ఇతిహాసములు భాగవతము ద్వాదశ స్కంధము
క. హరికథలు హరి చరిత్రము
హరి లీలావర్తనములు నంచిత రీతి\న్‌
బరువడి నెఱిఁగితి నంతయు
సురనుత! యనుమాన మొకటి చొప్పడెడి మది\న్‌.
40
చైత్రాది మాసంబుల సంచరించెడి ద్వాదశాదిత్యుల క్రమమును దెలుపుట
వ. అది యెయ్యది యనిన, లోకచక్షువు చైత్రమాసంబు మొదలుగా నేయే మాసంబున నే యే
నామంబునఁ బ్రవర్తించు. చెప్పవే. అని యడిగినఁ, జైత్రము మొదలగు ద్వాదశమాసంబుల
సౌరగణ సప్తకం బీశ్వర నియుక్తం బై, నానా ప్రకారంబుల సంచరించెడు క్రమము తొల్లి
శుకుండు విష్ణురాతునికిఁ దెలిపిన చందంబునఁ జెప్పెద. అని సూతుం డి ట్లనియె.
శ్రీమన్నారాయణ స్వరూపుం డగు మార్తాండుం డేకస్వరూపుం డైన, నతనిం గాల దేశ
క్రియాది భేదంబుల బట్టి, ఋషు లనేక క్రమంబుల నభివర్ణించి భావింపుచున్నారు.
ఆ ప్రకారం బె ట్లనినఁ, జైత్రంబున సూర్యుండు ధాత యను నామంబు దాల్చి, కృతస్థలి
హేతి వాసుకి రథకృత్తు పులస్త్యుఁడు తుంబురుఁడు అనెడు పరిజనులతోఁ జేరికొని
సంచరింపుచుండు. వైశాఖంబున ఆర్యముం డనుపేరు వహించి పులహుడు ఓజుడు ప్రహేతి
పుంజికస్థలి నారదుండు కంజనీరుం డను ననుచర సహితుం డై, కాలంబు గడుపుచుండు.
జ్యేష్ఠంబున మిత్రుం డను నభిధేయధరుం డై, అత్రి పౌరుషేయుఁడు తక్షకుండు మేనక
హాహా రథస్వనుఁడు అనెడు వారితోఁ జేరి కాలయాపనము సేయుచుండు. ఆషాఢంబున
వరుణుం డను నాహ్వయంబు నొంది, వసిష్ఠుండు రంభ సహజన్యుండు హూహువు, శుక్రుండు,
చిత్రస్వనుఁడు అను సహచర సహితుం డై కాలక్షేపణము సేయుచుండును. శ్రావణంబున
ఇంద్రుం డను నామముచే వ్యవహృతుఁ డై విశ్వావసువు శ్రోత యేలాపుత్రుండు అంగిరస్సు
ప్రమ్లోచ రాక్షసుఁడు చర్యుఁడు అను సభికులతోఁ జేరి కాలంబు గడుపుచుండు.
భాద్రపదంబున వివస్వంతుండను నామంబు దాల్చి ఉగ్రసేనుండు వ్యాఘ్రుండు అసారణుండు
భృగువు అనుమ్లోచ శంఖపాలుండు అను పరిజనావృతుం డై కాలయాపనంబు సేయుచుండు.
41
క. ధరలోఁ ద్వష్ట్రాహ్వయమును
బిరుదుగ ధరియించి యెపుఁడు బెంపు దలిర్ప\న్‌
జరియించుచు నభమందు
సరసిజహితుఁ డాశ్వయుజము చయ్యన గడుపు\న్‌.
42
వ. ఈ మాసంబున, ఋచీకతనయుండు కంబళాశ్వుండు తిలోత్తమ బ్రహ్మోపేతుండు శతజిత్తు
ధృతరాష్ట్రుండు ఇషంభరుఁడు అను సభ్యులతోఁ జేరికొని కాలంబు నడుపుచుండు.
కార్తిక మాసంబునందు విష్ణువని వ్యవహరింపఁబడి, అశ్వతరుఁడు రంభ సూర్యవర్చస్సు
సత్యజిత్తు విశ్వామిత్రుండు మఘాపేతుఁడు అను పరిజన వర్గముతోఁగూడి కాలంబు
నడుపుచుండు. మార్గశిరంబునందు అర్యమ నామ వ్యవహృతుఁ డై, కశ్యపుండు, తార్క్ష్యుండు,
ఋతసేనుండు, ఊర్వశి విద్యుచ్ఛత్రుండు మహాశంఖుండు అనెడు ననుచరులం గూడి
చరింపుచునుండు. పుష్యమాసంబున భగుం డనునామంబుఁ దాల్చి స్ఫూర్జుండు అరిష్టనేమి
ఊర్ణుండు ఆయువు కర్కోటకుండు పూర్వచిత్తి అనెడు సభ్యజన పరివృతుం డై కాలక్షేపణము
సేయుచుండు. మాఘమాసంబునందు పూషాహ్వయము వహించి ధనంజయుండు వాతుండు
సుషేణుండు సురుచి ఘృతాచి గౌతముండు అను పరిజన పరివృతుం డై చరియింపుచుండు.
43
క. క్రతునామంబు ధరించియుఁ
జతురతఁ బాలింపుచుండుఁ జాతుర్యకళా
రతుఁ డై సహస్రకిరణుఁడు
మతియుతు లౌ ననఁ దపస్యమాసము లీల\న్‌.
44
వ. అందు వర్చసుండు భరద్వాజుండు పర్జన్యుండు సేనజిత్తు విశ్వేదేవతలు ఐరావతుండు అను
వారలతోఁ జేరుకొని, కాలయాపనంబు సేయుచుండు. ఇట్లు ద్వాదశ మాసంబుల నపరిమేయ
విభూతులచేఁ దేజరిల్లుచు, నుభయ సంధ్యల నుపాసించు జనుల పాపసంఘంబుల
నున్మూలంబు సేయుచుఁ, బ్రతిమాసంబును బూర్వోక్త పరిజన షట్కంబు వెంటనంట, నుభయలోక
నివాసు లగు జనంబుల కైహికాముష్మిక ఫలంబుల నొసంగుచు, ఋ గ్యజు స్సామాధర్వ
మంత్రంబులఁ పఠియింపుచు ఋషిసంఘంబులు స్తుతియింపఁ, బురోభాగంబున నప్సరసలాడ,
గంధర్వులు పాడ, బ్రహ్మవేత్త లగు నఱువదివేల వాలఖిల్య మహర్షు లభిముఖు లై
స్తుతియింపుచు నరుగ, నధిక బల వేగ రాజమానంబు లగు నాగరాజంబులు రథోన్నయనంబులు
సలుప, బాహాబల ప్రతిష్ఠా గరిష్ఠు లగు నైరృతశ్రేష్ఠులు రథ పృష్ఠభాగంబు
మోచి త్రోయుచుండ, ననాది నిధనుం డగు నాదిత్యుండు ప్రతికల్పంబున నిట్లు కాలయాపనంబు
సేయుచుఁ దేజరిల్లుచుండు. అట్లు గావున నివి యన్నియు వాసుదేవ మయంబుగాఁ దెలియుము.
అని పౌరోణికోత్తముండగు సూతుండు శుకయోగీంద్రుండు ప్రాయోపవిష్టుం డగు
పరీక్షిన్నరపాలున కుపదేశించిన తెఱంగున, నైమిశారణ్యవాసు లగు శౌనకాది
ఋషిశ్రేష్ఠులకుఁ దెలిపి, మఱియు నిట్టి పురాణ రత్నంబగు భాగవతంబు వినువారును,
బఠియించువారును, లిఖియించువారును, నాయురారో గ్యైశ్వర్యంబులు గలిగి విష్ణు
సాయుజ్యంబు నొందుదురు. అదియునుం గాక.
