ఇతిహాసములు భాగవతము ద్వాదశ స్కంధము
చ. నిలిచిన శంకరుం గనియు నిత్యసుఖంబుల నిచ్చు గౌరి యి
మ్ముల హర! భూతిభూషణ! సముజ్జ్వల గాత్రునిఁ గంటె యెంతయు\న్‌
వలనుగ వానితోడ నొక వాటపుమాటను బల్కఁగాఁ దగు\న్‌
సలలిత మైన యీ తపసిజాడ వినం గడు వేడ్క యయ్యెడి\న్‌.
38
వ. అనిన, శంకరుండును, శాంకరితోఁగూడ, నభంబుననుండి ధరణీతలంబునకు నేతెంచి
నిర్గుణ బ్రహ్మాత్మ్యైక్యాను సంధానంబు చేసి, శుద్ధ చైతన్య స్వరూపుం డై,
యితరంబుఁ గానక యేకాగ్రచిత్తుం డగు న మ్మునిం గని, తన దివ్య యోగ మాయా
ప్రభావంబుచే నతని హృదయంబు ప్రవేశించి, చతుర్బాహుండును, విభూతి
రుద్రాక్షమాలికా ధరుండును, ద్రిశూల డమరుకాది దివ్యసాధన సమేతుండును,
వృషభవాహనారూఢుండును, నుమాసమేతుండును నై, తన స్వరూపంబు గనఁ
బఱచిన, విస్మయంబు నొంది, య మ్ముని యా పరమేశ్వరుని ననేక ప్రకారంబుల
స్తుతియించిన, నప్పు డమ్ముని తపః ప్రభావంబునకు మెచ్చి, మహాత్మా!
పరమ శైవుండ వని పరమేశ్వరుం డానతిచ్చిన, మార్కండేయుండును శంకరు
నిరీక్షించి, దేవా! హరి మాయా ప్రభావంబు దుర్లభంబు, భవత్సందర్శనంబునం
గంటి. ఇంతియ చాలు. ఐన నొక్క వరంబు గోరెద. నారాయణ చరణాంబుజ ధ్యానంబును,
మృత్యుంజయంబునుం గలుగునట్లుగాఁ గృపసేయవే. అని ప్రార్థించినఁ, గృపాసముద్రుం
డై, యట్ల కాక యని, జరా రోగ వికృతులు లేక కల్పకోటి పర్యంతంబు నాయువుం,
బురుషోత్తముని యనుగ్రహముం గలుగు నని యానతిచ్చి, య మ్మహాదేవుం డంతర్ధానంబు
నొందె. అని చెప్పి, యీ మార్కండేయోపాఖ్యానంబు వ్రాసిన, విన్నం, చదివినను,
మృత్యువు దొలంగు నని, మఱియు, హరిపరాయణుం డగు భాగవతుండు దేవతాంతర
మంత్రాంతర సాధనాంతరంబులు వర్జించి, దుర్జనులం గూడక, నిరంతరంబు
నారాయణ గోవిందాది నామస్మరణంబు సేయుచుండె నేని, నట్టి పుణ్య పురుషుండు
వైకుంఠంబున వసించు. మఱియు, హరి విశ్వరూపంబును, జతుర్విధ వ్యూహభేదంబులును,
జతుర్మూర్తులును, లీలావతారంబులునుం జెప్ప నగోచరంబులు. అన మును లిట్లనిరి.
39
AndhraBharati AMdhra bhArati - itihAsamulu - bhAgavatamu - dvAdaSa skaMdhamu - bammera pOtana poetana pothana potanAmAtya pOtanAmAtyuDu ( telugu andhra )