ఇతిహాసములు భారతము విరాటపర్వము - పంచమాశ్వాసము
అర్జునుఁ డుత్తరకు బొమ్మపొత్తికలుగాఁ గురువీరుల శిరోంబరంబు లిచ్చుట
తే. చెలులుఁ దానును నుత్తర యెలమిఁ దన్నుఁ | గాంచుటయుఁ బ్రీతి యెసలార గారవించి
‘బొమ్మపొత్తిక లడిగితి కొమ్మ! యింద’ | మనుచు నిచ్చెఁ దాఁ దెచ్చిన యంబరములు.
304
వ. ఇవ్విధంబునఁ గృతకృత్యుం డయి యథాపూర్వంబుగా మజ్జన భోజనంబులు సలిపి, ధర్మతనయు నివాసంబునం దేకాంత స్థలంబునఁ దా రేవురును ద్రౌపదియును గూడఁబడునట్టి తెఱంగు సంఘటించి, సమాగమ సముచిత ప్రకారంబు నడపి, గోగణ నివర్తనంబును రణప్రవర్తనంబును నన్యోన్య విదితంబులైన యనంతరంబ యగ్రజు నుద్దేశించి బీభత్సుండు భీమసేనున కిట్లనియె. 305
క. ‘మొగ మొప్పదు నా దెస నీ | జగతీనాథునకు; నే విచారించియునుం
దగ దీనికిఁ గారణ మిది | యగు నని యేర్పఱుపనేరనయ్యెద నెట్లున్‌.’
306
వ. అనిన విని యుధిష్ఠిరుం డతని కిట్లనియె. 307
క. ‘ఒం డేమియు లేదు; విరా | టుం డాత్మతనూజుఁ బొగడుడును దుర్దమ దో
ర్దండత గల్గు బృహన్నల | యుండఁ గొఱఁత యేమి పగఱ నోర్చుట కంటిన్‌.
308
ఆ. అనినఁ బేడిఁ బొగడె దని యవివేకి యై | కోప మడర సారెగొని యతండు
వ్రేసె నెత్తు రపుడు వెడలఁబోయినఁ జీరఁ | గప్పికొంటి నీవు గానకుండ.’
309
క. అని చెప్పి గంటి సూపిన | ననిలతనూభవుఁడు కనలి ‘యా దుష్టాత్ముం
దనయాది బంధుయుతముగ | ననిచెద జముప్రోలి’ కనియె నంగము వొంగన్‌.
310
వ. కిరీటియుం గోపించి. 311
క. ‘తన కొలఁది యెఱుంగని యి | మ్మనుజాధము నిపుడ పట్టి మర్దింపక త
క్కినఁ గాదు; వీని రాజ్యము | నిను నంతయుఁ జేరుఁగా!’ కనియె ధర్మజుతోన్‌.
312
చ. అనవుడు నాతఁ డిట్టులను ‘నక్కట! యింతకు ముంద రేమియున్‌
మనల నెఱుంగఁ; డవ్విభుని మాటునఁ బూనిక దీర్చికొంటి; మా
తని కొక యెగ్గు సేఁత యుచితంబె? యెఱింగెడునట్లు గాఁగఁ బో
యినఁ గనియున్‌ దురుద్ధతి వహించినఁ జూతముగాక పిమ్మటన్‌.’
313
వ. అని పలికి వారల కుందు మాన్పి ‘యిది యట్ల కాక యొండు దగునే?’ యనుచుఁ దక్కినవారి దెసయుం గనుంగొనిన నెల్లవారు నుపశమించిరి; తదనంతరంబ తమ్ము నెఱింగించు తెఱంగు దలపోసి వారందఱు విరాటు కొలువు కూటంబునకుం బోయి బయలు మెఱసి యుండువారుగా నిశ్చయించి, యా రాత్రి గడపి వేగుటయుం గృతస్నాను లయి పాండుసూనులు సమయ విహితాచారంబులు నడపి యుచిత ప్రకారంబున. 314
క. తెలుపులగు చీరలను బూఁ | తలఁ బువ్వుల నొప్పి రాజతనయానుగుణో
జ్జ్వల మాననీయ వేషము | లలవడఁ గూడుకొని నగరి కరిగిరి ప్రీతిన్‌.
315
క. చని ధర్మసుతుఁడు సింహా | సనమున భీమాదు లాత్మసముచిత రుచిరా
సనముల సభాస్థలిం గయి | కొని పంచాగ్నులును బోలెఁ గూర్చున్నంతన్‌.
316
తే. వేడ్కఁ దొడి పూసి కట్టి యవ్విరటుఁ డుత్త | రుండు దోఁ జనుదేరఁ గొల్వుండు బుద్ధి
నచటి కేతెంచి కని విస్మయంబు నొంది | యెల్లిదంబుగఁ దలఁచుచు నిట్టు లనియె.
317
క. ‘ఇది యేమి కంక! నీ వు | న్మదవృత్తిని శంక దక్కి మా గద్దియపైఁ
బదిలంబుగఁ గూర్చుండితి | వదియునుగా కిపుడు డిగ వహంకారమునన్‌.’
318
వ. అనిన విని మందహాసంబు సేసి సంక్రంద ననందనుం డతని కిట్లనియె. 319
సీ. ‘నడదీవియలు సేసె నగరికి మాణిక్య | మకుటముల్‌ పూనిన మనుజపతులఁ,
దగునాజ్ఞ సూయాణముగ నొనరించె మం | చిగ నేల నాలుగు చెఱఁగులకును,
బ్రీతార్థిజనుల సచేతన త్యాగ ధ్వ | జములుగా నన్ని దేశముల నిలిపె,
దిక్కులన్నింటను దెలుపారు పూఁత గా | వించె నుజ్జ్వల యశోవిభ్రమంబు,
 
తే. రాజసూయాధ్వర ప్రవర్తకుఁడు, నిత్య | సత్యభాషా మహావ్రతశాలి, పాండు
రాజ దుగ్ధ పయోనిధిరాజు ధర్మ | రాజు సుమ్ము మత్స్యావనీరమణ! యితఁడు.
320
ఉ. ఈతఁ డజాతశత్రుఁడు మహిం దగ దిగ్విజయంబు సేసె, వి
ద్యాతిశయార్థి వాసవుమహాసన మైనను నెక్క నర్హుఁ డు
ద్ద్యోతితమూర్తి కౌరవకులోద్వహుఁ, డార్యనికాయ సంతత
ఖ్యాతచరిత్రుఁ డీచిఱుత గద్దియకుం దగఁడే నరేశ్వరా!’
321
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - virATa parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )