాత్సర్య లోభ మోహాది దుర్గుణ విశిష్టులును, వర్ణాశ్రమాచార
రహితులును, దురాచారులును, దురన్న భక్షకులును, శూద్రసేవా రతులును, నిర్దయులును,
నిష్కారణ వైరులును, దయా సత్య శౌచాది విహీనులును, ననృతవాదులును, మాయోపాయులును,
ధనవిహీనులును, దోషైక దృక్కులును నై, పాపచరితు లగు రాజుల సేవించి, జననీ
జనక సుత సోదర దాయాద సుహృజ్జనులం బరిత్యజించి, సురతాపేక్షు లై, కులంబులం
జెఱుపుచుండెదరు. మఱియు, క్షామ డాంబరంబులం బ్రజాక్షయం బగు. బ్రాహ్మణులు దుష్ప్రతిగ్రహ
విహారు లై యజ్ఞాది కర్మంబులు బరార్థపరు లై చేయుచు, హీను లై నశించెదరు. అట్లు గాన,
నీ కలియుగంబున నొక్క ముహూర్త మాత్రం బయిన నారాయణస్మరణ పరాయణు లై, మనంబున
శ్రీ నృసింహ వాసుదేవ సంకర్షణాది నామంబుల నచంచల భక్తిఁ దలంచెడు
వారలకుఁ గ్రతుశత ఫలంబు గలుగు. అట్లు గావున రాజశేఖరా! నీ మది ననవరతంబు
హరిఁ దలంపుము. కలి యనేక దురితాలయంబు గాన, నొక్క నిమిషమాత్రంబు ధ్యానంబు
చేసినం, బరమ పావనత్వంబు నొంది, కృతార్థుండ వగుదువు. అని పలికి, మఱియును.
20
క. మూఁడవ యుగమున నెంతయు
వేడుక హరికీర్తనంబు వెలయఁగ లెస్స\న్‌
బాడుచుఁ గృష్ణా! యనుచుం
గ్రీడింతురు కలినిఁ దలఁచి కృతమతు లగుచు\న్‌.
2
AndhraBharati AMdhra bhArati - itihAsamulu - bhAgavatamu - dvAdaSa skaMdhamu - bammera pOtana poetana pothana potanAmAtya pOtanAmAtyuDu ( telugu andhra )