ఇతిహాసములు భాగవతము ద్వాదశ స్కంధము
వ. అంతఁ గల్ప ప్రళయప్రకారం బె ట్లనిన, నతం డి ట్లనియె. చతుర్యుగ సహస్రంబులు చనిన,
నది బ్రహ్మకు నొక్క పగ లగును, అదే క్రమంబున రాత్రియు వర్తిల్లును. అంత బ్రహ్మకు నొక్క
దినం బగుటవలన, నది నైమిత్తిక ప్రళయం బనంబడును. అందు విధాత సమస్తలోకంబులం
దన యాత్మయందు నిలిపి శయనింపం, బ్రకృతి వినష్టం బయిన, నది ప్రాకృతప్రళయం బని
చెప్పంబడును. ఆ ప్రళయ ప్రకారంబు వినుము. ఇట్లు పగలు నైమిత్తిక ప్రళయంబును, రాత్రి
ప్రాకృత ప్రళయంబును, నగుట గలిగిన నజునకు నది దినప్రమాణంబు. అట్టి దినప్రమాణంబున
మున్నూట యఱువది దినంబు లయిన, నలువకు నొక్క సంవత్సరంబు పరిపూర్ణం బగును.
తద్వత్సరంబులు శతపరిమితంబు లయిన.
22
సీ. అంత లోకేశున కవసానకాలంబు వచ్చిన నూఱేండ్లు వసుధలోన
వర్షంబు లుడిగిన వడి దప్పి మానవుల్‌ దప్పి నాఁకటఁ జిక్కి నొప్పినొంది
యన్యోన్యభక్షు లై యా కాలవశమున నాశ మొందెద రంత నలినసఖుఁడు
సాముద్ర భౌతిక క్ష్మాజాత రసములఁ జాతురిఁ గిరణాళిచేతఁ గాల్ప
 
తే. నంతఁ గాలాగ్ని సంకర్షణాఖ్య మగుచు
మిన్నుఁ గలయఁగ నది యాక్రమించు నట్టి
యెడను శతవర్షములు దడఁబడక గూడి
వీఁకతోడుత వాయువుల్‌ వీచు నపుడు.
23
వ. ఇట్లు వర్షశతంబు వర్ష శూన్యం బగును. అంత శతవర్షంబులు ద్వాదశ భాస్కర ప్రచండ
కిరణ తాండవం బగును. పిదప శతవర్షంబులు ప్రళయాగ్ని దందహ్యమానం బగును.
పిమ్మట సప్తమారుత ఝంఝానిల వేగతాడితం బగును. అందు మీఁద శతహాయనంబులు
నవధారాధరంబులు మహాఘోషంబులతోడం గరికరోపమానంబు లయిన నీరధారల నిఖిల
జగంబును శంబరమయంబు చేసిన, బ్రహ్మాండంబెల్ల జలమయం బగుటం జేసి, భూమి హృత
గంధగుణం బై కబంధంబున లీనం బగును. అ న్నీరంబును జీర్ణ రసగుణం బై తేజంబున
నణంగును. ఆ తేజంబు వాయువందు నష్టరూపం బై కలయును. ఆ పవనుండు గత స్పర్శ
గుణుండయి నభంబున సంక్రమించును. ఆ యాకాశంబు విగతశబ్దంబయి, భూతాది ప్రకృతి
యందు నణంగును. ఆ ప్రకృతియు ననాది యై, వా ఙ్మానస గోచరంబు గాక సత్త్వ రజ
స్తమోగుణ రహితం బై, మహదాది సన్నివేశంబు లేక, స్వప్నాద్యవస్థారహితం బై,
యప్రతర్క్యం బగు నాత్మ యందు లయం బగు. అదియె సర్వాధారభూతం బయిన పదం బని
చెప్పంబడు. కాలవిపర్యయం బయి పురుషావ్యక్తులు లీనంబగును. అది ప్రాకృతప్రళయం బనం
బరఁగు. అని చెప్పి, మఱియు నొక్క విశేషంబు వినుము. బుద్ధీంద్రియార్థ రూపంబులచే
జ్ఞానంబు తదాశ్రయంబయి వెలుంగు. దృశ్యత్వా వ్యతిరేకంబులచే నది యాద్యంతములు
గలదై యుండు. తేజంబు దీపచక్షుస్స్వరూపంబులకు వేఱు గానియట్లు, బుద్ధీంద్రియార్థంబులు
పరార్థమూర్తికి నన్యంబులు గావు. జాగ్ర త్స్వప్న సుషుప్త్యవస్థలు బుద్ధి ధర్మంబు లగు.
ప్రత్యగాత్మయందు నానాప్రకారంబులం దోఁచు నీదృశ్యప్రపంచం బంతయు మిథ్య యని తెలియుము.
ఒక్కతేజంబు బహురంధ్రంబులఁ గానంబడు తెఱంగున, నొక్కయాత్మ పెక్కు దేహంబులఁ
దోచఁబడు. హాటకంబు పెక్కు రూపంబులు గలదై యనేకం బయిన తెఱంగునఁ, బరమాత్మ
వివిధచేతనాచేతన శరీరముల యందుఁ బెక్కు విధంబుల\న్‌ గనఁబడిన న్నేకంబుగా
భావింపవలయు. నేత్రంబులకు మేఘావరణంబు దలంగినప్పుడు భాస్కరమండలంబు గనుపించు
తెఱంగున, బంధహేతు వయిన యహంకారం బాత్మజ్ఞానంబునఁ దిరస్కృతం బయిన యప్పుడే
పరమాత్మ నిర్మలం బయి తోఁచు. ఆ పరమాత్మను నిరంతరంబును దలంచుచు, యోగులు
తదేకాయత్త చిత్తు లై యుండుదురు. కాలంబును వేగంబున\న్‌ సర్వప్రపంచమునకు
నవస్థాంతరంబులం గల్పించుచుండు. పరమేశ్వరమూర్తి యైన కాలంబు, నభంబునం గలుగు
తారకంబులు గానరాని కరణిం గానఁబడక, కల్పావస్థలం జరించు. నిత్య నైమిత్తిక
ప్రాకృతి కాత్యంతికంబు లను ప్రళయంబులు చతుర్విధంబు లయి పరఁగు. అందుఁ గల
నారాయణు లీలావతారంబులఁ గమలనాభ భవాదు లయినను వచింపలేరు. నే నెఱింగి
నంతయుం జెప్పితి. సంసార సాగరంబుదాఁట హరికథ యనెడి నావయె సహాయంబు గాని,
వేఱొకటి లేదని చెప్పి.
24
AndhraBharati AMdhra bhArati - itihAsamulu - bhAgavatamu - dvAdaSa skaMdhamu - bammera pOtana poetana pothana potanAmAtya pOtanAmAtyuDu ( telugu andhra )