ఇతిహాసములు భాగవతము ద్వాదశ స్కంధము
వ. మఱియు నధర్వవేత్త యగు సుమంతు మహర్షి దాని\న్‌ దన శిష్యున కుపదేశింప నతండు
పథ్యుఁడు వేదదర్శుఁడు నను శిష్యుల కుపదేశించె. అందు వేదదర్శుఁ డనువాఁడు
శౌల్కాయని బ్రహ్మబలి నిర్దోషుండు పిప్పలాయనుండు అనువారలకును, బథ్యుం డనువాఁడు
కుముదుఁడు శునకుఁడు జాబాలి బభ్రువు అంగిరసుఁడు సైంధవాయనుఁడు అను వారలకు
నుపదేశించి, ప్రకాశంబు నొందించిరి. ఇ త్తెఱుంగున నధర్వవేదంబు వృద్ధి నొందె.
ఇ ట్లఖిలవేదంబుల యుత్పత్తి ప్రచారక్రమం బెఱింగించితి. ఇంకఁ బురాణక్రమం బెట్టు
లనిన, వినిపింతునని చెప్పఁ దొణంగె. లోకంబునఁ బురాణ ప్రవక్తకు లనం బ్రసిద్ధు
లగు త్రయ్యారుణి, కశ్యపుఁడు, సావర్ణి, అకృతవ్రణుఁడు, వైశంపాయనుఁడు, హారీతుఁడు
నను నార్గురు మజ్జనకుండును వ్యాస శిష్యుండు నగు రోమహర్షణుని వలన గ్రహించిరి.
అటి పురాణంబు సర్గాది దశలక్షణ లక్షితంబుగా నుండు. మఱియుఁ, గొంద ఱా పురాణంబు
పంచలక్షణ లక్షితం బనియు నొడువుదురు. అట్టి పురాణ నామానుక్రమంబుఁ బురాణవిదు లగు
ఋషులు సెప్పెడు తెఱంగున నే నెఱింగింతు వినుము. బ్రాహ్మము పాద్మము వైష్ణవము శైవము
భాగవతము భవిష్యోత్తరము నారదీయము మార్కండేయము ఆగ్నేయము బ్రహ్మకైవర్తము
లైంగము వారాహము స్కాందము వామనము కౌర్మము మాత్స్యము బ్రహ్మాండము గారుడము అను
పదునెనిమిదియు మహాపురాణంబులు. మఱియు నుపపురాణంబులుం గలవు. వీటిని లిఖియించినం,
జదివినం, వినిన దురితంబు లణంగు. అని సూతుండు శౌనకాదులకుం జెప్పిన, వారును
నారాయణ గుణవర్ణనంబును, దత్కథలును జెప్పితివి. ఇంక దోషకారులును, బాపరతులు
న్నె వ్విధంబునం భవాబ్ధిం దరింతు రా క్రమంబు చెప్పవే. అని యడిగిన, నెఱింగింపం
దలంచి, యి ట్లనియె.
30
క. తొల్లిటి యుగమునఁ దపముల
బల్లిదు లగు ఋషులు మహిమ భాషింపఁగ రం
జిల్లెడు మార్కండేయుం
డుల్లంబున హరిని నిలిపి యుడుగక బ్రతికె\న్‌.
31
AndhraBharati AMdhra bhArati - itihAsamulu - bhAgavatamu - dvAdaSa skaMdhamu - bammera pOtana poetana pothana potanAmAtya pOtanAmAtyuDu ( telugu andhra )