ఇతిహాసములు భాగవతము ద్వాదశ స్కంధము
మార్కండేయోపాఖ్యానము
వ. లోకంబులు కల్పాంతసమయంబునం, గబంధమయంబు లై, యంధకారబంధురంబు లై,
యున్నయెడ, నేకాకి యై చరింపుచుం, బాలార్కకోటి తేజుం డయిన బాలుని హృదయంబునం
బ్రవేశించి, యనేక సహస్ర వర్షంబులు తిరిగి, వటపత్రశాయి యయిన య బ్బాలునిఁ
గ్రమ్మఱం గనియె. అని చెప్పిన, శౌనకాదులు సూతుని సన్నుతించి, యా మునీంద్రునకు
నీ ప్రభావం బెట్లు గలిగె? అని యడిగిన, నతం డి ట్లనియె.
32
క. భూవినుత బ్రహ్మచర్యము
వే వదలక నిష్ఠచేత విశదము గాఁగన్‌
భావించి హరిఁ దలంపుచుఁ
గోవిందనుతుఁ డై మృకండు గుణముల వెలసె\న్‌.
33
వ. ఇట్లు తపంబుసేయు నతనికి హరిహరులు ప్రత్యక్షం బయి వరం బడుగు మనిన, గుణగణాఢ్యుం
డయిన కుమారు నడిగిన, నట్లకాక యని యతండు కోరినవరం బిచ్చి యంతర్ధానంబు
నొందిరి. అనంతరంబ య మ్మునికి మార్కండేయుం డుదయించి, నియమ నిష్ఠాగరిష్ఠుం
డై యుండ, మృత్యువు వానిం బాశబద్ధుం జేసిన నెదిర్చి, య మ్మిత్తిని ధిక్కరించి,
పదివేల హాయనంబులు తపంబు సలుప, నింద్రుండు భయపడి, య మ్మునివరుని యుగ్రతపంబు
భంగపఱుచుటకు దేవతాంగనలం బంప, వా రేతెంచునెడఁ బుష్ప ఫల భరితంబును,
మత్తమధుకర శుకపికాది శకుంతారవ నిరంతర దిగంతరంబును, జాతివైర రహిత
మృగ పక్షికుల సంకులంబును, సారస చక్రవాక బక క్రౌంచ కారండవ కోయష్టికాది
జలవిహంగ మాకులిత సరోవరసహస్ర సందర్శనీయంబు నగు నా తపోవనంబున
జటావల్కలధారి యై హవ్యవాహనుండునుం బోలి, తపంబు సేయు న మ్మునీంద్రునిం గని,
యంగనలు వీణా వేణు వినోద గానంబుల నలవరింప, మెచ్చక, ధీరోదాత్తుం డగు
న మ్మునీంద్రుని గెల్వనోపక, యింద్రునికడకుం జనిరి.
34
AndhraBharati AMdhra bhArati - itihAsamulu - bhAgavatamu - dvAdaSa skaMdhamu - bammera pOtana poetana pothana potanAmAtya pOtanAmAtyuDu ( telugu andhra )