45
తే. పుష్కరంబందు ద్వారకా పురమునందు
మథురయందును రవిదినమందు నెవఁడు
పఠనసేయును రమణతో భాగవతము
వాఁడు దరియించు సంసారవార్ధి నపుడ.
46
క. శ్రీరమణీ రమణకథా
పారాయణ చిత్తునకును బతికిఁ బరీక్షి
ద్భూరమణున కెఱిఁగించెను
సారమతిన్‌ శుకుఁడు ద్వాదశస్కంధముల\న్‌.
47
వ. మఱియు నష్టాదశపురాణంబు లందలి గ్రంథ సంఖ్య లె ట్లనిన బ్రాహ్మపురాణంబు
దశసహస్ర గ్రంథంబు. పాద్మం బేఁబది యైదువేలు. విష్ణుపురాణం బిరువది మూఁడు
సహస్రంబులు. శైవంబు చతుర్వింశతి సహస్రంబులు. శ్రీమహాభాగవతం బష్టాదశ
సహస్రంబు. నారదంబు పంచవింశతి సహస్రంబులు. మార్కండేయంబు నవసహస్రంబులు.
ఆగ్నేయంబు పదియేనువేల నన్నూఱు. భవిష్యోత్తరంబు పంచశతాధిక చతుర్దశ
సహస్రంబులు. బ్రహ్మకైవర్తం బష్టాదశసహస్రంబులు. లైంగం బేకాదశ సహస్రంబులు.
వారాహంబు చతుర్వింశతి సహస్రంబులు. స్కాందం బెనుబదివేల నూఱు. వామనంబు
దశసహస్రంబులు. కౌర్మంబు దశసహస్రంబులు. మాత్స్యంబు చతుర్దశ సహస్రంబులు.
గారుడంబు పందొమ్మిది సహస్రంబులు. బ్రహ్మాండంబు ద్వాదశ సహస్రంబులు.
ఇట్లు పురాణగ్రంథ సంఖ్యా ప్రమాణంబులు ప్రవర్తిల్లు. ఈ పదునెనిమిది పురాణంబుల
మధ్యంబున నదులయందు భాగీరథి విధంబున, దేవతలయందుఁ బద్మగర్భుని మాడ్కిఁ,
దారకలందుఁ గళానిధిగరిమ, సాగరంబులందు దుగ్ధార్ణవంబు చందంబున, నగంబులను
హేమనగంబు భాతి, గ్రహంబుల విభావసుకరణి, దైత్యులందుఁ బ్రహ్లాదుని భంగి,
మణులయందుఁ బద్మరాగంబు రేఖ, వృక్షంబులందు హరిచందన తరువు రీతి,
ఋషులందుఁ నారదుమాడ్కి, ధేనువులందుఁ గామధేనువు పోల్కి, సూక్ష్మంబు లందు
జీవుని తెఱంగున, దుర్జయంబులందు మనంబు చొప్పున, వసువులందు హవ్యవాహనుని
పోఁడిమి, నాదిత్యులందు విష్ణువు కరణి, రుద్రులయందు నీలలోహితునిరీతిని,
బ్రహ్మలయందు భృగువు సొబగున, సిద్ధులయందుఁ గపిలుని లీల, నశ్వంబులందు
నుచ్చైశ్శ్రవంబు లాగున, దర్వీకరంబులందు వాసుకి రూపున, మృగములందుఁ
గేసరి చెలువున, నాశ్రమంబులందు గృహస్థాశ్రమంబు క్రియ, వర్ణంబులలో
నోంకారంబు నిరవున, నాయుధంబులఁ గార్ముకంబు సోయగంబున, యజ్ఞంబులలో
జపయజ్ఞంబు చాడ్పున, వ్రతంబులం దహింస కరణి, యోగంబులం దాత్మయోగంబు రవణ,
నోషధులయందు యవల సొబగున, భాషణంబులందు సత్యంబు ఠేవ, ఋతువులందు
వసంతంబు ప్రౌఢి, మాసంబులందు మార్గశీర్షంబు మహిమ, యుగంబులందుఁ
గృతయుగంబు నోజఁ దేజరిల్లు. ఇట్టి భాగవత పురాణంబు పఠియించి విష్ణు
సాయుజ్యంబుఁ జెందుదురు. అని మఱియు ని ట్లనియె.
48
క. సకలాగమార్థపారగుఁ
డకలంక గుణాభిరాముఁ డంచిత బృందా
రక వంద్య పాదయుగుఁ డగు
శుకయోగికి వందనంబు సొరిది నొనర్తున్‌.
49
సీ. సకలగుణాతీతు సర్వజ్ఞు నఖిలలోకాధారు నాదిదేవుఁ
బరమదయారసో ద్భాసితుఁ ద్రిదశాభి వందిత పాదాబ్జు వనధిశయను
నాశ్రితమందారు నాద్యంత శూన్యుని వేదాంత వేద్యుని విశ్వమయునిఁ
గౌస్తుభ శ్రీవత్స కమనీయవక్షుని శంఖ చక్ర గదాసి శార్ఙ్గధరుని
 
తే. శోభనాకారుఁ బీతాంబ రాభిరాము
రత్నరాజిత మకుట వి భ్రాజమానుఁ
బుండరీకాక్షు మహనీయ పుణ్యదేహుఁ
దలఁతు నుతియింతు దేవకీ తనయు నెపుడు.
50
మ. అని యీరీతి నుతించి భాగవత మాద్యంతంబు సూతుండు సె
ప్పిన సంతుష్ట మనస్కు లై విని మునుల్‌ ప్రేమంబునం బద్మనా
భుని చిత్తంబున నిల్పి తద్గుణముల\న్‌ భూషించుచు\న్‌ ధన్యు లై
చని రాత్మీయ నికేతనంబులకుఁ నుత్సాహంబు వర్ధిల్లఁగ\న్‌.
51
క. జనకసుతా హృచ్చోరా!
జనకవచః పాలనాత్త శైలవిహారా!
జనకామిత మందారా!
జననాదిక నిత్యదుఃఖచయసంహారా!
52
మాలిని. జగదవన విహారీ! శత్రులోక ప్రహారీ!
సుగుణవన విహారీ! సుందరీ మానహారీ!
విగత కలుష పోషీ! వీరవర్యాభిలాషీ!
స్వగురు హృదయ పోషీ! సర్వదా సత్యభాషీ!
53
గద్యము. ఇది శ్రీపరమేశ్వర కరుణాకలిత కవితావిచిత్ర, కేసనమంత్రిపుత్ర,
సహజ పాండిత్య, పోతనామాత్య ప్రియశిష్య వెలిగందల నారాయణాఖ్య
ప్రణీతం బైన, శ్రీమహాభాగవతం బను మహాపురాణంబునందు రాజుల
యుత్పత్తియు, వాసుదేవ లీలావతార ప్రకారంబును, గలియుగ ధర్మప్రకారంబును,
బ్రహ్మప్రళయ ప్రకారంబును, బ్రళయవిశేషంబులును, దక్షకునిచే దష్టుం డై
పరీక్షిన్మహారాజు మృతినొందుటయు, సర్పయాగంబును, వేదవిభాగ క్రమంబును,
బురాణాను క్రమణికయు, మార్కండేయోపాఖ్యానంబును, సూర్యుండు ప్రతిమాసంబును
వెవ్వేఱు నామంబుల వెవ్వేఱు పరిజనులతోఁ జేరుకొని సంచరించు క్రమంబును,
తత్తత్పురాణగ్రంథ సంఖ్యలు నను కథలు గల ద్వాదశస్కంధము సంపూర్ణము.
 
శ్రీమహాభాగవతము సంపూర్ణము.
AndhraBharati AMdhra bhArati - itihAsamulu - bhAgavatamu - dvAdaSa skaMdhamu - bammera pOtana poetana pothana potanAmAtya pOtanAmAtyuDu ( telugu andhra )