కావ్యములు ఆంధ్ర పురాణము విజయ పర్వము

ఆంధ్ర పురాణము
మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి

కృష్ణరాయ! కవీశాస్త్వాం
స్తువంతు న వయం స్తుమః
నరసింహకిశోరస్య
కియాన్‌ గజపతేర్జయః
‘అనుష్టుప్‌ చక్రవర్తి’

విజయ పర్వము
క.శ్రీకర! పాణౌకృత ల
క్ష్మీకా! మజ్జనక! సమ్ముఖీకృత కవితా
లోకహిత సుతద్వితయ
వ్యాకృత రమణీయ వాఙ్మహః పరిపాకా!
1
గీ.అర్థ కామ ధర్మంబుల కనుగుణముగఁ
గాలముం బంచి నడచు భూపాలునెడల
ధర్మతత్పరుఁడై న ప్రధానమంత్రి
తీయముగ నెంచె దక్షిణనాయకతను.
2
మ.రమణీయార్థ సదుక్తిమత్కవితలో, రాజ్ఞీమణీ సద్గుణో
త్తమతాజ్యోతిని, వీడరాని ప్రణయస్థానంబుగా నున్న చి
న్నమదేవీ మధుహాసహర్షమునఁ బెంపౌ సచ్చిదానందరూ
పములన్‌ భావనసేయునట్లు కనిపింపన్‌ గృష్ణరాయాధిపున్‌.
3
మ.ఒకనాఁ డారసి మంత్రసౌధమున నేదో ముచ్చటింపంగ ను
త్సుకుఁడై ధీసచివుండు తిమ్మరసు చేతుల్మోడ్పుగా వచ్చి యూ
రకయుండన్, గనువిచ్చినొచ్చుకొని యౌరా! యంచు నాఱేఁడు మం
త్రి కరాంభోజము లంది నెన్నొసటికిం దేనెత్తుచున్‌ నమ్రతన్‌.
4
గీ.పలికె నీరీతి “నప్ప! యిప్పగిది నీకుఁ
గ్రొత్తయాచార; మెదియొ సంకోచపడుచు
మౌనము వహించు నీరాక వానమబ్బు
వచ్చి కురియగ పోక; తాపమ్ము గాదొ!
5
క.మాయెడల నేలుబడియెడ
నేయే నెరసు లవి యున్న నిదికా దదికా
దీయెడ నిటుసేయు మనన్‌
జేయక యెపుడేని నాలసించుట యున్నే!"
6
మ.అనుచుం బల్కెడి చక్రవర్తి హృదయం బానందసేకోత్సవం
బునకుం దెచ్చుచు నయ్యమాత్యుఁ డలరింపుల్‌గాఁగ నోర్విప్పి మె
ల్లన నిట్టుల్‌ పలికెన్‌ క్షణార్ధకృత హేలామౌన గంభీర గుం
ఫన బింబౌష్ఠదరీ దరస్మితము శంపావల్లి చేర్చుక్కగన్‌.
7
గీ.నల భగీరథ భారతనందనాది
రాజదేశీయుఁడగు కృష్ణరాయలెదుటఁ
దొడరి పలికెడి వావదూకుఁడనె కాని
మౌనియగు దక్షిణామూర్తిఁ గాను జూవె!
8
గీ.మంత్రసౌధాతిథేయ మిమ్మాడ్కి నేఁడు
కనికరించుటఁ గొంత విజ్ఞాపనంబు
సేసికొనుటకు స్వాంత మాసించుకొనియె
నిది ‘స్వధర్మాంజలి’గఁ దలంపఁదగుఁ గాదె!
9
చ.ఒడయని బాహులం దొదిగియున్నది దక్షిణ నాయకత్వ మి
ప్పుడు మధురాకృతిన్; బ్రజ లపూర్వగతిం బరితృప్తులౌచు నే
ల్బడి కనురక్తులైరి; పదిలంబుగ నెంచిన నింతమాత్ర నా
యెడఁదకుఁ దన్పుగాద; యెదియేఁ గొద గల్గినయట్టు లయ్యెడిన్‌.
10
చ.కరఁగవలెన్‌ గళారుచిర కల్పనలన్‌ గరఁగింపఁగావలెన్‌
జరుపవలెన్‌ రసజ్ఞ పరిషద్వితతుల్‌ జరిపింపఁగా వలెన్‌
మురియవలెన్‌ వినోద నవమోహనతన్‌ మురిపింపఁగావలెన్
నరపతి పూలవాకిలి నొనర్పవలెన్‌ నిజరాజ్య‍సంపదన్‌.
11
గీ.తలఁపఁ దత్పోషితోన్నత కళలలోనఁ
బరిమళించును జిరము భూవరుని భోగ;
మాతఁ డేలిన ధర్మమునందు వాని
త్యాగము సహస్రధా ఫలితమ్మె యగును.
12
గీ.భోగమునకంటెఁ ద్యాగమ్ముపొంత మ్రొగ్గు
ప్రభువునకు లోకమెల్లఁ జేపట్టుఁగుంచ;
మహిత దమన శ్రమాధీనమైనయట్టి
త్యాగమున ఱేఁడు శ్రద్ధసేయంగవలయు.
13
గీ.అహితశిక్షణ మొక త్యాగ మగునె! యనఁగ
నగు నని వచింతు; శిష్ట ప్రజావనంబు
తాదృశ త్యాగఫల రసధార యగుచు
భువన మాతృగర్భమునఁ దన్పుల నొసంగు.
14
వ.సర్వకర్ణాట రాజ్యపాలన ధౌరేయతం గొన్న దేవర సన్నిధానమున నిది యెఱుంగని యొక రాచఱికపు రహస్యం బని వచించుట కాదు; స్మరణార్థంబుగా వినుచుట నాపనిగా భావించి మనవి యొనర్పవలసినవాఁడ నగుచున్నాఁడ నని పలికి మఱియు నమ్మంత్రివరుండు పూర్వ దిగ్విజయయాత్రా ప్రోత్సహన దోహలం బగు చిత్తంబున నమ్మహీరమణుం గని-15
రాయలు మహామంత్రితో మంతనము
మ.ఒక రెండేండ్లుగ నాయొనర్చినది యేదో విన్నవింపంగ వే
డుకగా నున్నది; సర్వసైనిక బలాఢ్యుల్‌ శాత్రవుల్‌ నన్ను ని
ద్రకు రానీయరు రాజ్యభద్రతకు నాధారంబు సేనాంగర
క్షకదే! దానియెడం బరాకువడినం గా వేల్బడిం బేరుముల్‌.
16
మ.అగుటన్‌ గాలుబలంబు లక్షలుగఁ బెంపౌనట్లు సాధించి య
శ్వగజానీకము వేనవేల్వడయ సంపాదించి యప్పౌఁజు నే
పుగఁ బోషించుపనిన్‌ వలంతులకుఁ బంపుల్‌ పంచి యీరీతి నొ
క్కగతిన్‌ గన్నిడికొంచు సైన్యపరిరక్షా దీక్ష సాగించితిన్‌.
17
మ.బరువై యేండ్లకొలంది ప్రాఁతవడు కప్పంబెల్లఁ జెల్లించుకో
నరిగాఁపుల్‌ దరిఁగానకుంట నభిగమ్య ప్రేమరమ్యంబు దే
వర స్వామ్యంబు చిగుర్ప మొత్తమున సాఁబాల్విత్తమున్‌ వీడియున్‌
గరముం గోట్లకుఁ బెంచి తంచులు మునుంగన్‌ ద్రవ్యభాండారముల్‌.
18
వ.ఆ భాండారము లటులుండ మఱియొక వంక -19
చ.ఎదుటికి రారు వెన్వెనుక నేడ్చుచు నున్నవి లేని వేవొ ప
ల్కుదు; రది వెల్లడిం బడినఁ గ్రుక్కినపేలు: విభుం డమాత్యుఁడున్‌
జెదరుట వారి కుత్సవ విశేషము; ఱెప్పలతోడ దీప మా
ర్పుదు మని చెప్పునంతటి ప్రబుద్ధులు వారు శిలీంధ్రసన్నిభుల్‌.
20
వ.అట్టివారి నుపేక్షించుట యేలుబడికి మంచిదికాదు; కావుటం జేసి రాజధానిలో వారి నొకకంటం గనిపట్టి తాదృశుల నేయే రీతుల సమ్మానితులం జేయవలయునో యటులొనరించితి నది యటుండె; సామ్రాజ్యమునందలి దుర్గమ్ములెల్ల సర్వవస్తు సామగ్రీ సంభృతములు చేయంబడియె-21
గీ.ఎవరి గెలువని వెలితి సాళువ నృసింహ
విభుఁడు నీతండ్రి జీవముల్‌ వీడినాఁడొ
తత్పితౄణ విముక్తి కథాప్రసక్తి
వేల్పుదొర జోడుఱేఁడ! జ్ఞప్తికిని దెత్తు
22
మ.మన సామ్రాజ్యమునన్‌ బటిష్ఠతఁ దలంపన్‌ వీరమూర్ధన్య సై
న్యనికాయంబుఁ దలంప దిగ్విజయ యాత్రారంభముం జేయఁగా
ననువౌ కాలము వచ్చుటన్‌ మనవిసేయన్‌ వచ్చితిన్‌ దండ్రి సా
ళ్వనృసింహుండును బూర్వులున్‌ గనినస్వప్నం బారఁబండింపుమీ!
23
గీ.అనుడు - నమ్మంత్రివచన విన్యాస మెంచి
యధిపుఁ డొకనవ్వు నవ్వె రహస్యసౌధ
వజ్రఖచిత సువర్ణ కవాటమునకు
గడియ తెఱచినయట్లు సవ్వడి జనింప.
24
వ.అట్లు నవ్వినవాఁడు కర్ణాటాంధ్ర సార్వభౌముండు-25
ఉ.“మాయెడ దోసమింతపొడమన్‌ వచియింపఁగవచ్చు నీకు న
ప్పా! యది నేఁడు చేసినటులైనదె! దోసమె లేదటందువో!
తీయముగల్లు మంత్రియుపదేశముఁ బాసి స్వతంత్రుఁడయ్యె నీ
రాయ లటన్న యొక్క యపరాధము క్రొత్తగ నేఁ డొనర్తుమే!
26
మ.కకుబంతోజ్జ్వల రంగభూమినటికిన్‌ గర్ణాటసామ్రాజ్య చం
డికకుం బండువుగాఁగ నశ్వపతిరాడ్వీథీ శిరోరుండ మా
లిక కంఠాభరణ మ్మొనర్చుటగఁ దేలెన్‌ నేఁటి యిమ్మంత్రవా
ణికిఁ బిండీకృతమైన యర్థ; మొకఁ డున్నే! దీని కన్యంబుగన్‌.”
27
వ.అని మఱియుఁ బలుకంబోవు ప్రభువుమాట కడ్డమువచ్చినట్లు వచ్చి ప్రధానమంత్రి సమరాంగణ రసికరాజశిరోమణీ! మిగిలిన యర్థమ్ము నావలన నాలకింపు మని యిట్లు పలికె :28
మ.కకుబంతోజ్జ్వల రంగభూమి నటికిన్‌ గర్ణాట సామ్రాజ్యల
క్ష్మికి దోసిళ్ళ నొసంగఁగాఁ గటకభూమీ మత్తనాగేంద్ర మ
స్తక పీఠస్థలముల్‌ తెగంబొడిచి ముత్యాలెత్తుటల్‌ మంత్రవా
ణికిఁ బూర్వార్థముగాఁ దలంప నొకఁడౌనే! దీని కన్యంబుగన్‌.
29
చ.గజబలమున్‌ భుజాబలము గల్గినవాఁడు ప్రతాపరుద్రరా
డ్గజపతి వానితోడఁ గటకం బొకదుర్గమ దుర్గమైన; ద
క్కజముగ దానిపై గెలుపుగాంచుటతో నుదయాశఁ గన్నడ
ధ్వజ మరుణోదయం బనఁగవచ్చును భారతరాజకేసరీ!
30
వ.తొలుతం దొలిదెసకు విజయప్రస్థానంబుగా నరిగి గజపతిరాజ్యంబునందలి దుర్గంబు లుదయగిరి కొండవీడులు నద్దంకి వినుకొండ నాగార్జునకొండ దుర్గంబులును ముట్టడింపవలయును. అశ్వపతుల యధీనంబులగు రాచూరు ముదిగల్లు దుర్గంబులు ముట్టడించుపని యిప్పుడు కాదు. తురుష్కప్రభువు బిజాపురపు సులతానుకంటె గజపతి బలవత్తరుం డతనిన మునుముందు జయింపఁ బోవలయును. అశ్వపతుల బహమనీరాజ్య మైదు చెఱంగులుగా విభక్తమై పరిపాలితం బగుచుండుటం జేసి తత్తద్రాజ్య భాగంబులు ముట్టడిగొంట క్లేశకరంబు గాదు; అదియుంగాక వా రితరేతరాంతర్వైరమ్ముల రగులుచున్నవారు; తాదృశులతోడి సమరం బక్లేశకరంబు; పూర్వ దిగ్విజయయాత్రలో గజపతిరాజ్యంబును ముట్టడించుచున్నతఱిఁ జూచి బిజాపురప్రభువు మనరాజధానిపై సేనాసహితుం డెత్తివచ్చు నన్న సంశయంబు లేకుండ సమర్థుఁడైన నగరరక్షకు నిచట నియమింపవలయు ననుటయు-31
గీ.సమరవిషయ సమాలోచనమున నెల్ల
నక్షరాక్షర సంవాద మందుకొన్న
ప్రభువు హృదయమ్ము నెఱిఁగినవాఁడు మంత్రి
కదలె మెల్ల ననంతరకార్యసరణి.
32
వ.అంత నొక్కనాఁడు-33
మ.అలఘూత్సాహుని బూర్వ దిగ్విజయయాత్రారంభసన్నాహ దో
హలబుద్ధిన్‌ సచివాగ్రణిం గలసి కొల్వైయున్న శ్రీకృష్ణరా
యలు గోవిందుని నేత్రకోణముల బ్రాహ్మ్యక్షాత్త్ర తేజఃకణో
జ్జ్యలతల్‌ మొల్కలదేఱఁ బల్కె నిటు లాశాగర్భ కంఠధ్వనిన్‌.
34
గీ.ఓయి గోవిందరాజ! మే ముత్సవముగ
వెడలుచున్నాము పూర్వ దిగ్విజయయాత్ర
ప్రభుతకును లోచనముఁబోని రాచవీడు
ననువుమై నీదుఱెప్పల కప్పగించి.
35
క.పురపరిరక్షణ మనఁగాఁ-
దురుష్క సైనికులు తోడుతో సరిహద్దుల్‌
పరువడిమీఱఁగ రాఁ జూ
తురు; వారల నొక్కకంటితో నరయవలెన్‌.
36
గీ.దండనాథులలో సమర్థుండ వనుచు
నగరపాలనమున నీకు నాయకత్వ
మొసఁగుచున్నార; మిప్పురి నొక్కయీఁగ
వాలనీయక చూచి కాపాడవలయు.
37
వ.అని యాదేశించి-38
మ.తగువాఁడై తనయన్నకుం దగిన మేధావైభవస్ఫూర్తిఁ బెం
పగువాఁడై నృపనీతివిజ్ఞతకుఁ బ్రోవై బాహుశౌండీర్యపా
రగుఁడై యంచితధర్మ నిర్వహణ సారజ్ఞుండు గోవిందునిన్‌
నగరీపాలన నాయకత్వమ్మున సంధానించె భూనాథుఁడున్‌.
39
వ.ఇట్లు రాజపట్టణ రక్షాపట్టంబుఁ బడసిన గోవిందామాత్యుండు ప్రధానమంత్రి తిమ్మరసు నాదేశమ్మున శ్రీకృష్ణదేవరాయలవారు చమూసహితులై యుదయగిరి దుర్గంబు ముట్టడింపఁబోవుచున్నా రని పట్టణంబున ఘోషింపఁజేసె నయ్యెడ-40
పూర్వ దిగ్విజయయాత్రా సన్నాహము
గీ.కృష్ణవిభు పాణిజలజమ్ము లెత్తు నర్ఘ్య
దీధితులయందు నేదో మందేహదనుజ
మదగజంబుల కెఱ్ఱని మట్టిపఱపు
కరణిఁ దూర్పునఁ దోఁచె భాస్కరునియెఱుపు.
41
మ.ఉదయద్భాను సహస్ర రశ్మితతి రత్నోపాయనం బిచ్చి పెం
పు దలిర్పన్‌ వదనాబ్జమం దలుక కెంపుల్‌ రేఁగఁ గర్ణాటరాట్‌
పదవీభద్రుఁడు పూర్వ దిగ్విజయ చండశ్రద్దధానుండు సో
న్మద శత్రుద్విపకుంభ నిర్దళన శుంభత్సింహ రంహోగతిన్‌.
42
మ.గజఘీంకారము లశ్వహేషలును ఖడ్గస్వానముల్‌ వీరత
ల్లజ సింహారవ సాగరంబున ధ్వనుల్‌ సర్వంబు లీనంబుగా
విజయాశంసన మైకకంఠ్యమునఁ గావింపన్‌ నృపాలుండు త
ద్గజపత్యుద్ధతి మాన్పఁగా సమరయాత్రన్‌ నిల్చె హేలాగతిన్‌.
43
గీ.ప్రథన పటహధ్వనుల్‌ శుభస్వనముగాఁగ
సకలవీరులు వారయాత్రికులు గాఁగ
నుదయగిరిదుర్గ కన్యక నుద్వహింప
నరుగు వడువునఁ గృష్ణరాడ్వరుఁడు కదలె.
44
సీ.మకుటాగ్ర ఘటిత మౌక్తికమాలికా జ్యోత్స్న । ఫాలాగ్నిగోళదీప్తత నడంచి
నయనాంత సుమిత సంతతహాస మాధురి । గళశంఖ నీలరేఖలను గప్పి
కరధృతోజ్జ్వల శాతఖడ్గ కాంతిచ్ఛట । భూషణ ఫణిమణిస్ఫూర్తిఁ గప్పి
సమధిష్ఠితాశ్వరాజ తనూధవళరోచి । నవదాత వృషభవాహనము నొడ్డి
 
గీ.సమదగజపతిఁ గడిమిమై సంహరింప । హరుఁడు తాను బహిర్దర్శితాభిరామ
సత్త్వరూపమ్ముతో నున్నచాయ దోఁప । నరుగురీతిని గృష్ణభూవరుఁడు కదలె.
45
చ.సముచితమైన మంత్రమునఁ జాటిన తీరుపువెంట యుద్ధతం
త్రముదెస నేరుపుం గలుగు దట్టుఁడు తిమ్మరసయ్య సర్వసై
న్యమునకుఁ దాన నాయకత నందినవాఁడు పురస్సరుండుగా
నమరె భగీరథానుగమనాభిముఖామర వాహినీగతుల్‌.
46
మ.కవులున్‌ రాణులు రాట్పురోహితులు రాఁగా రాజభోగోచితో
త్సవరీతిన్‌ బయనించి సంగరముసేఁతన్‌ బెండ్లిగా నెంచు న
య్యవనీనాథునకున్‌ వినోదగతిఁ బ్రాపై యభ్యమిత్త్రీణతన్
బవుఁజుల్‌తీరిచె సర్వసైన్యవిభుఁ డప్పాజీ భూజాటోపుఁడై.
47
వ.సకలసైన్యంబు సప్తధా విభాగంబు నొనరించి యొక్కొక్క చమూభాగంబున కొండొక్క యధిపతినిగా నియమించె; నట్లు నిర్ణయింపఁబడిన కందనోలు పురాధీశ్వరుం డార్వీటి నారపరాజును, ఆకువీటి దుర్గాధ్యక్షుం డిమ్మరాజు రాయసము కొండమరసును, గండికోట దుర్గపతి కమ్మదొర పెమ్మసాని రామలింగన్నయు, వెలుగోటి దుర్గనాయకుండు వెలమదొర తిమ్మానాయండును, పంట వంశీయుఁడు గంగాధరరెడ్డియు నాలించుచుండ సర్వసేనాధ్యక్షుండు వారిం గనుంగొని-48
క.వినుఁడి చమూపతులారా!
వినుఁడీ శ్రీకృష్ణరాయ విభుమౌళి యను
జ్ఞను గొని ప్రాగ్దిశ ముట్టం
జనువారము మనము సప్తసప్తి కృపాప్తిన్‌.
49
మ.ప్రథనోర్వీభయదాకృతుల్‌ నడవుఁడీ! ప్రాగ్దేశ యాత్రా మహా
రథికుల్‌ ముందుకు సాగుఁడీ! గజపతిన్‌ రాపాడి తద్గర్వ ని
ర్మథనంబుం బొనరించి యయ్యుదయదుర్గం బందుకోఁగా నుదా
యుధులై సాగుఁడు! కృష్ణరాయ విజయోద్యోగానురాగోదయుల్!
50
వ.ఒక్క యుదయగిరి దుర్గంబకాక మఱిపెక్కుదుర్గంబు లీయాత్రలో గజపతుల యేలుబడిక్రింద నున్నయవి మన మాక్రమింపవలయును. అద్దంకి, వినుకొండ, బెల్లముకొండ, నాగార్జునకొండ, తంగేడు, కేతవరము, కొండవీడు మున్నుగాఁగల దుర్గంబులెల్ల ముట్టడించి గెలుపుగొని కాని మరలి రాఁగూడదు; ఉదయగిరి దుర్గాధ్యక్షుడు తిరుమల కాంతరాయలు ప్రబలుం డతనిఁ దొట్టతొలుత సాధింపవలయు.51
చ.పొదఁడు పొదండు ముందునకుఁ బోదము విక్రమవీరవృత్తి ను
న్మద గజపత్యహంకృతి సనాథవిభుత్వము కృష్ణ కీవలన్‌
గదిసిన వెన్నడిం దరుమఁగావలె నొట్టిడుకొన్న వారలై
యుదయగిరిప్రథా కబళనోత్కట కాంక్షలవెంట సాగుఁడీ!
52
మ.పటువౌ దక్షిణభారతావనిదెసన్‌ బ్రాగ్దేశధర్మారుణ
స్ఫుటరోచిన్‌ విమతాంబుదచ్ఛటలముంపుల్‌ తోఁచె; నుచ్చావచో
ద్భటధాటిన్‌ బవమానవేగమునఁ దద్ధార్ష్ట్యం బడంపంగ బా
సటగా సాగుఁడి! కృష్ణరాయ ధరణీశశ్రీ చమూనాయకుల్!
53
గీ.జైత్రవాదిత్ర జలద గర్జాస్వనమ్ము
మించునటు హెచ్చఱికలఁ దోఁతెంచునట్టి
సర్వసేనాధిపతి గళ స్వరములోన
నాంధ్ర కర్ణాటసేన ప్రయాణమయ్యె.
54
వ.అప్పగిది నుదయభూధరదుర్గంబు ముట్టడించు తమకంబునం గర్ణాటసార్వభౌముండు ప్రస్థానంబు సాగించిన వార్త నాలించి ప్రహరేశ్వరుండు తద్దుర్గాధిపతి కోటకాఁపుదలకు వలయు నేర్పాటు చేసికొనుచుఁ గటకాధ్యక్షుండగు గజపతికి రాయల దండయాత్రాప్రవృత్తి నెఱిఁగింపఁ బంపుటయు నాతం డుదయగిరి దుర్గరక్షణార్థంబు పరస్సహస్రసైన్యంబు నంప నాయత్తపడుచుండె.55
ఉదయగిరి దుర్గాక్రమణ కాలవిలంబము
ఉ.ఆయెడ నాయతోద్ధత రయంబునఁ దిమ్మరసయ్య వెంబడిన్‌
బాయక రాణువల్‌ నడచి వప్రముఁ జుట్టఁగఁ దద్వరూథినీ
తోయధిపొంగులో నుదయదుర్గము కొండొక నావగా నృపా
గ్రీయుని భావవీథి నలరించెను దౌదవులం బసందుగన్‌.
56
వ.అటు లక్కోట ముట్టడించుటకుం జేరిన కర్ణాటాంధ్ర సేనలు కార్యసాధనంబునకు యత్నించుచుఁ జండాయోధనంబు నెఱపుచుఁ గొన్నిమాసంబు లుండుటయు నంత నొకనాఁడు శ్రీకృష్ణదేవరాయప్రభుని దర్శించి తిమ్మరసు మహామంత్రి యిటులు ముచ్చటించె -57
క.ఆదుర్గము నీదుర్గముఁ
బోఁదఱిమినయటులు సాఁగఁబోదు; చమూశి
క్షాదక్షుం బుదయాద్రి మ
హాదుర్గం బిది జయింపనగు మెలఁకువమై.
58
గీ.ఒకఁడు రెండును గాదు మాసకతిపయము
నడచిపోయెను జూచుచుండఁగనె; మఱియుఁ
గడచిపోవచ్చు; మనము దుర్గమ్ముఁ బట్ట
వచ్చునేకాని కాలమ్ముఁ బట్టఁగలమె!
59
చ.తెలివికి శౌర్యధైర్య గుణదీప్తికిఁ దావలమైన ఱేనిలో
నలసతయన్న లక్షణమునందు విలక్షణమైన యొక్కయు
జ్జ్యల రుచిరత్వమున్న; దది సంగరవీథి విరోధి కంఠ ని
ర్దళన కళాకనన్నిశితధారము హేతికి జోడుగా నగున్‌.
60
చ.అదనగుపట్టు నానుకొనునంతటిదాఁక మహాప్రయోజనా
భ్యుదయములోనఁ గోరియును నూరకయున్నటులుండి, యంతలోఁ
బదనగుకత్తిపై నలసభావపుఁ గంచుక మూడఁదీయు ట
న్నది రణశిల్పలక్షణ రహస్యము వీరులయం దెఱుంగమే!
61
ఉ.ప్రాభవదీప్తిమద్గతి ధురంధర మంథరమైన వీరమ
త్తేభమ వీవు; నీ నిజవిజృంభణ వేగములో నవశ్వ కుం
ఠీభవదాత్మ శత్రుతతి నేఁ గనులారఁగఁ జూచెదన్; సురేం
ద్రాభ పరాక్రముండ వుదయాద్రి భవత్పరిపాల్యమై తగున్‌.
62
గీ.గిరిదరీ నిర్గమ త్క్రుధాతుర మృగేంద్ర
పాళిలో క్షుధార్తము శరభమ్ము పగిది
నుదయదుర్గ బహిర్వసుధోపయాత
యోధసార్థంబుఁ జెండి తాయోధనమున.
63
శా.సంతోషావహమౌ జయప్రసవ మాశాలంబమానమ్ము దు
ర్గాంతర్భాగముఁ జొచ్చినన్‌ సురభిళంబై తోఁచు; నద్దాని కా
వంతేనిన్‌ మఱి జాగుసేయక యనల్పశ్రద్ధ సూపంగఁ జె
ల్లింతున్‌ నాదగువంతు దేవర భుజాలీలా విలాసార్థినై.
64
వ.ఇఁక నీ దుర్గమ్ము ముట్టడికిఁ గాలవిలంబనము కర్జమ్ముకాదు కోటలోని కెట్టి యుపాయంబుననేనిం జొచ్చి తత్రత్య సేనానివహంబుఁ జెండాడి దుర్గాధ్యక్షుండును వీరాగ్రేసరుండును బ్రతాపరుద్రగజపతి పితృవ్యుండు నగు ప్రహరేశ్వరపాత్రుఁడు మున్నుగాఁ గల వారిం జెఱఁబెట్టవలయు; నయుతాధిక సంఖ్యాకంబగు పదాతివ్రాతంబుతోఁ జతుశ్శతాధికంబగు నాశ్వికబలంబుతో దుర్గాంతర్భాగము సురక్షితం బగుచుండె; నదియుంగాక కటకంబునుండి గజపతి యేతద్దుర్గ సంరక్షణంబునకై కొంతవాహిని నంపుచున్నట్లు వార్త వినవచ్చినది; సేనాసహాయుండ నేనుబోయి త్రోవలో దాని నడ్డగించుట ప్రథమ కరణీయంబని మఱియును-65
గీ.అతఁ డసాధారణుండు రాయసమువంగ
సమ్ము రతనమ్ము కొండమర్సయ్య - వాని
వాహినీ నాయకతకు దుష్ప్రాప మగునె!
యుదయ భూధరదుర్గ మియ్యది నృపాల!
66
మ.అని పల్కంగఁ బ్రధానమంత్రి వచనన్యాసంబుతో సింహ సం
హననుం డావిభుమౌళి నేత్రయుగళం బారుణ్యపూర్ణంబు వి
చ్చినదయ్యెన్; గొని తెచ్చినట్టులుగఁ దోఁచెన్‌ ఱేనికిన్‌ మంత్రి క
న్గొనలందుం బ్రథితోదయాచలగుహాగుప్తారుణశ్రీరుచుల్‌.
67
ఉ.ఆయెడఁ దండ్రియట్టిఁడు మహాసచివుండు కుమారమూర్తియౌ
రాయల లోచనాంచల పరాక్రమరేఖలలోన నేయుపా
దేయము గుర్తువట్టెనొ, కృతిత్వము నందినవాఁడు వోలెఁ గం
దోయి సమార్ద్రమై యెసఁగఁ దోరపుబీఱము జాలువాఱఁగన్‌.
68
గీ.నృపతి వీడ్కొని వచ్చు మంత్రివరుఁ డాత
“డౌర! మౌనగభీరమౌనట్టి ఱేని
యాత్మ నా కంది పుచ్చుకొన్నట్టు లుండు
నొక్కనాఁ; డొక్కనాఁ డది యుద్ధతమ్ము.
69
చ.అలసత నీయెడం గలదటంచు ధ్వనింపఁగఁ జేయు వృత్తితోఁ
బలుకుట కాదు : వాచ్యముగఁ బల్కితి; దానికి నాగ్రహింపఁ డు
జ్జ్వలమతిమన్మహాకృతి రసాతలనేత పరేంగితజ్ఞుఁ డ
య్యలఘుఁడు మాటలాడకయు నాడినయట్టులెయుండు నాయెడన్‌.
70
ఉ.ఆ ధరణీబిడౌజుఁ డుదయాచల దుర్గ మనోహరేందిరా
రాధన సాధుపాదయుగ రమ్యుఁడు, స్థానమునందుఁ గ్రోధి, హే
లాధృత వజ్రఖడ్గ విగళద్ద్విషదస్రుఁడు, వానితో హితో
ద్బోధకరీతిఁ బల్కుటది ముచ్చట నా కిటు బాల్యమాదిగన్‌.
71
ఆ.వె.ఉదయగిరియ కాక యున్నవి మఱియెన్నొ
యలుపమైన కోట లాక్రమింపఁ;
గ్రమ్ముకొన్న కటకగజపతి యేల్బడిఁ
గృష్ణఁ గడవ నడ్డగింపవలయు.
72
వ.అద్దంకి, వినుకొండ, నాగార్జునకొండ, బెల్లముకొండ, తంగేడు, కేతవరము మున్నగు దుర్గంబుల ముట్టడి యదియొక శ్రమసాధ్యమైన కార్యము కాదు. కొండవీటి దుర్గాక్రమణంబుతోఁ బూర్వ దిగ్విజయయాత్రకుఁ జారితార్థ్యంబు.”73
మ.అని భావాంబుధి వీచికాంతర నదద్యాదశ్ఛటల్‌ వోలె రేఁ
గిన యాశల్‌ గుణరత్న మోహనతఁ బొంగింపంగ నమ్మంత్రి నిం
గిని నేలం గొని మ్రింగఁగా వలఁతి సాగించెన్‌ మహాశంఖ ని
స్వనితోచ్ఛృంఖల వాహినీవితతిఁ గృష్ణాతీరయానోద్ధతిన్‌.
74
క.తానై సైనాపత్యము
నూనినవాఁ డడ్డగించె నుద్దవిడిఁ బరా
నూన చమూసంతతిఁ గృ
ష్ణానది యొడ్డునకుఁ గడచి నడవకయుండన్.
75
గీ.ఉదయశైలముకోట కాపుదల పొంటె
గజపతిప్రేషితము మదోత్కటము సేన
చటులధాటిఁ జరింప గేసరి విధానఁ
బొడిచె నొకయడుగేని ముందిడఁగనీక.
76
శా.తాటస్థ్యంబు వహింపఁగా సతము నాత్మంగోరు నాతండు పో
రాటంబందున ఖడ్గపాణియయి వీరద్రౌణియై మీఱి యా
ఖేటం బట్టులుగాఁ గడంగి తొడరెన్‌ గృష్ణా తటోర్వీ వనీ
వాటిన్‌ మామిడిపూఁత రాల్చినటు రాల్పన్‌ శత్రుకంఠంబులన్.
77
ప్రహరేశ్వరపాత్రుని రహస్యాలోచనము
వ.వాహినీసహాయుండు తిమ్మరసు గజపతిసైన్యంబులు నదీతటంబు దాఁటిరాకుండ నెప్పటికప్పుడు నిరోధించుచు నుదయగిరిదుర్గవిజయైకకాంక్షం - గృష్ణదేవరాయప్రభుపై నెల్లమనస్సు నిలిపియుండె; నటులు కొన్నాళ్లు గడచుటయు నట నొక్కనాఁడు ప్రహారేశ్వరుం డుదయాచల రహోగృహమ్మునకుఁ గొందఱఁ బధానవీరుల రావించుకొని-78
శా.ఎన్నాళ్లైనవి! యెన్నియైనవి నెలల్! హేరాళ బాహాగ్ర భా
స్వన్నిస్త్రింశ మహోగ్రయోధుల సహస్రం బస్రపాథోధి నా
సన్నంబైనది; కృష్ణరాయల చమూవ్రాతంబు దుర్దాంతమై
మిన్నున్‌ ముట్టినయట్లు కోటవెలిభూమిన్‌ గ్రమ్మి చిందాడెడిన్.
79
చ.తొడరుకడంక నియ్యుదయదుర్గ మభేద్యము నాక లోఁ జొఱం
బడఁగ శనైశ్శనైశ్చరితవర్తనులౌదురు వారు; కోట నె
య్యెడఁ గనుఁగొన్న సైనికులకింత క్షుధాశమనం బొనర్పఁగా
నిడుటకుఁ గూడుఁగూరయునునేఁ గఱవైనది చూడఁజూడఁగన్‌.
80
చ.వెలుపలినుండి కోటదెసఁ బేరిమివచ్చు పదార్థ మెన్నియో
నెలలుగరాక కొల్లవడి నిల్చెను; లోపలనున్న కొల్చు ని
ల్వలు మెలమెల్లఁగాఁ దఱుఁగువట్టెను; బట్టకయుండు నెట్లు! ల
క్షలు గడియించెనేనిఁ దినఁగాఁ దినఁగా నది యేమికావలెన్!
81
మ.తనకున్‌ మెండగుతిండి చిక్కక క్షుధాంతఃక్రోధుఁడై సైనికుం
డనుకూలుండును బ్రాతికూల్యమును జేయంబోయెడిన్‌ ఱేని కే
మనిచెప్పన్! నృపనీతి నీదృశరహస్యజ్ఞుండుగా విన్నవాఁ
డను నా రాయలఁగూర్చి; తిమ్మరసుదండన్‌ జండధీకుం డగున్‌.
82
ఆ.వె.ఇన్ని నెలలదాఁక నిటు చమూవితతితో
మఠమువైచి దుర్గమార్గ మడ్డి
రాచపాడినెఱపు రాయలపోఁడిమి
పెంపునెఱుఁగ బ్రహ్మవిద్యయగునె!
83
వ.మనమింక నుపేక్షాలవంబునకేనిఁ దావీయరా దింతవఱకు నెఱపివచ్చు సంగరం బుపేక్షయగునే యనంగాదు మనము నేఁటిదాఁక స్వరక్షణముమాత్రమ చేసికొనుచున్నవార మిటమీఁదఁ బరులం దఱిమివైచుటకును సర్వోద్యుక్తులము కావలయును; రాయలు ఖడ్గసంగ్రామమునఁ జతురుండన వింటి నతని నైపుణ్యం బెట్టిదో కనుఁగోవలయునని వేడ్క పొడముచున్నదని మఱియును-84
ఉ.వంచితబుద్ధి దుర్గమును బట్టఁగ వచ్చుట కాక కోటకుం
బంచలఁ గాఁపురంబునకు వచ్చినవాఁ డనిపించు; లోని కే
తెంచు పదార్థముల్‌ నడుమఁ దెక్కలిసేయునె! తిండిమాలి శు
ష్కించుటఁజూచి బంట్లపయిఁ జేతులుదూయుతలంపు మాయురే!
85
చ.అని కనులెఱ్ఱనెఱ్ఱ విరియన్‌ బ్రహరేశ్వరుఁ డుద్ధతుండు వె
చ్చని యొకయానవెట్టెఁ దనసైనికులన్‌ గృతదుర్నిరీక్ష్య శి
క్షణులను; శత్రులం దఱిమికాని భుజింప మటంచుఁ బట్టువీ
డని జగజెట్టులం గడుఁ గడంకకుఁ దెచ్చుచు నెచ్చరించుచున్‌.
86
చ.తన పదివేలపైఁగల పదాతిబలంబును నాల్గునూర్లు మిం
చిన హయసైన్యమున్‌ మదముచిందెడి దంతిబలంబు దుర్గర
క్షణమునయందుఁ గంకణముకట్టిన యట్టులు బిట్టురేఁగునం
తన ప్రహరేశ్వరుండు సముదాత్తపరాక్రమ మగ్గలింపఁగన్‌.
87
ప్రహరేశ్వరుండు : రాయలు : ద్వంద్వసంగరము
శా.ఆవిర్భూత మహాక్రుధోజ్జ్వలుఁడు తానై యబ్బురంబైన వీ
రావేశంబునఁ గృష్ణరాయలను మీఱన్‌ ద్వంద్వసంగ్రామ రే
ఖావిన్యాసముఁ జూపఁగాఁ దలఁచిరాఁగా, నాఁడు కర్ణాటరా
డ్దేవాధీశుని చిత్తవీథిఁ జివురొత్తెన్‌ నూతనోత్తేజమున్‌.
88
ఉ.ఉద్యదుదార వీరవిభవోజ్జ్వల లోచన రక్తపద్మయు
గ్మద్యుతి సానగాఁ బదనుగాంచిన కైదువుఁ జేతఁబట్టి గ్రీ
ష్మద్యుమణి ప్రభాంతర రమాపతిభక్తుఁడు కృష్ణరాయ ల
స్యుద్యతుఁడైన యుత్కలునిఁ జూచెను బండువుగాఁగ ముంగలన్.
89
చ.గజపతికిం బితృవ్యుఁడును గాఁకలుదీఱినజోదు శాత్రవున్‌
గజిబిజిసేయఁగా నహమికన్‌ బ్రహరేశ్వరపాత్రుఁ డేచి య
క్కజముగ నెక్కటిం బొడువఁగా వడి వచ్చినరాక కృష్ణరా
డ్భుజ నిజవిక్రమాంబునిధిఁ బొంగులుతీర్చె నభంగభంగిమై.
90
మ.బహుకాలమ్మునుదొట్టి రాయల భుజాపాండిత్యవైయాత్య ధూ
ర్వహతం జూడఁగ ముచ్చటల్‌ పడెడి వీరవ్రాత ముత్సాహ స
న్నహనంబై యిరుపజ్జలన్‌ నిలచినంతన్‌ శాతహేతిద్వయీ
మహితోచ్ఛ్రాయ తటిద్రుచుల్‌ దెసలఁ గ్రమ్మన్‌సాఁగె వాగ్గర్జలన్‌.
91
శా.ఆజానేయ యుగాధిరూఢు లగువా రంతన్‌ బరాక్రాంతి హే
లా జంఘాకరికుల్‌ పరస్పరము గెల్వన్‌ గత్తులంబోర ను
త్తేజంబుం గొనఁ గొంతసేపటికి రక్తిన్‌ హేతి యొక్కండుగాఁ
దేజీ యొక్కఁడు వీరుఁ డొక్కఁడునుగా దీపించె నద్వంద్వమై.
92
మ.క్షణమం దశ్వయుగంబు వేఱిమి వడంగా నంతలో నుత్తర
క్షణమం దిర్వురికత్తులుం గలసిపోఁగా నంతలో రెండురెం
డునుగా స్పష్టముగాఁ గనంబడఁగఁ బండో కాయయో తేల్పఁజా
లని గెల్పై యిరువాఁగుజోదులును లీలంజూచి రాకోల్తలన్‌.
93
ఉ.పొరిఁబొరిఁ గుత్తుకన్‌ దునిమెఁబో! యిదె రాయలకత్తి; వేఁడినె
త్తురు దొరఁగంగ గుండియను దూసె నదే ప్రహరేశుహేతి యం
చిరుతెగలందుఁ జూపఱును నెప్పటికప్పుడు నిల్చి యార్వ న
క్కరణి దురంబునం దొకనికంటెను నొక్కఁడుగాఁగ మీఱఁగన్‌.
94
ఉ.రాయల శాతహేతి సమరంబున నిల్చిన భాగధేయ ము
చ్ఛ్రాయముకల్మి నొక్కయెడ సంతసమారఁగ, నొక్కవంక శం
కాయుతి గెల్పునం దొదవఁగాఁ బ్రహరేశ్వరపాత్రుఁ డున్నదుం
డై యెసరేఁగి పోరువెలయం బొనరించె జిగీష పైకొనన్‌.
95
ఉ.ఆపగిదిన్‌ బెనంకువ జయప్రతికాంక్ష మునుంగు నుత్కలో
ర్వీపతి పిన్నతండ్రి నెదిరించుచు రాయలు సూక్ష్మసూక్ష్మ రే
ఖా పరిణద్ధ పావక శిఖాసఖ శాత కృపాణయుద్ధ లీ
లా పరిపాక వైభవ విలాసముఁ జూపెఁ గ్రమక్రమోద్ధతిన్‌.
96
గీ.ఉభయ ఖడ్గాహతి ధ్వని యురలు కతన
వినఁబడవొ! కాక వాగ్విడంబన మొనర్ప
వారి కనభీష్టమో యేమొ వీరయుగళి
పలుకు బీఱపుఁబల్కు లెవ్వరును వినరు.
97
శా.హోరాహోరిగఁ బోరి వారొకని యాయుర్మర్మ మొక్కండు చే
యారంబట్టిన తన్పు నందుటయుఁ బెంపౌస్పర్థలోఁ గృష్ణ భూ
దారగ్రామణి పాణిఖడ్గముఖ మంతన్‌ గుండెలోఁ గాఁడి బా
ధారూఢిం బ్రహరేశ్వరుండు జహదంతర్ధైర్యుఁడై యల్లనన్‌.
98
వ.ద్వంద్వసమరంబు నుడిగిపోవుటయ యప్పటికి లగ్గుగా వగచి మగిడి రాయలను గృపాణరణంబున గెలుత మని యాశపెట్టుకొని దుర్గాంతర్దేశంబునకుఁ జేరం జనుదెంచె; నచట శ్రీకృష్ణదేవరాయలు పాత్రప్రహరేశు నట్లు కత్తివ్రేటున నొప్పించినవాఁ డతని కరవాల సమరచాతుర్యంబునకు లోలోన మెచ్చుకొనుచుఁ బ్రహరేశు నుక్కడంచికాని విడువరాదని నిశ్చయించుకొనె; నా రాయలు రాయసము కొండమరాజు మున్నుగాఁగల వీరులం గాన్పించుకొని.99
ఆ.వె.కత్తి పదను గలుగు కడగంటి చూపుతో
నుదయశైల దుర్గ మొదిగి రాఁగ
నహితుఁడైన యట్టి ప్రహరేశు గుప్పిటఁ
బట్టుకొనుచు వారి కిట్టు లనియె.
100
ఉ.పట్టిన పట్టునన్‌ నెలలు పైఁబడె మెల్లఁగ; నెంతకాల మీ
ముట్టడి యిట్లు సాగవలె! ముందరఁ దొందరమైఁ గడంగి యీ
ఘట్టములోన గెల్పుఁ గొనఁగా నగు; నా పయిఁ గొండవీడు చే
పట్టుకొనన్‌ వలెన్‌ జలముపట్టి; యిదంతయు నెప్డు కావలెన్!
101
క.ఇక మూఁడు నాళ్ళ లోపల
సకలంబును దుర్గ మిదియు స్వాధీనముగాఁ
బ్రకటితము సేయనగు; నిం
తకు సైనికపాళి కాన నడపుట చెల్లున్‌.
102
ఉ.దిగ్గన ముట్టడిన్‌ నెఱుపు తెంపరులౌ మన సైనికాగ్రణుల్‌
లగ్గలు పట్టఁగా వలె విలంబన మీయెడ సాగరాదు స
మ్యగ్గతి మీదెసన్‌ గడు సమర్థత మేల్కనుగాక! యింక నీ
ప్రాగ్గిరిదుర్గవీథి నెగురన్‌ వలయున్‌ మన వైజయంతికల్‌.
103
గీ.తాను బ్రహరేశ్వరుఁడు సముద్ధతిఁ గడంగి
తీర్చి దుర్గ బహిర్ద్వార దేశమునకు
నరుగు దెంచుట - కరవాలు నందుకొనుట
దుర మొనర్చుట యెంత తెంపరితనమ్ము!
104
మ.అది కా దాతని నంతతో విడుచుటం దాంతర్య మొండొక్కఁ డు
న్నది; దుర్గం బిది ముట్టి లోనఁ జరణన్యాసంబు గావించి, యు
న్మదుఁ డవ్వాని శిరోధినాళమును దున్మన్‌ గూడునేకాని, కూ
డదువో! మాదు కృపాణనైపుణిని జూడన్‌రాఁగఁ బోకార్చుటల్‌.
105
చ.మన మనురక్తమౌ నటులు మత్కరవాల కళా విలాసముల్‌
కనుఁగొనుపొంటె నొక్క యవకాశ మొసంగితి నంతెకాని, యె
వ్వనికిని జెల్లునే! సకల భారత ధారుణిఁ గృష్ణరాడ్భుజా
గ్ర నిశిత జాగ్ర దుగ్రతర ఖడ్గహలాహల జిహ్వ లార్పఁగన్‌.
106
చ.తరములనుండి యింతబలితంబుగ ఱంపిలు మాదునేల్బడిన్‌
దిరపడియున్న దుర్గమును దెంపరి యగ్గజరాజు పట్టి కా
వరమున గద్దెనెక్కునొకొ! స్వామ్య మిదెవ్వరిదన్న శంకలే
దొరయఁడు మత్కరాసి నపుడొక్క యదృష్టము వానికుండుటన్‌.
107
మ.ఇదె! కర్ణాటవిభుప్రతిజ్ఞ వినుఁడా! యీ దుర్గమున్మెట్టి సో
న్మదుఁడౌ నుత్కలనాథుగుండె యడలందన్‌ దత్పితృవ్వున్‌ నిరా
స్పదుఁగాఁజేసి తదీయమౌ శిరము మాపాదంబునం ద్రోసి చే
యుదు మాపై నఘమర్షణం బపుడుకావో! మా కనుష్ఠానముల్.
108
గీ.అని ధనుష్టంకృతిధ్వనియంచు లొరయు
ధీరగళమునఁ గృష్ణకుమార విభుఁడు
పలికిన ప్రతిజ్ఞ యుదయాద్రి వప్రవీథిఁ
జించెఁ గ్రౌంచాచలము తోడుసేఁత నెంచి.
109
వ.ఆంధ్రకర్ణాట యోధసంతతి రాయల తీవ్ర ప్రతిజ్ఞ నాలించి రంతఁ బ్రాణత్యాగంబులకు వెనుదీయనివారు స్వామిభక్తితో నిస్సమానఖ్యాతిం గొన్నవారు స్వధర్మాచరణంబునం దచంచల నిష్ఠగలవారు నుదయాచల దుర్గాక్రమణ రహస్యంబులు గుర్తించినవారు నగు నవ్వీరులెల్లరు ఱేనియానయుం బ్రతినయుం దలంచుకొని యుండి రయ్యెడ-110
రాయలవారి యుదయదుర్గాక్రమణము
మ.అల కృష్ణావనినేత చేసిన ప్రతిజ్ఞారంభ మా సర్వసే
నలకున్‌ మేల్కొలుపై తనర్చుటయు నంతన్‌ నిద్రలంబాసి తం
ద్రలకున్‌ రోసి యపూర్వమౌ కడఁక శ్రద్ధాసక్తులం దన్మహా
చల దుర్గంబును లగ్గపట్టుటకు దీక్షంబూని రెవ్వారలున్‌.
111
చ.అనుపదమందుఁ గృష్ణవిభునానఁ దలంచుచు నగ్నిదూఁక జం
కని పెనుజోదు లాంధ్రులును గన్నడులున్‌ గడుమీఱి తెల్ల వా
ఱెనొ తెలవాఱలేదొ కసిరేఁగి వికర్తనదీప్తు లట్లు చ
య్యన నుదయాచలంబు సుడియంగొన నాదట నగ్గలించుచున్‌.
112
చ.పదను కటారులన్‌ దళుకువాఱెడి పెన్‌పిడికిళ్ళతోడ భీ
ప్రద వివిధాయుధ ప్రతతిఁ బట్టిన పాణులతోడ వీరసం
పద కుదురౌ నభీరుభటవర్గము వేనకువేలు దుర్గ మ
య్యది యద్రువంగనార్చుచుఁ దదాక్రమణంబున కుత్సహించుచున్‌.
113
చ.అనితరసాధ్యమై తమకు నంతును బొంతును నందకుండె ని
న్ని నెలలనుండి దుర్గ మిది నేఁ డొకనాఁటను ముట్టడింప నె
ట్లనువగునంచు వారి హృదయంబుల సంశయలేశమేని లే
దనఁగ, మహావిభుండయిన యాతని యాజ్ఞ ప్రతిజ్ఞ యట్టిదౌ.
114
చ.ఉరవడి పోరఁ బెంపెసఁగు నుత్కల వీర సహస్రమున్‌ మదో
ద్ధుర గజయూధ మేచి పరితోవిహృతిం బొనరింప లోనికిం
జొఱఁబడు కాంక్షఁ బ్రాణములు చూడక రాయలవైపుజోదు లు
క్కఱఁ బ్రతివీరులం దునిమి యాంత్రపుఁబ్రోవులు వెట్టి రయ్యెడన్‌.
115
శా.కండల్‌దేఱిన కాకదీరిన భుజాగ్రం బొక్కఁ డొక్కండుగాఁ
జండాసిన్‌ గదళీసుఖంబుగను ద్రుంచన్‌ ద్రవ్వి తండంబులై
తొండంబుల్‌ పడి పాదముల్‌ పడి గజస్తోమంబు మొండెంబు లే
కాండంబయ్యెను గోటవెల్పలను సింహద్వార దేశంబునన్‌.
116
శా.ద్వారక్షోణిని రక్షసేయుచు సముద్దాంతంబుగా మీఱు న
వ్వీరవ్రాతము కారుటగ్గి పగిదిన్‌ వేగింపరాఁగా ఝరీ
ధారాపాతముగాఁ దెనుంగులు దునేదారుల్‌ తుటారించి చ
ల్లాఱం జేసిరి వారి యుద్ధతి నిశాతాసిప్రసారంబునన్.
117
చ.అడుగడుగున్‌ బురోవిహరణాదరణోర్జితమైన స్వాగతం
బిడినటులుండఁ గృష్ణధరణీశుఁడు తా నొకతేజ నెక్కి “యొ
క్కఁ డితఁడ చాలు” నంచు ననఁగాఁ గరవాల కరాళకాంతితో
గుడిగొను నెమ్మొగంబునన కూల్చె నరాతి మహాంధకారమున్‌.
118
మ.“ఇది మాయేల్బడిలోనిదుర్గ; మిట మాదేస్వామ్య; మిం దుండఁగూ
డద యెవ్వారికిఁ బొండు ప్రాణములతోడన్‌ మీ గజాధీశుఁ డ
స్మదఖండోజ్జ్వల వాహినీ మకరదంష్ట్రాశాతనిస్త్రింశ క
ష్టదశన్‌ గూలె; నతండు కృష్ణుని కటాక్షశ్రీల జీవించుతన్!
119
చ.ఎది యెటులైన వానికిఁ బితృవ్యత నేఁడును దుర్గ నేతృతా
పదమున నుండె; వాని నిలుపన్‌ బ్రహరేశుని మీరు మీరు బ
ట్టిదులగు జోదు లెల్లరుఁ గడింది మగంటిమి నాదుకొండు నేఁ
డిదిగొ కృపాణపాణియగు కృష్ణుఁడు వచ్చినవాఁడు జిష్ణుఁడై.
120
మ.ఒక ధర్మం బనిలేక దుర్గ మిది మాయోపాయముం జేసి ము
ట్టుకొనం జెల్లెను నాఁడు; చెల్లునొకొ నేఁడున్‌ గృష్ణరాడ్భూమినా
యకుముందున్‌ బ్రహరేశపాత్రుఁడనఁ గట్టా! యేఁడిరా! తచ్ఛిరో
మకుటాగ్రంబును గాలఁదొక్కి యపు డంభస్స్నానముం జేసెదన్‌.
121
మ.అని గర్జిల్లుచుఁ బెల్లు నెమ్మొగము కోపాటోప కంఠాలమై
జననాథాగ్రణి రాయ లుత్కలచమూసాలద్రుమాళిన్‌ దునా
తునుకల్‌గా నభిరామభంగి మెయిఁ దోడ్తోఁ ద్రుంచుచున్‌ వ్రాలిచూ
పెను ఖడోత్సవలీల; మత్సరత పర్వెన్‌ వీరవర్గంబునన్.
122
గీ.గజముల హయంబులం బట్టి కత్తిపీఁట
నరఁటిదూఁట చక్రాలుగా నఱకునట్లు
తఱుగు నరపతి కరవాలధార నాఁడు
తిరుగులేని పరీపాక సరణి మించె.
123
ఉ.కాలువగట్టునం బడిన గండి దెసన్‌ బ్రవహించు నోడికం
బోలిన శత్రువాహిని గుముల్‌గుములై యల కోటనుండి యు
ద్వేలముగాఁగ ముందు కరుదేరఁగ ద్వారధరిత్రి రక్తజం
బాలము చేసి కట్టెఁ గరవాలముతో నృపుఁ డానకట్టగన్‌.
124
వ.దుర్గద్వారమేదినీతలంబునఁ గొన్నిగడియ లవ్వడువునఁ జండాహవంబు నడచుటయు దుర్గాంతర్భాగమున రక్షణోద్యోగులైన యసంఖ్యాక సైన్యములు క్రమంబున నయ్యెడకువచ్చి పోరియుఁ గర్ణాటాంధ్రవీరుల దాడి కాఁగలేక కృచ్ఛ్రప్రాణులై జడిసియు దవ్యులనుండి పాఱియు నఱుకఁబడి మడిసియుఁ జెల్లాచెదరైపోయి రట్టితరుణంబు నరసి రాయలవారి పక్షంబున సేనలు లోనికిం జొచ్చి పోయి యెదురైన వారిం దఱిమివైచుటయు-125
శా.సానల్‌దేఱిన యోధరత్నములతో సర్వాంధ్ర కర్ణాట సే
నానీకంబులు వెల్గుప్రోవులుగ డాయన్‌రాఁగఁ జీకట్లు నాఁ
గా నాగేంద్రుబలంబు లయ్యుదయదుర్గ శ్రీదరీగర్భవీ
థీ నిర్బంధ దశావశాత్మతను జెందెన్‌ భీతభీతమ్ములై.
126
వ.అట్టి సమయంబున-127
గీ.అగ్గపడు మాకుఁ గటకనాయకుని పీఠి
లగ్గపట్టితి ముదయశైలంబుకోటఁ
గార్య మల్పావశిష్టమౌ కతన నిపుడు
కడుగఁబడదయ్యె మాఱేని ఖడ్గధార.
128
మ.అహరారంభమునన్‌ బటీరజలధారా భ్యంజనస్నాన ధ
ర్మహఠాత్సంక్రమితాంతరాయమునఁ దీవక్రోధుఁడై యుండె మా
మహిపాలాగ్రణి కృష్ణరాయలు, గజక్ష్మారాట్పితృవ్యుండునౌ
ప్రహరేశుం డతఁ డేడ! వానితల నిల్పన్‌ బొండు పొం డుత్కలుల్!
129
గీ.అని విజయపట్టణాంధ్ర వాహినులలోనఁ
గంబునిస్వాన సశ్రుతికంబుగాఁగఁ
బొంగు వీరవచోఘోషమున మునుంగు
రాయల కరాసి యుదయదుర్గమునఁ దేలె.
130
ప్రహరేశ్వరపాత్రుని శరణాగతి
ఉ.ఆ జగజెట్టి రాయలకు - నావిజయాకృతి - కా ప్రచండ బా
హా జితవైరివీరతతి - కంచితమంగళ రత్నదీప నీ
రాజన మిచ్చు నోజ తనరన్‌ బ్రణిపాత పురస్సరజ్జహ
త్తేజుఁడు శత్రుమంత్రి యరుదెంచెను సోపదపాణిబంధుఁడై.
131
మ.హతశేషోత్కల వీరసైన్యము గతాహంకారమై కృష్ణభూ
పతి కర్పించెడి నిండుజోతలఁ గృపాపాంగాంబుదం బొండు భి
క్షితమై చిన్కెను; సన్నసన్నఁ బులకించెన్‌ దుర్గలక్ష్మీమనో
జ్ఞ తటిద్గాత్రము; కాంచె రాయలు పురోంచత్ప్రత్నరత్నద్యుతిన్!
132
క.అరుదెంచి వెఱపు నడఁకువ
బెరయన్‌ శ్రీకృష్ణరాయ పృథివీపతికిన్‌
శరణాగత వత్సలతా
ధురంధరున కిట్లు భక్తితో వినిపించెన్‌.
133
వ.ప్రభూ! కటకేశ్వరుండగు గజపతికిఁ బితృవ్వుండు నుదయశైలదుర్గపాలనాధికృతుండు నుత్కల వీరశిరోమణియు నగు ప్రహరేశ్వరుండు దేవర చరణసరోజసన్నిధానమునకు నవ్యోపాయనంబుగా నంపిన నవరత్నభాసురంబగు నుష్ణీషంబును సమర్పించుకొని వినిచిన మనవి యథాగదితంబు వినిపింతు నది యెట్లనిన-134
ఆ.వె.ఉదయశైల దుర్గ మిది పరాభేద్యము
దీని ముట్టడింపఁగా నెవండు
సాహసింపలేద సారవిక్రమబాహు
లేయ! కృష్ణదేవరాయ! నేఁడు.
135
ఆ.వె.ఎట్టి ప్రతినయేనిఁ బట్టి నెగ్గించుకోఁ
గలుగు వలఁతి వనుచుఁ దెలిసికొంటిఁ
గరుణ కల్మి పదనుగల నీదు తరవారి
ధార మాకు శరణదాత్రి యగుత!
136
ఆ.వె.మైత్రినెఱపి లోనిశత్రుత విడువంగ
ఱేని చరణ సన్నిధానమునకు
నర్పణం బొనర్తు మస్మచ్ఛిరోధార్య
మాణమైన రత్నమకుట మిద్ది.”
137
మ.అని పాత్రప్రహరేశుఁ డాడుమనువాక్యంబుల్‌ యథోక్తంబు వి
న్ని నవోపాయనమౌనటుల్‌ మణిమయోష్ణీషంబుఁ దత్పేషితం
బును గృష్ణార్పణమంచు రాయల పదాంభోజాతముల్‌ సోఁకున
ట్లునిచెన్‌ మెల్లఁగ నుత్కలుండగు నమాత్యుం డాతఁ డుత్కంపియై.
138
చ.ఘనవీరాళి శిరోధినాళ రుధిరాక్తంబైన ఖడ్గంబు దిం
పని బాహాగ్రముతోఁ ద్రిలింగ ధరణీపాలుండు ప్రత్యగ్రలో
చన వహ్నిచ్ఛటఁ దా నొనర్చిన ప్రతిజ్ఞన్‌ జ్ఞప్తికిం బట్టి ని
ల్చెను గర్తవ్యవినిశ్చయంబునఁ దనర్చెన్‌ లిప్తకాలంబుగన్‌.
139
క.ఆలిప్తలోన సైనిక
పాళిం గలకల మొకండు పర్విన నుర్వీ
పాలకుఁ డది యేమగు నని
యాలించుచుఁ గాంచె నొక మహాతేజస్విన్.
140
వ.అటు లవలోకితుండు ప్రధానమంత్రి తిమ్మరసయ్య తియ్యంబు మెఱయ శ్రీరాయలను జయవాద పురస్సరంబుగాఁ బరిరంభణమునకుం దెచ్చుకొన భుజద్వయంబుఁ జాఁచి-141
క.కుడికేలఁ బదనుకైదువు
పిడిపట్టును విడక నేర్పుపెంపునఁ దనకున్‌
గడుసుం గవుఁగిలి యొసఁగిన
యొడయని తీరెఱిఁగి తేర్ప నుచితజ్ఞుండై.
142
మ.పలికెన్‌ దిమ్మరసయ్య యిక్కరణి సంభావించి పూర్వాపరం
బులు సందర్భము లాకళింపుగొని యింపుల్‌గాఁ “ప్రభూ! సర్వముం
దెలిసెన్‌ నీ కరవాలధార కెదురేదీ! నీ ప్రతిజ్ఞా మహో
జ్జ్వలితాగ్నిచ్ఛట సోఁకినన్‌ మిడుత చేడ్పాటందఁడే యెట్టిఁడున్‌.
143
మ.కటకాధీశుని యాన వచ్చిన చమూకాండంబు లిక్కోట బా
సటగాఁ జేరుట సాఁగనీక నడుమన్‌ జక్కాడినాఁడన్‌ ద్వదు
ద్భట సేనానివహంబు తోడుగొని: యేతన్మాత్రమేకాదు, చ
క్కటి నున్నట్లె క్షణక్షణంబున కెఱుంగం గంటి నీపోఁడుముల్‌.
144
ఉ.అంచెలమీఁద నెప్పటికినప్పు డిటం బొడసూపువార్త ర
ప్పించుచునుండి మచ్ఛ్రవణపేయముగా శపథంబు నీది యా
లించితిఁ గొంతగాఁ గళవళించితిఁ దావక సత్యసంధతా
భ్యంచితమూర్తిచేతఁ బిలువంబడి వచ్చినయట్లు వచ్చితిన్‌.
145
చ.అలఘు జయోదయంబు ప్రథమావసధంబునఁ గల్గువాని క
వ్వల విహరింపఁగా నగు శివం బఖిలాధ్వమునందు నన్న పె
ద్దలనుడి నీయెడం జెలఁగుతన్‌! బ్రహరేశ్వరుఁడున్‌ భవద్దయా
దళగతి పాత్రుఁడై బ్రతుకుతన్! శరణాగతరక్ష పొల్చుతన్‌.
146
చ.అనితరసాధ్యమైన యుదయాచలదుర్గముఁ బట్టుకొంటి; వె
త్తిన తరవారి దింపి, మణిదీప్తిమదుత్కలరాట్కిరీటముం
గని కరుణించి వేగ జలకం బొనరించి స్వధర్మనిష్ఠ నె
మ్మనమున నొక్కసారి బలిమర్దనవామనగాథ నెంచుమా!
147
గీ.అనఁగఁ దనమోము నొరయుక్రోధారుణిమము
సడలఁజేసెడి విజయహాసమ్ము శుక్ల
రేఖ మలిసంజ జాబిలిరేక వోలె
విరియ రాయలుపలికెఁ దిమ్మరసు నరసి.
148
గీ.అప్ప! నీ నిండుమనము నేమనఁగవలయు!
నిపుడు తీసిన నవనీత మిది నిజమ్ము
పరునిప్రాణము నిలుపు నీ కరుణ నాదు
వీరతకుఁదోడు మంగళవిధిఁ దనర్చె.
149
వ.అనిపలికి తనచేతి కరవాలు దించి ప్రహరేశు నుష్ణీషంబు ననుగ్రహబుద్ధి నవలోకించి యుదయదుర్గ విజయవార్త నలుదెసలఁ జాటం బంచి రాయసము కొండమరసయ్య దండనాయకున కా దుర్గంబుపై సర్వాధికారం బప్పగించె-150
క.తొలిదెసగెల్పున నుదయా
చలదుర్గం బాగతిన్‌ వశంపడె; దానన్‌
గలుగదు తన్పు ధరిత్రీ
తలపతికిన్‌ విజిత విమత దర్పిత మతికిన్‌.
151
వ.కృష్ణాస్రవంతికి దక్షిణాశ నుత్కలోర్వీశుండగు ప్రతాపరుద్ర గజపతి యేల్బడియందు దుర్గంబులు పెక్కు లున్నయవి. అద్దంకి వినుకొండ నాగార్జునకొండ తంగేడు కేతవరము కొండవీడు మున్నగు దుర్గంబులెల్ల నాక్రమింపఁబడినంగాని పూర్వ దిగ్విజయయాత్ర కృతార్థం బైనట్లు కాదు.152
రాయల కొండవీటి ముట్టడి
మ.అరయన్‌ దక్షిణభారతోర్వర సువిఖ్యాతంబులై యున్న భూ
ధర దుర్గంబులలోన నొక్కఁడయి తత్తద్గుప్త నిర్మాణ వై
ఖరియందున్‌ శిఖరాయమాణమె యనంగా రాణకున్వచ్చి దు
ర్ధరతంబొల్చెను గొండవీడు కటకాధ్యక్షాధికారావృతిన్‌.
153
చ.అమలయశస్సుధాంశు రుచిరాంశుల నిల్చిన కాకతీయరా
జ్యమునకు వన్నెఁదెచ్చి సమరాంగణ వక్రిత వైరివీర వి
క్రమమగు రెడ్డియేల్బడికిఁ గంచుకమై యల కొండవీడు దు
ర్గము కడ కుత్కలప్రభుని కైవసమై యెడ వెచ్చనూర్చుచున్‌.
154
చ.అగణితవాహినీసముదయంబున దుర్దముఁడౌ ప్రతాపరు
ద్ర గజపతీశు నాత్మజుఁడు దర్పితపాత్ర మహాధివీర సా
నుగతుఁడు మీనకేతన మనోజ్ఞుఁడు తెంపరియైన వీరభ
ద్ర గజపతీంద్రుఁ డయ్యెడలఁ దానొకయేలిక కొండవీటికిన్‌.
155
గీ.ఉత్కలాధీశు వశమున నున్నయట్టి
కొండవీటిని ముట్టడిగొనెడిదాఁకఁ
గృష్ణభూనాయకునకు వర్ధిష్ణువునకు
నుదయదుర్గముఁ గొన్న సమ్మదము లేదు.
156
ఉ.ధీరతపెంపు సాఁగ వెనుదీయని తెంపునఁ బెక్కుమాసముల్‌
తోరపుఁబోర నొక్క పెనుదుర్గముఁ జేకొనియున్న వేఁడి చ
ల్లాఱకమున్న సేనలకు నాదటగొల్పుచు వీరభద్రు భం
డారముఁ దేల్పఁ గొండపురి డాయఁగ రాయలు లోఁదలంచుచున్‌.
157
చ.తన తలఁపిట్టి దంచును బ్రధానుఁడు తిమ్మరసయ్యకున్‌ వచిం
చిన నతఁ డా నృపాలు జయశీలత వీరత సంగరజ్ఞతన్‌
మనమున నుగ్గడించుకొని మల్లడిగొన్న రణాభిలాష నా
జ్ఞ నిడియెఁ గొండవీటిదెస సాగి చనం బృతనాసమూహమున్‌.
158
మ.అపుడే యొండొక దుర్గమం దనుభవం బార్జించి పైకొన్న తో
రపుటుత్సాహము ముందుగా నడవఁ గర్ణాటాంధ్రరాట్‌ సైనికుల్‌
సుపరిక్షుణ్ణములైన మార్గములలోఁ జొత్తించి జేగీయమా
న పరాక్రాంతిని గొండవీడును గొనంగా సాగి రొక్కుమ్మడిన్‌.
159
వ.అకాండంబుగా శ్రీకృష్ణ మహీనాయకుండు సవాహినీకుం డట్లు కొండవీడు ముట్టడిగొన వచ్చువార్త నాలించి వీరభద్రగజపతి గజిబిజియై దుర్గగోపాయనంబునకుఁ బాత్ర సామంతుల నెచ్చరించె; నంత నరహరిపాత్రుండును జన్యామల కసవాపాత్రుండును సుప్రపాల చంద్రమహాపాత్రుండును నల్లాఖానుండు నుద్దండఖానుండును మొదలుగాఁగల వజీరు లక్కోట నలదెసలఁ గాచుకొనియుండి రయ్యెడ-160
చ.“విడి నుదయాచలంబున స్రవించిన యౌత్కలమైన రక్తపుం
దడి యది యాఱలే; దిటు లదాటుగ వచ్చెను గొండవీటి ము
ట్టడి జతనం” బనం గటకటంబడి యక్కటకాధినేత రు
ద్రుఁడు తన వీరభద్రునకుఁ దోడుగ రాఁదొడఁగెన్‌ ససైన్యుఁడై.
161
గీ.అట నుదక్తటిఁ గటకసైన్యంపు జడధి
యిచట దక్షిణదిక్తటిఁ గృష్ణరాయ
నాయక చమూసరిత్పతి; నడుమనుండెఁ
జకిత కృష్ణసారాక్షి కృష్ణాస్రవంతి.
162
ఉ.ప్రాణములొడ్డుచున్‌ విభునిపక్షము గెల్పున కుద్యమించి కృ
ష్ణానది నీఁదుకొంచుఁ దరణంబొనరించిరి కృష్ణరాయ సే
నానులు కొంద ఱుత్తరమునంగల యుత్కలసేన రువ్వు పా
షాణము లవ్వి వెల్లువఁ బసందుగఁ గల్వలవోలె నిల్వఁగన్‌.
163
ఉ.ఆ గజనేతపక్షమునయందలి వీరులువైచు ఱాలకున్‌
లోఁగక నీటిలోఁతున మునుంగుచు నీఁదుచు నప్పుడప్డు పై
పైఁ గనిపించు నయ్యెడలఁ బైఁబడుగుండ్లకుఁ దప్పుకొంచుఁ బెం
పౌ గజయీఁతనేర్పు సొగసంతయుఁ జూపిరి శత్రుసేనకున్‌.
164
క.కరవాలకరులు కృష్ణా
తరంగిణిని నీఁదుకొంచుఁ దరియించి తదు
త్తరతటిఁ గొందఱువీరులు
పరవాహిని నెద్రుచు నదనుఁ బరికించి వెసన్‌.
165
వ.పెక్కురు కర్ణాటాంధ్రసైనికు లది సమయంబని దోనెలపై నౌకలపైఁ బయనించి నదిం దరించి గజపతిబలంబును బ్రతిభటించు చున్నవారికి సాయపడి సంగరం బొనరించుచుండి రివ్విధంబున నట నడ్డగింత జరుగుచుండ, నిటఁ గొండవీటి దుర్గాక్రమణంబున రాయలు కృతప్రయత్నుండై యుండుటయు-166
ఉ.మంతునకెక్కి సంగరపుమాయ లెఱింగినవారు పాత్ర సా
మంతులు మాయకుం దగినమాదిరి సాహస; మట్టిదైన దు
ర్దాంతపరాక్రమమ్ముగల దర్పితవీరులు దంతిరాజు నే
కాంతికభక్తు లొక్కమెయి నయ్యెడ రాయలసేనఁ దాఁకఁగన్‌.
167
క.ఉదయాద్రి దుర్గశిలలం
బదనిడుకొనియున్న ఖడ్గపాళిం గొని బ
ల్లిదముల రాయలసైన్యము
లెదురుకొనెఁ గళింగసేన యేపు లడంపన్‌.
168
గీ.ఒడ్డెజోదుల యెదురుకో లడ్డగించి
పాత్ర సామంతులకు నొవ్వుపాటు నించి
కొండవీటిని ముట్టడి గొంట కయ్యె
రాయలకు రెండు నెలల సంగ్రామ హేల.
169
ఉ.గాటపుఁగోట కప్పగిదిఁ గన్నడరాయఁడు తెచ్చినట్టి కీ
డ్పాటున సిగ్గుపాటుగొని పాటవమేఁదుచు నొంటిమై కళిం
గాటవిఁ బట్టి పాఱె సరహస్యముగా నల వీరభద్రుఁ డా
రాటముతోడ; నక్కరణి రాయల కందె ద్వితీయదుర్గమున్‌.
170
మ.కొమరుంబ్రాయమునం దిటుల్‌ గెలుపు చేకోఁగల్గి యా కొండవీ
డు మహాదుర్గము నాక్రమించిన విభుండున్‌ నాఁడు సత్పుత్రుచం
దమునన్‌ దిమ్మరసయ్య మంత్రి కిడు జోతల్‌ గాంచి తత్రత్యు లు
త్తమవీరుల్‌ పులకించి రవ్విభుని యౌదాత్త్యంబు భావించుచున్‌.
171
వ.అటు లాక్రమింపఁబడిన కొండవీడు దుర్గమ్మునకుఁ దిమ్మరసు మహామంత్రిమేనల్లుండగు నాదెండ్ల అప్పయామాత్యుండు పరిపాలనాధికారిగా నియమితుండయ్యెఁ బదంపడి-172
సీ.నాగార్జునుని కొండ లోఁగిన దంచును । నద్దంకి దుర్గ జయమ్ము వించి
‘బెల్లముకొండ’ను బేర్మిఁబట్టితిమంచు । వినుకొండయును జిక్కె ననుచు వినిచి
యమ్మనబ్రోలు స్వాయత్తమైన దటంచుఁ । గేతవరమ్మునుం గెల్చితి మని
తంగేడు దుర్గమ్ము లొంగివచ్చె నటంచుఁ । గొండపల్లిని ముట్టుకోలు పలికి
 
గీ.మేలుపై మేలుగా గెల్పుమీఁద గెల్పు । తెచ్చి ఱేనికి జోదులు తెల్పుకొనుచు
రాయల శ్రుతిద్వయీ సౌధ రమ్యవీథిఁ । దూఁగఁ గైసేసి రల జయతోరణములు.
173
కటకపురి : జైత్రయాత్రా ప్రసంగము
గీ.అఖిల భూధర దుర్గమ్ము లాక్రమించె
నుక్కడంచెను భయద శత్రూత్కరంబు;
నంతచేసిన నరసింహు నాత్మజునకు
గజపతిని బట్టుదాఁక నెక్కడిది తన్పు!
174
గీ.కటక పట్టణ హరణైకకాంక్ష యొకఁడె
తలఁపునం గ్రమ్ముకొన్న రాయలను గాంచి
తిమ్మరసుమంత్రి తత్ప్రసక్తికిని వచ్చి
పలికె నీరీతి నవధాన పరత గదుర.
175
ఉ.ఈ విజయంబు లెల్ల నొకయెత్తున గ్రుచ్చినయట్లు వచ్చి నె
త్తావులు గ్రుమ్మరించి పరితః పరిబుద్ధ దళానురాగ రే
ఖా విభవమ్ము లోసొగసు కన్నుల వెన్నెల నింప నీగతిన్‌
దేవరవారి పొంత కరుదెంచె నుదంచిత శోభనమ్ముగన్‌.
176
చ.చటులత రేఁగు నుత్కలుల సైన్యము నీ నిశితాసిధార ను
ద్భటగతిఁ ద్రెళ్ళఁ జేసి భయదంబులు పర్వతదుర్గముల్‌ విశం
కటముగ నాక్రమించుకొనఁ గంటివి; యేపు దలిర్ప నీ పయిన్‌
గటకపురమ్ము ముట్టడి యొకండెకదా! కరణీయ మయ్యెడిన్‌.
177
ఉ.ఈయెడ సాఁగఁబోవునది యెంతకు మించిన జైత్రయాత్ర కా
దో! యదియెల్ల నప్పగిది నుండె; యథార్థముగాఁగ నా యభి
ప్రాయము సెప్పఁగా నదను వచ్చెను; సాగిన యుద్ధయాత్రలో
నాయత మస్మదీయచము వంతయు సన్నవడెన్‌ సగానకున్‌.
178
గీ.గజబలము ముబ్బడిగఁ బెంచి కాల్బలంబు
నినుమడిగఁ దెచ్చి ముందున కేఁగవలయు
దారుణ కళింగ విపిన పథంబులందు
బడలు వడనీక సేనల నడపవలయు.
179
ఉ.కాదని నేఁడొ రేపొ కటకంబును నెవ్వడి నాక్రమింపఁగాఁ
బోదుమయేని గెల్పు లెటుపోనెటు వచ్చునొ నిశ్చయింపఁగాఁ
గాదు; జయంబు నిర్ణయముఖంబున నిల్చినయట్టి వేళలోఁ
గాదె! విరోధిపైఁ బదనుగత్తిని దూయుట కృష్ణభూవరా!
180
వ.అని పలుకు నమ్మహాసచివు వచనంబులు విన్న కర్ణాటవిభుండు సామర్షంబుగా నవ్వి యతనిం గాదనుటకుఁ జాలనివాఁడు వోలె నుండి.181
గీ.అనఘ! నీ పల్కినట్లు సైన్యబల మిపుడు
వెలితి వడియుంటఁ బ్రస్థానవేళగాదు;
మరలి మన రాచవీటికి నరిగి యెపుడొ
కటకపుటభేదనమును బట్టుటయె తగవు.
182
గీ.కాని, వేఱొండు చూచితిమేని నీవు
పలికినది కేవలము రాచపాడి; దాని
కొక్కయెడ నపవాదమై యున్నయట్టి
యనఘధర్మము నీ వెఱుంగనిది కాదు.
183
గీ.ఉదయదుర్గము నాందిగా నుత్కలేంద్ర
పురి భరతవాక్యముగఁ జేసి ఖరకరాసి
నడపెదఁ గళింగ విజయాఖ్య నాటకమ్ము
నని యొనర్చితిఁ బ్రతిన యాత్రాదియంద.
184
గీ.వెన్నుఁ ద్రిప్పక భీకర వీరయాత్రఁ
గటకపురిఁ గొంట ధర్మముఁ గాచుకొనుట
ధర్మమునకును నీతి కంతరము కల్మిఁ
బ్రథమ పక్షంబె ప్రకృత మాశ్రయము మనకు.
185
మ.ఎది యెట్లైనను నుత్కలేంద్రు నగరం బీయాత్రలోఁ బట్టి పో
వుదు మన్నట్టులె యంతరంగ మిది చెప్పున్; సందియంబింత ని
ల్వదు సమ్రాడ్గజనాథలక్ష్మి కటకాలంకార ఘల్‌ఘల్‌ రవా
భ్యుదిత స్వాగతహస్తసంజ్ఞ లిడుఁ బ్రత్యుత్థాన లీలాదృతిన్‌.
186
క.అని యటులు రాయలాడిన
వినూత్న వాక్ఫణితి కొంత వింతగఁ దోఁపన్‌
బ్రణయ స్వాదు హృదంభో
జని యమ్మంత్రిమణి మృదురుషావన్ముఖుఁ డై.
187
వ.రాజపరమేశ్వరా! కటకంబుపై జైత్రయాత్ర కిదియదను కాదనఁగా నవునంటివి; ధర్మమునకు దండనీతికిం గల యంతరము సెప్పి రాచపాడి రెండవపక్షం బంటివి; ఉత్కల పురీహరణమ్మున విజయంబుగొంట కంతరంగమే సాక్షి యంటివి; ఏలికకుఁ బ్రత్యుత్తరము చెప్పఁ దొడంగు వాఁడం గాను; కటకమ్ముపై నవశ్యము దండయాత్ర సాగింతము. విజయనగరమ్మునుండి కొంతసైన్యము వచ్చి మనలం గలసికొనున ట్లేర్పాటు గావించెద నని పలికి, యంతలోఁ జమత్కారచారువైన కొండొక నవ్వుతో గజరాజగమనాభుజంగుండగు కృష్ణరాట్కుమారమూర్తిం గటాక్షించి యిట్లనియె.188
ఉ.భూరమణాగ్రణీ! మఱచిపోదునె యొండొకనాఁటిమాట నీ
వీరతతోడ నేను జతపెట్టిన యక్కరుణన్‌ గుఱించి నిం
డారఁగ మెచ్చు పల్కితికదా! మఱి వీరమునందు నేఁడు శృం
గారము తోడుసేఁతయును గాదనవచ్చునె? నీదుమాటలన్‌.
189
మ.అజితోత్తేజితవైఖరిన్‌ గటక జైత్రారంభయాత్రాది న
గ్గజనాధేందిర పాణిపద్మదళ సంజ్ఞాహ్వాన కల్యాణ మా
రజమై తోఁచుటయంద యేలిక రహోరాగత్వరాస్ఫూర్తి య
క్కజమై కన్పడె: నిద్దియుం బ్రథమపక్షంబే! ధరాజానికిన్‌.
190
క.కుతుకము చిగుర్ప సరసా
న్వితగతి నిటు మంత్రి పలుకువెంట నిరువురున్‌
జతపడి యటఁ గురిపించిరి
యితరేతర వివృత హసిత హేలామధువుల్‌.
191
చ.పదపడి యొక్కనాఁడు సరపాలుఁడు రాయలు మూదలింపఁగాఁ
గదలిన రాణువల్‌ బహుళ కంటక భూరుహవద్వనీ దురా
సద సరణిన్‌ దరీముఖవసన్మృగరాడ్గతి దుర్గమాద్రి భీ
ప్రదసరణిన్‌ బ్రయాణములు పట్టి క్రమక్రమవేగయాత్రలన్‌.
192
చ.అడవుల నద్రులన్‌ నడచునట్టి యొకానొక శిక్షణంబునం
గడుకొను నేర్పుఁ దీర్పులను గాంచిన కొందఱు వీరసైనికుల్‌
వడి మును సాఁగి దారి నడపన్‌ వెనువెంబడి నేఁగి, పెండ్లికై
వెడలినయట్లు వేడ్క లొదవించెను గాల్బలపుం బచారముల్‌.
193
గీ.ఒక యడవిత్రోవ మాతంగయూధములను
ముందు నడపింతు; రొకదారియందు నశ్వ
పాళి వేఱొక సరణిఁ గాల్బలము మున్ను
గాఁగ నడపింతు రదియు శిక్షణపువంతు.
194
శా.ఆరంగూరిన గెల్పుతొందర దళంబై యాంధ్ర కర్ణాట రా
డ్వీరాపార వరూథినీ వితతి యాఠేవం జెలంగన్‌ గళిం
గారణ్యైకపదీ ప్రయాణముల డాయం జేరెఁ దద్దంతిభూ
దారోదూఢ మహాపురీ దృఢతరోద్యద్దుర్గ ముద్గాఢతన్‌.
195
చ.మదకరిరాజు పౌఁజు వెడమాయల దారులుకాచి ప్రక్కగా
నెదురుగ వెన్కగా నెద్రిచి యెక్కడికక్కడ నడ్డగింతలం
బొదువుచు నుండ రాయల చమూతతి నల్లెరుమీఁద బండిగాఁ
జిద్రుపలుచేసికొంచు దరిసెన్‌ గటకంబు రయోద్భటంబుగన్‌.
196
ఉ.డాసిన దండయాత్రకు నెడంద దిగుల్వడనీని సాహసో
ద్భాసితుఁడైన యక్కటక పట్టణ భూరమణుండు శోణిత
గ్రాస పరాయణుల్‌ బహుముఖ ప్రముఖోత్కల వీరులున్‌ వినం
గా, సముదీరితారుణిత కంఠము నెత్తుచు నిట్లు వాకొనెన్.
197
ఉ.మేమనుకొన్నయట్లె యుఱిమెన్‌ గటకంబున శత్రుసేన; మీ
మీ మగపాడితో ననుపమేయము సంగరముం బొనర్చి యు
ద్దామతఁ బేర్చి రాయల కథాగమనంబు నెదిర్చి యుత్కల
స్వామి ప్రతిష్ఠకుం దగిన వైఖరి సాఁగుడి విక్రమింపఁగన్.
198
గీ.ఉదయభూధర దుర్గమ్ము నొడిసికొనుట
కొండవీటిని ముట్టడిగొనుట కాదు
రుద్రు తార్తీయ లోచనార్చులఁ బడంగ
నెట్టి సాహసమున కొడిగట్టినాఁడు!
199
వ.అని మఱియును రాజధానీ సంరక్షణంబున నప్రమత్తులై యుండుటకుఁ బాత్రసామంతుల రావించుకొని బలభద్రపాత్రుం బిలిచి చెప్పి ముకుందపాత్రుతో నుత్సాహవచనంబులాడి భీకరపాత్రుం గదిసి జాగరూకత నుండఁ బలికి, రణరంగపాత్రుండు వజ్రముష్టిపాత్రుఁడు కసవాపాత్రుండు మున్నగునామంబులతో వ్యవహరింపఁబడు నుత్కల క్షత్త్రియపాత్రులతోఁ గలయంగలిపి చెప్పియు వేఱువేఱ చెప్పియు నుత్తేజితులంజేసె; నంత వారందఱు నొక్క కుత్తుకతో “రాయలను జీవగ్రాహముగాఁ బట్టి యిత్తు”మని యుత్కలోర్వీపతి సన్నిధిం బ్రతిజ్ఞ లొనరించుటయు.200
మ.విలసత్తేజులు పాత్రవీరులు మహావిస్ఫూర్తిమద్బాహు ల
త్యలఘూత్సాహులు పల్కు పల్కులను గల్యాణమ్ము సాధించిన
ట్టులు కర్ణాటవిభుండు పట్టువడినట్టుల్‌ లోన భావించుచున్‌
గలఁకం బాసెను వృద్ధుఁ డుత్కలధరాకాంతుండు నొక్కింతగన్.
201
మ.అటు లాయేలిక పాత్రభూపతుల సాహాయ్యంబుఁ జేపట్టఁగాఁ
గటకం బుత్కలవాహినీ మహితరక్షాకేళి ‘నా కేమి’ య
న్నటులుండెన్; దిటవూని తెల్గులును గర్ణాటుల్‌ గజాశ్వంబులం
బటుధాటి న్నడపించుకొంచు నదలింపంబోయి రుద్వేగులై.
202
వ.ఉత్కలరాట్పురీహరణ సముత్కమానసులైన వీరసైనికులు తోడుగా రాయలు కడిమిమెయిఁ బెనంగు కాళింగవీరులతోఁ గవిసి చండతరమైన యాయోధనంబు సాగించె నట్లు రుద్రగజనాథ కర్ణాటనాథోభయ వరూథినీ మధ్యంబునఁ గొంతకాలమ్ము నడచిన యాలమ్మునం దెవరిది హెచ్చుబలంబో, యెవరిది లొచ్చుబలంబో నిర్ణయించుట దుస్సాధంబయియుండె. విజయనగరమ్మునుండి తిమ్మరసుమంత్రి యానమై నరుదెంచిన మఱికొంత పౌఁజు కటకముం జేరుకొనియెఁ, బెక్కునాళ్ళు కటకమ్ము ముట్టడికిఁ దమకించియుఁ బాత్రసామంతుల బహువిధవంచనమునకు వారి పరాక్రాంతికిని రాయలసేనలు సుదూర ప్రయాణాయాసవశంబునఁ దట్టుకొనలేకపోయె నదియెఱింగి యించుక వగపుగొనియున్న యేలికం గని యింగితవేదియగు మహామంత్రి తిమ్మరసయ్య యిట్లనియె-203
మ.“నరపాలా! యిదియిట్టులౌననుచు నాంతర్యంబునం దెంచి య
త్తఱి యాత్రాదిని విన్నవించితినిగాదా! యుత్కలాధీశుఁ డి
క్కరణిన్‌ దర్పితవాగ్భటుండగుచు సాఁగన్‌ బాత్రసామంత బం
ధుర సాహాయ్యమొకండె కారణముగాఁ దోఁచున్‌ సువిస్పష్టతన్‌.
204
ఆ.వె.స్థానబలము పాత్రసామంతబలమును
నగ్గలించె నుత్కలాధిపతికి;
దీర్ఘయాత్రలగుటఁ దెవుళులతో మన
సైనికులకు నీరసతయు మించె.
205
గీ.ఉత్కలపురంబుఁగొన దండ మొకటికాదు
సామమును దానమునుగాదు; సరిగ నొకఁడె
గూఢ విప్రియకారులకొఱకు నద్ది
దాఁచఁబెట్టిన పదనైన రాచపాడి.
206
చ.బలితపుఁగోటముట్టడులఁ బాల్గొని దవ్వులుసాగి సైనికుల్‌
నలఁగుడువడ్డ యిట్టియదనం దదుపాయమహాప్రయోగ ము
జ్జ్వల జయసాధనం బదియు వైళమ సాఁగుట లగ్గు : దానికిన్‌
ఫల మది ఱేనియాన యయినన్‌ మఱునాఁ డరచేతఁ జేరెడిన్‌.
207
ఉ.ఈదృశమౌ నుపాయమున కేలిక యానయునేల! యెన్నఁడేఁ
గాదనియందుమే యనుటగా; దిట నొక్కఁడె సంశయంబు; ధ
ర్మాదృతి గల్గునట్టి యొడయం డిది కూడని రాజనీతి మ
ర్యాదగఁ ద్రోసివైచిన మహాసచివత్య మిదేమి కావలెన్.
208
క.కావున ఱేనికి వినుచుట
నా విధి; నృపనీతి యది రణంబులఁ దోడుం
గావుట రాజ్యాంగమునకు
సేవధి; యని సచివమణి వచించినయంతన్‌.
209
మహామంత్రి రాజనీతి చతురత
గీ.మంత్రి ప్రతివాక్యమునకు సమన్వయంబు
పట్టుకొని ఫాలపట్టికం బెట్టుకొనెడి
రాయలు వచింపఁగల యుత్తరమ్ముతీరు
తిమ్మరసు చెప్పఁబడకయే తెలిసికొనియె.
210
వ.పిమ్మట ఱేని వీడుకొని యొకానొక యేకాంతస్థలమ్మున నొంటిమైఁ గూరుచుండి చేత గంటంబును దాళపత్త్రంబులునుం బట్టిన యమ్మహామంత్రి యాలోచనైకలోచనుం డాత్మగతంబున-211
చ.కరిపతి మత్తుఁడై కటకకాననవీథులఁ గ్రుమ్మరిల్లఁగా
నరయుట దుస్సహం; బిఁక నుపాయ మదొక్కఁడె యుండెఁ బాత్రము
ష్కరులకు వానితోడఁ జెలికారము సాగకయుండఁ జీల్తుమే
నురవడి నేఁది భేద మను నోదమునంబడి డిందకుండునే!
212
ఉ.ఇంతకుమించి క్లిష్టమగు నీ తరుణంబునఁ జేయఁగా నుపా
యాంతరమున్నదే! యదియు నంతకునంతకు జాగుసేఁత భూ
కాంతునిపట్ల సేగియగుఁ గావున దైవమునెంచి పాత్ర సా
మంతులపేర వింతవొడమన్‌ విరచించెదఁగాక లేఖలన్.
213
గీ.అని తలంచి యపూర్వసృష్టిని వెలార్ప
మంత్రదండంబుఁ బట్టినమాడ్కి మంత్రి
గంటముం బట్టుటయు మౌక్తికములచాలు
రాలె మేలైన తాళపత్త్రంబుమీఁద.
214
సీ.అటు వ్రాసి తొలికమ్మయందలి మాటలే । పదునాఱు ప్రతులుగాఁ బట్టి వ్రాసి
యొక్కొక్క కమ్మలో నొక పాత్ర వీరుని । నామమ్ము సంబోధనముగఁ జేసి
సకలంబులగు లేఖలకుఁ దన చేవ్రాళ్లు । పెట్టి, మున్ముందె రప్పించుకొనిన
దంతపేటికలలోఁ దల్లేఖ లొండొండె । యమరిచి రాజముద్రాంకనముల
 
గీ.భద్రగతి వైచి నమ్మినబంట్లఁ బిలిచి । పేటికలు వారిచేతులఁ బెట్టి యిట్టు
లానవెట్టెను దిమ్మరసయ్య దాని । యెత్తుగడ యింత తెలియంగనీక తాను.
215
మ.“ఇటు మీ చేతుల నున్న పేటికలతో నెంతే రహస్యమ్ముగాఁ
గటకోర్వీశుని కోటదారియెడ సాఁగంబోవుఁ డీరేయి; మీ
రటు పోవన్‌ గని రాచబంట్లు మిము దూయంబట్టఁగా వత్తు రో
భటులారా! యపు డెట్టు లాడవలెనో వాక్రుత్తు నాలింపుఁడీ!
216
మ.“వినుఁడీ! యన్నెము పున్నె మిం దెఱుఁగ ముర్వీనాథుఁడౌ రాయ లి
చ్చిన యానం గొని వచ్చినార; మిటు మాచేనున్న యీపేటికల్‌
కనుఁడీ; దీనిని పాత్రవీరులకుఁ గాన్కల్‌ చొన్పి మాఱేఁడు పం
పెను; దాఁచం బని యేమి! వారికి సమర్పింపంగఁ గర్తవ్యమౌ”
217
వ.ఇటులు మీరు పలికినను నాలింపక కటకరాజభటులు మిమ్ము గజపతియొద్దకుఁ దీసికొనిపోవుదు రయ్యుత్కలోర్వీపతి యడిగి నప్పుడుకూడ మీ రిట్లే చెప్పవలయును. అతండు వార్తాహరులను మిమ్ము క్షమించును; లేదా, బంధించు; నేది యెట్లైన వెఱవకుఁడు పొం”డని యాదేశించుటయు.218
మ.ప్రచురాజ్ఞాచరణ ప్రవీణ మగు ధీరత్వంబు నిండార ధీ
సచివాదిష్ట పథంబుఁ గైకొని తమిస్రావేళ శోభా మలి
మ్లుచ నేత్రాయిత పేటికాగ్ర మణిదీప్తుల్‌ త్రోవసూపన్‌ నృపా
నుచరుల్‌ సాగుచుఁ గల్గఁజేసి రల పాంథుల్‌ చోరవిభ్రాంతినిన్‌.
219
మ.అట సంచారము సేయుచున్‌ గటక దుర్గారక్షకుల్‌ వారిఁ గాం
చుటఁ బాటచ్చరబుద్ధిఁ బట్టుకొని కొంచుం బోయి బంధించి; రం
తట శ్రీ రాయలవారి బంట్లు తమవార్తల్‌ విన్చినన్‌ మంత్రి య
న్నటులే యౌటకు నబ్బురమ్ముపడఁగా నవ్వారి న య్యారెకుల్‌.
220
క.కొనిపోయి యుత్కలాధీ
శుని సన్నిధి నిలిపి తాము చూచిన తెఱఁగున్‌
గని బంధించిన తెఱఁగును
వినుపంగా గజవిభుండు విని రుద్రుండై.
221
వ.వీరిం గూర్చి విచారణంబు రేపు జరిపింత మిపుడు వీరు తెచ్చిన కృష్ణరాయప్రభుత్వ ముద్రాంకనంబులు గల దంతపేటికల నిచటఁ బెట్టించి చెఱ నుంచి పొండని గర్జించుచు నొక పెట్టెఁ దెఱపించి పరికించి యందున్న కమ్మఁ దీసి యిట్లున్నదాని మనస్సునం జదువుకొనియె.222
మ.“కనుఁగొన్నారము మీదులేఖ; నురరీకారంబు మాఱేఁడు తె
ల్పెను మీ తెల్పిన యట్టు ల గ్గజపతిన్‌ వేగంబె బంధించి యి
చ్చిన మీ కోరిన మేరకున్‌ ద్రవిణరాశి గ్రామ భూమీ మణీ
కనకోపాయన పూర్వకంబుగ మిముం గన్గొందు మత్యాదృతిన్‌.”
223
గీ.అనుచుఁ బఠియించుకొను తన మనసుఁగాని,
కమ్మ నరయు కన్నులఁ గాని నమ్మలేక
మరలఁ గని, పైని బాత్ర సామంతుపేరు
దిగువ సంతకమును నెగాదిగ గణించి.
224
వ.అక్కళింగదేశ నాయకుండు దంతపేటికల నన్నింటిని దెఱపించి చూచి వానియందలి లేఖలు చదువుకొని సర్వలేఖలయందలి విషయం బొకటిగా గుర్తించె నంత.225
మ.జ్వలితంబుల్‌ కనులన్‌ మిడుంగుఱులు పెల్చన్‌ రాలఁ, గ్రోధ వ్యథా
కలుషోచ్ఛ్వాసము లంతకంతకును వేగ స్ఫూర్తిమైఁ దేల ను
త్కల రాజేంద్రుఁడు “పాత్రవీరుల దురంతం బింతగానౌనె! రా
యలకున్‌ మమ్ములఁ బట్టియిత్తురఁటె! యౌరా! స్వామివిద్రోహముల్!
226
మ.ధనమున్‌ గోరి విభు ప్రతారణముసేఁతన్‌ బూనుటే యైనఁ ద
త్కనకంబుల్‌ మణిరాజి గ్రామములు కేదారాళి మాచే నుపా
యన మీయం బడకుండునే తమకు! ద్రోహవ్యూహ సన్నాహచిం
తనులౌ పాత్రుల గోముఖంబులకుఁ జిత్తం బెంత మోహంపడెన్‌.”
227
వ.అని యూర్పు వుచ్చి కొంతతడవు నిదానించి.228
గీ.పాత్రులకు మాకు నడుమ భావమ్ముచెడుట
కమ్మహామతి తిమ్మరసయ్య మంత్రి
కల్పనం బంటకును నమ్మకమ్ము చాల
దరయఁ బాత్రులయందు ద్రవ్యాశ మిగులు.
229
మ.ఎది యెట్లైనను వారిచెల్మి నిజమం చే నమ్మి పోవంగ మం
చిది కా; దియ్యెడ వారితోడు సెడినన్‌ సమంబునుంగాదు; బ
ల్లిదుఁడౌ రాయలు సైన్యసంయుతుఁడు కాళింగోర్విఁ జేపట్టు ప
ట్టుదలన్‌ వీడఁడు; మా తనూబలము వాడుంజూపు వర్షిష్ఠమై.
230
ఉ.వ్రాలినయట్టి ప్రాయమున రాయలముందు ధృతాయుధుండనై
యాలము సేయఁగా విజయమౌనను నిశ్చయ మేది! రాజ్య ప
ద్మాలయ వీరుఁడున్‌ యువకుఁ డప్రతిమాన కళాప్రియుండు వి
ద్యాలలితుండు రాయల యెడాటమునన్‌ దలసూపు టొప్పదే!
231
మ.అవనీనాథ కుటుంబముల్‌ వెదకి వియ్యం బందుకోఁదగ్గ ప్రా
భవసామ్యం బెటలేమిఁ బుత్త్రికకు నుద్వాహంబుసేయన్; దదు
త్సవ కాంక్షామతి నున్నవేళ భగవత్సంకల్ప మట్లున్నటుల్‌
బవరం బీగతివచ్చె నాగడముగొల్పన్‌ బాత్రసామంతులన్‌.
232
రాయలతో గజపతి సంధి : కన్యాప్రదానము
వ.అని తలంచునంతలోఁ బాత్రవీరుల దురాగతంబు చుఱకవేసినట్లు జ్ఞప్తికివచ్చుటయు మరల లేఖలోని ప్రత్యక్షరమును భావించు నగ్గజపతి కక్షరం బొక యంకుశమై గుండెకుఁ బొడుచుకొనియె; నతండు ధీమంతుఁడును నీతివిద్యావిదుండు వయఃపరిణతుం డగుట నసమయంబునం బొడసూపుక్రోధంబును బరితాపంబును దనకుఁ దాన యుపశమించుకొనంగలిగి రేయెల్ల నిద్దురలేనియతం డుషఃకాలమ్మునకుం బ్రసన్నమానసుండై తనయమాత్యుం గానిపించుకొని సకలంబు నెఱిఁగించిన నమ్మేధావియును గజపతి యభిప్రాయచ్ఛాయంబట్టి యిట్టులు వచించె :233
మ.దిగులందం బనియేమి! యిట్టితఱి నర్థిన్‌ సంధిగావించు టొ
ప్పగునంచున్‌ నృపనీతి చెప్పినది : శ్రేయస్సాధనం బద్ది; రు
ద్రగజాధీశ, కళింగదేశ సుచరిత్రఖ్యాతి యీపై సహ
స్ర గుణోద్దీపితమౌను! నిం దుభయపక్షక్షేమ మేపారెడిన్‌.
234
ఉ.ప్రాకట వీరసైన్య నికరంబున నియ్యెడ కెత్తివచ్చి చీ
కా కొనరించుచున్‌ విజయకాంక్ష నెసంగినఱేఁడు సంధి కం
గీకృతి సూపఁడంచు మదికిన్‌ జొఱ దించుక సందియం బదే
మో! కృతబుద్ధియౌ ప్రభువునొద్ద యథార్థము వెల్వరించెదన్‌.
235
మ.ప్రథితుండయ్యె వినూత్న యౌవనమునన్‌ భావధ్వని వ్యంగ్య సే
వధి సత్కావ్య మహాకవిత్వమున దీవ్యద్గాన విద్యారసా
వధి మాధుర్యగుణాధిలోక విహరద్భావంబునన్‌ గృష్ణరా
ట్సుధి ప్రఖ్యాతుఁడు; నట్టివాని మది పొల్చుంబో సుధార్ద్రంబుగన్‌.
236
శా.ఈరీతిన్‌ గటకంబు ముట్టడికినై యేతెంచె నన్నట్టి దో
షారంభం బెడగాఁ గళానిధియకాఁడా! రాయ; లట్లౌట వీ
రారూఢంబు తదీయహస్తమది క్రిందై నీ కరాబ్జంబు మీఁ
దై రాణించుట కొండుపాయ మనపాయం బీయెడం దోఁచెడిన్.
237
మ.కల గాంధర్వకళా మధూత్సవ మిళత్కల్యాణ భావార్ద్ర, ను
త్కలవాణీ కవితాగుణాఢ్య, నమృతాంధ స్సాహితీగ్రంథ గం
ధిల చిత్తాబ్జను, భర్తృదారికను నాదిక్షత్త్రతుల్యుండు రా
యల కీఁ జూడఁ బ్రతిగ్రహీతగ నతండై రాఁడె నీ వెంబడిన్‌.
238
గీ.ఆర్తరక్షణదీక్షయం ‘దన్నపూర్ణ’
సత్కళా ‘రుచి’ పేర్కన్నచానఁ - గటక
రాడ్జలధిగన్న లక్ష్మిఁ - గర్ణాటదేశ
పార్థివుఁడు రత్నహారి చేపట్టుఁగాక!
239
క.అనవుడు విద్వత్సచివుని
ఘనాశయము తీర్థమట్లు కాఁగా స్వార్థం
బునఁ దనివోవుచు గజపతి
తనయను రాయలకు నెడఁద దారగ నొసఁగెన్‌.
240
శా.తాదాత్మ్యంబునఁ గృష్ణభూపతి నిజాంతఃపుష్పితానంద బా
ష్పోదస్పంద పరీమళోచ్చలిత వాయుస్పర్శలో నుత్కలో
ర్వీదార ప్రియదారికోత్కలిక మూరింబోవఁగాసాఁగెఁ గ
న్యాదానోత్సవ మక్కళింగ శుభకర్ణాటాంధ్ర వాఙ్నాందియై.
241
క.గజపతి శ్రీనరసింహా
త్మజానుకంపా కటాక్ష మధురసవారీ
గజపతి కటకక్షోణీ
ప్రజాహృదయమోద బంధురత నొడఁగూర్చెన్‌.
242
మహమ్మదీయుని మోసము : రాయల క్రోధము
వ.సయ్యదుమర్కా రను నొక తురుష్కుం డశ్వంబులు చవుకగాఁ గొనితెచ్చి యిత్తు నని రాయలవారిని నమ్మించి లక్షాధికధనంబ వ్విభుని నడిగి కొంపోయి మఱి రాఁడయ్యె; ధనాపహర్తయగు నవ్వంచకుండు బీజపురాధీశుని కొలువున నుండుటం దెలిసికొని రాయలు ‘సయ్యదుమర్కారు’ మోసమును బ్రకటించి వాని నప్పగింపుమని యాదిలుషానవాబునకు వార్తనంపె; నతండు వినిపించుకొనక వంచకున కాశ్రయం బిచ్చియుండె; నంత విజయనగరీవిభుండు రాయలు క్రుద్ధుండై-243
మ.అదిరా! మాయెడ నింతకేరడము సేయంగూడెనే! తాను స
య్యదుమర్కారు తురుష్కుఁ డక్కరణి మాయల్‌పల్కి నే విల్చియి
చ్చెద నశ్వావళి నంచు నమ్మ వచియించెన్‌ ద్రవ్యలక్షాధికో
న్మదుఁడై మోసమొనర్చునే! యెఱుఁగఁ డస్మచ్ఛాతహేత్యగ్రమున్!
244
ఉ.కాదన కిట్టి మోసమునఁ గన్నులు గానని యగ్గరాసు న
య్యాదిలుషా బిజాపురమునం దవలంబన మిచ్చి దాఁచినాఁ
డే! దయనీయుఁడే యగునఁటే! యపరాధి తురుష్కుఁ; డీయధ
ర్మాదరముష్కరత్వ మరయన్‌ మఱిదేనికి దారితీయునో!
245
ఉ.వంచకుఁడైన సయ్యదును బట్టి బిజాపురినేత మాకు న
ర్పించుట యట్టెపోయినది; పేరిమిమై స్వకులాభిమాన దు
ర్యంచితవృత్తియై తగవువంక గణింపక దొంగ దాఁచి లేఁ
డంచు వచించునే! యిదికదా యదనౌఁ గదనంబు సేఁతకున్!
246
ఉ.ప్రాఁతపగల్‌ విడన్‌ జెలిమిపట్టిన యాదిలుసాహితోడ ని
ర్హేతుక సంగరంబు పచరించుట ధర్మ్యముగామిఁగాని మా
చేతికిఁ దానుగా వలచి చిక్కెడి వప్రముకాదె రాయచూ
రీతఱి మాతలంపు ఫలియించినయట్లె నయానుకూలతన్‌.
247
ఉ.అట్టి మహాధివీరులగు నన్నయుఁ దండ్రియునేనిఁ దాము చే
పట్టక రాయచూరు విడువంగలదాన రహస్య మారయన్‌
బట్టికి నాకుఁ గృష్ణనరపాలున కీ సుకృతాభ్యనుజ్ఞఁ జూ
పెట్టుట కాక యొండు కనిపింపదు కారణ మయ్యుపేక్షకున్‌.
248
ఉ.నైజతురుష్కభావముఁ గనంబడనీయనిచెల్మి శత్రుతా
బీజము లోనఁ దాఁచుకొని పెంచెను బీజపురీవిభుండు; ని
ర్వ్యాజముగాఁగ వానియెడ వర్తిలుటన్నది తప్పుసేఁత; యా
త్రాజిత దంతినాథునకుఁ దా నొకలెక్కయె వాజినేతయున్!
249
చ.తొడరినవాహినీచయముతో వడి నీయెడ రాయచూరు ము
ట్టడియొనరించి యశ్వపతిడంబ మడంచితిమేని గెల్పుని
న్మడి గజరాడ్విజేతలము మాకతనన్‌ సకలాంధ్రలక్ష్మికిన్‌
గుడి యెడచెక్కులన్‌ శ్రవణకుండల మండితపద్మరాగముల్‌.
250
క.అని యనికిన్‌ నిశ్చయముం
బొనర్చుకొని సచివపుంగవుని యాశయముం
గొని రాయచూరుముట్టడి
యొనర్పఁ బయనించె రాయ లొకజయవేళన్‌.
251
రాయచూరు దండయాత్ర
శా.ద్రాఘిష్ఠంబులు కృష్ణభూపతిమరుత్వజ్జైత్రసంగ్రామ భే
రీఘోషంబులు పిక్కటిల్లఁగ, మదప్రేంఖన్మహాదంతి రే
ఖాఘీంకారము లగ్గలింపఁగఁ దురంగశ్రేణికాభీల హే
షౌఘంబుల్‌ పొడతేరఁగా నడచె స్ఫాయత్సైన్య మొక్కుమ్మడిన్‌.
252
మ.అరిగాఁపుల్‌ నరపాలకుల్‌ సమరయాత్రాహూతులై వచ్చి యు
ద్ధురమౌ స్వీయవరూథినీ చయముతోఁ దోడ్పాటునందీయ బం
ధురితాంగీకరణార్ద్రహాస విచరిష్ణుండైన కృష్ణుండు సం
గరజిష్ణుండయి సాఁగె రాయచురుదుర్గంబున్‌ విదారింపఁగన్‌.
253
మ.పదునాఱేన్గులతో సహస్రతురగవ్రాతంబుతో మించి ము
ప్పదివేల్కాలుబలంబుతోఁ దన కనల్పప్రీతిమద్భక్తిసం
పద పెంపారఁగ వచ్చి తోడుపడు కామానాయకుం గాంచె ధీ
ర దరస్మేరకటాక్షవీక్ష బెడఁగారన్‌ రాయ లయ్యాత్రలోన్‌.
254
చ.ఇరువది గంధసింధురము లేపువహింపఁగ వచ్చి రెండువేల్‌
తురగము లిచ్చి కాల్బలము తోడ్పడ నేఁబదివేలు తెచ్చి దు
ర్ధరబలుఁడై సహాయపడు త్ర్యంబకరావును మెచ్చె నాఁటిసం
గర గురుయాత్రలో దురవగాహగభీరుఁడు రాయ లాదటన్‌.
255
మ.త్రిసహస్రాధికవాజిరత్నచయమున్‌ ద్రింశద్ద్విపశ్రేణి ష
ష్టిసహస్రంబు పదాతివర్గమును మాస్టీలున్‌ విడంబించు సై
న్యసమారంభముతోడఁ దోడుపడు తిమ్మప్పన్‌ గటాక్షించె సం
తసమారన్‌ వసుధావిభుండు రణయాత్రారంభవేళాసభన్‌.
256
ఉ.మేదురవాజిబృందము నమేయగజావళి పత్తిలక్ష పెం
పౌ దురమెత్తి రాయచురునాక్రమణంబునఁ దోడుసూపు న
య్యాదెపవీరుఁ గాంచెను బ్రియంబున రాయలు స్నేహమంగళ
స్వాదుఘృణానుషంగ పరిసారితపాణి ననుగ్రహించుచున్‌.
257
మ.బవరంపుందమకం బెసంగఁ బరభావజ్ఞుండు విప్రుండు సా
ళువగోవిందుఁడు సింధురాశ్వపదగాళుల్‌ నూఱులున్‌ వేలు నా
హవయాత్రన్‌ నడపింపఁ గన్నడవిభుం డామూర్తిలో నగ్రజుం
డవు శ్రీతిమ్మరసయ్యమంత్రివరుచాయల్‌ గాంచె నాహ్లాదియై.
258
ఉ.ఆలపుజాతరన్‌ దనకు నయ్యయిఱేఁడులు తోడునిల్వ ని
ర్వేల గజార్వజాత నిబరీస పదాతిచమూకదంబ వీ
థీలసితుండు కృష్ణుఁ డవధీరితవైరి రణక్రుధా సము
న్మీలితలోచనుండు పయనించెను ‘రాయచురుం’ బొరింగొనన్.
259
గీ.మధురనాయకుండు మహిసూరుమండల
పాలకుండు తోడుపాటు నెఱప
విక్రమాఢ్యుఁడైన వెంగాపురాధ్యక్షు
డనుసరింప రాయ లరిగె ననికి.
260
చ.వెస నసహాయశూరతకుఁ బేర్వడియున్‌ స్వపురాణ పుణ్యపుం
బస యది తాదృశంబగుట బాంధవ వీర సుహృత్సమృద్ధి స
ప్రసవము కావుటన్‌ దెలుఁగువల్లభుఁ డుల్లసితాత్ముఁడై పర
గ్రసనకళావినోదియయి రాయచురున్‌ బయనించె నేడ్తెఱన్.
261
వ.అత్తెఱంగునం గృష్ణదేవరాయ సార్వభౌముం డఖర్వవాహినీ నివహంబున రాయచురు దుర్గంబు నాక్రమింప నుద్యమించి పయనించిన యుదంతమ్ము నాలించిన యాదిలుషాహి క్రోధముష్కరుండు తన యేల్బడినున్న యాదుర్గము రక్షణముపొంటె రాణువం గదలించుకొని కృష్ణాతటిన్యుత్తరతీరంబుఁ జేరుటయు.262
సీ.గోవధంబున జంకుగొనని తురుష్కుల । దైవంబునకుఁ బ్రతిద్వంద్వి యనఁగ
నట లెక్కకందని యట్టి సైనికతార । కలలోన నిష్కళంక శశివోలె
విలసిల్లి కర్ణాటవిభుమౌళి రాయలు । రాయచూర్‌ మహితదుర్గమ్ముఁ బట్టి
పాలించు చీకటుల్‌ లీలమైఁ బాలార్ప । నయ్యాత్ర సాగించి యక్కజముగ
 
గీ.ముట్టడింపఁగఁ దమి యత్నముం బొనర్ప । నశ్వపతిపక్షవీరు లుద్యద్బలంబు
చలము నిజదుర్గ రక్షావిచక్షణతయు । ముప్పిరింగొన నుండి రేపుగొని యపుడు.
263
ఆదిలుషా పలాయనము
మ.అకలంకంబు నృపాలభక్తి కుదురౌ నత్యల్ప సంఖ్యాక సై
నిక సంఘం బట రాయచూరునఁ గృపాణీపాణులై శూరతా
ధికులై మీఱుచు రాయసైనిక సమృద్ధిన్‌ లోన భావించి జం
కక దుర్గప్రతిరక్షణానుపమ దీక్షన్‌ నిల్చి రుత్సాహులై.
264
ఉ.అంత బిజాపురీనృపతి యాదిలుసాహి చమూసమూహ దు
ర్దాంతుఁడు వెల్లువన్‌గడచి దక్షిణతీరముఁ జేరి కృష్ణభూ
కాంతుని సేనలం బొదువఁగా వడిమై విడియన్‌ మహాపరా
క్రాంతిని రెండుపక్షములు రాచుకొనెన్‌ బెనుభండనంబునన్.
265
చ.ధరణితలంబు బిట్టదరఁ దల్లడపాటునఁ గృష్ణవేణి బం
ధురగతిఁ బాయచీలినటు తోఁపఁగఁ బొంగులుదేరి యేడ్తెఱన్‌
నరపతి సైన్యపాళి హయనాథు వరూథిని భీకరమ్ము సం
గర మొనరించె లోని తమకమ్మున గొబ్బురిలో రణస్థలిన్‌.
266
మ.పృథుసేనాంగ పరస్సహస్రకర దుష్ప్రేక్ష్యుండు శ్రీకృష్ణరా
య ధరానాయక భాస్కరుండు రణరంగావేశి కాఁగాఁ, గళా
నిధిచిహ్నధ్వజుఁడైన యశ్వపతియున్‌ వెల్వెల్లనై శోక వా
రిధినిర్మగ్నుఁడు కాక యేమియుగు నార్తిన్‌ దత్పరాక్రాంతికిన్‌.
267
గీ.పిఱుతివియనట్టి బీజపుఁ బెంపు కలిమి
నాంధ్ర కర్ణాటయోధ సంహతి కడంగి
కసిమసంగి తురుష్క పుష్కలత నణఁచె
నశ్వపతి బెంగటిల్ల నయ్యాహవమున.
268
ఉ.గొబ్బురిలోన సాఁగు నలకోల్తల స్వీయహయాదిసేన లా
గుబ్బుగ స్రుక్కి ప్రాణములు కోల్పడి పీనుఁగుపెంట లౌటచే
నిబ్బరమేది బీజపురినేత యపేతజయాశుఁడై యెదన్‌
మబ్బులు క్రమ్మగాఁ దిరుగుమార్గము పట్టఁగ నిశ్చయించుచున్‌.
269
వ.నాఁటి రేయి ‘యసద్‌ఖానులారీ’ యను వాని సైనికవీరుం గాంచి పలాబత్ఖానుం డాదియైన వాహినీనాయకులు రాయలచే బంధితు లగుట వచియించి బీఱమ్ముడిందిన డెందంబున రణంబు దప్పించుకొని బిజాపురమ్మునకు మరలిపోవుటయ యిప్పటికి లగ్గుగా నిజనిర్ణయంబు వెల్లడించె; నంత.270
మ.తెలవాఱన్‌ విని రెల్ల రిప్పలుకు లేతేరంగ; నిస్మాయి లా
దిలుఖానుండు బిజాపురాధిపతి భీతిన్‌ బాఱెఁ; దాదృగ్బలో
జ్జ్వలితాశ్వప్రభుఁ డయ్యు నేన్గుపయిఁ గృష్ణం దాఁటి పర్వెత్తి పో
వలసెన్; గృష్ణవసుంధరా విభునితోఁ బంతంబఁటే వానికిన్‌.
271
గీ.అటు నవాబు పలాయితుం డగుటవిన్న
కన్నడేంద్రుననుత్తాన కమ్రవిత్త
గర్భవీక్షలతో నసంఖ్యాకతురగ
గజవరూథిని పొంగులుగట్టి నిలిచె.
272
గీ.దొరకె ఱేనికి గంధసింధురచయంబు
దొరకె జవనాశ్వగణము భూవరున; కట్టి
గొబ్బురిదురంబు హేతువై యిబ్బడించె
ముబ్బడించెను రాయచమూబలంబు.
273
మ.అటు బీజాపురినాయకుండు చలితుండై పోవఁ దద్వాహినీ
భటులున్‌ వేర్వడి నల్దిశల్‌ చెదరిపోవన్‌ దత్పరాయత్త ము
త్కట హస్త్యశ్వకదంబముల్‌ గలసిరాఁగా రాయచూ ర్ముట్టడిం
చుటకున్‌ వెండియు సాఁగె రాయలు చమూస్రోతస్వినీనేతయై.
274
క.నలువదివేల్కాల్బలగం
బులతో మున్నూఱు ద్విపసమూహంబులతోఁ
గలితాశ్వికతతితో రా
యలరాణువ కదలె నరిభయావహలీలన్‌.
275
గీ.కదలె జంగుఫిరంగులగమి నెసంగు
బండ్లు వికృతాట్టహసిత జిహ్వాభివివృత
మృత్యుభయదాస్యములయట్లు మెఱవడించి
రాయచురుదుర్గ కబళనారంభతృష్ణ.
276
వ.మఱియుం బోర్చుగీసు సేనానాయకుండు ‘క్రిస్తోవిడిఫిగరీడో’ యను నాతండు రాయల కా రాయచూరుదండయాత్రలో బాసటయై నడచె; నతండెకాక మఱియెందఱో ఱేండ్లు న్యాయప్రవృత్తుండైన యమ్మహీపతికిఁ దోడుగాసాగి రవ్విధంబున నాదండు ప్రయాణించి రాయచూరున కభ్యర్ణంబుననున్న మల్లయబండ నర్ణవంబువోలె విడిసియుండె;277
చ.విడిసినదండనాథులకు వేడుకగా, భటపాళికిన్‌ ముదం
బడరఁగ నక్కజంబయిన యాటలు పాటలునున్‌ వినోదముల్‌
విడుదుల వేఱువేఱ పృథివీపతి యేర్పడఁ జేర్చి తీర్చె ము
ట్టడిగొనుముందు నొక్కొకగుడారము నొక్కొక రాచవీడుగన్‌.
278
ఉ.ఆలపుగుట్టులం జతురుఁడై పరభావము లిట్టె పట్టు భూ
పాలకమౌళి రాయలు కృపారసికుం డలజైత్రయాత్రలో
వేలకువేలుగా వ్యయమువెట్టె వరూథినికిన్‌ వినోద సం
ధా లలితాతిథేయ కలనా కలితాత్మత పల్లవింపఁగన్‌.
279
గీ.సంగరమ్మున కనుపుటో, మంగళమున
కింపుమైఁ బిల్చి యామెత లిచ్చుటో, యె
ఱుంగనీకుండ ఱేఁడు వీరుల కొనర్చె
వేడ్క లల్ల మల్లయబండ విడుదులందు.
280
గీ.అగపడకయుండి యెచ్చటికచటఁ దనదు
కంటికొసయాన సర్వసౌకర్యములును
దమకుఁ గలిగించి ఱేని చిత్తఫలకమ్ము
భటుల తరవారులం గ్రొత్తపదను దీర్చె.
281
వ.అటులు కృష్ణదేవరాయ విభుండు సేనానివహంబుతో మల్లయబండవఱకు వచ్చి దండు విడిసియుంట యెఱింగి రాయచూరు దుర్గంబున మహమ్మదీయ సేనాపతి దుర్గప్రాకారత్రయంబు సురక్షితం బొనరించెఁ; గోటకు నల్వయిపుల రెండునూర్ల ఫిరంగు లెత్తించి శస్త్రంబులు సానఁబట్టించె నొడిసెరువ్వు యంత్రంబు నేర్పరించె; గజవాజి పదాతిసేనల నాయత్తపఱిచె; నంత-282
గీ.ఒక్క మధ్యాహ్నవేళ రణోష్మల మగు
నెసకమున రేఁగి వచ్చి పూరింటి చూఱు
నిప్పు ముట్టినయటు లవనీవిభుండు
రాయల బలంబు లవి ముట్టె రాయచూరు.
288
రాయలు రాయచూరుముట్టడి
సీ.కోటకొమ్మలనుండి ఘోరాగ్నిగోళముల్‌ । కురియునట్లు ఫిరంగిగుండ్లు రాల
ఒడిసెలయంత్రమ్ముబడి ఱాలరువ్వు లు । వ్వెత్తుగా మూర్ధంబు లూడ్చివైవ
చలముమైఁ బెనుతుపాకులుపట్టి పయినుండి । కాల్చెడుకాల్పు లుగ్రత నెసంగ
బలవదశ్వపతియోధుల సింహనాదముల్‌ । శ్రవణవీథులఁ బరశ్వథముగ్రొవ్వ
 
గీ.సరకుగొనక వివిధసంగ్రామములయందు । నాఱితేరి వచ్చినట్టిదగుట
నెట్టుకొనుచుఁ గోటముట్టడిగొనుదీక్ష । నురవడించె నృపతియోధవితతి.
284
ఉ.ప్రాణములొడ్డి రాయభటపాళి పరావళిసేయుహావళిన్
దేనికిదానికే యొకప్రతిక్రియసేయుచుఁ దట్టుకొంచుఁ జే
తో నిభృతాతి సాహసగతుల్‌ వెలయించుచుఁ గోటఁ బట్టుకోఁ
గా నిఖిలాభ్యుపాయములుగా నిలఁద్రొక్కుకొనెన్‌ రణావనిన్‌.
285
గీ.ఒకటి రెన్నాళ్ళుకాదు : మహోద్ధతముగ
సాగె నిరువదినాళు లాసంగరమ్ము;
నందు నిందు భటుల్‌ వేలమంది డింది
రశ్వగజబృందములు మ్రందె నచట నిచట.
286
క.ఎడనెడ నిజవీరుల కొర
వడిసూపఁగ వచ్చె ననెడివడువున నాక
న్నడపతి తురుష్కవాహిని
నెడమడు వొనరించె శాతహేతికరుండై.
287
క.ఒడయఁడు రణరంగమునకు
వడి వచ్చుట తమపరాభవంబుగ మదులన్‌
జడియుచుఁ దెనుంగుజోదులు
తొడరి యపూర్వగతిఁ జెండుదురు శత్రుతతిన్‌.
288
క.తనసేనల బల మెఱిఁగిన
జనపతికిన్‌ గోట కైవసంబగుటకు సా
గినజాగు సమరయాత్రా
వినోదకేళిగనె కానిపించె నెడందన్‌.
289
మ.కుహనాయోధనయోధులౌ నల తురుష్కుల్‌ కృష్ణసమ్రాడ్భయా
వహసేనానివహంబు చుట్టుకొని నొవ్వంజేయఁ జేయన్‌ గుభృ
ద్గుహలో నూఁదరగొట్టినట్టులుగ గగ్గోలంది, దుర్గావన
స్పృహ నానాఁటికి డిందఁగా నవశులై చేడ్పాటు భావించుచున్.
290
క.పెఱదారిలేమి నెంతటి
సరదారులయయ్యు నబ్బిజాపురిసేనల్‌
నరపతిరాయలకున్‌ రా
చురుకోటం జొఱఁగఁ ద్రోవచూపిరి నతులై.
291
విజయ మంగళముభరిత విజయవాద్యచయరవంబునందుఁ గృష్ణరాయ
తురగగతికి నశ్వపతుల దుర్గలక్ష్మి శ్రుతినిగలిపె
నిరుగడలను నిల్చి జోదు లెలమి జోత లీయ, బీజ
పురవిభుత్వ మడల ఱేఁడు ప్రోలుసొచ్చె రాయచూరు.
292
గీ.ఆంధ్రకర్ణాట వీరజయారవమ్ము
తరఁగలై పోర్చుగీసుయోధ ప్రశంస
నురుగులై రాయచురు సుధాఝరిగఁ బాఱె
రాయ లెసలారె రాజమరాళలీల.
293
గీ.శరణుగోరిన శాత్రవోత్కరమునందుఁ
గనికరము విందులిడు క్షమాకాంతమౌళి
యరులుసైతము కొనియాడునట్టి గుణము
మెఱయఁగా రాయచురు నాక్రమించుకొనియె.
294
వ.అశ్వపతియగు బిజాపురాధీశు నేలుబడినున్న రాచూరుకోట నత్తోయంబున రాయలు ముట్టడించినవార్త సర్వయననప్రభువుల గుండియలఁ గలగుండువఱచె; వారు మెల్లమెల్ల నవ్విభు ననుగ్రహమ్ము నర్థించుచు నాతనిచెలిమికై దోసిళ్ళువట్టి యుండిరి; తెనుంగు వల్లభుఁడును రాయచూరుదుర్గరక్షణంబునకుఁ గొంతపౌఁజు నచట నిలిపి తాను విజయకమలారమణీయుండై రాచవీడు చేరుకొని గెలుపు సంబరంబు జరిపి యందు దండనాయకుల నందఱ నర్హంబుగా నామతించె;295
రాయలకు బిజాపురాధీశుని లేఖ
చ.అటు లవమానితుండయిన యాదిలుసాహి బిజాపురీశుఁ డూ
ఱటగొనకుండి ఱంపమున రాఁచుచు నేఁచెడి రాయచూరు ము
చ్చట మదిలోపలన్‌ మఱవఁజాలనిదై యొకనాఁడు కమ్మ నొ
క్కటి యలకన్నడేంద్రునకుఁగా ననుపన్‌ లిఖియించి యంతటన్.
296
క.తనమంత్రి నసద్‌ఖానునిఁ
గనుఁగొని యాలేఖలోనఁగల యంశములన్‌
వినిపించి విజయనగరం
బునకున్‌ గొనిపొమ్మటంచుఁ బుచ్చినతోడ్తోన్‌‌.
297
ఉ.ఆతఁడువోయి లేనివినయం బది యున్నటు లోన నున్నదౌ
భీతియు లేనియట్లు కనిపింపఁగఁజేయ నటించుచున్‌ జగ
ద్ఖ్యాతుఁడు కృష్ణరాయవిభు దర్శనముం బొనరించి మ్రొక్కె ను
ద్ద్యోతిత శాతదీర్ఘనయనోత్పలధార నృపాలుఁ డారయన్‌.
298
ఉ.తా నరుదెంచుటం గల యుదంతము ముందుగ విన్చి ఱేని క
న్గోన కుఱంగటన్‌ నిలిచి కొంకుచు దోయిటనెత్తి యా యసద్‌
ఖానుఁడు బీజపూర్విభునికమ్మను రాయల కందఁజేసి యా
సీనుఁడునయ్యె నవ్విభునిచేత ననుజ్ఞనుబొంది పొందుగన్‌.
299
గీ.అంత బహుభావశబలిత స్వాంతరంగ
నిబిడ నయనద్యుతి స్పృహణీయమూర్తి
కృష్ణరాయలు బీజపురీశులేఖ
నివ్విధంబునఁ దనలోఁ బఠించుకొనియె.
300
క.“శ్రీకృష్ణదేవరాయ ధ
రాకాంతమణీ! సమాదరణ రమణీయా
లోకనమున మావిన్నప
మాకర్ణింతువ యటంచు నాసింతు మెదన్‌.
301
చ.చెలఁగనెడందలం జెలిమిసేయుచుఁ బాయనిప్రేమ నొండొరుల్‌
మెలఁగుటయయ్యె; మాయెడలమీకును మీయెడమాకుఁ బొచ్చెము
ల్పొలయవు మున్ను; పాడిగలపోఁడిమి రాయలఁ జెప్పి చెప్పఁగా
వలె నొరు నంచుఁ బేర్గనినవాఁడవు వింటిమి నీయశోగతుల్‌.
302
ఉ.ఈతఱిఁ దొంటిచెల్మి గణియింపక మాపరిపాల్యమైన పృ
థ్వీతలి నందుకో నరుగుదెంచుట - రాచురుకోటపొంటె ని
ర్హేతుకసంగరంబుఁ బొనరించుట - యీతెఱఁగెల్లఁ జూడ నీ
ఖ్యాతికి నీతికిన్‌ దగినదంచు నెవండు వచించు నీక్షితిన్.
303
ఉ.ఐనది; దానికై దిగులునందము ఱేండ్లకు నిట్టికాంక్ష విం
తైనది కాదు; కాని యొకన్యాయపథం బది యుండుఁగాదె భూ
జానికి; మాదు రావణువలసైతము మీచెఱఁ బెట్టినావు; లో
కానకు నచ్చునే! యెవనికర్జము వానికి వేడ్క నిచ్చినన్‌.
304
గీ.కావున నొనర్తు నొక్కవిజ్ఞాపనంబు
లోకనిందకుఁ బాల్పడఁబోక రాయ
చూరు మాది మా కిచ్చినచో ధరిత్రి
కింతకంటెను వలసినశాంతి లేదు.”
305
క.అని వ్రాసిన బీజపురీ
శునిలేఖను లోనఁ జదివిచూచెడునెడఁ గృ
ష్ణుని నయనంబులు సతటి
ద్ఘనాఘనధ్వానగోళక ప్రతిభటముల్.
306
గీ.అపుడు కన్నడపతి భయదాంబకముల
నుండి వెలువడినట్టి ప్రత్యుత్తరముగ
బీజపురమునవాబు పంపిన యుదంత
హరుఁ డసద్ఖానుఁ డీరీతి నాలకించె.
307
గీ.“అవునుగదె! యందినన్‌ సిగ యందకున్న
కాళ్ళు ననుట యాదిలుసాహిగారియెడల
సార్థకమ్ము; మృగాంకధ్వజమ్ముగలుగు
ఱేని కీ లక్షణము సాజమైన దగును.
308
శా.సంతోషం బగుదెంచె శాంతి కభిలాషం బిట్లు బీజాపురీ
కాంతుం డిప్పటికేని లోగొని జగత్కల్యాణసంధాన కృ
త్స్వాంతుం డౌటకు; రాయచూరెవనిదో వాఁడాక్రమించెన్; వివ
స్వంతున్‌ మీఱునె యంబుజాహిత సముచ్ఛ్రాయధ్వజోత్తేజముల్‌.
309
గీ.కోర్కి విడదేని రాచూరుకోటయెడలఁ
గమ్మ లిటులేల! రాయబారమ్ములేల!
సముఖమున వేఁడ మే మభీష్టము లొసంగి
పంపఁగల మని చెప్పు మీ ప్రభువుతోడ.
310
మ.అని పల్కన్‌ విని తద్వచస్సరణిలో న్యక్కార భావంబుకం
టెను నొండొక్కయనుగ్రహంబె తొలఁకాడె న్నాఁగ లోలోన ము
న్కొనుసంతోషముకల్మి నాయసదుఖానుం డేఁగె బీజాపురం
బునకున్‌ రాయలయాతిథేయత తలంపుంబట్టి చెల్వారఁగన్‌.
311
వ.ఆతం డటువోయి యాదిలుసాహినవాబునకు రాయల ప్రత్యుత్తరంబు వినిపించుటయు నా విభుండు తొలుత నొకింత దురాగ్రహమ్మునకు గుఱియై వెనుకముందులు యోజించి వేఱొండు గతిలేమి రాయలసమక్షంబున కరిగి చెఱఁగొనంబడిన తన రాణువను, ముట్టడింపఁబడిన రాయచూరు కోటను నర్థించి పొందు నందుటయ యుచితంబుగా నిశ్చయించుకొనె నంతట.312
క.ఇరువురు ఱేండ్లును నేల్బడి
సరిహద్దగు ముద్దగల్లుసరసఁ గలసికోఁ
దిరపఱుచుకొనిరి యొండొక
పరస్పరాలాప సంధిబంధాభిరతిన్‌.
313
గీ.వచ్చె నిర్ణీతకాలంబు వచ్చిచేరెఁ
గన్నడాంధ్ర మహీరాజ్య కలిత వజ్ర
సింహపీఠస్థలీ సమాసీనమూర్తి
ముద్దగలుప్రోలు రాచపెంపులు దలిర్ప.
314
వ.అనుకొన్నయటులు వేళకుఁ గృష్ణదేవరాయవిభుండు ముద్దగలు చేరినను బీజపురాధీశుండు పొందున కొడంబడక తాను రాకుండిన కతంబున రాయలు కినిసి.315
ఉ.ఆదిలుసాహి పొందుకొఱకై యరదెంచెద నన్నవాఁడు రా
లే దిటు రాకపోవుట మలీమస మానసవృత్తికాక యొం
డేదియుఁ గానఁగాఁబడదు హేతువు; మమ్మిటు పిల్చి తాను రాఁ
డా! దయనీయుఁ డెట్టులగు నాకపటాశయుఁ డిట్టిసేఁతలన్‌.
316
ఉ.గొప్పలువల్కె శాంతిదెసఁ గోరిక యీరికయెత్తినట్లు మా
చొప్పిది పాడికాని దనుచున్‌ బలికెన్‌ మఱి తాను దియ్యగాఁ
జెప్పినమాటలం దొకఁడు; చేసెడు చేఁత మఱొండు; మమ్ముఁ గ
న్గప్పుట కెంచునే! యిటులు నాటకమాడునె దుర్మదాంధతన్‌.
317
మ.సరికాని మ్మిటు సంధియాత్రను మహాసంగ్రామ పర్యాప్తమౌ
కరణిన్‌ దీర్తుముగాక బీజపురమున్‌ గల్యాణిదుర్గంబుఁ గ
ల్బరిగిన్‌ నాశమొనర్చి యీపయి నదిల్షాకున్ నిశాతాసి మ
త్కర సత్కారము చేయఁగావలయుఁ గర్తవ్యంబు లీమూఁడునున్.
318
గీ.అనుచుఁ గర్ణాటపతి చేసికొనిన నిశ్చ
యమున నమ్ముద్దగలునంద యఖిల విజయ
నగర భూరి చమూభీషణ రణభేరి
భాంకృతిధ్వని కంకురార్పణము జరిగె.
319
మ.శరవేగమ్మునఁ గృష్ణరాయపతి ప్రస్థానంబులోనన్‌ బిజా
పురి కల్బర్గియు నాక్రమించిన క్షణంబుల్‌ సర్వతౌరుష్క బం
ధుర సేనానివహక్షణాపహములై తోడ్తో స్వధర్మావనా
దర ధీ సాధుగణ క్షణావహములై తట్టెన్‌ బ్రజాశ్రేణికిన్‌.
320
మ.కలబర్గిన్‌ జెఱఁబెట్టె నెన్నఁడొ యదిల్‌ఖానుండు మున్‌ భామినీ
సులతాన్పుత్రుల మువ్వురన్‌ గరుణకుం జోటీక; యవ్వారి రా
యలు కారుణ్యపయోదమై యరసెఁ; గారావాసముం ద్రోసె; వా
రలలో జ్యేష్ఠునిఁ బిల్చి కల్బరిగి దుర్గం బిచ్చె నత్యాదృతిన్‌.
321
మ.అలఘూత్తేజము దిగ్విదిక్కుల దళంబై వెల్గ శత్రూత్కరం
బుల నాలంబునఁ దున్మి కల్బరిగడంబున్‌ మెట్టి, రాజ్యాశ ద
వ్వులకున్‌ బాఱఁగఁ జోఁపి యబ్బహమనీపుత్రున్‌ గటాక్షించు రా
యలు మోసెన్‌ బిరుదావళిన్‌ యవనరాజ్యస్థాపనాచార్యతన్‌.
322
గీ.తొలుత గజపతి రాజ్యము గెలిచి పట్టె
నశ్వపతుల దర్పోద్ధతి నణఁచె నేఁడు
తిరుగులేని ప్రతిజ్ఞ సాధించుయోధు
రాయలకు నుపమానము రాయ లొకఁడె.
323
మ.అకలంకమ్ము ప్రియంకరమ్ము నగు కర్ణాటాంధ్ర సామ్రాజ్య చం
ద్రిక సాంద్రంబుగ సర్వభారత ధరిత్రిన్‌ శుద్ధపక్షైక కౌ
తుక హేలామృత సంపదభ్యుదయ హేతుస్ఫీతమైనట్లు తొం
టి కవివ్రాతము వ్రాఁతలన్‌ నిలఁబడెన్‌ విస్పష్టసాక్ష్యంబులై.
324
గీ.రాజభక్తికి మేలి తార్కాణమైన
తిమ్మరసువంటి మంత్రి, మంత్రియెడ నట్టి
యడఁకువ గలట్టి ఱేఁడు రాయలును గానఁ
బడుదురే నేడుఁ గన్నులు పొడుచుకొన్న.
325
గీ.శీలవంతుల నిరువురు చెలిమికాండ్ర
నరయఁ గన్నులు కుట్టుఁ గొందఱకు; వారి
కుట్రలు చరిత్ర నెల్ల గగ్గోలుపఱిచి
చేయు నొక్క యపూర్వమౌ సృష్టికృతిని.
326
మ.అసదృక్సంగరవీథి శాత్రవసమూహ వ్యూహమున్‌ దున్మి భా
గ్య సముద్వేల్లిత ధాత్రి నేలిన విభుండౌ కృష్ణభూపాలు వె
న్క సమీచీనత నెవ్వఁడేలవలె నన్నన్‌ గాదు కష్టంబు; వ
జ్ర సముత్కీర్ణ మణీముఖంబుదెస సూత్రప్రాయ మాయేల్బడుల్‌.
327
భువనవిజయసభ
గీ.నాఁడు రాయల పరిపాలనమ్మునాఁడు
‘భువనవిజయ’ మహాసభాభవన మలఁరె
బరికృత నిబంధ రసభావ బంధురాంధ్ర
సుకవితేందుముఖీ పాణిముకుర మనఁగ.
328
గీ.సర్వరాజ్యక్రియా పరిష్కరణవేళ
నానృపతి కొల్వుదీర్చు వజ్రాసనమున;
సకల కావ్య సువర్ణ ప్రసంగవేళ
నతఁ డధిష్ఠించు నికషోపలాసనమున.
329
గీ.ఆవిభుని యంతరంగంబునందు నిలిచి
యతని బహిరంగముల పరిష్యంగ మెనసి
“సాహితీసమరాంగణ సార్వభౌమ”
బిరుదయువతి సనాథయై పేర్మివడసె.
330
క.కరుణాకర వేంకటపతి
చరణ స్మరణార్ద్రమతి రసాతలపతి తా
నరుదేర భువనవిజయం
బురువడి నడుగులకు మడువు లొత్తున్‌ భక్తిన్‌.
331
మ.అతులౌచిత్య విశేష భాజనుఁడు విద్యాభోజుఁడౌ కృష్ణభూ
పతి విచ్చేసిన వెంబడిన్‌ సుకవితాభంగీ పికీ గానముల్‌
శ్రుతిపక్వం బొనరించి హృద్యముగ వించున్‌ దత్సభారామదే
వత; యాఱేని యపాంగరేఖలఁ జిగుర్పన్‌ జైత్రయాత్రాస్పృహల్.
332
చ.ప్రజనిత వైదుషీ భువన భారము లోపలఁ దాల్చు కృష్ణభూ
భుజుఁ డరుదేర బిట్టు బరువుం గొనుచున్‌ జవుజవ్వులాడు త
ద్విజయ సభాధరాంగణము వెక్కసముం దొలఁగింప ధీర ది
గ్గజములు సర్వదిక్కులను గాచును జాఁచు నభీతిహస్తముల్‌.
333
మ.కవితాగోష్ఠిఁ జెలంగి కావ్యరసలోకంబందు దివ్యానుభూ
తి విశేషస్థితి నున్నయా మసృణమూర్తిం జూడఁగా, నీతఁడే
యవునా! మత్తగజాశ్వపత్యుభయసేనానల్ప జీవాపహా
రివిధాచండుఁ డటంచు సంశయము ద్రష్టృశ్రేణికిం గల్గెడిన్‌.
334
మ.అకలంకోదిత వేదశాస్త్రవచన వ్యాసంగమం దొక్కనాఁ
డొకనాఁ డుజ్జ్వల కావ్యభావిత రస ప్రౌఢోక్తులం డొక్కనాఁ
డు కృతోన్మీలన గాన నాట్యకలనాటోపమ్మునం దట్టు లు
త్సుక హేలాశబలాభిరామముగఁ దోఁచున్‌ గృష్ణభూభృత్సభల్!
335
గీ.అమర వాఙ్మయ కవన దక్షములు కావ్య
నాటకాదులు రాయలనోట వినుచు
విజయసభ యాత్మ వెఱచు “నివ్విభునియెడఁదఁ
దవులునే దేశభాష మక్కువ” యటంచు.
336
మ.పురుషార్థంబులు నాలుగింటికిని దద్భూపాలవర్యుండు పెం
పొరయం గాలముఁ బంచుకొన్నయటులే; యోర్మిన్‌ విభాగించి త
ద్ధరణీనాథ మహాసభాంగణము తత్తద్విద్యలన్‌ భాషలన్‌
మఱియెన్నేఁ గళలన్‌ సమానగతి సంభావించు నాలించుచున్‌.
337
సీ.“వేంకటనాథాది విబుధుల గీర్వాణ । పాండితీరమకు సువర్ణభూష
కర్ణాణ కవికులగ్రామణి ‘తిమ్మణ్ణ’ । భారతి కారతి పళ్లెరమ్ము
ద్రవిడ సారస్వత కవులు జ్ఞానప్రకా । శాది కోవిదుల విహారధరణి
బహుదేశభాషాప్రపంచ పండితకవి । ప్రకరమ్మునకు శుభాహ్వానవాణి
 
గీ.నాఁటి శ్రీకృష్ణవిభు కొల్యుఁగూటమునకు । భాషలందు భేదప్రతిపత్తి లేదు
కాని, కలదు శిరీషప్రసూన మసృణ । మమృతమయ మాంధ్రవాఙ్మయమందు భక్తి.
338
చ.పరమ రసజ్ఞతామధువిభాసీత సద్మము కృష్ణరాణ్మనః
పరివికసత్సహస్రదళపద్మము గద్దియగాఁగఁ దత్సభాం
తరమున నుండు నాంధ్రకవితా భువనాంచిత శిల్పబంధ మం
ధరుఁ డలసాని పెద్దన పితామహుఁ డాదృత వాక్కళామతిన్‌.
339
సీ.వికచాంబురుహవనీవీథిఁ దారినయట్లు । విచికిలామోదంబు విరిసినట్లు
సాంద్రశరత్పూర్ణచాంద్రి సోఁకిన యట్లు । కల్వపువ్వులగాలి కదలినట్లు
శివశిరోహరిణాంక శిశువు నవ్వినయట్లు । ముత్తెమ్ము లౌదలఁ బోసినట్టు
లమృతహ్రదస్నాన మాచరించినయట్లు । పరమార్థ మాధురి దొరకినట్లు
 
గీ.‘మనుచరిత్ర’ మహాకృతి మనసుఁదనుప । జయజయోచ్చయ మంగళస్వాన సరణి
భువనవిజయ సంసన్మహాభవన వీథిఁ । బల్లకీయెత్తె రాయలవారి పాణి.
340
చ.ఒడయఁడు నాఁటి నిండుసభ నుత్పలమాలిక సౌరభంబు వెం
బడిఁ దవనీయ రత్న సుషమావరణీయముగా నిజాంఘ్రికిన్‌
దొడిగిన గండపెండెరముతోఁ గవిచంద్రుఁడు ఱేనికౌఁగిలిం
బడసిన నాఁటి వేడ్క నిలువంబడు నాశశితారకంబుగన్‌.
341
గీ.వ్యంగ్యపుందావి చెడని పదార్థదళము
వాడని రసోత్తరము కవిత్వమ్ము కుదురు
పారిజాతాపహరణకావ్యమ్ముఁ గొన్న
రాయల సదస్సు నందనారామ మయ్యె.
342
గీ.భవ్య నవవచ శ్శతధా నిబంధనమ్ము
మహిమ భరిత సద్యోజాత మధురిమమ్ము
భవపరాఙ్ముఖ ధూర్జటి పండితోక్తి
కమ్మహీశానుకొలువు నిత్యాభిముఖము.
343
సీ.విమత కాళింగ పృథ్వీ జిగీషా కృత । జైత్ర యాత్రారంభశకునమైన
శ్రీకాకుళక్షేత్ర సేవా మహాభాగ్య । ఘటిత కల్యాణ సంకల్పమైన
హరివాసరోపవాసాంత నిర్మలచర । త్సాత్త్వికభావ ప్రసాదమైన
యాంధ్రవిష్ణు పదాంబుజాభ్యర్చనానంద । లలిత సుస్వప్న ఫలమ్మునైన
 
గీ.కావ్య మాముక్తమాల్యదఁ గన్న బుధుని । కృష్ణభూపాలమణిని దర్శించినపుడు
సహృదయ సహస్ర వర శిరశ్చాలనముల । భువనవిజయసభ యనంతమూ ర్తి యగును.
344
మ.సుదృఢోదాత్త విలక్షణప్రతిభ సత్సూత్రమ్ముగా నాంధ్ర శా
రదకున్‌ బుష్పసరంబు చేసిన మహాగ్రంథంబు నాముక్తమా
ల్యద శ్రీకృష్ణమహీంద్రు సర్వరసవిద్యాసారమున్‌ దత్సద
స్సదనోత్తంస మలంకరించుకొనె నుచ్చైస్సౌరభవ్యాప్తమున్‌.
345
సీ.సాతవాహన ధరానేతృ ప్రవర్తిత । సరస సాహిత్య సంసన్మహస్సు
రాజరాజనరేంద్ర రమ్యావసధ విద్వ । దమృతాయమాన సభాంతరమ్ము
కాకతీయావనీకాంత మహాస్థాన । హర్మ్యాగ్ర రచిత విద్యాసదస్సు
రెడ్డిభూమీపతి ప్రీణిత సుకవిరాట్‌ । “త్రైలోక్యవిజయ” సౌధతల గోష్టి
 
గీ.స్వ స్వ రుచిరాంశముల సమర్పణ మొనర్ప । సొంపు గడియించి చతురస్రశోభఁ గాంచి
భావరసపుష్టమై కృష్ణదేవరాయ । నృపతికొలువు మహాంధ్రచరిత్ర నేలె.
346
వ.శ్రీకృష్ణదేవరాయలవెనుక వర్ధిష్ణువగు నచ్యుతదేవరాయలు వజ్రసింహాసనం బధిష్ఠించె; నాఱేఁడు రాయలసవతితమ్ముఁ డాయేలిక పండ్రెండువత్సరంబు లారాజ్యంబు పాలించె; నతనివెంట వేంకటపతిదేవమహారాయలు నాతనివెనుక సదాశివరాయలు నతని తర్వాత నళియరామరాయలు విజయవీఠాధిష్ఠితు లైరి.347
చ.హరిచరణాబ్జసేవనకృతార్థుఁడు నచ్యుతభూమిజాని సో
దరతనుసంభవుండగు సదాశివరాయలవెన్కఁ గీర్తిభా
స్వరమగు నట్టిదౌ తుళువసంతతి తా నుపసంహృతిస్థితిన్‌
బొరసెను నారవీటినృపపుంగవవంశము తేజరిల్లఁగన్.
348
సీ.ఏడుకోటల నొక్కనాఁ డాక్రమించిన । యార్వీటివిభు పౌత్రుఁ డగుటెకాక
తుళువాన్వయాబ్ధికౌస్తుభము రాయలవారి । కనురక్తుఁడగు నల్లుఁ డగుటెకాక
తనశాతహేతి శాత్రవకంఠపాళిఁ దూ । టాడఁ జాలినవీరుఁ డగుటెకాక
రాచఱికమ్ము తంత్రములలోతు లెఱింగి । నట్టి మేధాశాలి యగుటెకాక
 
గీ.యొక మనోమోహనాకృతి యుజ్జ్వలతకు । నాశ్రయంబగు సుందరుఁ డగుటెకాక
యెవ్వనికిఁ దక్కనట్టి యదృష్టమునకు । నళియరామ మహీపాలుఁ డాటపట్టు.
349
సీ.తుంగభద్రాతీర సంగరస్థలిఁ దురు । ష్కుల వాహినుల నెదుర్కొన్నయదియు
దక్షిణాపథమునఁ దనరు తీర్థక్షేత్ర । వసతుల కభయమ్ము నొసఁగినదియు
నతిలోకహృద్యమై యలరార వీణియఁ । గీలించి ఱాల్‌ కరఁగించినదియు
వసుచరిత్రాది కావ్యస్రష్ట మూర్తిని । మెచ్చి హెచ్చగుకాన్క లిచ్చినదియు
 
గీ.దివ్యసౌందర్యరాశియౌ తిరుమలాంబ । మనసుఁదమ్మి వసంతముఁ జినికినదియు
నైన యార్వీటిరాయల యమృతపాణి । భూమదక్షిణధరకు శ్రీరామరక్ష.
350
పర్వాంతము
చ.జయజయ! సత్కవీంద్ర పరిష త్సుపరిష్కృత భవ్యకావ్య వా
ఙ్మయ బహుశస్సదా శ్రవణ మంథనబంధురితార్ద్ర హృత్కుశే
శయ జనకా! భవత్తనయ సమ్యగుపాసన భాగధేయ! ప్ర
శ్రయగుణగేయ! కృష్ణమహిరాడ్జయపర్వము నిట్లు విన్చితిన్‌.
 
ఉ.మానితభూమినాథ జయమంగళగాథల నేమి చెప్పిన
ట్లైనది! పర్వ మప్పుడె సమాప్తికి వచ్చెనటంచు సాగు ల
జ్జానమితాస్యు నీతనయు నర్భకు నన్ను క్షమింపు; మాంధ్రభూ
జాని జయావళిం బలుక శక్తుఁడఁగానని చెప్పి సాగెదన్‌.
 
విజయ పర్వము - ఆంధ్ర పురాణము - మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి - ఆంధ్రభారతి - కావ్యములు - ఆంధ్రపురాణము - ఆంధ్రపురాణం - ఆంధ్ర పురాణం మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి ( తెలుగు కావ్యములు ఆంధ్ర కావ్యములు) Andhra Puranamu - AndhraPuranamu - Andhrapuranam - andhra puranam - Madhunapantula Satyanarayana Sastry- AndhraBharati AMdhra bhArati - kAvyamulu