కావ్యములు ఆంధ్ర పురాణము విద్యానగర పర్వము

ఆంధ్ర పురాణము
మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి

యద్బహ్మ ప్రతిపాద్యతే ప్రగుణయత్తత్పంచమూర్తిప్రథాం
తత్రాయం స్థితిమూర్తి మాకలయతి శ్రీబుక్కణక్ష్మాపతిః
విద్యాతీర్థముని స్తదాత్మని లసన్మూర్తి స్త్వనుగ్రాహికా
తేనాస్య స్వగుణై రఖండితపదం సార్వజ్ఞ్య ముద్ద్యోతతే.
‘మాధవవిద్యారణ్యస్వామి’

విద్యానగర పర్వము
క.శ్రీగణ్య నైష్ఠికోదిత
నైగమికాశీః పురో వినమ్ర శిరస్కా!
జేగీయమాన సదనా
భోగాజిర విబుధకథిత పుణ్యవచస్కా!
1
శా.అక్షయ్యంబగు నాత్మతత్త్వమున విద్యారణ్య యోగీశ్వరా
పేక్షా రూప మహఃకళల్‌ విరియ నుర్విన్‌ భద్రముల్‌గా, విరూ
పాక్షస్వామి కటాక్షరేఖ సగుణంబై మ్రోసి ధర్మస్థితిన్
సాక్షాదభ్యుదయమ్మిడెన్‌ యవన దుశ్శక్తిం దుటారించుచున్‌.
2
గీ.ధర్మదీక్షలు పెంచి - శాత్రవులఁ ద్రుంచి
హరిహరుఁడు రెండుమూర్తుల నాకళింప
విజయనగర మహారాజ్య సృజనమునకు
బ్రహ్మయయ్యె విద్యారణ్య పరమయోగి.
3
హరిహర సోదరుల పురావృత్తము
చ.హరిహరుఁడున్‌ గుణోత్తరత నాతని సోదరుఁడైన బుక్క భూ
వరుఁడును గాకతీయులకుఁ బట్టిన దుర్దశ నెంచి నిల్వఁగాఁ
దెరువేడఁబాయుచున్‌ బయలుదేఱి వినిద్రతఁ దుంగభద్ర యొ
డ్డొరసిన యానెగొందె కొలువుండఁగ జూచిరి జంబుకేశ్వరున్‌.
4
ఆ.వె.ఆనెగొందె రాజ్యమందు సాచివ్యమ్ము
నందె హరిహరుండు; నతని సహజుఁ
డందె బుక్కరాయ లచటి కోశాధ్యక్ష
పదము జంబుకేశు హృదయ మొడిసి.
5
ఉ.ఈసున నొక్కకారణ మదేదియొ త్రవ్వి కరమ్ము క్రొవ్వి ఢి
ల్లీసులతాను ‘తుగ్లకు’ కలిం దలపించుచు సర్వవీర సం
త్రాసముగాఁగ సైనిక పరంపర నంపిన నానెగొందెలో
దూసిరి వాఁడికత్తు లకుతోభయులౌ నిరువంక రాణువల్‌.
6
గీ.హరిహరాదులు నాఁ డెంత యడ్డపడియు
గెలుపు సాధింపలేక సిగ్గిలిరి; బెగ్గ
డిలిరి; మృత్యుంజయతను బండించుకొనియె
నీప్సితము నిండ నా జంబుకేశ్వరుండు.
7
చ.హరిహరసోదరుల్‌ వివశులౌచుఁ దురుష్కులపెల్లు దాడి మ
చ్చరికము నింకఁ దట్టుకొనఁజాలకపోవుడు - వారి నిర్వురం
జెఱగొని ఢిల్లి పట్టణముఁ జేరుపఁగాఁ ‘దుగలక్కు’ గెల్పు సం
బరమును నిల్పుకో నెడఁద పట్టక యార్చె విషార్చి గ్రక్కుచున్‌.
8
చ.పదపడి యానెగొందె పరిపాలన మెవ్వఁడొ సేయఁగాఁ బ్రజా
హృదయము లెట్టు లూఱటవహించును! వచ్చిన క్రొత్తయేల్చడిం
బదను రుచింపకే తిరుగుపాటు ఘటిల్లుటఁ జేసి - తంత్రముల్
చెదరుటఁజేసి కన్ను తెఱచెన్‌ సులతాను తనంత దాను గన్‌.
9
వ.మఱి చేయునది లేక యా సోదరులను జెఱ విడిపించి తన కరిగాఁపులై యానెగొందె రాజ్యము నేలుకొం డని యాన యిచ్చుటయు వారు వచ్చి ప్రజాంతరంగమ్ములు విచ్చునటులు ప్రభుత్వము నెఱపం గడంగిరి; నిర్వక్ర పరాక్రమధను లగు హరిహరరాయ సహోదరులయెడం దత్పురాసుకృతవిశేష ఫలంబుగా శ్రుతి స్మృతి సదాచార పాలకుండగు శ్రీమన్మాధవ విద్యారణ్యస్యామి నాందీవాదియై యనుగ్రహంబు వెదచిందుచుండు; నయ్యన్నదమ్ములు నాఁడు నాఁడు.10
సీ.వినిపించుకొందురు వేదభాష్యమ్ముల । తత్త్వమ్ము గురుని పాదముల కెఱఁగి
చదివించుకొందురు సర్వదర్శన వాద । భేద సారమ్ము వైవిధ్య మెఱుఁగఁ
జాణక్యు నర్థశాస్త్రపయోధి మణు లేఱి । సానఁ బట్టింతు రాచార్యుచేత
స్మృతుల సదాచారగతుల భిన్నతఁ జూపి । నవ సమన్వయపు సంతనలు విండ్రు
 
గీ.సంగమాన్వయ భవులు నిస్సంగుఁడైన । పరమయోగి విద్యారణ్యగురునిఁ దలఁచి
లోకమున వేదమున వెల్గురేక యొక్కఁ । డరసి పాలించుచుందు రయ్యానెగొందె.
11
వ.అటులుండ నొకనాఁ డప్పవిత్ర పంపాక్షేత్రంబున-12
హరిహర సోదరులు - విద్యారణ్యస్వామి సందర్శనము
మ.భువనేశీ సముపాసనోజ్జ్వల తర భ్రూమధ్యగోర్ణా విలా
స విభా నిర్జిత భానుమండల సహస్ర స్ఫూర్తిమై నొప్పి మూ
ర్త విరూపాక్షుఁడు వోలె నింపెసఁగు విద్యారణ్యయోగిన్‌ బున
ర్భవదూరున్‌ దరిసింపఁ గోర్కి చిగురింపన్‌ ధర్మసేవామతిన్‌.
13
చ.తఱచుగఁ దాను బోయెడి విధంబునఁగాక భవిష్యదర్థ త
త్పరత యొకండు లోఁతుటెడఁదం గదలించుచునుండ, స్వామిశ్రీ
చరణయుగంబు మ్రోల నొక చక్కని వాచిక మందుకోఁగ నా
హరిహరరాయ భూపతి సహానుజుఁడై వెడలెన్‌ వినీతుఁడై.
14
మ.అరుణార్క ద్యుతిరేఖ లాశ్రమ పురః ప్రాంతావనీజాత బం
ధుర పర్ణాంతర జాల భాసురములై తోఁపన్‌ సమాధ్యంతమం
దరవిప్పుం గను లెత్తి “యివ్వి పొడలే ళ్ళౌరౌర! చెట్లెక్కు ట
బ్బుర” మంచున్‌ మఱియంతలో నపుడనవ్వున్‌ దానుదద్భ్రాంతికిన్‌.
15
ఉ.ఆ పరమర్షి మందహసితాంచలమందు జగద్ధితైక సం
ధా పరమాదరోదర సుధాకణ మొక్కఁడు చెంగలించి లోఁ
దీపులు పొంగు నయ్యెడ సుధీజన సంఘ విధేయతా లసద్
రూపవిలాసుఁడౌ హరిహరుండు ససోదరుఁ డౌచు వచ్చుచున్‌.
16
శా.అల్లంతన్‌ గురుపీఠముం గనుచు భక్త్యావేశవిత్తంబు దో
సిళ్లన్‌ నిల్వఁగఁ జిక్కఁబట్టుకొని యాశీర్లాభకాంక్షా త్వరో
ద్యల్లీలా గమనాభిరాములయి డాయం జేరి, ధ్యానాంతరో
త్ఫుల్లంబైన కటాక్ష నీరజ దళంబుల్‌ గాంచి రా సోదరుల్‌.
17
ఆ.వె.లోనలోనఁ దేనెసోనలు - పైపైని
శిలలఁ గత్తిరింపఁ గలుగు పదను -
గురుని యడుగుఁదమ్ము లొరయ సాష్టాంగమై
యెఱఁగె వినయభరత హరిహరుండు.
18
ఆ.వె.అన్నవెనుక నొక్కఁడై యొక్కఁడై యట్టె
సాఁగి మ్రొక్కు లిడిన జాడవెంట
ధర్మరాజు నరయు ధౌమ్యుండు దేశికుం
డాశిషమ్ము లిచ్చె హరిహరునకు.
19
గీ.హరిహరాభిన్నులైన సోదరులు నల్వు
రా మహాశీస్సుధా భిక్ష నంజలించి;
రందఱును దేశికోత్తము నభ్యనుజ్ఞ
నొంది యుచితాసనములఁ గూర్చుండి రంత.
20
మ.సవిశేష స్ఫురణాభిరామము కటాక్షశ్రీని నిండార్చి మా
ధవ విద్యాఖని గొంతులో జలద మంద్రధ్వాన గాంభీర్య గౌ
రవ మొక్కం డెదొ తొల్కరింపఁగఁ బ్రియారంభంబుతో ధార్మిక
వ్యవసాయం బిటు పంటవోసినటుగా నాలించి రయ్యేవురున్‌.
21
మ.అవురా! చూడఁగఁ జూడఁగా యవనమాయాభంగు లిప్పాట లొం
గవు కాఁబోలును! ధర్మధేను వది ముక్కాల్‌కుంటియై కంట వె
ల్లువగా నీరొడియన్‌ వడంకుఁగొని నిల్చు న్నేఁడు; నా సుంత వై
భవముం బుణ్యముగట్టుకొంటకుఁ దలంపన్‌ వారు మంపిల్లిరో!
22
మ.పుడమిన్‌ ధర్మ మధర్మపున్‌ బెడఁదఁ బెంపుం బాసి పోనున్న య
ప్పుడు విద్వాంసులు కార్యదక్షులును బ్రోపుం జూపి యద్దానిఁ గీ
డ్పడకుండన్‌ సరిదిద్ద నొప్పు; నటు తప్పన్‌ వారికే ముప్పు చే
పడుఁగానీ; చెడకుండ ధర్మమును నిల్పన్‌ దైవమొం డుండెడిన్‌.
23
గీ.ఇచట మేముండి - పయి నీశ్వరేచ్ఛయుండి -
యచట నసమాన విక్రమ ప్రచురమూర్తు
లైన మీరింద ఱుండి ధర్మావనంబు
నోఁచుకొనలేదె! నేఁడు హిందూధరిత్రి.
24
మ.అది కా; దీ యవన ప్రతారణపుఁ జర్యల్‌ సాగనీకుండఁ జే
యఁదగున్; హైందవ ధర్మపాలన పరాయత్తైక చిత్తంబులన్‌
బదనౌకత్తులు దూసి మీరు గనుపాపం బింతయున్‌ లేదు నాఁ
గదలున్‌ మా యెదలోన నొక్క శివసంకల్పంబు రేఖాకృతిన్‌.
25
చ.హరిహరరాయ! యీ నలువురైన సహోదరు లండ నిల్చి యుం
దురుగద! నీవు పంచవదనుండవుగాఁ గను జేవుఱించి సం
గరమున నిల్చినన్‌ యవనకంఠ విలుంఠన మౌను; ధర్మ బం
ధురమును దేశబంధు వగు నూతనరాజ్య మొకండు పొల్చెడిన్‌.
26
మ.నిరమిత్త్రంబుగ హైందవప్రజలు రాణింపన్‌ గళాహృద్యమౌ
పుర మొక్కండు నభేద్యవప్రమొకఁ డొప్పుల్‌మీఱఁ గట్టించి, దే
శ రమాపాదసరోజ మంగళ సమర్చారంగమై యున్న బం
గరుగద్దెన్‌ నిను నిల్ప నొక్క వెలుఁ గాజ్ఞాపించు నాత్మీయమై.
27
గీ.అనఁగ నిర్మేఘ వర్షౌఘమందుఁ దడిసి
తనియఁ దోఁగాడినటులు సోదరులు నలువు
రరసికొనరాని మూఁగమైమఱపుఁ గొన్న
హరిహరుం డన్న గంభీరతాంబురాశి.
28
మ.అణువై నిల్చి - దయాభిరాముఁ డగు నయ్యాచార్యునంఘ్రిన్‌ రజః
కణమై పొల్చి - యొకింతలోన గురు సంకల్పంబు భావించి, ని
ల్వునఁ దా నప్పుల మున్గు నయ్యనుభవంబుంగాంచి, లోఁదేర్చి, వా
ఙ్మణులం గానుకలిచ్చె దేశిక మనోమార్గంబు దీపింపఁగన్‌.
29
మ.సదయాత్ముండవు నీవు పల్కు నుపదేశం బిద్ది - యాదేశ మి
య్యది - వేదోపనిషత్తునై మదికి దివ్యాశీస్సుగా నర్థమై
నది; యీ వాసన యే సుకర్మ కృత సంతానంబొ కావచ్చు; దుః
ఖద మీ పుట్టువునందుఁ జేకుఱిన సంస్కారంబు కా దెన్నఁగన్‌.
30
వ.అని పలికి తోడ్తోడ హరిహరుండు తనపజ్జనున్న యేకోదరుల నొకమా ఱరసి వారికన్నులందుఁ దొలఁకాడుచున్న యొక యుదంతం బాశ్చర్యావహంబగుదానిని స్మరించుకొని మఱి గురుసన్నిధి నిట్లు వచించె :31
కుందేటి మగంటిమి
గీ.ఒక ప్రసంగాంతరమ్ము దేశికుల మ్రోలఁ
దెలిపి - యద్దాని మొదలేదొ తెలిసికొనెడి
తలఁపు తొందర నన్ను ముందఱకుఁ ద్రోయు;
వేడ్క నయ్యది యిట విన్నవించుకొందు.
32
మ.ఒకనాఁ డీయెడ మేము దుర్మృగవధోద్యోగంబుతో వేఁటవే
డుక త్రోపాడఁగఁ దుంగభద్రనదిగట్టుందాఁటి యల్లంతమే
రకుఁ బోఁబోవఁగ దక్షిణంబున మహారణ్యం బొకండుండెఁ; గౌ
తుకమారన్‌ బటుధాటి నయ్యటవియందున్‌ సాగె నాఖేటమున్‌.
33
మ.కలితాభీలత రూపుఁదాల్చిన మృగగ్రామంబు లక్కానలో
పల నున్నట్టివి; యెన్నఁ డేము పరికింపన్‌ లేదు; పోఁగాఁ దలం
పులకున్‌ రా వవి; వాని క్రొంబొగరుఁ జొప్పుల్‌ నేర్పులుం బెద్దయా
ర్పులు మా కబ్బురమయ్యె నిబ్బరపుఁబెంపుం బూని మే మయ్యెడన్‌.
34
ఉ.గాటపుఁబట్టునన్‌ బలుమెకంబుల గీటడఁగించి నాఁటి యా
ఖేటవినోద మంతట ముగించి యటుల్‌ పఱతెంచుచుండఁ గుం
దేటిని వేఁట వేఁపి గమనించుటఁ గాంచితి మొక్కచోట న
ప్పాట నదృష్టపూర్వమగుభంగి యొకం డది యేమి చెప్పుదున్‌.
35
గీ.గజముఖుని మోయనగు మూషికమ్ముకూడఁ
గదలలేని మార్జాలము కంటఁబడినఁ
గలుఁగులోఁజొచ్చు టది సృష్టివిలసనంబ;
యెలుక పిల్లినిఁ బట్టుట విలయ మగునో!
36
మ.ప్రళయాంతం బిటు గంతువెట్టె నని సంభావింతుమేనిన్‌ గలిన్
దొలిపాదం బిదికూడ దాఁటినటులేదున్; జిత్ర! మవ్వేఁట జా
గిల మువ్వెత్తుగఁ గుందెటిం బొదువనుంకింపన్‌ నిరాతంక ని
శ్చలధీరాకృతి నద్ది జాగిలము నజ్జం బట్టె మాముంగలన్‌.
37
ఉ.కాంచుచునుంటి మేము తటకాపడి రాపడి కొంతసే పటుల్‌
పెంచినబీఱముల్‌ తెలుప భీకర మద్భుతమైనపోరు చూ
పించినవెంటఁ గుందెటికి భీతిలి జాగిల మద్ది తా నుడా
యించుట విశ్వసించెదరఁటే! పరికించియు రెండుకన్నులన్‌.
38
గీ.ప్రకృతి విపరీతరీతిఁ జూపట్టినట్టి
యీ విశేషంబు కతన మాదృశులబుద్ధి
మంగళామంగళములకు మధ్యవీథి
నాడునే కాని యొక నిశ్చయమ్ముఁ గొనదు.
39
వ.అవ్విధినిర్ణయం బెద్దియో విని తనివోవు నదృష్టరేఖ మాలో నుండవలయుంగాని కాలత్రయవేదులగు నాచార్యుల కిందలి భవితవ్వతావగతి దురధిగమంబు కాదుగాదె!40
క.అని హరిహరుండు సంభ్రమ
వినయమ్ములు నిండఁ దనకు వినిపించిన నూ
తనగాథను నూతనగా
థనుగా వినలేదు గురుఁడు తత్త్వమెఱుఁగుటన్‌.
41
మ.వెలుఁగుంగన్నుల త్రోవలో నొక సుధావిర్భావమై యుజ్జ్వలో
జ్జ్వలమై నిల్చి సనాతనప్రథిత శిల్పస్నిగ్ధరేఖా తటి
త్కళలన్‌ నిండిన భవ్య దివ్య రుచిరాకారంబు నిర్మాణ మూ
యల నూఁగాడుట నెంచె మాధవమహోపాధ్యాయుఁ డంతస్స్థితిన్‌.
42
మ.జనిపంక్తిన్‌ నిఖిలాగమంబులును శాస్త్రంబుల్‌ పురాణావళుల్
తనివో నధ్యయనించి పెంచిన సమర్థంబైన వైదుష్య వా
సనతో నిండి యఖండమైన సదనుష్ఠానంబుతో నారఁబం
డిన మేధాతిథి మాధవుండు నవసృష్టిం గాంచె ధాత్రంశమున్‌.
43
ఆ.వె.ఒక ముహూర్తకాల మొదిఁగి యవ్విప్రుని
నుదుట మెఱయు గురుత పదను గనియె
హరిహరుండు; మాధవాచార్య చతురాస్యు
డినియె ఱేఁడు సిగ్గుగొని తొణంక.
44
చ.హరిహరరాయ! నీవు చరితార్థుఁడ వింతకు; మా తలంపుతో
సరిజత కల్పుకొన్న యొక సంగడికాఁడవు నేఁడు; రేపు ని
బ్బరమగు పెద్ద యేలుబడిఁ బట్టము మోసెడివాఁడ వైనచో
గురువులయాన నాఁడు తలకున్‌ లఘువైనటు తోఁచవచ్చునో!
45
వ.అని యించుక నవ్వి విజ్ఞాన చతుర్ముఖుండు మాధవగురుండు హరిహరానుజన్ములగు బుక్కరాయాదులపై ననుకంపామరంద విసృమరంబులైన యపాంగ ప్రసవాక్షతంబులం బోసి యెల్ల తెఱంగుల మీ నల్వుర కగ్రజుండగు హరిహరుని యడుగుజాడల నడచి సువిశాల సుందరమ్ము ధర్మేందిరా మందిరమ్ము ననందగు హైందవ సామ్రాజ్య మొండు చిరస్థాయి యగునట్టులు నెలకొల్ప వలసి యున్నది; గుణభద్రయగు తుంగభద్రా స్రవంతికి దక్షిణంబున మీ వేఁట వోయిన విపినంబు నుచ్ఛేదించి ‘కుందేటి మగంటిమిం’ గంటిరే యల్లచోట సూత్రపట్టి శంకువువెట్టి యొకమహాపుర దుర్గనిర్మాణంబు గావించునది; యిది శివాదేశము -46
గీ.వేదధర్మ గోపాయనవిధిఁ దలంచి
శ్రీవిరూపాక్షునిధి స్వీకరింప రండు!
ఏడుగడియలకాల మీనాఁడు మీకు
ద్రవిణభవన కవాటబంధములు వాయు.
47
మ.కొనుఁ డన్నన్‌ విని కోశలాభమున వాకుల్‌ రాక యానంద కో
శ నిమగ్నాత్మతనున్న సోదరులపక్షం బౌచు ముందున్న య
న్నను వీక్షించుచు బుక్కరాయలు బిరానన్‌ మాధవున్‌ ధర్మక
ర్తను సాష్టాంగము మ్రొక్కి పల్కె వినయార్ద్రప్రీతి తళ్కొత్తఁగన్‌.
48
గీ.అంటిముట్టని శుకయోగివైన నీదు
నంఘ్రియుగ మంటె మా యన్న; యాతఁ డిట్టు
లేడుగడియలలోఁ జూఱలాడుకొనెడి
ద్రవ్యమోక్షము; కాఁడె కృతార్థుఁ డిపుడు!
49
గీ.హరియె తా మాధవుండుగా నవతరించె;
హరుఁ డమృతకంఠుఁ డగు విరూపాక్షుఁ డయ్యె;
నాద్వయం బద్వయంబైన హరిహరునకుఁ
బరమశాశ్వతమైన జీవమ్ముఁ బోసె.
50
గీ.గురుఁడవై నాఁడు కఱపినకఱపులకును
మిత్రముగ నేఁడు నీ చేయుమేలునకును
మంత్రిగా రేపు తీసెడిమార్గమునకు
బదులు చెప్పక తలలు వంచెదము మేము.
51
వ.మా యన్న యడుగుజాడలం బోయి దేశికాశీస్సులతో ననాయాసంబుగా యవననిరాసంబుఁ గావించి మహాసామ్రాజ్య నిర్మాణంబునకు దీక్షితుల మయ్యెద మని వచించిన బుక్కరాయల వాక్కులకు మాధవుల యంతరంగ మానందఘనం బయ్యె; హరిహరుండును గృతజ్ఞతానిభృతమైన చేతమ్ముతో ‘గురుప్రసాదం’ బని పలికి శిరమ్మువంచుకొని మణిమాటాడలేక నూతనపుర దుర్గనిర్మాణ శుభముహూర్త పత్త్రంబు జయాశీఃపురస్సరము మాధవ విద్యారణ్యస్వామి ప్రసాదించినది యందుకొని కందోయి కద్దుకొనియె; ననంతర మాచార్యునివలన సుముహూర్తవేళాచరణీయ విశేషంబులు విని శ్రీనిధిం గొని మేరుగిరిదక్కిన మోదభారముంగని గురునియనుజ్ఞ హరిపంచాయుధములుం బోని హరిహరరాయ బుక్కరాయ కంపరాయ మారప ముద్దప నాములగు నాసంగమాన్వయసంభవు లానెగొందెఁ జేరుకొనిరి;52
మ.గురునాశీర్వచనంబుకల్మి నెడ జంకుం గొంకుఁ బోనాడి స
త్వరసన్నాహ మొనర్చుకొంచు భగవద్దత్తంబు విత్తంబు చే
కుఱుటన్‌ సైన్య మగణ్యముం బెనిచి శక్తుండై స్వరాజ్యైక వి
స్తరవాంఛామతి నానెగొందెవిభుఁ డుద్యజ్జైత్రయత్రాకృతిన్‌.
53
ఉ.తోడయి సోదరాళి తనతో సరివచ్చి రణోర్వియందు ముం
దాడి యరాతిరాజ దురహంకృతి పెంపడఁగించుచుండఁ గ్రొ
వ్వాఁడి మగంటిమిం దన యవార్య భుజోద్ధతిఁ జూపువేడ్కఁ బో
రాడి జయించు నా హరిహరావనిపాలుఁడు మచ్చుతున్కగన్‌.
54
గీ.దైవశక్తి వీఁపుఁదట్టి త్రోపుడువెట్ట
నచిరకాలమంద హరిహరుండు
కడఁగి పోరి యాంధ్రకర్ణాటమండల
ప్రాంతములను గెలిచి పట్టుకొనియె.
55
గీ.గ్రుక్కలో శత్రుశరధి మ్రింగుకొనిత్రేన్చు
బుక్కరాయ లొక్కఁడు చాలుఁబో యనంగ -
నట్టితమ్ములు మఱి మువ్వురైన యిపుడు
హరిహరుని బాహుగర్వ మేమనఁగవచ్చు!
56
వ.యవనపాలితంబులగు నయ్యాచోటు లాక్రమించుకొని వారిభండారంబు లొడిచి సోదరులసాహాయ్యంబున హరిహరుండు తన యేలుబడి మేలుబడిగా దిద్దుకొనుచు నొక్కనాఁడు నూతనసామ్రాజ్య పురనిర్మాణంబునకు మాధవాచార్యులు నిర్ణయించిన సుముహూర్తకాలమ్ము సంభావించి సోదరమంత్రియైన బుక్కరాయలతో సమాలోచించి యమ్మఱునాఁటి వఱువాత వైతాళికుల గెలుపు మేల్కొలుపుల మేలుకాంచి -57
విజయనగర సామ్రాజ్యస్థాపన సుముహూర్తము
మ.అతులోదారతరంగభద్ర సుగుణోద్య త్తుంగభద్రానదీ
తత పూతాంబువులందు సోదరులకైదండన్‌ మహీదేవతో
దిత సంకల్పపురస్సరంబుగను భక్తిన్‌ స్నాతుఁడై నైష్ఠిక
వ్రతుఁడై మంగళదైవత ద్విజ సమర్చల్‌తీర్చి యుత్సాహియై.
58
శా.చేతశ్శుద్ధి యొనర్చుకో నుపవసించెన్‌ ఱేఁడు నాఁడెల్ల శ్ర
ద్ధా తాత్పర్యములన్‌ శ్రుతిస్మృతుల బోధంబుల్‌ పురాణాగమ
ఖ్యాతంబుల్‌ కథలున్‌ సుశిక్షితములౌ నాన్వీక్షకీ కల్ప గో
ష్ఠీతంత్రంబులు నాలకించుచు భజించెన్‌ సాత్త్వికాచారమున్‌.
59
గీ.హైందవేతర విమత ధార్ష్ట్యమ్ముకతన
వాఁడి కడుపెండి నవసి యల్లాడుచున్న
యాంధ్రకర్ణాటరమకు సుధాన్నభిక్ష
వాని యొకనాఁటి పూర్ణోపవాసదీక్ష.
60
వ.హరిహరుండు తెల్లవాఱుజాము శంకువు నెలకొల్పులగ్నం బగుటం దొలినాఁ డటు లుపవసించి గురూక్తవిధానంబునం గడపి యారేయి జాగరణం బొనరించె; వేఁబోక సుముహూర్తంబు దరియుటయు.61
సీ.అమృతనిర్ఝర తరంగములుగాఁ బొంగారి । చదలంటు మంగళస్వనము వెంట
నెఱవిచ్చు పసిఁడితామరపూల నిగ్గైన । తెనుఁగుకన్నడపు టంగనలవెంట
బ్రహ్మబిందు సముత్కరము పదక్రమముతో । ఘనమైన స్వస్తివాచనము వెంట
నమలదీధితులు శంఖములట్లు నమ్రులై । తనుఁ జుట్టుకొన్న సోదరుల వెంట
 
గీ.హరిహరుఁడు రాజహంసయై యల్లనల్ల । మానసానంద ఘన సరోమార్గమందు
గలయనడచి గురుబ్రహ్మ తలఁపు వట్టి । శంకువును బెట్టు మంగళస్థాన మరసె.
62
ఉ.లంపులమారులై పెఱకళావిభవమ్ము సహింపనేరమిం
గొంపలడంచు నయ్యరులకుం దలఁకుం గొని యింతదాఁకఁ గ
న్పింపక నేలలో నడఁగి నిర్మల సాధు తపస్సమాధిమై
సొంపులుదేఱు వాస్తుపురుషుండు శుభాగమనమ్ము పల్కఁగన్‌.
63
గీ.హరిహరుం డాతని కరాగ్ర మందుకొన్న
చందమై మంగళారంభ సమయమందుఁ
దన పురోహిత విప్రుఁ డిచ్చినది పట్టె
సఫల తాంబూలమును శుభాక్షతల నడుమ.
64
వ.హరిహరరాయ ధరణీంద్రుండు ప్రాఙ్ముఖోపవిష్టుండైన పదంపడి పురోహితుండు గణాధిపతి పూజాకార్యము నిర్వర్తింపఁజేయుటయు శంకు సంస్థాపన సుముహూర్త సంకేతంబుగాఁ దోతెంచనగు శ్రీమన్మాధవాచార్య వదనాధ్మాయమాన శంఖారావమ్మునకు వా రెల్లం జెవులు వెట్టియుండ నా నిశ్శబ్ద ప్రభాతమ్మునఁ గతిపయ క్షణంబులకు -65
క.వినిపించె నొక్క కంబు
స్వన మంబరవీథి మ్రింగు చాయ ఘనంబై;
విని, గురు సంకేతిత శం
ఖ నినాదం బిది ముహూర్తకాలం బనుచున్‌.
66
వ.హరిహరునిచే శంకువు నిలుపఁజేయ సంభ్రమించు తఱిఁ బురోహితుం బరికించి శబ్ద బ్రహ్మవిత్పాద శుశ్రూషా పరాయణుండును శ్రుతిమత్ప్రసంగ చరిత్రుండును, ప్రయుక్తి నిపుణుండును, విద్యాతీర్థముని రాడ్భోగమూర్తియు, విశేషార్థవేదియు, నిత్యస్ఫూర్తిమంతుండు నగు బుక్కణోర్వీరమణుం డది యాచార్యశంఖధ్వానంబుగాఁ దనకు వినంబడమి నాఁగుం డని యమ్ముహూర్తంబు నివారించి యాశ్చర్యఖిన్నుఁడైన తన యన్నతో నిట్లనియె.67
మ.అరయంగా గురుదేవ శంఖరవ మన్నా! కాదు కా దిద్ది; య
త్యురు సంకల్ప పురస్సర ప్రణవ సుష్ఠూచ్చారితోచ్చై ర్నినా
ద రసబ్రహ్మములో నణుస్ఫురణమాత్రం బౌనె! యీ ధ్వాన; మె
వ్వరిదో ముష్టిరవంబు సంకు విది కావచ్చున్‌ నిరాశంకమై.
68
వ.అదియుంగాక యిది విరూపాక్షాలయమ్ము దెసనుండి పొడతెంచిన సవ్వడియుం గాదు; కతిపయక్షణంబులకు మాధవమధురవదనపూరితంబై వచ్చు శంఖ నిస్వానమునకు నిశ్శబ్దతనుండి నిరీక్షింత మనవుడు హరిహరుండు సరి కానిమ్మనియు నంతరాంతరమున మెదలు సంశయలేశమ్మున నట్టె యుండె, నంత-69
గీ.అలఘుమతిశాలి బుక్కరాయలపలుకుల
కచటివిబుధులు మూఁగలై యరయుచుండ
నావుపాల్పిండునంత కాలాంతరమ్ము
నీరవత ప్రాంతమెల్ల నిండారునంత.
70
మ.వినవచ్చెన్‌ బ్రణవామృతాబ్ధి విచలద్వీచీ సమాచీన నూ
తన శంఖారవధార యొక్కఁ డది తత్త్వశ్రీ గుబాళించు గొం
తున నేతెంచినదై యిదంప్రథమ మాధుర్యావధిం జూఱలి
చ్చిన నాతన్పు ముహూర్తకాలముగఁ దోఁచెన్‌ బుక్కభూజానికిన్‌.
71
గీ.తోఁచుటయు - నగ్రజునివంకఁ జూచుటయును -
హరిహరుఁడు సంకువుంచుట - యనెడిదెల్ల
జరిగె నొకసూదిమొనఁ దమ్మివిరిదళంబు
గాఁడినంతటి సుముహూర్తకాలమందు.
72
వ.శంకుస్థాపనమ్ముతో నవధాన్య నవరత్న సువర్ణంబులు ప్రోవు వెట్టి మహానగరనిర్మాణంబునకు సంకల్పించిన తోడ్తోడ హరిహరరాయసోదరులు గురుదేవులకుఁ బ్రణమింప విరూపాక్షాలయమ్మునకుఁ జనుదెంచి నవ్యనగరారంభ స్తంభాయమానులగు మాధవాచార్యుల సందర్శనం బొనరించి కృతాభివందనులగుటయు నా బుధస్వామి -73
ఆచార్యవందనము
గీ.చేసి చేయనిరీతి భాసించునొడుపు
నెఱిఁగి యెఱుఁగనిభాతి రహించుపొలుపుఁ
దొలఁకు లోలోఁతు నగవూరఁ బలుకరించి
యా సహోదరబృందమ్ము నాదరించె.
74
గీ.గురుల కంజలిఘటియించి హరిహరుండు
వినయపూర్వాభిభాషి యిట్లని వచించె :
“శ్రీమదాచార్యవరుల యాశిషము లెంచి
యొక నగరనిర్మితికి శంకు వుంచఁబడియె.
75
క.తొలినాఁటి ఋషులమేలిమి
తలఁపుల మధుపరిమళావతారంబౌ మీ
నిలువెత్తున కెది యెత్తం
గలవారము కరపుటంబుఁగాక మహాత్మా!
76
గీ.దారి కనరాక తిరుగుసోదరుల సాఁక
యవను లెదురొడ్డి నిలుచు నాహవములందు
గెలుపునిలిపిన నీ యపాంగలవ లక్ష్మి
విజయపురరాజ్యమున జయధ్వజముపొలుపు.
77
చ.అరుదగు నీ మహోద్యమమునందు రవంతయుఁగూడఁ గర్తృతా
భరమున వ్రేలువెట్టుటకుఁ బాల్పడువాఁడనుగాను; నీ కృపా
నిరతి నిమిత్తమాత్రముగ నిల్పి యిటుల్‌ విజయం బొనర్చె నీ
హరిహరుఁ డన్నవానిని; మహామతి! కేవలమాధవాకృతీ!
78
వ.మన్నించిన స్వాములసన్నిధిం జిన్నమెత్తు సందియంబు వెల్లడింప సాహసించుచుంటి; శంకుసంస్థాపనవేళా సంకేతంబుగా నీ ప్రభాతంబున నొక శంఖస్వానంబు చెవింబడియె; నంత కొక్కింత యవ్వల వేఱొక్క యారావంబు వినవచ్చె నదియ సుముహూర్త సంకేతంబుగా మాభావింపఁబడుట యటుండ నీ తొలి మలి సవ్వడుల నెయ్యెది గురుదేవుల యనుజ్ఞాస్వనంబో తెలియమి నించుక సందియం బొదవె నివారింపవేఁడెద” ననుటయు-79
చ.అనిమిషదేశిక ప్రతిభుఁ డయ్యతిమౌళికి ఱెప్పపాటులో
ననె తెఱచాటు కర్మగమనంబును గాలము నాకళింత వ
చ్చెను; వెనువెంట వెచ్చనయి చిందిన సన్ననియూర్పునుండి వి
చ్చిన పరితశ్శుచిస్మితరుచిం దులకించె భవిష్యయోగముల్‌.
80
గీ.“అద్వితీయము నిత్యమౌనట్టి ప్రణవ
శబ్దమున - బ్రహ్మమున వచ్చె సంశయాత్మ;
కలుగఁగూడని దిది; కర్మకాలనియతి
హరిహరుల కేని దాఁటంగ నయితిగాదొ!
81
ఆ.వె.వేలకొలఁదియేండ్లు వెలుఁగాఱిపోకుండ
నిలుపఁగల ముహూర్తనిశ్చలతను
కర్తృసంశయమ్ము కదలించె నించుక
విజయనగరదుర్గ విభవకలన.”
82
మ.అని దివ్యాంతరవీథిలో మెఱసినట్లైనన్, రహస్యంబు దాఁ
చిన కన్‌ఱెప్పల మబ్బు లెత్తుకొని యాశీశ్శీకరాసారమున్
దనుపందన్‌ వెదచింది - తన్నరయు విద్యారణ్యుఁ గారుణ్యపూ
ర్ణుని నాచార్యుఁ దలంచుచుం బరమధన్యుండయ్యె నాఱేఁ డొగిన్‌.
83
గీ.“విధివిహితమైన సుముహూర్త వేళయంద
జరిగెఁ గోటకు శంకుసంస్థాపనమ్ము
సందియము వీడు” మనుచు నాశ్వాసపఱిచి
గురుఁడు హరిహరు లోదిగుల్‌ పరిహరించె.
84
గీ.మఱియు వచియించెఁ దత్‌ స్థలమహిమ మిటులు
విన్నయది ఱేనిహృదయమ్ము వేడ్కపడఁగ
“హరిహరా! యీ మతంగ భూధర విశేష
మింతయని చెప్పఁ గాదు; విన్పింతుఁ గొంత.
85
మ.మును త్రేతాయుగవర్తి రామచరితంబున్‌ వాలిసుగ్రీవ గా
థను విన్నాఁడవుగాదె? వాలి నిజసోదర్యుండు సుగ్రీవుపై
ననియెత్తెన్‌ బలుసారు; లయ్యెడలఁ దా నా యన్నతో నోడి పా
ఱినవాఁడై తన ప్రాణరక్షకయి సుగ్రీవుండు భీతాకృతిన్‌.
86
ఆ.వె.వచ్చి యీ మతంగ పర్వతమ్ముం జొచ్చి
బ్రతుకుఁ దీర్చుకొనెడివాఁడు నాఁడు;
బలముగలుగువాఁడు బలహీనుఁ దెగటార్చు
చెనఁటిపనికిఁ బాలుసేయ దిచొటు.
87
గీ.వ్రాలి బలశాలి నని యిట వచ్చెనేని
వాలి తలవిచ్చు ననుచు శాపమ్మునిచ్చె
మును మతంగమహామునిముఖ్యుఁ; డట్టి
భద్రమహిమాస్పదము మతంగాద్రి పదము.
88
చ.ఇట నెదిరించి నిల్వఁగలయేపు సమర్షముతోడి చూపు ను
ద్భట బలగర్వితుండు పగవానికి సాగదు; యోగిరాట్ఛటా
జటిల తపఃప్రభావిత లసత్త్రసరేణు పవిత్రఖండ మి
చ్చొటఁగలకోట నోటమియు సోఁకదు కొన్నిశతాబ్దు లింతటన్‌.
89
మ.అని యాస్వామి వచింపఁగా విని మహత్మా! మీ కటాక్షమ్ము నిం
డిన పూర్వస్మృతి పంజరమ్ముఁ బడియుంటిన్; లోనఁ గూర్చుండి చే
యున దేముండు! శుకానువాదములు కావో రాజ్యతంత్రమ్ము; లో
యనఘా! మాకుఁ బరాశరస్మృతికి భాష్యంబున్‌ గటాక్షింపవే!
90
క.అని యెనిమిది యంగమ్ములఁ
బ్రణామ మొనరించె హరహరప్రభుఁ; డది త
జ్జనపతి యనహంతకు ద
ర్శనముగ మాధవుఁడు సంతసంపడె నెడఁదన్‌.
91
బుక్కరాయల కొలువు - నాచన సోమనాథుఁడు
మ.అనుజన్ముండగు బుక్కఱేఁడు యువరాజై వృద్ధవిద్వత్సనా
తనధర్మంబులపోకడల్‌ తెలిసి విద్యారణ్యబోధంబు సం
తన ధీరత్వముకల్మిఁ దా నెడమచేతన్‌ ధారుణీభార మె
త్తినవాఁడై కుడికేల భక్తిమెయి నొత్తెన్‌ భ్రాతృపాదాబ్జముల్‌.
92
ఉ.తమ్ములు నల్వురున్‌ సుచరితవ్రతులై కృతబుద్ధులై దిశాం
తమ్ములఁ గీర్తివైభన సితచ్ఛవి చామరపాళిఁ బూర్ణ చి
త్తమ్ముల నిల్చి వీవ బహుధాసుఖ మేలిక చూఱలాడె నె
త్తమ్ముల గద్దెపై మనసుఁ దన్పెడి రాజమరాళమో యనన్‌.
93
మ.విసపుందీవగ దక్షిణాపథ మహాపృథ్విన్‌ మహమ్మద్మతం
బెసరేఁగం గసిఁ గోసి యా హరిహరుం డేలెన్‌ స్వరాజ్యమ్ము; స
ర్వసమోదారము వేదధర్మమును నివ్వాళించి పాలించె సం
తసమారన్‌ రసికప్రజాళి తన విన్నాణంబుఁ గీర్తింపఁగన్‌.
94
గీ.పేరునకు నేలుబడి దిద్దు పెంపునందు
ధర్మపాలనమందుఁ బెత్తనము తనది;
యాత్తసామ్రాజ్య మిది విరూపాక్షవిత్త
మనెడి దృఢచిత్తమున నేలె హరిహరుండు.
95
గీ.వేదవేదాంగవిదులైన విబుధులకును
బాత్రులకు నిచ్చు వితరణపత్త్రపాళి
నఖిలశాసనముల విరూపాక్షదేవు
చివరిచేవ్రాలు - నాఁటియాస్తికత జాలు.
96
చ.ఒరవడివెట్టుచున్‌ నడచుచుండిన యన్నయెడన్‌ వినీతులై
మెఱవడిగల్గుసోదరులు మేల్కొని నూల్కొనియుండ నింక నా
హరిహరరాయభూవరున కారట మింతయులేదు సంతతిం
బొరయమి; నర్థవాద మగుఁబో! యనపత్యగతి ప్రసంగముల్‌.
97
వ.హరిహరుండు నిరవద్యచరిత్రాభిరాముం డూనషోడశ వర్షమ్ములు పాలనము సాగించి పురుషాయుషపచేళిమంబగు తనువు విడిచె; ననంతర మపుత్రకుం డగు నాఱేనివెనుక బుక్కరాయలు విజయనగర సామ్రాజ్య భద్రపీఠమ్ము నధిరోహించె.98
ఆ.వె.అతనికంటె ధన్యుఁ డాంధ్రరాజన్యుల
నుండఁ డనుట సమధికోక్తి కాదు;
సమరవీథిఁ బరులఁ జక్కాడి సాధించి
యేలవచ్చుఁగాక యెల్ల నేల!
99
శా.వీరోత్సేకత ముద్దచేసికొని యుర్విన్‌ మ్రింగుఁగా కేమగున్
గారే రాజులు! రాజ్యముల్‌ కలుగవే! గర్వోన్నతిం బొందరే!
వారేరీ! మఱి బుక్కరాయ వసుధాపాలాగ్రణింబోలె వి
ద్యారణ్యశ్రుతిభాష్య గణ్యమగు ధన్యత్వమ్ముఁ జూఱాడిరే!
100
ఉ.లోఁతులుముట్టి ప్రాఁజదువులో నవనీతముఁబట్టి లోకవి
ఖ్యాతి గడించుకోరికను గాక - మహోత్తమధర్మమర్మ సం
ఘాతము వెల్వరించు హితకామన నెత్తినవేదభాష్య వాగ్
జ్యోతికి జోతవట్టి నిలుచున్‌గదె బుక్కవిభుండు నిత్యుఁడై.
101
గీ.బుక్కరాయల యోలగమునకుఁ దొడవు
లమరవాక్కవు లాశీర్జయాళి కూర్ప
సచివపీఠము మాధవస్వామి తీర్ప
ఱేఁడు కౌతుకపడి యొక్కనాఁడు పేర్మి.
102
ఉ.పూచినవేడుకం గయితపొల్పుల ముచ్చటవెంటఁ దెన్గులోఁ
జూచిన కబ్బపున్‌ బలురుచుల్‌ ప్రచురంబుగ నెత్తిపల్కి వా
చా చతురాననుండు పరిషత్పరికీర్తిత సత్త్వమూర్తియౌ
నాచనసోమనాథ కవినాథున కాచరితప్రణాముఁడై.
103
చ.హరిహరదేవదేవ చరణాబ్జమధూళికయైన తత్కవీ
శ్వరునెద కింతదగ్గఱగ వచ్చి మహీపతి క్రొత్తవేడ్క ను
త్తరహరివంశకావ్యకవితాశ్రవణోత్సుకతా తరంగిత
త్వర యొకకొంత కట్టుకొని పల్కె గుణజ్ఞత జల్లువెట్టఁగన్‌.
104
ఆ.వె.“నలుపుఁదెలుపు గలుగు నిలవేల్పుకొలువుతోఁ
దెలుఁగుబాస నూత్నదీప్తివోసి
నవ్యభవ్యగుణ సనాథతఁ జాటి రీ
నాడుమెఱయ సోమనాథబుధులు.
105
మ.చెవులారం జవులూర నాథకవితాశ్రీ సంవిధానమ్ము మా
కుం వినన్‌ వెన్నెలవిందు; కొల్వున రసజ్ఞుల్‌ విందు; రాచార్య మా
ధవులుం గందురు బాసపల్కుపనినిద్దాకూర్ప” లం చాడ, బు
క్కవిభుం డాయెడఁ జూపుగౌరవము వేడ్కన్‌ లోన భావించుచున్‌.
106
వ.దేవరకు మా యెడలం గలభావాదరంబు లేతాదృశంబులు; మహాభారతకవితాపరాంశంబగు హరివంశోత్తరప్రబంధకథనం బిది సహృదయహృదయాభిహారకంబు కావలయు; శివస్వరూపులగు విద్యారణ్యస్వాముల చరణసన్నిధిని విష్ణుసన్నిభులగు ప్రభువుల సమక్షంబున హరిహరానుగ్రహోపాత్తవివేకపాకంబగు కవితాశ్లోకంబు వినిపింపఁగనుట పరమభాగధేయంబుగా భావింతు మని పలికి యంతరంగకృతంబైన మంగళాచరణ గురునమస్కరణాదికంబుతో నుత్తరహరివంశ ప్రబంధమ్ము వినిపించునయ్యెడ.107
సీ.సకలాగమవిశేష సారజ్ఞతకు మెచ్చి । యద్వైతభావన కాత్మ నలరి
సాహిత్య రసపోషణోహమ్ము గుర్తించి । కథనశిల్పరహస్యగతుల నెంచి
నొడికారపుంగ్రొత్తబెడఁగుల నారసి । సంప్రదాయమ్ముముచ్చటల మురిసి
యుభయభాషా సమానోపపత్తి గణించి । భావసంయమవైభవమ్ముఁ గాంచి
 
గీ.పదపదమ్మున నౌచితీభణితి నరసి । సోమనాథుని కవితలసుధలఁ దడిసి
రాంధ్రరసికులు; బుక్కరాయాధినేత । పరమరమణీయ సహృదయత్వమ్ముపోఁత.
108
చ.మతి కరఁగన్‌ రసధ్వని రమా పరమోత్తర సంవిధాన మా
కృతిఁగల కొన్నిఘట్టములకే కుతుకంబును బట్టలేక యా
నతుఁడయి సోమనాథకవినాయకుఁ గౌఁగిటఁబట్టి కొల్యులో
‘నితని కితండె సాటి’ యనియెన్‌ రసికత్వపుమెచ్చు మచ్చుగన్‌.
109
వ.అవ్వెనుక శమదమాది సుగుణసనాథులు సోమనాథులు యథోచితవచనరీతి బుక్కరాయల గుణజ్ఞతను సంభావించి విద్యారణ్యస్వాములయాశీస్సులు గడించి మహారాజసత్కృతులం గాంచి వెడలిరి. పదంపడి బుక్కభూపాలుం డొక్కపుణ్యకాలంబున నాచన సోమనాథులకు బుక్కరాయపురాభిధంబగు నగ్రహారమ్మును ధారాదత్తముంగావించె; నాఁటి వితరణమ్ము నావిష్కరించు తామ్రశాసనవిశేషవిషయం బెట్టి దనిన -110
మంజరి.నతిసహస్రము; సమున్నత శిరశ్చుంబి
చంద్రచామరున కీశానదేవునకుఁ
బ్రణతు లవ్యాహతైశ్వర్యకారునకు
వారణాననునకు - వరదాయకునకుఁ -
బంటవలంతివాల్గంటి యెవ్వాని
యంకపాళిని జూఱలాడు సుఖాళి
నట్టి తొల్లిటి కిటి యలరించు సిరులు;
కామధేనువునకుఁ గౌస్తుభమునకుఁ
దోఁబుట్టువైన చంద్రునివంగడమున
యదువు మున్‌ జనియించె; నా యన్వయమున
బుక్కాహ్వయమ్మునఁ బుట్టె శూరుండు
మంగాంబ యతనియర్ధాంగభాగ్యముగ
సంగముండను భూపచంద్రునిఁ గనియె
మూలాంబికకు సంగముఁ డనుఱేనికిని
హరిహరుండును గంపనాఖ్యుండు బుక్క
భూమిపాలుఁడు మారపుఁడు ముద్దపుఁ డనఁ
గొడుకు లైదుగురును బొడమి రింపొంద;
వారిలో బుక్కభూపాలు బీఱమ్ము
పరమహీనేతల ప్రక్కబల్లెమ్ము;
రాజాధిరాజ విక్రమకళాశోభి
యాఱేనిపురము విద్యారణ్యకృతము
బుక్కరాయల దానపూర్ణధారలను
బెరుఁగుచున్నది ధర్మతరురాజ మవనిఁ;
దారణాబ్దమునఁ జైత్రసితమ్ము నవమి
భవ్యపంపావర్తి భాస్కరక్షేత్ర
మున విరూపాక్ష దేవునకు సన్నిధిని
భవ్య భారద్వాజ పరమాన్వయునకు
అష్టభాషా కవిత్వాత్త కీర్తికిని
సకల పురాణార్థ సారమూర్తికిని
నాచనాంబుధి కళానాథున కిపుడు
కొమరారు గుత్తిదుర్గము రాజ్యమందు
శ్రీపినాకిని దరిఁ జేరియున్నట్టి
మును పెంచుకలదిన్నెయనుపేరి యగ్ర
హారమ్ము బుక్కరాయపురాభిధమ్ము
నిధులు నిక్షేపముల్‌ నిండినదాని
జల శిలాదులతోడ వెలసినదాని
నాచంద్రతారకం బనుభవింపంగ
సంతోషమున నిడె సహిరణ్య సలిల
ధారతో బుక్కభూధవమౌళి; పిదప
నాచన శ్రీ సోమనాథ బుధుండు
బుక్కభూపతి ధర్మబుద్ధికి నలరి
చిరజీవి వగుమని చేసె నాశీస్సు;
దానపాలనముల దానమ్ముకంటె
ననుపాలనమె శ్రేయమును గూర్చు సతము
వితరణం బది స్వర్గగతి నిచ్చుఁగాని
పాలనం బచ్యుతపదముఁ జేకూర్చుఁ
బరదత్త విత్తానుపాలనకలన
తన యీవికంటెను నినుమడిఫలము
నరపాలసాధారణము ధర్మసేతు
విది నిరంతరపాల్య మెంతయునంచు
రామచంద్రుఁడు కోరు రాఁబోవు నృపుల.
‘విరూపాక్ష’
111
ఉ.మించిన సడ్డమై నొరులు మెచ్చఁగఁ గాక - యముత్రవాంఛఁ గా
వించిన గుప్తదానరతిపేర్మి యలుప్తపరీమళంబు న
ల్వంచల నేలలో విరియఁబాఱఁగ నింగువగుడ్డలై గుబా
ళించిన నాఁటి శాసనములే నిజదేశచరిత్ర పెన్నిధుల్‌.
112
ఆ.వె.ఒక్కరాగిరేకుముక్కపై నలనాఁడు
చెక్కఁబడిన కొన్నియక్కరములు
బుక్కరాయలకును బుధమౌళి నాచన
సోమునకును జెల్మి సొంపు నిలుపు.
113
చ.హరిహరువెన్క నాతనికి నన్నిట మిన్నగ నిల్చుతమ్ముఁడై
యిరువదియేడువత్సరము లేల్బడిచేసెను బుక్కరాయభూ
వరుఁడు: నిజాంధ్రరాజ్యవిభవంబున హద్దులుపెంపొనర్చె ను
ద్ధుర విమతావనీపతుల తోరపుగుండెల నారగ్రుద్దుచున్‌.
114
గీ.కలదు తఱుఁగని ధనము బొక్కసములందుఁ
గలవు కోట మిన్నంటుమేడ లవియెన్నొ
ప్రకృతివర్గానుకూల్య సంపదయుఁ గలదు
విజయపురరాజ్యమున బుక్కవిభునినాఁడు.
115
వ.పరమభాగ్యశాలి యగుబుక్కభూపాలుని కుమారుండు కుమారకంపభూపతి దక్షిణంబున మధురారాజ్యముంబట్టియేలు మహమ్మదీయుల యాగడంబుల నెదుర్కొని యాంధ్రప్రజాసుఖాభ్యుదయకాంక్ష, నాయోధనమ్మున విజయలక్ష్మి నార్జించిన శౌర్యధురీణుండు; మధురావిజయకృతి కవయిత్రి కుమారకంపరాయని కందోయి కమృతవర్తిగా నుండెడిది; బుక్కరాయమహీజాని తనూభవుండగు హరిహరరాయలు జనకునివెనుక నేలుబడికివచ్చె నయ్యెడఁ గొండవీటఁ గుమారగిరిరెడ్డియు రాజమహేంద్రవరంబునఁ గాటయవేమారెడ్డియుం బరిపాలకులుగా నుండిరి; హరిహరరాయలు -116
మ.బలియుండయ్యు నెదుర్కొనన్‌ మదిఁ దలంపంబోక యా రెడ్డిరా
జులతో వియ్యపునెయ్యముం బడయఁగాఁ జూచెన్‌ రసజ్ఞుండు రా
యలు; శ్రీ కాటయవేమభూపతికిఁ గన్యారత్నమున్‌ మేలికా
న్కలతో నిచ్చెను; వారి బాంధవ వసంతం బెల్ల రగ్గింపఁగన్‌.
117
వ.ఏవంవిధ విజయనగరప్రభునందనమున నుదారమందారమగు ప్రౌఢదేవరాయల సాహిత్యగుణగ్రహణపారీణత పేరుకొనం దగినయది.118
సీ.మదపుటేనుఁగువేఁట చదురులోఁ జెదరక । పెనుపొందు తనతలంపునకు మించి
పలుదీవియలనుండి పఱతెంచురాయబా । రుల నాదరించు నిర్మలత మించి
బలిసినరెడ్డిరాజుల నరిగాఁపులఁ । గావించుకొనెడి దీక్షలను మించి
చలపట్టి బహమనీసులతాను లెసరేఁగఁ । దలపడి గెలుచు బాధ్యతను మించి
 
గీ.బహుళసారస్వత కృతార్థపరిచయుండు । ప్రౌఢదేవరాయలకు విద్వజ్జనాళి
పాండితిని హెచ్చులొచ్చులఁబట్టి కొలిచి । యామతించుట నైసర్గికాభిలాష.
119
ప్రౌఢదేవరాయల ముత్యాలశాల
గీ.న్యాయశాస్త్రజ్ఞులకును వైయాకరణుల
కఖిలదర్శన తత్త్వరహస్యవిదుల
కాలవాలము ముత్యాలశాల నేలు
రాజరత్నము శ్రీప్రౌఢరాయవిభుఁడు.
120
ఉ.కొమ్ములుదేఱు కోవిదులకుం దలవంపులుగా సమస్తశా
స్త్రమ్ములఁ బూర్వపక్షవిసరంబును గుప్పి, యనల్పజల్ప వా
దమ్ముల గెల్పువట్టి విశదంబు యశస్సునుగొన్న యాణిము
త్యమ్ములు ప్రౌఢరాయల సదస్సున వెల్గు నుదూఢరోచులై.
121
మ.కవితాగర్వము శాస్త్రగర్వము మహీకాంతాశ్రయోపాత్తవై
భవగర్వమ్మును ముప్పిరింగొనిన విద్వత్‌ సార్వభౌముండు గౌ
రవపీఠమ్మును గౌడడిండిముఁడు తీర్పంబోవ ముత్యాలశా
ల వెలుంగుల్‌ ధవళాతపత్త్రరుచిలీలాచ్ఛాయఁ దేలించెడిన్‌.
122
ఉ.పాయని పండితాదరణభావమునం గొలువుండి రమ్య ము
క్తాయతనాంతరాశ్రిత బుధప్రకరంబున హెచ్చు గౌడదే
శీయుని మెచ్చు రాయలు రుచించుట నాతని పోఁడుముల్; స్వజా
తీయతఁ బక్షపాతము వహింపఁడు సారగుణజ్ఞుఁ డెన్నఁడున్‌.
123
మ.అతివాక్ప్రౌఢుఁడు గౌడడిండిముఁడు వాక్యార్థంబుఁ గావింప ను
ద్యతుఁడై నప్పుడు మౌక్తికాలయసభాద్వాఃప్రాంతమం దున్న యు
న్నతమౌఢక్క యొకండు మ్రోఁచును; నితాంతం బైనయా మ్రోఁతతో
శ్రుతిగల్పున్; శితికంఠతాండవసదస్సున్‌ నిల్పు రాట్సన్ని ధిన్‌.
124
గీ.అష్ట దిగ్జయ పటహీకృతాతిచండ
బిరుద డిండిమ భయద డంబరత మెఱయు
నరుణ గిరినాథ గౌడభట్టరునిపేరు
త్రాఁచువలెఁ గొండవీటిపొంతలకుఁ బ్రాఁకె.
125
గీ.రెడ్డిరాజుల యేల్బడి రక్తి సడలి
నవని యలసటఁబడ్డ శ్రీనాథకవికి
దక్షిణాధీశమౌళి ముత్యాలశాల
నోలలాడిన మలయవాయువులు సోఁకె.
126
మ.పరపక్షంబులు లెక్కసేయని వయఃపాకమ్ముతోఁ బ్రౌఢ ని
ర్భరపాండిత్యము కాఁకదేఱిన కవీంద్రస్వామి శ్రీనాథుఁ డు
ద్ధురులై శిష్యులు కొంద ఱుత్సుకతఁ దోడ్తో రాఁగఁ బ్రౌఢక్షితీ
శ్వరువిద్యానగరంబుఁ జేరెఁ బరిషత్సందర్శనోత్సాహితన్‌.
127
ఉ.పంబినవేడ్కఁ గన్నడపువైఖరు లోరుచుకొంచుఁ గొల్వుఁ జే
రం బనివట్టె; ఱేనియనురాగము నూఁదినవారితోడి యా
లంబముఁ బట్టె; నంబరతలంబున మ్రోఁతలుమ్రోయు డిండిమా
డంబరగాథలుం జెవిఁబడన్‌ విననేరక నెట్టె నచ్చొటన్‌.
128
గీ.తొలుదొలుత దేవరాయల కొలువుగొన్న
కవుల కౌఁదలగా నున్నగౌడభట్ట
డిండిమునిఁ జూచె శ్రీనాథపండితుండు
తనకు నది మరియాద లాంఛనముగాఁగ.
129
ఉ.అదటఁ దాను డిండిముగృహమ్మునకున్‌ స్వయ మేఁగుదెంచి భా
వోదరనమ్రతం బ్రణతియుంచినమీఁదటఁ బల్కరింపు మ
ర్యాదలవెంట డిండిమునియాకృతిలో దురహంకృతిన్, దదీ
యాదృతిలోనిచేఁదు చవినంది పరేంగితభంగి నెంచుచున్‌.
130
గీ.లేచి చలివేవెలుంగుగాఁ దోఁచునట్టు
లార్ద్ర గంభీరమదహాస మభినయించి
వీడికొనివచ్చె డిండిమగౌడసూరి
నాంధ్రసుకవి శ్రీనాథ విద్యాధికారి.
131
క.మెలమెల్ల దేవరాయల
కొలువున శ్రీనాథుగుఱచి గుసగుస లొలయన్
బలపఱిచెఁ గొలువుచనవర
యలఘుఁడు ముమ్మకవి తన్మహాకవిఘనతన్‌.
132
మ.అనసూయమ్మగు ముమ్మసత్కవియభిప్రాయమ్ము ప్రామాణికం
బని భావించినవాఁడు రాయ లొకనాఁ డాస్థానసాహిత్యగో
ష్ఠిని శ్రీనాథున కిచ్చె దర్శనము; మెచ్చెన్‌ వైదికోదాత్తవ
ర్తన శృంగారిత నిత్యనిష్కలుష వర్చస్స్ఫూర్తి మన్మూర్తికిన్‌.
133
వ.మెచ్చి, సాభివాదబహుమానంబు శ్రీనాథమహాకవి కర్హాసనంబు వెట్టించి యతనివలన దేవభాషాకవితామహాశీస్సు లందుకొనియె; శ్రీనాథుండును సుధాభిషేకమాధురులు చిలుకు దక్షిణాధీశ్వరు తొలిచూపులం దడిసి తనుపువడి ధీరవినయోచితరీతిం దన కవితావైదుష్యంబు లించుక తారకాణగాఁ బ్రసంగించె; నాఁటి కవిరాజసమాగమారంభము క్షేమకరంబుగా ముగియుటయు -134
శ్రీనాథ డిండిముల శాస్త్రార్థప్రౌఢి
మ.అవనీపాలుని యానకల్మి మఱునాఁ డాస్థానముక్తాసభా
భవనప్రాంగణవీథి నొక్కకొలు వేర్పాటాయె; నచ్చోట శా
స్త్రవివాదమ్ము కవిత్వవాదము సముద్దండించి చూపన్‌ జిగీ
షువులై యిర్వురు ధీరతాభ్యుచితవేషుల్‌ చేరి రుద్గ్రీవులై.
135
వ.వారిలోఁ గవిసార్వభౌమ బిరుదభీకరులైన గౌడభట్టారకుల వారొకరు; వేఱొకండు బ్రాహ్మీదత్తవరప్రసాదుండు తెలుంగు కవిరాజు శ్రీనాథుండు; నయ్యిద్దఱ శాస్త్రవైదుషీకవితాశేముషీవిశేషంబులు వివేకించి, గెలుపోటములు నిర్ధారించి వెల్లడించుటకుఁ జంద్రభూషక్రియాశక్తి మహోపాధ్యాయు లాచార్యపీఠంబు నలంకరించియుండిరి; వజ్రాసనాసీనుండు ప్రౌఢదేవరాయల సన్నిథిని వాదోపక్రమణంబునకు సభాపతి యోంకృతి వలుకుటయు -136
గీ.మ్రోఁగె వెనువెంట వినువీథి ముట్టునటులు
గౌడడిండిమ భట్టారు కంచుఢక్క;
యాస్వనంబున జతగల్పి యందుకొనియె
శాబ్దమున నొక్కపూర్వపక్ష మ్మతండు.
137
ఉ.ధాటిగ దానినెత్తినవిధానములోఁ బృథుశేముషీ సము
ద్ఘాటనభంగిలో ముఖపిధాన మొనర్పఁగ నెంచు గౌడు నా
స్ఫోటన మిట్టె తేల్చుకొనుచున్‌ వినుచున్‌ గవినాథమౌళి తా
నోటమి మాటయే వినని యుద్భటుఁడై కనుపట్టె నాసభన్‌.
138
ఉ.ఆయెడఁ గొల్వుపండితుల కచ్చెరుపాటుగఁ బూర్వపక్షమున్
వేయఁగ నిచ్చి డిండిమకవిం గని “పెద్దలముందు మాది లేఁ
బ్రాయముగాన మే మడుగవచ్చుట మీరలు చెప్పఁజొచ్చుటల్
నాయముకాదె! సందియములన్‌ మముఁగోరఁగనిండు ముందుగన్‌.
139
చ.అని యొకభాష్యపంక్తి నరుదారఁగ నొక్కటనెత్తిపల్కి మె
త్తనిపులి నాథపండితుఁడు దానిసమన్వయ మెట్టులంచు వేఁ
డిన - నది వాఁడితూపువలె డిండిముచూపును దూసిపోవుడున్
గనుకని కొల్యుకోవిదు లెగాదిగఁ గాంచిరి తత్తరించుచున్‌.
140
గీ.అంత శాస్త్రార్థ నిర్ణయాధ్యక్షుడైన
చందభూషక్రియాశక్తి సాధువృత్తి
డిండిములతోడ గడుసుఁబోఁడిమికిఁ బోవు
తెలుఁగుకవిరాజు శ్రీనాథువలనుఁ గాంచి.
141
వ.అయ్యా! డిండిమభట్టారులు తొట్టతొలుత నెత్తుకొన్న పూర్వపక్షంబున కుత్తరంబు మీరు పలుకవలయును; పదంపడి మీ చూపిన మహాభాష్యపంక్తి వారు సమన్వయపఱుతురు; ముందు వెనుక నందుకొనుటకు వయోభేదంబుఁ బాటించుట మా సభాసంప్రదాయము కాదు; మీ యుత్తరపక్షంబు వినిపింపుఁ డనుటయు శ్రీనాథవిద్యాధికారి ధీరమందస్మేరవదనుండై సరియ - మా పంక్తిసమన్వయము శ్రీవారు విచారించులోన నట్లె కానిత్తు మని-142
మ.కనుఁగొంచున్‌ సభవైపు డిండిములపక్షంబెల్ల సంక్షేపతః
పునరుద్ఘాటితముం బొనర్చి బెడిదంపుంబెంపుతో నభ్రగ
ర్జనగంభీర రవంబుతోడ ‘నిద మాస్తా’ మిత్యుపక్రాంత వా
ద నిరూఢిం బరిహారపక్షరచనా తాత్పర్యధౌరేయుఁడై.
148
శా.శ్రీనాథుండు కవీంద్రుఁ డందుకొని పేర్మిన్‌ స్వీయపక్షంబు శ్లో
కానీకమ్మున నాశుభంగి బదులీయంబోవఁగా డిండిముం
డా నేర్మిన్‌ మది మెచ్చి నొచ్చుకొనె; సభ్యశ్రేణి శ్రీనాథులోఁ
బాణిన్యాది సమష్టిరూపరుచి తోఁపన్‌ మోడ్చె గుప్తాంజలుల్‌.
144
ఆ.వె.గౌతమీయమందుఁ గాణాదమందును
బాదరాయణమునఁ బట్టు లంది
గౌడభట్టు విసరఁ గవనఖేలనమున
బదులుపలికె నాథపండితుండు.
145
వ.తిరుగఁబడి శ్రీనాథుండు వేసిన యొండు రెండు పూర్వపక్షంబులకు డిండిముఁడు ఝడితిస్ఫురణంబురామి నుత్తరంబు లీయనేరకయుఁ దొలుత నిచ్చిన పాతంజలమహాభాష్యపంక్తి సమన్వయింపంజాలకయు నొచ్చుకోలువడియె; దానంజేసి శ్రీనాథభట్టారుల బ్రాహ్మీదత్తవరప్రసాదోచ్ఛ్రయమ్ము నెదుర డిండిమునిపాండితీడంబరము డిందువడినట్లు తోఁచుటయుఁ జంద్రభూషక్రియాశక్తి యధ్యక్షపీఠమునుండి లేచి -146
గీ.ప్రౌఢవిభుని గుణజ్ఞతాప్రవణుఁ జూచి
పలికె నిటు ప్రక్కపాటు చేడ్పడనితీర్పు:
“నేఁటి శాస్త్రార్థమందు డిండిములమ్రోల
నిలఁబడిన యుగ్రుఁడైనను నెగ్గిరాఁడు.
147
ఉ.సందియమేల! డిండిమవచఃపరిపాటి కరాళధాటికిన్
ముందఱ వచ్చి నిల్చినదిపో గెలు!; పట్టిదికాక, సింధువున్
మందరమట్లు శాస్త్రములమట్టు మథించిన వైదుషీసుధా
నందులు నాథపండితు లనన్‌ గనుఁగొంటిమి శ్రీసదస్సునన్‌.
148
మ.లలితోదాత్త రసోల్లసత్కవన లీలాఖేలనప్రౌఢి ను
జ్జ్వలశాబ్దాదిక శాస్త్రవీథులను సంచారించు విద్యాసనా
థులు శ్రీనాథులు; వీరి నర్హపదమందు న్నిల్పి స్వర్ణాభిషి
క్తులఁ గావించుటకంటెఁ జేయనగువిందుల్‌ చాల విప్పట్టునన్‌.
149
గీ.అనుడు విని చంద్రభూషవిద్యాధిపతుల
తగినతీరుపు తనలోని తలఁపుతోడ
జతపడఁగ బ్రౌఢరాయభూపతుల నోటఁ
బలుకు బంగారముగ ముత్తెములుగ రాలె.
150
మ.“తొలి మే మీగతి నొక్కయెత్తు నొకపొత్తుం గల్గు శాస్త్రార్థపుం
బలుకుల్‌ విన్నవి కావు; నేఁటి కిటు లా భాగ్యంబు కల్గెన్‌ గృత
జ్ఞులమై యుందుము పండితద్వయికి; నిచ్చో విజ్ఞతోదార ని
ర్మల మీ తీర్పున కేము వీరు సభయున్‌ మాఱాడ నేముండెడిన్!
151
గీ.కవులలో సార్వభౌముఁ డొక్కండె వలయు
నతఁడె కనకాభిషేకపూజార్హుఁడగుటఁ
గొలువు పండితులగు డిండిములయనుజ్ఞ
నడపుకొందుము మేము శ్రీనాథపూజ.”
152
వ.అని వచించుటయు నౌచితీసమంచితమగు విద్యానగరవిభుమౌళి మహౌదార్యంబునకుఁ బండితకోటి సంభృతానందంబునంబొందె; శ్రీనాథమహాకవియు వినయభారోదరపాండిత్యగౌరవంబున వినమితశీర్షుం డాయె; నాయెడ గౌడడిండిముండు తన యామోదమ్ము మౌనకమనీయ గభీరహాసంబున నావిష్కరించి చంద్రభూషక్రియాశక్తిచే నభినందితుఁడైనంతఁ గొలువు ముగిసెఁ; గర్ణాటాధీశ్వరు నాజ్ఞచే నొక్కపుణ్యహమ్మున - 153
కవిసార్వభౌముని కనకాభిషేకము
గీ.ఆంధ్రకవిసార్వభౌమ హేమాభిషేక
పరమసమ్మాన మంగళాచరణగాన
వాద్యనిస్వాన మదియొక్కస్వాతివాన
తనుపుగా మొగ్గవిచ్చె ముత్యాలశాల.
154
సీ.కస్తూరికాపుండ్రకమ్ము దిద్దినమేలి । పస చిందులాడు నెన్నొసలివాఁడు
తారహారముల ముత్యాలపేరులమ్రోలఁ । గొమరారు తెలిజన్నిదములవాఁడు
రత్నాంగుళీయక ప్రభకు శోభలుతీర్చి । విలసిల్లు కెంజేతివ్రేలివాఁడు
చెలువారు పైఁడిపువ్వులు కుట్టినంచుల । పట్టుసాలువ వలెవాటువాఁడు
 
గీ.ఠీవి గలవాఁడు - శంభుసేవా వివేక । సాధుశీలమ్మువాఁడు శ్రీనాథవిబుధుఁ
డచ్చమగు తెల్గునొడుపు ముందడుగు లిడఁగ । వెడలెఁ గనకాభిషేకపుం బెండ్లికొడుకు.
155
చ.అడఁకువవాఱ భక్తి పెనుపారఁగ దేవనృపాలమంత్రి చూ
పెడు పువుబాటలో నడుగువెట్టుచుఁ గన్నియలెత్తుహారతుల్
పొడవగుకూర్మి నందుకొనిపోవుచు సూరెల బారుదీఱి చే
రెడు కవిబృందముం గనికరించుచు ముచ్చటలూర్చునయ్యెడన్‌.
156
మ.తనకున్‌ స్వాగమనంబుపల్కి మృదుహస్తద్వంద్వసంస్పర్శనం
బునఁ దేలించిన వృద్ధడిండిమునిచొప్పున్‌ మెచ్చి శ్రీనాథుఁ డె
త్తినయంఘ్రిన్‌ గరుణాఢ్యచిత్తుఁడు సముద్దిష్టంబు పీఠంబుపై
నునిచెన్‌ మెల్లన వందిగీత జయగాథోత్సేధమధ్యంబునన్‌.
157
గీ.ప్రౌఢపతిమౌళి కుచ్చుతురాయిచుంగు -
నల ‘క్రియాశక్తి’ మేని వెన్నెలహొరంగు -
సకల కవిసార్వభౌమోపచారమునకుఁ
గుడియెడమవైపు వీచోపువడువు లయ్యె.
158
చ.కలిత శివార్చనైక రసికమ్మగు శ్రోత్రియతేజ మొండు ని
ర్మలము సముజ్జ్వలంబునగు మౌక్తికశాలకు లో వెలుంగుచున్
వెలిగొడుగుంబెడంగుఁ దలఁపించె; నుదంచిత సార్వభౌమతా
కళ కవినాథులో నకృతకంబు స్వతోజనితంబునై తగెన్‌.
159
మ.కరమానందముకల్మిఁ దెల్గుకవులుం గర్ణాటసూరుల్‌ బరా
బరులై తా మరిగాఁపులట్లు సభదీర్పన్‌ నర్తనప్రౌఢలౌ
తెఱవల్‌ కొందఱు మందముగ్ధగతులన్‌ దీనారటంకాల ప
ళ్ళెరముల్‌ చేతుల నందిపుచ్చుకొని యోలిం దెచ్చి రాస్థానికిన్‌.
160
గీ.మేలిముత్యాలశాల యన్‌ పాలకడలి
నురలివచ్చిన పుత్తడిసిరులు మోసి
యితఁడు శ్రీనాథుఁ డగునుబో యింక ననుచు
వేసికొనె డిండిముఁడు మెల్ల విసపుగుటక.
161
వ.హేమాభిషేక సంభారములు తుంగభద్రా గౌతమీ కృష్ణాది నదీతోయంబులు సమానీతములైనవెంట హృద్యమంగళవాద్యంబులయు విబుధులసాధువాదంబులయు భూసురస్వస్తివాచనంబులయు తియ్యనిసవ్వడిలో మహోత్సవ పర్యవేక్షణ పీఠాధ్యక్షుండు చంద్రభూషక్రియాశక్తికోవిదులగు సభాసదులం గనుంగొని మధురోచ్చైస్స్వరంబున -162
గీ.“డిండిమబుధేంద్రు నలఘుపాండితిని గెలిచి
కవులలో సార్వభౌమతఁ గన్న మేటి;
యితని వ్యుత్పత్తి నెఱిఁగి ప్రౌఢేశ్వరుండు
చేయుచున్నాఁడు స్వర్ణాభిషేకపూజ.”
163
వ.అని పలుకునంత విజయనగరమహీకాంతుండు దేవరాయలు శ్రీనాథకవిసార్వభౌమున కాభిముఖ్యంబు వహించి తనపజ్జ నొకతరుణి కరయుగంబునం బట్టియున్న యపరంజిపళ్లెరంబున నంజలి ముంచి తీసి కడానివిరులం గవిశిరమ్ము నభిషేకించె; వెనువెంటఁ జంద్రభూషక్రియాశక్తి మగుడ సభ్యుల నరసి గంభీరతరస్వరంబున -164
గీ.“పౌఢ నరపతి తనయేలుబడినిఁ బుడమి
నేఁడు శ్రీనాథుసరి వేఁడు లేఁడటంచు
నీ త్రిలింగ కవీశున కిపు డొసంగుఁ
గనక కుసుమ మహాన్యాస గౌరవంబు.”
165
వ.అని యతండు పలుకునంత నా తెలుంగునేలిక యనల్పసంకల్పమున రెండవదోయిట దీనారమ్ము లందుకొని శ్రీనాథు నుత్తమాంగమ్ముఁ దీర్థమాడించుటయుఁ జంద్రభూషక్రియాశక్తి మరల సదస్యులం బరికించి పేరెలుంగున -166
గీ.పదనుగలకైత యొకకొమ్ము వాఁడిదేఱి
యున్న వైదుష్యవైభవ మొక్కకొమ్ము -
కాంతిరమ్యము శ్రీనాథ కామధేను
మౌళితలమున జాళువా పూలదిమ్ము.
167
వ.అని పలుకునంత నొడయండు తృతీయాంజలిం గయికొన్న జాంబూనదప్రసూనంబులు వోసి శ్రీనాథమహాకవిని మూర్ధాభిషిక్తు నొనరించుటయు -168
చ.పరిగొనివచ్చి మంతిరులు పళ్ళెరముల్‌ కయికొంచు వేడ్క బం
గరు విరివానలం గురియఁగాఁ దలమున్కల సార్వభౌముఁ డ
య్యురవడి గౌరవంబునకు నుబ్బియు నుబ్బక శారదా దయా
వరణములో నొడల్‌ దులిపివైచి కనెన్‌ నవజాతరూపమున్‌.
169
వ.అట్టి మహోదయావసరంబున-170
క.శతమానం భవతీతి
శ్రుతిపాఠ పురస్సరద్విశుద్ధమహీదై
వత కృత మహదాశీస్సం
భృతాక్షతలఁ దోఁగి లేచి శ్రీనాథుఁ డొగిన్‌.
171
వ.పెద్దల కెఱంగి ప్రౌఢరాయమహీనాథుదెస నరసి యానందబాష్పాభిషేకమ్మున నాఱేనికృతమ్ము సంభావించుచు నిట్లనియె.172
చ.నరవరమౌళి! యొక్క కవినాథుని యౌదలఁగాదు - శారదా
చరణములందుఁ బాద్యము నొసంగితి వర్ఘ్యము నెత్తుకొంటి వి
త్తఱి : మఱియింతకంటె నొకధన్యత నీకును నాకు లేదు: బం
గరునకుఁ దావిపొంగు తొలఁకాడెను నీకతనన్‌ దెనుంగునన్‌.
173
వ.మఱి యింతకుమించి యీ కల్యాణోత్సవానంద సమ్మర్దసమయంబున డెందంబు విప్పఁగలిగినది లే దని యథోచితమ్ముగం బలికి యూరకుండె; నా యెడ రాజనియుక్తులు కొందఱు లేచి -174
మ.ప్రభురత్నమ్మగు దేవభూపతి యపారప్రీతి శ్రీనాథుపై
నభిషేకించిన శాతకుంభమయ పుష్పానీకముల్‌ భక్తి సౌ
రభపూర్ణంబులు రాశిచేసి యరుదారన్‌ నిండుదోసిళ్ళతో
సభ విద్వాంసులకెల్లఁ బంచిరి సమంచద్గౌరవోదారతన్‌.
175
గీ.జాదులు ప్రసాదములుగాఁగ స్వర్ణకుసుమ
విసరముఁ బరిగ్రహించిన విబుధవరుల
ప్రమద బాష్పాంబువుల మెత్తఁబాఱెనేమొ!
యుక్కుసెడి పల్క దిఁక లోహఢక్క యెపుడు.
176
గీ.దురితహరములు నాథపాదుకలు గొనఁగ
సుమహిత సువర్ణమంత్రపుష్పముల మెఱయు
కరపుటంబులతో నిల్చుఘనుల నొలసి
యలరె ముత్యాలశాల దేవాలయముగ.
177
సాళువాభ్యుదయము
సీ.సకల విశ్వఖ్యాత సామ్రాజ్య సంస్థాప । నమున కేయది నిదానముగఁ బొలిచెఁ
దొలినాఁటి భారతీయుల యార్షధర్మమ్ముఁ । గాపాడ నేది దీక్షఁగొని నిలిచె
నమరాంధ్ర భాషా మహాకవీశ్వర వీథి । నేయది పూవుదోయిళ్ళు వట్టెఁ
జెనఁటి ధర్మముల మున్కొనఁజేయు పగఱేండ్ల । యడవిలో నేది కారగ్గిపెట్టె
 
గీ.నేది హరిహర బుక్కరాయాది రాజ । సముదయముపొంగునకుఁ బాలసంద్ర మయ్యె
నట్టి సంగమ వంశవిఖ్యాతి కడకు । భౌతికతఁ బాసి యక్షరజ్యోతి నెనసె.
178
గీ.సృష్టిలయములు రెండు నాచేత నుండు
నను నుదాహృతికై విరూపాక్షదేవుఁ
డటులు కావించె నన సంగమాన్వయమ్ము
చెడె “విరూపాక్షరాయల”చేతఁ గడకు.
179
వ.సంగముల వంగడంపుఁ జెట్టుకుదురు కదలి తలవాల్చుటయును సాళువ సంతానంబునం దవతరించిన సంగమ ధరణీదారులకడ సరదారులై వారి నెయ్యంబు గడించినవారు క్రమంబుగ విజయనగర రాజ్యంబున కేలికలైరి; సాళువాభ్యుదయం బీయెడ స్మరణీయంబగు కృతి; యా వంగసమున నభంగపరాక్రముండగు గుండదేవుండు తొలుత వెలసె; నతని కుమార షట్కమున మంగిదేవుండు లబ్ధప్రతిష్ఠుండయ్యె; నవ్వీరుని యనుజునకుం దనూజుండు గుండరాజు యశఃపయోధి; యతనికి మల్లాంబికయం దుదయించిన నరసింహరాయలు కీర్తిసాంద్రుం డతండు.180
చ.అవితథమైన స్వోద్యమమునం దనవద్యత మూదలించి గౌ
రవముఁ దలంచి యేల్బడి హొరంగులు చక్కఁగ దిద్దుకొంచు సా
శువ నరసింహరాయలు తెలుంగుల పున్నెపుఁ బ్రోవు వోలె నే
లె విజయపట్టణాబ్జము ఫలించిన రాజ్యకళా హరిప్రియన్‌.
181
చ.కటక పురాధినాయకుఁడు కాంచిని ముట్టుకొనంగ వచ్చె ను
ద్భటతరసైన్యధుర్యత నదాటుగ; నాయెడఁ దీవరించి మి
క్కుటపుమగంటిమిం బెనఁగి కోల్తల నెక్కటి గండరించుచున్
దిటవఱఁజేసె నగ్గజపతిన్‌ జితకాశి నృసింహుఁ డేపునన్‌.
182
మ.ఇటు వీరత్వమునన్‌ గవిత్వమునఁ దానే ముందు ముందుంటి న
న్నటు లాఱేఁడు మెలంగుచున్‌ గళలకుం బ్రాణంబునై దేవవా
క్పటువై కబ్బము లల్లెఁ; గొల్వు వికసింపన్‌ వాణి సేవించి యూ
ఱటముం బొందిన వీరభద్రకవి నారాధించె సారజ్ఞతన్‌.
183
వ.చారుకీర్తిధౌరేయుండు సాళువ నరసింహరాయలు తనకొల్వుఁ గూటంబునం గల కవికోటి నగ్రకోటి నందిన పిల్లలమఱ్ఱి పినవీరభద్రకవి రచించిన జైమినిభారతం బశ్వమేధపర్యం బంకితంబుగాఁ బడసెఁ; దత్‌ప్రబంధకథనవైచిత్ర రసికరంజక మైనయది;184
గీ.ఆంధ్రసాహిత్యకవితా రసాభిషేక
కేళి నొకనాఁడు సంస్థానపాళిఁ దీర్చి
సాళ్వ నరసింహ వసుమతీచంద్రమౌళి
కొలువుకవి వీరభద్రుకోర్కులు తలిర్ప.
185
మ.పలికెన్‌ గౌరవబంధురమ్ముగఁ బ్రియాహ్వానమ్ము రంజిల్లు నం
జలిబంధమ్ము రచించి యీగతి సభాస్తారుల్‌ ప్రమోదింప, ను
జ్జ్వలకీర్తీ! పినవీరభద్రకవిభూషా! నీ గుణోదార ని
ర్మలవాచా రమణీయ కావ్యరసధారల్‌ మమ్ము నూరించెడిన్‌.
186
క.“మామది నిరతము భారత
రామాయణకథల నెనరు రంజిలు; నందున్
జైమినిభారత మనఁగా
భూమి నపూర్వము పురాణముల గణియింపన్‌.”
187
ఉ.కమ్మనమించుతెల్గు నొడికారపుఁగూర్పున నశ్వమేధప
ర్వమ్ము ప్రబంధఫక్కి తనరన్‌ రచియించినఁ గుందనమ్ములోఁ
గమ్మఁదనంబు చిందునటుగాదె కవీశ్వర! గద్య పద్య బం
ధమ్మున నిన్నుఁ జెప్పినపదంపడి యన్యులఁ జెప్పఁగావలెన్‌.
188
క.అని ఱేఁడు కోరకితమౌ
తనలోపలితలఁపు కుసుమిత మ్మొనరింపన్
బినవీరభద్రకవి నె
మ్మనము పరిమళించెఁ జతురిమంబున నంతన్‌.
189
చ.ఒడయఁడు ముచ్చటించి సబహూకరణంబుగ నిచ్చినట్టి య
య్యుడుగర లంది సొమ్ములు యథోచితమౌ కపురంపుఁదమ్ములం
బిడఁ గయికొంచుఁ గావ్వరచనేప్సితముం గుసుమింపఁజేయుక్రొం
బెడఁగు వెలార్చి సాళ్వ పృథివీపతికోర్కి ఫలింప నిట్లనెన్‌.
190
ఆ.వె.“శ్రవణపర్వమైన సరసంపుఁ దలఁపులో
డాఁగు నశ్వమేధ యాగఫలము
ఖిలముగాక మాకు వెలయింపఁబంచిన
వాఁడవైతి తెల్గుఱేఁడ! నేఁడు.
191
గీ.అరయ జైమినిభారతాంబరపువీథి
కెగసి విహరింపఁ బక్షంబు లెన్నివలయు!
నొక్కనెలలోనఁ బ్రభువులకున్నవాంఛ
వెన్నెలలు నించునట్లు కావించువాఁడ.
192
చ.అని పినవీరభద్రకవి యాడినబాసకు సాళ్వనేత జీ
వనమునఁ గీర్తిముద్ర చెలువంబు వడం బొడఁగాంచి యారవి
చ్చిన విరివోలెఁ గొల్యుపొలిచెన్; జయమంగళమంజుగాన ని
స్వనమధుతుందిలోర్మికలపై నిలిచెన్‌ గవిరాజచిత్తముల్‌.
193
వ.అమ్మఱునాఁటినుండి కబ్బంపుఁగ్పూరున డెందంబు నిబ్బరించి యుండవలసినవాఁ డటులుకాక వాగీశ్వరీ పదపద్మసేవాధురంధరుండు పినవీరభద్రుండు తొల్లింటియట్టు లలవోక మెలంగుచుండ నొకనాఁడును -194
మ.చతురాస్యుండగు నావిచక్షణుఁడు సంస్థానమ్మునన్‌ సాళ్వభూ
పతితో నాడినబాస వెండియుఁదలంపంబోఁ; డహోరాత్ర పూ
జిత వాణీ చరణాంబుజాత యుగళశ్రీకున్‌ రసాలోక ని
ర్జితసర్వస్వునిఁ దత్సహోదరునిఁ బేర్మిం గూర్మి నీక్షించుచున్‌.
195
వ.ఆతని యన్న పెదవీరన్న యిక్కరణిం బలికె.196
మ.అనుజా! యేమిది! సాళ్వవీర నరసింహస్వామి డెందానఁ జం
దన గంధంబు నలంది యీ కొలము పెద్దల్‌ ముద్దుసేయంగఁ దం
డ్రిని తాతన్‌ దలఁపింపఁజేయు దనుకొంటిన్; నేఁటికిన్‌ గంట మె
త్తినయట్లే కనిపింప దెన్నఁటికిఁ బూర్తింజేయు దీ కబ్బమున్!
197
గీ.భవ్యసంహిత జైమిని భారతంబు
తెలుఁగు సేఁతకునై యొక నెలయె గడువు
కొలువునన్‌ నాఁడు దర్పించి కోరుకొంటి;
వది మఱచినట్లె యుంటి వియ్యదను గెంటి.
198
చ.సుమహితమైన దీక్షఁ గొనుచున్‌ గవితారచన మ్మొనర్ప గం
టము కదలింపకున్న నకటా! యొకనాఁటికి నచ్చియున్న క
బ్బమె యిది! తెల్లవాఱిన సభన్‌ బ్రభుసన్నిధి కెట్లుపోక! లో
కముమొగ మెట్లు నీవు కవిగా నిఁకఁ జూచెద వోసహోదరా!
199
క.అని కూర్మియలుకఁ బల్కిన
తన యన్న యెడందఁ దొనఁకు తాత్పర్యము మె
చ్చినవాఁడై పినవీరన
వినయాంజలి మెఱయ నిటులు వినిచెఁ గడంకన్‌.
200
శా.“అన్నా! యీ వెఱపేల! యిట్టి దిగు లేలా! భారతీ తీర్థ వి
ద్వన్నేతృ ప్రథమాదరోదయ సమృద్ధ స్వైర సాహిత్య సం
పన్నుండైన యనుంగు సోదరుని కబ్బం బెల్ల ఱేపాడి కా
దన్నం జూచెదు తెల్గు జైమినినిఁకేలా! దొల్త మీమాంసలన్‌.
201
గీ.పలుకుఁగలికి యపాంగ రేఖలకు నోఁచు
కవికి నొకరేయి చాలదో కావ్యరచనఁ!
గుకవి మల్ల కషోల్లస త్కులిశ పాణి
పల్లవుఁడ, నా యెడాటమ్ము వలకు శంక.”
202
వ.అనుటయుం బెదవీరన్న చిత్తంబు ధీరస్మేరం బయ్యె; నాఁటి సాయంసమయమున మఱంది యభిలషితంబు మెయి మాతృమూర్తింబోని యతని ప్రజావతి శ్రద్ధాన్వితయై.203
పినవీరభద్రకవి : వాణీకటాక్షము
ఆ.వె.శుభ్రపఱిచె నొక్క సువిశాలమగు గది;
నేల గోమయమ్ము నీట నలికె;
లగ్గు మురిపె మొలుక మ్రుగ్గులు తీరిచెఁ
బఱచె నచొట మేలివస్తు వితతి.
204
మ.గదిలోనస్‌ గవితా శిశూదయ సమీక్షా సాక్షిభూతంబు లా
ముదపుం దివ్వెల నిర్మలద్యుతుల సొంపుల్‌ పర్వె; నచ్చోట శా
రద సాక్షాత్కృతిఁ గోరి భావుకత చేరం బోవు నన్నట్లుగాఁ
గదలెన్‌ మెల్లగ నన్నకున్‌ వదినెకున్‌ గాంక్షా పరిస్ఫూర్తిగన్‌.
205
గీ.జగము సృజియించు క్రొత్తముచ్చట జనింప
నబ్జయోని సమాధిస్థుఁడైన నాఁటి
తొంటి తలఁపేదొ వీరభద్రునకు నంటె
బహు జనుఃప్రాప్త సుకృతమ్ము పంటగాఁగ.
206
ఉ.నిద్దురగాని మేల్‌ నిదుర నీడకుఁ జేరె నుపాసనైక సం
పద్దశ నందుకొన్న కవి భద్రుఁడు; నాయెడ నల్మొగంబులన్‌
నిద్దపుఁగూర్మి తోఁచి కమనీయ మహస్సొకఁ డేదొ లేచి క్రొ
మ్ముద్దులగుమ్మరూపు పొలుపుల్‌ వెలయించె నిశాంతకాంతమై.
207
గీ.వాణి దయకల్మి సుకవికి భద్రనిద్ర;
యామె దయలేమి కుకవికి నంతులేని
మొద్దు నిద్దుర; తెలియని మొఱకు మదికిఁ
గుకవి సుకవుల నిద్ర లొక్కొడుగఁ దోఁచు.
208
మ.తనలోనం బినవీరభద్రు నొక నిద్రం బుచ్చి, యవ్వాని పా
ణినిఁ దానై నడపించి గంటమును దానే యంటి, యన్నింట నా
తనికిం దానయి యశ్వమేధము ప్రబంధంబుం బురాణించె జై
మిని మూలంబగు భారతంబుఁ గొని నేర్మిం దెల్గు సొంపారఁగన్‌.
209
చ.గడియకు నూఱు పద్యములుగా వడిపెంపునఁ గూర్పుసాగు న
య్యెడ - నతఁ డున్నతీరు రచియించెడితీరును జూడఁ గోర్కి పు
ట్టుడుఁ బెదవీరభద్రుఁడు కడుంగడు నాదటఁ దల్పుసందు క
న్నిడి పరికించె నొక్క పరమేడిత దివ్యమహః ప్రరోహమున్‌.
210
గీ.అంతలో నది సోదరుం డగుట నెంచి
వింతవిడి, తాటియాకుల దొంతు లరసి
కదలు గంటమ్ము బాణవేగమ్ముఁ దెలిసి
తన సగర్భ్యుని కూర్పుఁదీర్పునకు మురిసె.
211
చ.పలపలఁ దెల్లవాఱుతఱి భారతమున్‌ ముగియించి యోగ ని
ర్మల మగు నిద్దురన్‌ విడిచిరా ననుజుండటు మేలుకొన్న సొం
పులు గని, యశ్వమేధ ఫలమున్‌ గడియించిన నారసింహ రా
యల సుకృతంబు నెన్నుకొనె నప్పెదవీరన లోన సన్నుతిన్‌.
212
వ.అట్టియెడ జైమినిభారత కృతిస్వీకరణ మంగళదివసంబు చేరవచ్చుటం బ్రమోదించుచు సాళ్వనరసింహ మహీజాని మంత్రిమణులగు తుళువ నరసరాజును చిట్టిగంగనామాత్యునిం గానిపించుకొని పినవీరభద్రకవి నామతించుకొని రా నాజ్ఞాపించె; వారును సప్రాభృతం బవ్విబుధుని స్వర్ణ శిబికారూఢుం గావించి కొల్వునకుం గొనివచ్చుటయు సాళ్వపతి యతని నర్చలం దనిపి సంస్థానీవిద్వత్సమక్షంబునం గృతి వినిపింప వేఁడె నపుడు.213
సీ.పరఁగంగ మల్లమాంబా కుమారునకు సో । మ కులాంబునిధి పూర్ణిమా విధునకు
భరితకీర్తికిఁ దులాపురుషాది దానాంబు । జంబాలితాస్థాన సౌధునకును
బరరాజభీకర ధరణీ వరాహున । కాత్రేయగోత్ర పవిత్రునకును
గుండయ నరసింహ మండలేశ్వరునకు । నభ్యుదయ పరంపరాభివృద్ధి
 
గీ.కరముగా భారతీ తీర్థ గురు కృపా స । మృద్ధ సారస్వతుఁడు సత్కవీంద్ర సఖుడు
కుకవి మల్ల కషోల్లసత్కులిశ హస్త । పల్లవుఁడు చెప్పెఁ బినవీరభద్ర సుకవి.
214
గీ.చెప్పి యర్పించె నాఱేని శ్రీమదమల
కీర్తి హర్మ్యాగ్రతలమునఁ గీలుకొల్పు
వైజయంతిక జైమిని భారతమును
సహృదయ హృదంబరైక సంచరణ వాంఛ.
215
వ.కావ్యంబు నాలించి య క్కవిరాజునకు వెలిచామరంబులు సితాతపత్త్రంబు మణిభూషణంబు లగ్రహారంబు గజాశ్వంబులు పసదనం బిచ్చి మెచ్చుటయుఁ గొల్వునందలి కొందఱు దోషజ్ఞులు వీరభద్రు నవలోకించి.216
ఉ.“మొన్నటిదన్క గంటమును ముట్టిన జాడయె లేదు; కబ్బ మీ
వెన్నఁడు సంతరించి ముగియించితి వో పినవీరభద్ర! యీ
తెన్నుఁ దలంప వింతగుఁగదే! యిది యింతటఁ గూర్చుపట్టునం
దెన్నికఁ దోడుపా టొసఁగె నెవ్వఁడు? వాని నెఱుంగఁ జెప్పవే!”
217
క.అని చనవున వా రడుగుట
యును సాళ్వవిభుండు దాని కుత్తర మెటు వ
చ్చునొ యనుచున్‌ సకుతూహల
మనస్కుఁడై కవినిఁ జతురిమంబున నరయన్‌.
218
గీ.అపుడు కొలువునఁ గల తన యన్నవంకఁ
బిన్నవీరన్న సాకూత బిరుద భరిత
హసిత నేత్రాంచలమ్మున నరసి తెలిసి
యెదిరివారల కలవోక బదులు పలికె.
219
గీ.నలు మొగంబుల విరిసి యామ్నాయ మహిమ
గడలుకొనఁ దొంటిపుట్టువై కవిసమాఖ్యఁ
దనరి సృజియించు చతురాననునకు ధరణి
రాణ కెక్కెను వాణి నారాణి యగుచు.
220
గీ.అమృతధునిఁబోని యామె సాయము రవంత
చినుక జైమినిభారతం బనఁగ నెంత!
వాణిదయ మాకుఁ గయిదండ పట్టదోటు!
వలయునే యన్యకవుల తోడ్పాటు చేటు!
221
వ.అని యిటులు నిండుఁగొలువున ధరాఖండలు సమక్షమ్మునఁ బినవీరభద్రుం డసూయానిద్రితులైన కొందఱు కవింమన్యులకుఁ బ్రత్యుత్తరంబుగాఁ దెచ్చికోలుదర్పంబునం బలికె నాయెడ నయ్యుపాసకు నంతరంగరహస్యం బెఱుంగమి నసహ్యపడి కొంద ఱటమటించి లేచి ప్రభువుదెసం జూచి -222
మ.“ఇతఁ డౌరా! ప్రపితామహుం డయినవాఁడే! లెస్సగాఁ దోఁచి భా
రతపుంబట్టులు పల్కె నంచు మనసారన్‌ మెచ్చుకొన్నార; మీ
కృతికిం జేతులు దోయిలించెదము కానీ, “వాణి నారాణి” యం
చతిలోకస్థితి నోరుచేసికొన నౌనా! పిన్నవీరన్నకున్‌.
228
వ.“అమంగళంబు ప్రతిహతం బగుఁగాక” యనుటయు సాళువనరసింహ మహీదారుండు సహజకవితా వక్రోక్తిధీరుండు చమత్కృతి మద్వచోగుంఫనంపువిఱుపు లెఱింగినవాఁ డుచితస్మితాంకూరము మాఱాకుతొడుగ వీరభద్రకవిం బరికించి పలికె.224
క.“మఱి యేమందురు! వాణీ
పరజననీ చరణరేణు పావనతల ని
క్కరణిఁ దలంచుట దర్ప
స్ఫురణమ్మో! కవుల సమయమో యిది చెపుఁడా!”
225
మ.అనుచున్‌ ముచ్చట వేఁడ నిర్మలిన భావాలోకవక్రోక్తి జీ
వనుఁడౌ నక్కవి కొల్వునంగలుగు విద్వత్పాళి యూహింపనే
రనితీరున్‌ గమనించి వారిఁ గని యౌరా! “వాణి నారాణి” యం
చనఁగా నియ్యెడ నిట్లపూర్వముగ వ్యాఖ్యానింపఁగాఁ బాడియే.
226
చ.కవి చతురాస్యుఁ డౌట యిది కాదనవచ్చునె! మంగళాన్వయ
ప్రవణతయున్‌ రసజ్ఞతయుఁ బట్టినచోఁ బ్రతికూలభావనా
లవమున కిందుఁ దావు పొదలం బనిలే; దిట వాక్యవక్రతం
దవిలిన సానుభూతియకదా! యుచితజ్ఞతయై తనర్చెడిన్‌.
227
గీ.అరయుఁడీ! దీన మేల్చూపు నలవరించి
“వాణియన రాణిగదె చతురాననునకుఁ”
బరమసత్యము కాదన వచ్చుచెట్టు!
‘లనఁగ’ రూపాంతరంబు ‘నా’ ననుటకాదొ!
228
మ.అనియాడం బినవీరభద్రకవి సద్యస్సాధువిస్ఫూర్తులం
గొనియాడెన్‌ నరసింహరాయలు; గుణజ్ఞుల్‌ కొంద ఱవ్వాని తీ
ర్పును నేర్పుం గని మెచ్చి రచ్చముగ; సభ్యుల్‌ కొంద ఱుద్వేగభా
వనులై మెచ్చకపోయి; రక్కొలువు చెల్వంబయ్యె వాణీదయన్‌.
229
వ.సాళువనరసింహరాయ లీతోయంబున వీరభద్రకవితాలతోపఘ్నంబై ‘రామాభ్యుదయ’ నామకంబగు గీర్వాణకావ్యంబునకుం గర్తయై సారస్వతం బామతించుచు వేఱొండువంకం జంద్రగిరిరాజ్యంబున నారాయణవనంబు రాచవీడుగాఁ గొంతకాలంబునకు నిజసేనాకదంబముం బెంపుగావించుకొనెఁ; బదంపడి వీరతిలకుండు తుళువ నరసరాజు సేనాధినాయకుండుగా దండువెడలి విరూపాక్షరాయల విక్రమం బడంచి విజయనగరసామాజ్యభద్రాసనం బలంకరించె.230
గీ.లుబ్ధమతులయి తనదునేలుబడివైపు
గజపతులు నశ్వపతులును గన్నువేయ
నుదయగిరి రాయచూరుల నోటువఱిచి
పట్టుకొనఁ దెన్నురోయు సాళ్వవిభుమౌళి.
231
మ.ఒకనాఁ డేకతముండి శ్రీ తులువవంశోద్ధారకున్‌ మంత్రినా
యకు లోకజ్ఞకళాసఖున్‌ నరసరాజాఖ్యాకు రప్పించి - వే
డుక నేవో తొలిపల్కి, యేలుబడిపోటుల్‌ పాటులున్‌ మాటలో
నికి రా దింపి యిటుల్‌ వెలార్చె మదిలో నెక్కొన్నయాశారుచుల్‌.
232
శా.ఓయీ! నీదుసహాయతానుగతిఁగాదో మంత్రివర్యా! జగ
ద్గేయంబై తులకించు కన్నడపుగద్దెన్‌ నిల్చితిన్; గాని, నా
పాయంబైన జయమ్మటంచుఁ దనివోవంజాల; దావచ్ఛటల్
డాయన్‌ రా నిటఁ బూలపాన్పునఁ బరుండం గూరునే యూఱటల్!
233
సీ.హైందవధర్మ కల్పానోకహస్కంధ । మడఁగింపఁ దఱివేచు నశ్వపతులు
బహమనీసులతాను లహమించి యొకవైపు । మించినపగ సకిలించుచుండ
గజపతులై కళింగము నేలుకొను ప్రతా । పముచూపి యుదయదుర్గమునఁ బగఱు
మదమెత్తి యొకదెస మల్లడిగొనియుండ । నమరునే భద్రాసనమున శాంతి!
 
గీ.కృష్ణ దిగువకు వారి రానీక యుఱిమి । తఱిమి నుఱుమాడినపుడుగాదా! యఖండ
చండకర్ణాటసామ్రాజ్య సార్వభౌమ । పదవిఁ ద్రొక్కినఫలము చేపడును మాకు!
234
గీ.గజపతులు నశ్వపతు లఁటే! - కాదు కాదు;
వారిబిరుదము లివి ప్రక్కబల్లెములుగ
మమ్ము నిదురింపనీయవు; వమ్ముగాక
నరపతిత్వముపెంపు లూనంగవలయు.
235
ఉ.నీమది కెట్లుతోఁచు నటు నిర్ణయమెంచి వచింపు మన్న మే
ధా మహనీయమూర్తి పరితఃపరిశీలిత రాజనీతి వి
ద్యామసృణాత్ముఁ డల్ల తుళువాన్వయరత్నము సాళ్వనేత కాం
క్షామితి నెంచి దానఁగల సాధకబాధకముల్‌ తలంచుచున్‌.
236
మ.“ఇది సాకల్యము నంతరంగమున మున్నే నేను జర్చించుకొ
న్నదికానీ, ప్రభుసన్నిధిన్‌ దెలుప; నైనన్‌ దీని మన్నింపఁగో
రుదు రాజేంద్ర! నిజమ్ము తా మనిన శత్రువ్రాత మిర్వంకలన్
బదనుంగత్తుల నొత్తియున్నెడ సుఖస్వాపంబు దీపించునే!
237
మ.పరిశీలించిన నత్తురుష్కబల మశ్వశ్రేణికా సైన్య దు
ర్ధరమై యున్నది; భామినీశులపయిన్‌ దండెత్తగాఁ దగ్గ ని
బ్బరముం గూర్చుకొనంగ ముందుగ హయవ్రాతమ్ములం జేర్చుకో
నురవౌ; దానికి నూత్నయత్న మది యెంతో కొంత సాగించితిన్‌.
238
చ.మఱియుఁ గళింగ భూపతుల మార్కొనఁ జూచుటకూడ నేఁడు తొం
దరఁ గొనరాని కర్జ మనెదన్; విపినాళి కళింగ ధారుణిం
దఱచయి యుంటఁజేసి ద్విరదంబుల నిబ్బడిఁ బెంచి ప్రొద్దు వు
త్తురు మదగర్వితుల్‌ గజపతుల్‌ గిరిదుర్గ నిరర్గళస్థలిన్‌.
239
గీ.కాన, గజ వాజి రాజి నెట్లైనఁ జేర్చి
మనకుఁ గల కాల్బలమ్ము పెంపునకుఁ దోడు
దీర్చి దండెత్తి శంఖమొత్తిన దినమ్ము
ప్రభువుల మనోరథ మ్మిది పండుఁగాదె!
240
మ.అరయన్‌ వారల కెట్టి వాజి గజసైన్యం బుండె నద్దాని యం
తరమున్‌ మీఱు కుబేరభాగ్య మగుఁగాదా మీది!; సుల్తాను పెం
పఱ బేరమ్ములు వోయి యెంతయిన ద్రవ్యం బిచ్చి యశ్వోరసో
త్కరముందెచ్చుట యొక్కఁడే యిపుడుకర్తవ్యంబు మున్ముందుగన్‌.
241
గీ.అశ్వము లరబ్బి పారశీకాది దేశ
ముల సమృద్ధములై తురుష్కులకుఁ జిక్కు;
నాప్తులగు పోర్చుగీసు బేహరులు కతనఁ
దనియ వెలవోసి విలిచిన మనకుఁ దక్కు.
242
వ.ఆనాఁ డశ్వపతులు శ్వపతులై పరువెత్తుట తప్పదు; వాజి రాజి తోడ్పాటున బహమనీఱేని జయించినవెంట ననేక పాటోపమ్మునఁ గళింగమ్ము ముట్టుకొని చేపట్టుట దేవరకు దుస్సాధంబు కా దనుటయు.243
ఆ.వె.దవ్వులరసి తనకుఁ దాత్కాలిక ప్రియే
తరము హితముఁ బల్కు నరసరాజు
సరస హృదయ మెఱిఁగి సాళ్యవీరాగ్రణి
నొచ్చుకొనక లోన మెచ్చుకొనుచు.
244
మ.అనె నీ రీతిగ మంత్రితో “నరసరాజా! సాజమౌ మేలిచూ
పున యోజించుచు నీ వచించినది యొప్పున్; సంగరాకాంక్ష పె
ల్లున మాయుల్లము రాచపాడియెడ నిల్పుం బట్టలేదయ్యె; నీ
వనినట్లే ద్విరదాశ్వసైన్యసముదాయశ్రద్ధ శ్రేయంబగున్‌.
245
శా.ఏమో! యీ బరువెల్ల నీవె కొని మా యీ కాంక్ష, కేనాఁటికే
నీ; మోక్షంబును జూపి శాత్రవచయోన్నిద్రమ్ము రాచూరు దు
ర్దామశ్రీ నుదయాద్రిదుర్గము స్వసామ్రాజ్యంబునం జేర్పు మిం
తే: మా కొండు తలంపు లే దనుచు సాళ్వేంద్రుండు వాక్రుచ్చుడున్‌.
246
తుళవ నరసరాజు సాచివ్య చాతుర్యము
సీ.కర్ణాటవిభుఁడు లక్షలుగాఁగ వెలయిచ్చి । హయపాళి విలుచునన్నట్టివార్త
యెల్లదేశములలో నల్లె నంత విదేశ । వర్తకుల్‌ ద్రవిణలిప్సమెయి వచ్చి
సింధుదేశము పారశీకం బరబ్బీయు । గాలించి మిగులఁ జౌకగొని తెచ్చి
నరసింహవిభునిచెంతకు నేగుదేరఁగా । నమ్మహీనేత హయత్రయమ్ము
 
గీ.వేయి వరహాల వెలయిచ్చి విలిచి యుంచు; । వర్తకులు కొనివచ్చు నశ్యములు దారిఁ
జచ్చెనేనియు వాని పుచ్ఛములు కోసి । యిచ్చియును వేవరాలు గడించుకొంద్రు.
247
గీ.తఱుగని పసిండి నాణెముల్‌ పఱపువైచి
మడుగు లొత్తుచు నాహ్వాన మంజువాణి
యాంధ్ర కర్ణాట రాజ్య సితాబ్జపాణి
యశ్వకల్యాణి కంచితార్ఘ్యమ్ము నిచ్చె.
248
గీ.త్రవ్వి తండములైన గుఱ్ఱములు నేన్గు
లివ్విధంబునఁ బడసి భూమీంద్ర కమల
యశ్వ పూర్వము హస్తినాదానుబోధ
మగు జయ మనోరథమ్ముమధ్యమునఁ బొలిచె.
249
చ.హృదయ మెఱింగి రాచపనులెల్లను దానయి నిర్వహించి య
ప్పదపడి ఱేనితోడ నొడువం జనవందినవాఁడు బుద్ధి సం
పదగలవాఁడు నౌ నరసమంత్రి నిరంతర సాధు దృష్టిఁ జ
క్కదములు దిద్దెఁ దీరుపరిగా నరసింగని రాజ్యలక్ష్మికిన్‌.
250
మ.అటు కొన్నేఁడులు మేలియేలుబడిసేయన్‌ దైవయోగంబు త్రొ
క్కటమయ్యెన్; నరసింహనేత నిజకాంక్షావృంతబంధంబు త
ల్లటపాటుం గొనుకాలముం దెలిపి మెల్లన్‌ మంత్రి హస్తాబ్జ సం
పుటమున్‌ గుండెకుఁ జేర్చుచుం గడతలంపుల్‌ తెల్పె నీ రీతిగన్‌.
251
మ.చిరమిత్త్రంబుగ మంత్రిసత్తముఁడుగాఁ జేదోడు వాదోడు పెం
పు రహింపన్‌ దమకంబునం గొలువు పొల్పుల్‌ నిల్పి తిన్నాళ్లుగా
నరసన్నా! యిటు గొంతు సన్నఁబడె నన్నా! మీఁద నాబిడ్డ లి
ర్వుర నీ చేతుల కప్పగించుకొని యూర్పుల్‌ హాయిగా వీడెదన్‌.
252
గీ.అశ్వగజలక్ష్మివెంట నా యంతరాత్మ
యిచటనే నిల్చి దీవన లిచ్చుచుండు
‘నుదయగిరి రాయచూరు’ నం చోసరిల్లి
పెదవి కొస యూర్పు నరసింహవిభుని విడిచె.
253
వ.స్వామిభక్తిసంసక్తుండు తుళువనరసరాజు తనయేలిక బిగువుఁ గేల్గవం జిక్కిన శ్రద్ధాంజలి వీడుకొని యశ్రువు లొత్తుకొని భర్తృదారకుల నోదార్పవలసిన వాఁ డగుట ధీరచిత్తంబున నుపశమిల్లి తోడ్తోడం గార్యశేషంబున నవహితుండై.254
గీ.చిఱుత ప్రాయంపుఁ జెలువుతోఁ జేరెఁడేసి
కన్నులను ముద్దు లూరించుచున్న వానిఁ
దిమ్మరాయనిఁ గర్ణాట దివ్యపీఠి
నిలిపి యభిషిక్తుఁ జేసె నిర్మలినబుద్ధి.
255
సీ.మహనీయ మేధారమా స్పృహణీయ వి । ద్యారణ్యమూర్తి తిమ్మరసుమంత్రి
యఖిల తంత్రము సహస్రాక్షుండుగాఁ జూచి । నడపింపఁ జాలు విన్నాణి తనకుఁ
బదపదమ్మునఁ దోడుపడుచుండ నరసరా । జనభిషిక్తుండైన యట్టి ఱేఁడు
నకిరీటుఁ డగురాజు ననుచు గొండాడఁగాఁ । గర్ణాటరాజ్య చక్రమ్ముఁ ద్రిప్పె
 
గీ.సాళువాన్వయపుం బూఁత వ్రీలకుండఁ । బేరునకు గద్దెపై నిల్వఁబెట్టె నంతె;
తుళువ వంశోద్భవుండె యెత్తుకొని ధరణి । గుత్తగొనె నని కొందఱి చిత్త మడలె.
256
చ.కొలువున నుండి యోర్మియునుఁ గూర్మియుఁ గోల్పడి కన్నడంపుచేఁ
తలు తలపోసి కొందఱు మదంబునఁ జాటుగఁ గూడి, నర్సరా
యలకు నకారణాగత మహాధరణీ భరణాధికారపుం
గలిమి కసహ్యపాటు దనుకన్‌ గపటాలపనాతి సంధులై.
257
వ.బాల ప్రభుండైన తిమ్మరాయని గతాసుం గావించి సామ్రాజ్యకాంక్షతోఁ దుళువనరసరాజే యి చ్చెనఁటిపనికిం బాల్పడె నని ప్రవాదంబుం గల్పింత మని సంకల్పించుకొని రంతఁ గొన్నాళ్ళకుఁ దగినతఱి చూచి యాతతాయి యగు నొక దళవాయి యనుకొన్నంతపనియుం గావించిన నుత్తరక్షణంబున నద్దుర్వార్త విద్యుద్వేగంబునఁ గర్ణాటరాజ్యమునం బ్రాఁకిపోవుటయు -258
మ.అకటా! యెంతటి ద్రోహచింతనము! తానై రాజ్యభారంపుఁ బూ
నికమై నుంటకుఁ జాల కిట్టిపని చన్నే! కాని పేరాసతో
నిఁక నీ వజ్రపుగద్దె వధ్యశిలయౌనే! నర్సరా జిట్టి మో
ఱకుఁగర్జంబు నొనర్చినాఁ డనుట కౌరా! నోరు వెన్కాడెడిన్‌.
259
గీ.అనుచుఁ బ్రజలాడుకొనెడివాక్యముల సడియె
చెవిఁబడెను దొల్తఁ దుళువవంశీయమణికి;
వెనుక ననుమానమొనరించుకొనె నతండు
చిఱుతయెకిమీని దారుణ మరణవార్త.
260
మ.పరు లెవ్వారును దేఱిచూడనిగతిం బాటించుచున్‌ వజ్రపం
జరమం దుంచి సహస్రనేత్రముల రక్షాభారమున్‌ మోసి తా
నరసెన్‌ బాలమహీపతిన్‌ దుళువవంశాంభోధిచంద్రుండు త
త్పరుఁడై; తత్సుకృతంబె పాపపరివాదంబయ్యె లోకంబునన్‌.
261
గీ.సాళ్వవంశాంకురం బిట్లు సమసిపోక
నొక్కవైపు విషాదము - నొక్కకంటఁ
దనకు రాఁగూడని ప్రవాదమున జనించు
ఖేదమును వెల్లిగొన విరక్తిఁ గొనియుండ.
262
మ.గణనీయ ప్రతిభుండు తిమ్మరసు తత్కాలోచితప్రౌఢ నీ
తి నిరూఢంబగుచూపుతో నరసపృథ్వీజాని నోదార్చి యి
ట్లనె: రాజా! తొలుదొల్తఁ జేయఁదగు కార్యం బొండె కన్పట్టు; న
ప్పని యీ నీ పరివాదకర్దమ మడంపం గల్గునం చెంచితిన్‌.
263
వ.అది యెద్ది యందువేని సాళ్వనరసింహరాయల రెండవకుమారుండగు నిమ్మడి వీరనరసింహరాయని నభిషిక్తుం జేయవలయు; నిది యిటులు జరుగుట నీ స్వామిభక్తికి స్వర్ణాభిషేకంబు గాఁగలదు; దాన నిప్పటి సడిబురద క్షాళితంబగు; నప్పిదప నిట్టి కఠోరహింసకుం బాలుపడిన పగదారుల సాధింప యత్నింపవచ్చు నని ప్రబోధించుటయు -264
గీ.నరసభూపాలమౌళి తిమ్మరసుమంత్రి
మంత్రమున హర్ష మెనసి యిమ్మడినృసింహు
శిరముఁ దడుపంగ నయ్యభిషేకవారి
కడిగివైచెఁ బ్రవాదపంక మ్మవారి.
265
మ.తనయత్నం బిటు బీఱువోవుటకు ఖేదక్రోధముల్‌ మీఱి దు
ర్జనుఁడౌ నద్దళవాయి తిమ్మరసుమంత్రం బింత కానోపు నం
చనుమానించుచుఁ దత్ప్రతిక్రియలు సేయంజూచు నాక్రొత్తరా
జున కప్రౌఢున కేవియేవొ మెఱమెచ్చుల్‌ వల్కి యూరించుచున్‌.
266
చ.ఎఱుఁగని చిత్తమందు విసమెత్తుచుఁ దీపులు గ్రుమ్మరించు నే
ర్పరి; యరవాయిలేని దళవాయి రహోగతి బాలభూపతిన్‌
గఱపులత్రాళ్లతోఁ గ్రమముగా వలవైచుకొనెన్; గదుక్తి త
త్పరతయెకాని పెద్దలహితంబులు పట్టునె లేఁతబుద్ధికిన్‌.
267
సీ.తనయన్నఁ జెనకిన చెనఁటి సేనాపతి । యవినీతికఱపుల నామతించి
యిమ్మడినరసింహుఁ డీడుచాలనిఱేఁడు । వెడఁగుఁబోకలఁ బోవు వడువు నెంచి
కర్ణాటరాజ్య రక్షణ బద్ధకంకణ । బిరుదోదయుండు తిమ్మరసుమంత్రి
మును మేలుకొని తంత్రముల యాకళింతలు । నరసరాజునకు సాంతమ్ము వినిచి
 
గీ.కడకు నిటు పల్కె : “వీరాగ్రగణ్య! మనకుఁ । జుట్టముగ వచ్చి దయ్యమై చుట్టుకొనియెఁ
జిఱుత నరపతి; దళవాయిచేతఁ జిక్కి । యన్నతరవాయి యితఁడుకాకున్నఁ జూడు!
268
గీ.భవ్యకర్ణాట సామ్రాజ్యభవనలక్ష్మి
కిప్పటియుపేక్ష పతనైకహేతువగుట
తప్ప; దటుకాక దళవాయి తలఁ దెమల్చి
రాజ్యమును గాచుకొనుట యర్హమ్ము మనకు.
269
మ.సదయాంతఃకరణమ్మునన్‌ భవదనుజ్ఙాతుండనై చెప్పఁబో
యెద నాఱేనికి; విన్నచో సరియ; కాదేనిన్‌ నిరాధార బా
ల్యదశాధీనుఁ డతండె సొంపఱు” నటం చాడన్‌ మహామంత్రి కన్‌
తుదలన్‌ రేఁగినయెఱ్ఱజీరలకు సంతోషమ్ముఁ బాలించుచున్‌.
270
గీ.అంతలో నర్సరాజు రోషాంతరమున
“భ్రాతృఘాతుకుఁడౌ దళవాయితోడ
సంగడీఁడగునంత దుర్జనతకూడ
నీయశక్తుండు గడియించెనే” యటంచు.
271
ఉ.కొంచక పల్కి లేచి తనకుం బెనుబాసటయైన మంత్రి చూ
పించినత్రోవలో నడుగువెట్టుచు వెండి వచించె : నింత దు
ర్వంచనకుం దలంచుదళవాయి ననం బనిలేదు : కీడు మే
లెంచకయున్నఱేఁడు మనునే! యిటు పాపము డగ్గఱించునే!
272
క.కానిమ్ము రాజనీతి
జ్ఞాననిధివి నీవు పోయి సముచితహితవాక్‌
ప్రాణములు వోసి యప్పసి
ఱేనిని బ్రతికించి యాదరింపు మనంగన్‌.
273
వ.జాగుసేయక యమ్మఱునాఁడె యిమ్మడినృసింహు నేకాంతంబున దర్శించి తిమ్మరసు ధీసచివుం డాతని కీ తెఱంగున హితం బుపదేశించె.274
గీ.రాజరత్నమ! నిఖల కర్ణాట లక్ష్మిఁ
బడసి యేలిన సాళ్వవంగడమువారు
నా కొసంగిన హృదయబంధంబు చనవుఁ
గొంతకొని విన్నపము చేసికొందు నొకఁడు.
275
శా.ఈ సామ్రాజ్యము నిట్లు తెచ్చుటకు నెంతేఁ బూన్కి నీ తండ్రి సే
వా సర్వస్వము దారవోసె; నొక త్రోవం బెట్టి యిద్దాని ర
క్షాసాచివ్యము నర్సరాజు నడపెన్; సాళ్వాన్వయంబందు వి
శ్వాసం బుంచె నతండు; నేఁడు నతఁడే పట్టున్‌ జయచ్ఛత్త్రమున్‌.
276
చ.అకృతక రాజభక్తి భరితాంతరుఁడై పరరాజపాళి కం
తకుఁడయి యింత యేలుబడి తంత్ర మెఱింగినవాఁడు - నీదు తం
డ్రికిఁ గుడిచేయియై సవదరించిన యాప్తుఁడు నర్సరాజు; తత్
ప్రకటతరాదరంబె ప్రభుపట్టముఁ గట్టెను నీదు నన్నకున్‌.
277
చ.బరువనఁబోక సాళ్వకులభద్రత కీతఁడు కూర్మి నిల్పె నె
ల్లరు ప్రజలున్‌ జయస్తవములం బొనరింపఁగ; నంత నీర్ష్యమైఁ
గెరలి కసాయిసేఁతకు దిగెన్‌ దళవాయి; యతండు హంతయౌ
టెఱిఁగియు నేఁడు వాని కఱపే చెవిఁ బెట్టుట రాచపాడియే!
278
గీ.కృత మెఱుంగవుగాక! మా హితము వినవు
గాక! కర్ణాట రాజ్య రక్షణము కొఱకు
నరసరాయలు వెనుదీయఁ; డరసికొనుము
చెనఁటి నెయ్యపుమాటలు వినక మనుము.
279
గీ.అనుచు మేల్‌ పల్కి తిమ్మరసయ్య ఱేని
యింగిత మెఱింగి “కటకటా! యితని జబ్బు
నోటఁ జక్కెర వోసితిఁ జేటు డగ్గ
ఱించెనో వీని” కనుచు భావించుకొనుచు.
280
మ.మఱి మాటాడక, ఱేనిమోమున నెదో మౌర్ఖ్యంబుఁ బాలించు బి
త్తఱి మౌనంబున సిగ్గులేని తెఱఁగున్‌ దన్నంత్రి గుర్తించి తీ
వరపుంజూపున శాంతి దీపిలిన భావంబున్‌ వెలారించు పెం
పొరయంగా నట వీడి వచ్చెఁ, బయి నుద్యోగంబు సాగింపఁగన్‌.
281
ఉ.వచ్చినవెంట మంత్రి తుళువప్రభువుం గని ఱేనితోడఁ దా
నచ్చట విన్చినట్టి హిత- మాతని మౌనవిధా విషాంతరం-
బచ్చుపడంగఁ బల్కి తదనంతర కార్య రహఃప్రసక్తియుం
దెచ్చి కృతజ్ఞుఁడౌ నరసనేత కవుంగిటఁ జొచ్చె వేల్పుగన్‌.
282
సీ.నృపనీతి చాతురీనియతి చాణక్యుండు । తిమ్మరసయ్య యందిచ్చి నట్టి
దివ్యోపదేశ పాథేయమ్ముఁ గైకొని । పెఱకన్నెఱుంగని తెరువుఁ బట్టి
తుళువాన్వయాబ్ధి చంద్రుండు పెన్గొండకు । సరసరాజద్యుతి స్ఫురణ నరిగెఁ;
దనరాక సైన్యసంతానమ్ము పొంగారి । యుత్తరంగితమైన యోజ నెఱిఁగి
 
గీ.కన్నడంబున ముసరుచీకటి నడంప । రాణువల వెంటఁగొని సంగరమ్ము నడపి
విజయనగరమ్ముకోట నక్కజముగాఁగ । ముట్టె నిమ్మడి నరసింహుఁ బట్టుకోఁగ.
283
చ.తలఁపని ముట్టడింపునకుఁ దల్లటపాటున బాలరాజు తొ
ట్రిలి-యెటు సేఁతకున్‌ నిలువరించెడి ధీరతలేమిఁ గుందఁగా,
నల దళవాయి బీఱముల నాడుచు ఱేనికిఁ గర్ణపర్వపుం
గలుములు తోఁడుచున్‌ దురమునన్‌ దివసద్వయ మంగవింపఁగన్‌.
284
శా.క్రోధాటోపధనంజయస్ఫురణలక్ష్యుండై కనత్ఖడ్గ దు
స్సాధోదీర్ణభుజాగ్రుఁడై తుళువవంశస్వామి దుర్దాంత దు
ర్నేధాధారత రేఁగువానితల నేర్మింబట్టి తున్మాడి హ
స్తాధీనంబగురాజ్యలక్ష్మి కిడె రక్తాంభోజరాజోపదన్‌.
285
చ.అటు తుళువాన్వయుండు కుటిలాశయుఁడౌ దళవాయికుత్తుకం
దటుకునఁ దున్మి బాలవిభు దగ్గఱి “యెవ్వఁడు నిన్నుఁగూర్చి యిం
తటిజతనం బొనర్పఁ గనెఁ దత్కృత మెన్నక యానుకొన్న యి
వ్విటపముఁ ద్రెవ్వఁజూచునవివేకివి - నీకు భవిష్య ముండునే!
286
గీ.వాడి యూఁగాడు నీ సాళ్వవంశవల్లి
నెటులొ బ్రదికింపఁజూచు నక్కటికమూని
తిమ్మరసుమంత్రి - నేను - గద్దెపయి నిన్ను
నిలిపినచరిత్ర మఱపుగొంటివఁటె నేఁడు.
287
మ.అకృతజ్ఞుండ వవద్యశీలుఁడవు విద్యారణ్యసామ్రాజ్యపా
లకవజ్రాసన సన్నిధానమున నిల్వంగా ననర్హుండ; విం
తకు సాళ్వాన్వయపల్లవం బయితికానన్‌ వ్రేళ్లువెన్కాడుఁ బొ
మ్మిఁక” నంచున్‌ శితఖడ్గచాలన కళాహేలారణత్పాణియై.
288
క.“పెనుగొండదుర్గమునకుం
గొనిపొండీ వీనిఁ బట్టుకొం” డనఁగాఁ గ్రు
క్కినపేనై సైనికులకు
మణిబంధము లప్పగించి మనె మన్నీఁడున్‌.
289
గీ.శ్రీరుచిరసాళ్వవంశము చెఱకుతుదకు
వెన్నుగాఁబుట్టె నిమ్మడివిభుఁ డతండు;
నాంధ్రకర్ణాట భద్రసింహాసనమ్ము
తుళువ వంగడమునకుఁ జేదోడొసంగె.
290
మ.కమనీయ ప్రణయోదయోత్సవ రతిం గర్ణాట రాజ్యేందిరా
రమణీరత్నము మంత్రిసాక్షికము వజ్రస్ఫీతపీఠాన సం
గమవంశమ్మును సాళ్వవంశమును ముక్తాహారముంజేసె వి
క్రమశుంభత్తుళువాన్వయ ప్రభుని వక్షఃపీఠిఁ గైసేయఁగన్‌.
291
శా.ధీరోదాత్త భుజాభిరాముఁడగు పృథ్వీజాని యాతండు కా
వేరిన్‌ సేతువుఁగట్టె; సైన్యవితతిన్‌ వెన్వెంటఁ గొంపోవుచున్
శ్రీరంగంబును ముట్టెఁ; జోళ మధుర శ్రీపాండ్య చేరాది రా
ష్ట్రారంభోద్ధతి నడ్డగించుచు స్వరాజ్యం బేలె దుర్వారతన్‌.
292
గీ.మించి పోరాడి చేతఁజిక్కించుకొన్న
రాయచూర్‌ ముదిగల్లు దుర్గములు రెండుఁ
దాను లేకుండఁ గని “యదిల్షా నవాబు”
కన్మొఱంగె నటంచుఁ గిన్క మదిఁ బొదల.
293
మ.తలపోయుం దుళువాన్వయప్రభుఁడు తత్తౌరుష్క సేనాశ్వ పు
ష్కలతాముష్కర జృంభణంబులను శుష్కప్రాయముం జేయ; నె
త్తులువేయున్‌ బలవాజి వారణపదాతుల్‌ మీఱఁగాఁ బెంచి ‘యా
దిలుషా’ యేపు లడంచి దుర్గములు సాధింపం బ్రయత్నించుచున్‌.
294
గీ.తల్లి బుక్కాంబ కరుణపెత్తనముఁ బడసి
జనకుఁ డీశ్వరరాజు బోధనము నొడిసి
పెరిఁగి కర్ణాటవిభుఁడైన నరసరాజు
తిమ్మరసు దీవనలజాడఁ దెలిసి మెలఁగె.
295
గీ.మణిమకుట భారభరణశ్రమం బొకండు
తక్క మిగిలిన రాజ్యతంత్రములబరువు
తిమ్మరసుపండితుఁడు మోసి తీర్చుచుండ
నడచెఁ గావ్యకళాసక్తి నరసరాజు
296
వ.అమ్మహీరమణుం డుమామహేశ్వర ప్రసాదలబ్ధ సారస్వతాభినందులును వాగీశ్వరీమంత్రరాజసిద్ధిపారంగతులును గౌశిక భారద్వాజ గోత్రసంజాతులును గురుదక్షిణామూర్త్యఘోరశివాచార్యచ్ఛాత్త్ర పరమాణువులును భాషాద్వయ కావ్యరచనాశేముషీభూషణులునై రాణకెక్కి సంస్థానకవి స్థానాలంకరిష్ణువులగు నందిమల్లయ ఘంటసింగయాహ్వయ కవుల నాదరించి వరాహపురాణ ప్రబంధనాయకత్వంబున ఖిలముగాని యశము నార్జించి విలసిల్లె297
గీ.నరసనరపతి తిప్పాంబ - నాగమాంబ
యోబమాంబయు నా మూవు రువిద లెలమి
రాణులై కొల్వఁ గృతమనోరథుఁడు తాను
బుత్త్రకామేష్టి బరువునం బోక మురిసె.
298
వ.అతండు తన పట్టపుదేవేరియగు తిప్పాంబనలన వీరనరసింహరాయ లనెడి పేరుగల తనయుం గనియె; రెండవ రాణివాసంబు నాగాంబికయందుఁ గృష్ణదేవరాయలం బడసెఁ; దృతీయ జాయయగు నోబాంబికయం దచ్యుతరాయ రంగరాయ సమాఖ్యాకులగు సూనుల నిర్వురం గాంచె; నా పృథివీపతికిఁ జతుర్భుజంబులవోలె నన్నలువురుకుమారు లుదయించి విరాజిల్లుచుండి రంత -299
ఆ.వె.తుళువ నరసరాజ తిలకుండు శ్రుతిహిత
ధర్మపాలనైక తత్పరుండు
కన్నడమ్ముఁ బెద్దకాలము పాలించి
తనువు నొడ్డెఁ గాలధర్మమునకు.
300
చ.అతని తనూజవీథిని వయోధికుఁడౌ నరసింహరాయ లూ
ర్జిత భుజవీర్యధుర్యుఁ డభిషిక్తుఁడుగావుటఁ గంటఁజూచి ద
ర్పితమతియైన తజ్జనని తిప్పమ గొప్పతనమ్ముమైఁ గటు
స్మిత మొనరించె; నాగమకుఁ జిన్నతనం బనిపించె నాయెడన్‌.
301
ఉ.వీరతఁ దండ్రిపోలికలు వెంగలిసేఁతలఁ దల్లి చాలికల్
చేరికయైన వీరనరసింహుని నేలికఁ జేసి కంటఁ దా
నారయుచుండు నేలుబడి యంతయుఁ దిమ్మరసయ్య; తియ్యపుం
గోరిక కృష్ణరాయుదెసకుం బ్రభవిష్ణుతఁ దీవసాగఁగన్‌.
302
సీ.నరసింహరాయల పరిపాలనమ్మున । నరిగాఁపులైన భూవరులు మిగిలి
కరము నర్పింపక తిరుగుపాటొనరింప । సాగుడుఁ జండశాసనుఁడు ఱేఁడు
దక్షిణధాత్రికి దండువో వెడలించి । సంగరమ్మున శత్రుసమితి నొంచి
మరల సామంతభూవరు లప్పనముసేయు । కప్పంబులను గటాక్షమునఁ గొనియె
 
గీ.జైత్రయాత్రలతోఁ దీర్థయాత్ర సాగి । కాంచె నాఱేఁడు కంచియుఁ గాళహస్తి
రామసేతువు మధుర శ్రీరంగపురము । శేషగిరి శ్రీధరాదిక క్షేత్రసమితి.
303
పర్వాంతము
మ.చెలువొప్పార మదాత్మపీఠమున లక్ష్మీసత్యనారాయణా
ఖ్యులు మీదంపతు లాదిదంపతులు నిత్యోపాస్యులై యుండి యు
జ్జ్వలవాగర్థము లీయకున్నెడల విద్వత్పర్వఘట్టంబు నా
వలనన్‌ సాగినదౌనె! మీయవి పురఃపాకంబు లాశాస్యముల్‌.
 
గీ.సత్యనారాయణాఖ్యాకజనక! నీకు
నేఁడు కనకాభిషేకమ్ము నెఱపికొనెడి
తనుపు నాయెడ మొగ్గసూపినది; నీవొ
కండు శ్రీనాథుఁ డొండును గాదు నాకు.
 
విద్యానగర పర్వము - ఆంధ్ర పురాణము - మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి - ఆంధ్రభారతి - కావ్యములు - ఆంధ్రపురాణము - ఆంధ్రపురాణం - ఆంధ్ర పురాణం మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి ( తెలుగు కావ్యములు ఆంధ్ర కావ్యములు) Andhra Puranamu - AndhraPuranamu - Andhrapuranam - andhra puranam - Madhunapantula Satyanarayana Sastry- AndhraBharati AMdhra bhArati - kAvyamulu