ఇతిహాసములు భాగవతము ద్వాదశ స్కంధము
ఉ. ఏను మృతుండ నౌదు నని యింత భయంబు మనంబులోపలన్‌
మానుము సంభవంబు గల మానవకోట్లకుఁ జావు నిత్య మౌఁ
గాన హరిం దలంపు మిఁకఁ గల్గదు జన్మము నీకు ధాత్రిపై
మానవనాథ! పొందెదవు మాధవలోక నివాససౌఖ్యముల్‌.
25
పరీక్షిత్తు తక్షకునిచే దష్టుం డై మృతి నొంద నతని పుత్రుండు సర్పయాగంబు చేయుట
వ. జరా మరణ హేతుకం బయిన శరీరంబున నుండు జీవుండు, ఘటంబులలోఁ గనఁ బడెడు
నాకాశంబు ఘటనాశం బయిన మహాకాశంబునం జేరుచందంబున, నీశ్వరుం గలయు.
తైలనాశన పర్యంతంబు వర్తి తేజంబుతోడ వెలుంగు కరణి, దేహకృతంబగు భవంబు
రజ స్సత్త్వ తమో గుణంబులచేతఁ బ్రవర్తించు. ఆత్మ నభంబుమాడ్కి ధ్రువం బై,
యనంతం బై, వ్యక్తావ్యక్తంబులకుఁ బరం బై యుండు. ఇ ట్లాత్మ స్వరూపినిఁగా
హరిని నిరంతరంబు భావించుచుండుట విశేషంబు. నిన్నుఁ దక్షకుండు గఱచు నను
భయంబు నొందవలదు. హరిం దలంపుము. ధన గృహ దారాపత్య క్షేత్ర పశుప్రకరంబుల
వర్జించి, సమస్తంబును నారాయణార్పణంబు చేసి, విగత శోకుండ వై, నిత్యంబును
హరిధ్యానంబు సేయుము. అని వినిపించిన, రాజేంద్రుండును, గుశాసనాసీనుం డై, జనార్దనుం
జింతింపుచుండెను. అంత శుకుండును, యథేచ్ఛా విహారుం డై చనియె.
26
AndhraBharati AMdhra bhArati - itihAsamulu - bhAgavatamu - dvAdaSa skaMdhamu - bammera pOtana poetana pothana potanAmAtya pOtanAmAtyuDu ( telugu andhra )