ఇతిహాసములు భారతము విరాటపర్వము - ద్వితీయాశ్వాసము
కీచకుండు ద్రౌపదియందలి మోహంబునఁ బరితపించుట (సం. 4-14-7)
వ. అనిన విని కీచకుండు ముదిత హృదయుండయి నిజసదనంబునకుం జని వివిధ మధురసంబు లొనరించి, సముచిత ఖాద్యంబులు సమకట్టి, తత్ప్రదేశంబు విజనంబు గావించి, యొక్క రమ్యస్థలంబుననుండి పాంచాలివలని తగులు చిత్తంబు నుత్తలపఱుపం దలరి నెవ్వగల కగపడి తలపోఁతలకుం జొచ్చి దుర్విదగ్ధుండు గావున నమ్ముగ్ధకుం దన సన్నిధిఁ గామ వికారంబు వుట్టుట గలుగ భావించుచు. 82
సీ. ‘కేలిమై నొక్కట లీలఁ గ్రేళ్ళుఱికెడు | వాలుగు సోగల నేలుదెంచి,
కరువలి సుడియమిఁ గందక చెన్నొందు | నెఱవిరితమ్ముల నుఱక తెగడి,
బెడఁగొందఁ దుడిచి మైఁ దొడసిన వలరాజు | వాలిక తూపులఁ దూలఁ దోలి,
పొలపంబు మెఱసి దిక్కులఁ గాంతి పూరించు | క్రొక్కారు మెఱుఁగుల నుక్కడంచి,
 
తే. తన విలోచనములు నాదు మనము నాఁచి | కొనఁగ నయ్యింతి ననుఁ గనుఁగొనియె, నాత్మఁ
గై కొనియె, రాగ రసమునఁ గడలుకొనియె | మదన వికృతి బయల్పడ నుదిలకొనియె.
83
ఉ. చిత్తము మెచ్చి నావలనఁ జిక్కఁగ వెండియు నా లతాంగి య
చ్చొత్తిన యట్లు నాకుఁ దన యుల్లము దెల్లము సేయకున్కిఁ దా
నత్తఱిఁ గ్రొత్తకాన్పగుట నడ్డము సొచ్చిన సిగ్గుపెంపు త
న్ను త్తలమందఁ జేయుటకునో తలపోసి యెఱుంగ నయ్యెదన్‌.’
84
తే. అనుచుఁ గొందలపడు కోర్కె లగ్గలించి | చిఱ్ఱుముఱ్ఱాడుచుండ నచ్చెలువ చెలువు
తగిలి తన యిచ్చఁబాఱు చిత్తంబు పజ్జ | నరిగి యిట్లను నక్కీచకాధముండు.
85
సీ. ‘లీల నాముందట నా లేమ పొలసినఁ | జూడ్కికిఁ జుబ్బనచూఱగాదె!
కనువిచ్చి నన్ను నా తనుమధ్య సూచినఁ | దనువున కమృతసేచనము గాదె!
చిఱునవ్వు బెరయ నచ్చెలువ నా తోడఁ బ | ల్కినఁ జెవులకు రసాయనము గాదె!
యెలమి నమ్మెలఁత నన్నెలయింపఁ దివిరిన | నెడఁద కానందంబు నిక్క గాదె!
 
తే. యా నితంబిని మక్కువ ననఁగి పెనఁగి | యింపు పొంపిరివోవ న న్నేలికొనఁగఁ
దలఁచి పొందిన నది జన్మఫలము గాదె!’ | యనుచు వలరాజు బారికి నగ్గమయ్యె.
86
వ. మఱియు ననేకభంగుల ననంగ విభ్రమంబుల కనురూపంబులైన బహువిధ ప్రలాపంబులం బ్రొద్దుగడుపుచు నమ్మదిరాక్షిరాక కెదురు చూచుచుండె; నక్కడ పాంచాలి రావించి సుదేష్ణ తృష్ణ భావించుచు నిట్లనియె. 87
క. ‘ఒదవెడు తృష పెల్లిదమున | వదనము వఱువట్లు వట్టె వాసిత రాజ
న్మదిరారస మానఁగ నా | హృదయంబున వేడ్క యెసకమెసఁగెడుఁ దరుణీ!
88
క. కీచకుని యింట నెప్పుడు | వాచవి యగు బహువిధముల వారుణి గలుగున్‌
వే చని యచటికిఁ గొని ర | మ్మా చూతముగాని నీ గమన వేగంబున్‌.
89
వ. అనవుడు. 90
ఉ. ఉల్లము దల్లడిల్లఁ దను వుద్గత ఘర్మజలంబు దాల్చుచున్‌
డిల్లపడంగ ‘నా కిది కడింది విచారము పుట్టె; నందుఁ బో
నొల్ల ననంగ రా, దచటి కూరక పోవను రాదు, నేర్పు సం
ధిల్లఁగ దీనిఁ బాపికొను దీమస మెట్టిది యొక్కొ దైవమా!’
91
వ. అని తలంచుచు డోలాందోళితమానస యగుచు నమ్మానిని సుదేష్ణ కిట్లనియె. 92
ఉ. ‘ఉత్పలగంధి! నన్నుడుగు, మొడ్లను బంపుము కల్లుదేర; నే
సత్పథవృత్తి నీ కడన సంతతమున్‌ బహుమానపాత్రనై
తత్పరతం జరించి యుచితంపుఁ బనుల్‌ దగఁ జేయఁ గాక దు
ష్యత్పరివారయోగ్య పరిచారముమైఁ జను నట్టి దాననే?
93
క. అతివ! తగునమ్మ నీ గృహ | మతి నిర్మల చరితభరితమని యీ యెడ మ
త్పతుల యసన్నిధి నైనను | మతి నూఱడి యున్నచోట మన్నన దప్పన్‌.
94
ఉ. సాధులు సేరి నెమ్మిగ నిజస్థిర వృత్తము దుష్టకోటిచే
బాధలఁ బొందకుండఁ దమపాల వసించినఁ బెద్దవారు ది
క్కై ధరియించి వారికొక యాపద వుట్టకయుండఁ గాచు టొ
ప్పై ధరఁ కీర్తి కెక్కదె? యపాయము సేసిన నింద వుట్టదే?
95
ఆ. ఎవ్వరేని యింటి కెద్దియే నొకటికి | నన్నుఁ బంపఁదగునె? నిన్ను నాఁడ
కొలుచునెడ ననుజ్ఞగొననె? నీచములగు | పనుల కేను జాలకునికి సెప్పి.’
96
క. అనిన విని యనుచితంబున | కనయము శంకించియును లతాంగి మదిన్‌ త
మ్ముని వలవంత దలఁచి యి | ట్లనియెం బాంచాలితోడ సాదర వృత్తిన్‌.
97
ఉ. ‘అక్కట! యేను వేడ్కపడి యానెడు నాసవ మర్థిఁ దేర నొం
డొక్క నికృష్టఁ బంచుటకు నోపక చెప్పిన దీని నీవు గో
సెక్కఁగఁజేసి నిన్ను నతిహీన విధాన నియుక్తఁ జేఁతగా
నిక్కమ యుమ్మలించి; తిది నెయ్యము తియ్యము కల్మియే? సఖీ!
98
క. అది లాఁతియిల్లె? నినుఁ దమ | హృదయంబుల నెవ్వరేని నెఱుఁగరె? యేఁ జె
ప్పుదు నీదు పెంపు నినుఁగ | న్నది మొదలుగ నెల్లవారి కయ్యై భంగిన్‌.
99
క. అని మఱియుఁ బెక్కుభంగులఁ | దనుఁ బ్రార్థింపంగ ద్రుపదతనయకుఁ జిత్తం
బున‘నింకఁ బెద్ద పెనఁగం | జన దీయమతోడ’ నను విచారము పుట్టెన్‌.
100
వ. ఇట్లు దోఁచిన తలంపునం జేసి. 101
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - virATa parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )