ఇతిహాసములు భాగవతము ద్వాదశ స్కంధము
వ. ఇట క్రుద్ధుం డయిన బ్రాహ్మణోత్తమునిచేఁ బ్రేరితుం డయిన తక్షకుండు, ద్విజ రూపంబు
దాల్చి, పరీక్షి ద్వధార్థంబుగా నేతెంచుచుండి, మధ్యమార్గంబునఁ గాశ్యపుం
డను సర్పవిష హరణసమర్థుం డగు వేఱొక విప్రునిం గని, యతని నపరిమిత
ధనప్రదానంబునఁ దృప్తుం గావించి, పరీక్షి న్నికటంబునకు రాకుండు నట్లు నొనర్చి,
యంతటఁ బరీక్షిన్మహారాజు చెంతకుం జని, కామరూపుం డగుటం జేసి, యురగం బై,
రాజుం గఱచిన, నతండు నా క్షణంబ విషాగ్నిచే భస్మీభూతుం డయ్యె. అట్టి యవసరంబున
భూమ్యంతరిక్షంబుల నుండు నిఖిల ప్రాణు లాశ్చర్యకరం బగు తన్మరణంబు గని,
హాహారవంబులు సేసిరి. అంత, నీ యర్థంబు నతని తనయుం డైన జనమేజయుండు విని,
క్రోధావేశంబున సర్పప్రళయం బగునట్లు యజ్ఞంబు సేయుచుండ, సహస్రసంఖ్యలంగల
సర్పంబులు హతంబు లయ్యె. ఆ సమయంబునఁ దక్షకుండు రాకుండుట నెఱింగి "సహేంద్ర
తక్షకా యాను బ్రూహి" అను ప్రేషవాక్యము నొడువ, నంత తక్షక సహితుం డయి విమానముతో
నింద్రుండు స్థాన భ్రంశంబు నొంది పడుచుండ, న త్తఱి బృహస్పతి యేతెంచి,
పరీక్షిత్తనయునిం గీర్తింపఁ దొణంగె.
26
చ. మృతియును జీవనంబు నివి మేదినిలోపల జీవకోటికి\న్‌
సతతము సంభవించు సహజం బిది చోర హుతాశ సర్పసం
హతులను దప్పి యాఁకటను బంచత నొందెడు నట్టి జీవుఁడు\న్‌
వెతలను బూర్వకర్మభవ వేదన లొందుచుఁ గుందు నెప్పుడు\న్‌.
27
వ. అట్లు గావున, నసఖ్యంబు లయిన దందశూకంబులు హతంబు లయ్యె. శాంతమానసుండ వై
క్రోధంబు వర్జించుము. అనఁ గురూపదిష్ట ప్రకారంబున సర్పయాగంబు మానియుండె.
అంత దేవతలు కుసుమవృష్టి గురియించిరి. ఆ రాజన్యుండును మంత్రి సమేతుం డై
నగరప్రవేశంబు సేసె. బాధ్యబాధక లక్షణంబులు గల విష్ణు మాయా గుణవ్యాపారంబుల
నాత్మ మోహింపబడుం గావున, నట్టి మాయా వికారంబులం బరిత్యజించి, నిర్మల మానసుం డై
వర్తించు వాఁడును, బరనింద సేయక, వైరంబు వర్జించి, భగవ త్పదాంభోజభక్తి
సంయుక్తుం డై తిరుగు నతండును, హరిపదంబుఁ జేరు. అని చెప్పి, మఱియు సూతుండు పరమ
హర్ష సమేతుం డై, శౌనకున కి ట్లనియె.
28
వ్యాసుఁడు వేదములం బురాణములను లోకమందుఁ బ్రవర్తింపఁ జేయుట
క. ధారుణిఁ బారాశర్యున
కార్యులు పైలుఁడు సుమంతు జైమిని మునులున్‌
ధీరుఁడు వైశంపాయనుఁ
డారయ నలువురును శిష్యు లై యుండి రిల\న్‌.
29
వ. వారలు ఋ గ్యజు స్సామాధర్వణంబు లనియెడు నాలుగు వేదంబులును, వ్యాసోపదిష్ట క్రమంబున
లోకంబులం బ్రవర్తింపఁ జేసిరి. అని చెప్పిన, నా క్రమం బెట్లని శౌనకుం డడిగిన,
సూతుండు సెప్పం దొణంగె. ఆదియందు చతుర్ముఖుని హృదయంబున నొకనాదం బుద్భవించె.
అది వృత్తినిరోధంబు వలన మూర్తీభవించి వ్యక్తంబుగాఁ గనఁబడె. అట్టి నాదోపాసన
వలన యోగిజనంబులు నిష్పాపు లై ముక్తి నొందుదురు. అందున నోంకారంబు జనియించె. అదియె
సర్వమంత్రోపనిషన్మూలభూత యగు వేదమాత యని చెప్పఁబడు. ఆ యోంకారంబు
త్రిగుణాత్మకం బై, అకార ఉకార మకారంబు లనెడు త్రివర్ణరూపం బయి ప్రకాశింపుచుండె.
అంత భగవంతుం డగు నజుం డా ప్రణవంబువలన స్వర స్పర్శాంత స్థోష్మాది లక్షణలక్షితం
బగు నక్షరసమామ్నాయంబుఁ గల్పించి, తత్సహాయంబుననే తన వదనచతుష్టయంబువలన
వేదచతుష్టయంబు గలుగఁజేసె. అంత నతని పుత్రు లగు బ్రహ్మవాదు లా వేదంబులం
దదుపదిష్ట ప్రకారంబుగా నభ్యసించి, యాక్రమంబునఁ దామును దమ శిష్యపరంపరలకు
నుపదేశించిరి. ఇట్లు వేదంబులు సమగ్రంబులుగాఁ బ్రతియుగంబునను మహర్షులచే
నభ్యసింపంబడును. అట్టి వేదంబుల సమగ్రంబుగఁ బఠియింప నశక్తు లగువారలకు
సహాయంబు సేయుటకై ద్వాపరయుగాదియందు భగవంతుండు సత్యవతీదేవియందుఁ
బరాశర మహర్షికి సుతుఁడుగా నవతరించి, యా వేదరాశిం గ్రమమున, ఋక్కు యజుస్సు
సామము అధర్వణము అను నాలుగు విధంబులుగ విభజించి, పైల వైశంపాయన జైమిని
సుమంతు లనియెడు శిష్యవరులకుఁ గ్రమంబున నా ఋగాదివేదంబుల నుపదేశించె. అందుఁ
బైలమహర్షి చేకొన్న ఋగ్వేదం బనంతంబు లగు ఋక్కులతోఁ జేరియుండుటం జేసి,
బహ్వృచశాఖ యని చెప్పంబడు. అంత నా పైలుండు ఇంద్రప్రమితికి బాష్కలునకు
నుపదేశించె. అతం డా సంహితం జతుర్విధంబులు గావించి, బోధ్యుఁడు యాజ్ఞవల్క్యుఁడు
పరాశరుఁడు అగ్నిమిత్రుఁడు ననువారికి నుపదేశించె. ఇంద్రప్రమితి తన సంహిత
మాండూకేయున కుపదేశించె. మాండూకేయుఁడు దేవమిత్రుండను వానికిం జెప్పె. అతనికి
సౌభర్యాది శిష్యు లనేకు లై ప్రవర్తిల్లిరి. అందు సౌభరిసుతుం డగు శాకల్యుఁడు తా
నభ్యసించిన శాఖ నైదు తెఱఁగులగ విభజించి, వాత్స్యుఁడు మౌద్గల్యుఁడు శాలీయుఁడు
గోముఖుఁడు శిశిరుఁడు ననెడు శిష్యుల కుపదేశించె. అంత జాతుకర్ణి యనువానికి వా
రుపదేశింప, నతఁడు బలాకుఁడు పైంగుఁడు వైతాళుండు విరజుండు ననువారి కుపదేశించె.
ఇదియునుం గాక ముందు చెప్పిన బాష్కలుని కుమారుఁ డయిన బాష్కలి వాలఖిల్యాఖ్య సంహితం
బాలాయని, గార్గ్యుఁడు, కాసారుం డను వారలకుం జెప్పె. ఇ త్తెఱంగున బహ్వృచసంహిత
లనేక ప్రకారంబులం బూర్వోక్త బ్రహ్మర్షులచే ధరియింపంబడె. అంత యజుర్వేదధరుం
డగు వైశంపాయనుని శిష్యసంఘంబు నిఖిలక్రతువుల నాధ్వర్యవకృత్యంబుచేఁ
దేజరిల్లిరి. మఱియు నతని శిష్యుం డగు యాజ్ఞవల్క్యుఁడు గుర్వపరాధంబు చేసిన,
నా గురువు కుపితుం డై, యధీతవేదంబుల మరలం దన కిచ్చిపొ మ్మనిన, నతండుఁ దాను
జదివిన యజుర్గణంబును, దదుక్తక్రమంబునఁ గ్రక్క, నవి రుధిరాక్తం బగు రూపంబుఁ
దాల్చిన, నా యజుర్గణాధిష్ఠిత శాఖాధిదేవతలు తిత్తిరిపక్షు లయి, వాటిని భుజియించిరి.
దానం జేసి యాశాఖలు తైత్తిరీయంబు లయ్యె. అంత నిర్వేది యగు నా యాజ్ఞవల్క్యుఁ
డపరిమిత నిర్వేదంబు నొంది, యుగ్రతపంబున సూర్యుని సంతుష్టుం గావింప, నతండు
సంతసిల్లి, హయరూపంబు దాల్చి, యజుర్గణంబు నతని కుపదేశించె. కాన నవి
వాజసనేయశాఖ యని చెప్పంబడె. అంత నా యజుర్గణంబు కాణ్వ మాధ్యందినాదులచే
నభ్యసింపఁబడె. ఇట్లు యజుర్వేదంబు లోకంబునం బ్రవర్తిల్లె. సామవేదాధ్యేత యగు
జైమినిమహర్షి తన సుతుం డగు సుమంతుని కుపదేశించె. అతండును సుకర్ముఁ డను తన
కుమారునికిఁ దెలిపె. అతం డా వేదమును సహస్రశాఖలుగా విభజించి, కోసలుని కుమారుఁ
డయిన హిరణ్యనాభునికిం దన కుమారుం డగు పౌష్పింజి యనువానికి నుపదేశించె. అంతట
వా రిరువురును బ్రహ్మవేత్త లగు నావంత్యులు, నుదీచ్యులు నను నేనూర్గురికి నుపదేశించి,
వారిని సామవేదపారగులుగాఁ జేసిరి. ఇట్లు సామవేదంబు లోకంబున వినుతినొందె
 
AndhraBharati AMdhra bhArati - itihAsamulu - bhAgavatamu - dvAdaSa skaMdhamu - bammera pOtana poetana pothana potanAmAtya pOtanAmAtyuDu ( telugu andhra )