ఇతిహాసములు భారతము విరాటపర్వము - ద్వితీయాశ్వాసము
సుదేష్ణ ద్రౌపది నూఱడించుట (సం. 4-15-36)
ఉ. ‘న న్నిటు లాదురాత్ము సదనంబునకుం జనుమన్నజంత కీ
బన్నములన్నియుం దెలిపి ప్ర య్యిడనే’ యని పోయె నార్తయై
కన్నుల బాష్పపూరములు గ్రమ్మఁగ మోమున దైన్యమొందఁగా
నన్నలినాక్షి తొట్రిలుచు నంగము దూల సుదేష్ణపాలికిన్‌.
154
తే. చనిన, నయ్యెలనాఁగయు సంభ్రమంబుఁ | దెచ్చికొని తానెఱుంగని తెఱఁగు దాల్చి
శాఠ్యమున నుమ్మలించి పాంచాలితోడ | నెలుఁగువేఱొక భంగిగా నిట్టులనియె.
155
సీ. ‘ధరణీ పరాగంబు వొరసి ధూసరితమై | చేడియ! నీ మేను చెన్నుదఱిఁగెఁ;
జిత్తంబు తలపోఁతచే వాడు పొదవిన | చెలువ నీ నెమ్మోము చిన్నఁబోయెఁ;
బ్రస్వేదమునఁ దోఁగి ఫాలంబుతో నంటి | యుగ్మలి! నీ కురు లొప్పు కుందెఁ;
గన్నీరు వఱ్ఱొడ్డి కాంతి యెంతయుఁగొన్న | వెలఁది! నీ కనుఁగవ విన్ననయ్యె;
 
ఆ. నేది కారణమున నెవ్వ రెచ్చోట నీ | కేమి కీ డొనర్చి రెట్టిపాటి
సాహసికులొ వారిఁ జంపుదు నొంపుదు | భంగపఱుతు నిడుమపఱుతుఁ జెఱుతు.
156
వ. ఇత్తెఱంగు నాకుం జెప్పు ’మనిన ’నీ వెఱింగియు నెఱుంగమి భావించిన, నింక నే మని పలుకంగలదాన? నైనను విను’ మని సైరంధ్రి యిట్లనియె. 157
మ. ‘ నను నీ వప్పుడు సూతమందిరమున న్మద్యంబుఁ దెమ్మన్నఁ బో
యిన నాతం డవినీతి సేసినను జేయీ కేను మత్స్యావనీ
శుని యాస్థానము దిక్కు వే చనిన నచ్చోఁ దీవ్రకోపంబున
న్వెనుకం గూడఁగ ముట్టి పట్టికొని తన్నెం బల్కు లింకేటికిన్‌?’
158
వ. అని యేర్పడం బలికిన. 159
ఉ. ‘ఖేదము దక్కు మీ క్షణమ కీచకు దండితుఁ జేసి నీకు నా
హ్లాద మొనర్తు నే’నని నయంబునఁ గేకయరాజపుత్రి య
త్యాదరవృత్తితో ననునయం బొనరించిన నయ్యసత్య సం
వాదిని పూన్కి పాండుసుతవల్లభ యాలము సేసి యిట్లనున్‌.
160
క. ‘నీ వింత యలుగ నేటికి? | నా వంతయుఁ బౌరజన మనఃఖేదము నొ
క్కావంత ద్రిక్కకుండఁ గ | లావంతులు మత్పతులు గలరు పగఁ దీర్పన్‌’.
161
క. అనిన సుదేష్ణయుఁ దత్పరి | జనములు వెఱఁబొంది యెన్ని సాంత్వనములు సె
ప్పినఁ దేఱద, మజ్జ్జన భో | జనములకుం జొరద ద్రుపదసంభవ యెట్లున్‌.
162
వ. అట్టియెడ సుదేష్ణసేయునది లేక నివ్వెఱఁగంది యుండెఁ; దక్కటి యంగనలును గీచకుని నీచత్వంబు దలంచి వాని చేటున కొడంబడిరి; పరిభవానల సంతప్తయైనపాంచాలి నిజశయనస్థానంబునకుం జని తల్పంబుపై మేను వైచి, యపాంగంబులం దొరంగు కన్నీరు చెవుల కొలంకులు నిండ నెవ్వగలు నివ్వటిలం దలపోయుచుండి. 163
క. ‘ప్రబలుం డారయ నా సిం | హబలుం; డాతని జయింప ననిలతనయు బా
హుబలంబ కూడఁ దగు; దై | వబలం బును నాతనికి నవశ్యముఁ గల్గున్‌.’
164
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - virATa parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )