కావ్యములు గంగాలహరి రామచంద్ర కౌండిన్య
(ఓరుగంటి రామచంద్రయ్య)
ఆమోదము - శ్రీ విశ్వనాథ సత్యనారాయణ

శ్రీ ఓరుగంటి రామచంద్రయ్యగారు రచించిన 'గంగాలహరి' చదివితిని. జగన్నాథుని యీ కృతి తెలుగు గీతపద్యములలో నింత సొగసుగా వ్రాయుట యసాధ్యమయిన పని. ప్రతి గీతపద్యము రమణీయముగ నున్నది. వీరి గీతపద్యరచన దాని యంతట నది యొక మధురమైన కూర్పు. అందులో జగన్నాథుని సర్వభావములను వదలకుండ తెలుగు చేయుట సుకరమైన పని కాదు. అర్థము నెచ్చటను వీరి వదలిపెట్ట లేదు. జగన్నాథుడు చేసిన దీర్ఘసమాసముల యందలి ధ్వనిని గీతపద్యములలో సంతరించుట సంభవమైన విషయము కాదు. "వ్యాలోలోల్లాసి వల్గల్లహరి నటఘటీ తాండవమ్‌" అన్న సమాసములో గంగాదేవి యొక్క బిగువు నవ్వులు విచిత్రముగా వ్యంగ్యభూతములై యున్నవి. ఇందులో 'ఘటీ' శబ్దము బిగువునకు వ్యంజకమైనది. దానిని తెలుగుసేత కష్టము. 'ఉల్లసద్భంగ తాండవము' అని వారు తెనుగు చేసిరి. భంగ శబ్దము కొంత వ్యంజకముగా నున్నది. ఇట్లు తప్ప మరిఎట్లు చెయ్య వలయును?

'విశ్వేశు సిగల చిందులిడు గంగ' అన్న తెలుగుమాటలు మూలమును మించి రమణీయముగ నున్నవి. ఇట్టివి ఎన్నియో కలవు.

శ్రీరామచంద్రయ్యగారు కుటుంబ మంతయు సారస్వతులు. వీరి యుద్యోగపు జదువు వేరు. అచట వారికెంత ప్రాముఖ్యమో, ఇందులో కూడ నంత ప్రాముఖ్యము గడించుకొనుట వారి కోవలోని సువాసన.

AndhraBharati AMdhra bhArati - padya kAvyamulu - gaMgAlahari - rAmachaMdra kauMDinya - OrugaMTi rAmachaMdrayya - Ramachandra Kaundinya - Oruganti Ramachandrayya - jagannAtha paMDitarAya gangAlaharI - Jagannadha Pandita gangalahari Panditaraya Gangalahari ( telugu kAvyamulu andhra kAvyamulu)