కావ్యములు గంగాలహరి రామచంద్ర కౌండిన్య
(ఓరుగంటి రామచంద్రయ్య)
అంజలి
శ్రీ రమణాయ నమః

శ్రీపండితరాజకృతి గంగాలహరికి, తెనుఁగున నా యీ పరివర్తనము జరిగి యిది మూఁడవ యేఁడు. ప్రకటిత మగుటకే యింత వ్యవధియు. ఎంత తపించిననో గదా గంగావతరణమును, భవతరణమును.

అనువాదములు కావన్న నాఁడు తెనుఁగున వాఙ్మయ మల్పాల్పమని యొక ప్రథ. అనువదింపువెఱ్ఱి తెలుఁగులఁ బట్టి నంతగా నొరుల యెడ మృగ్యమఁట. ఇది తలవంపుగా నేటి యువసాహిత్యారాధకులలో పలువుర భావన కావచ్చును. కాని, దీనినే స్వపరభేదము మెచ్చని తెలుఁగుల గుణగ్రహణ పారీణతగాఁ బరిగణింప రాదా? "అయినను, ఒరు లొనరించిన వానినే మరల మరల పరివర్తించు టేల?" అన్నచో, వారు వారేమందురో కాని, నే ననెడి దొక్కటే. నా యీ ప్రయత్నము గాంగేయము. గంగలో నెంద ఱెన్ని మాఱులు మునుగరు? నాకునై నేను మునుకలు పెట్టిన ట్లుండునా?

అనువాద విధాన మిట్టి దన్న విధింపు ఇప్పటికి సర్వాదృతముగఁ గానరాదు. ఏ భాష సొగసు లా భాషకే. ఇతరముల నవి పరివర్తింపఁ గాదను వాద మున్నదే. కాని, యనువాదము లప్రతిషేధములే కాకున్న, విశ్వజనీనత, యెట్టిదైనను, ప్రయత్నింప రాని దగును గదా? అనువాదము దుష్కరము, నిజమే. కవిహృదయ మెఱిఁగి, భావ మొప్పరికింపక, ఔచిత్య ముపలక్షించి, ఆ యా భాషామర్యాదలను, రసధ్వనిని గుర్తించి, పలుకు కూర్పుల శ్రుతిమాధురు లుపేక్షింపక తదనురూపమగు రచన - అనువాద మేభాషలోనికో అందు, తద్భాషా సంప్రదాయానుగుణముగ చేయుట సులభ మెట్లును గాదు. అట్లని ప్రారంభింపమియు లేదు; ప్రారబ్ధార్థము లుజ్జగించుటయు లేదు. నాది స్వతంత్రానువాద మన్న బూకరింపుతో ననువాదమునఁగల లోపములఁ గప్పుకొనుటయు లేదు. నారచనాసాఫల్య మింతని నిర్ణయించుట కవితారసజ్ఞులగు పెద్దలకు, ఏతాదృశరచనావ్యవసాయులకు, తగునది; నాకు శిరోధార్యమును. నావఱకు నాకు ప్రయత్నించు టొక్కటే కలుగుకార్యము.

నా యీ రచన సద్యఃఫలద మనుటకు దార్కాణ - అతిలోకమహా ప్రతిభులు సత్యకవి విశ్వనాథులు, ఇతిహాసకావ్యులు సోమశేఖరులు, వ్యాకృతకళాపూర్ణోదయులు వేంకటరమణులు, కవిసూరిజనోత్తంసులు సూర్యనారాయణులు, నాయందు వాత్సల్యము నెఱపి యాశీర్వదించుటయే. వారికెల్లరకును నా కృతజ్ఞతాంజలులు.

మూలార్థావబోధము నందు నాకెంతయో తోడ్పడిన నాయిల్లాలు సౌ॥ కామాక్షిని, అనువాదావసరము లెఱుఁగు మెప్పులతో నత్యంతము ప్రోత్సహించిన శ్రీసోమశేఖరులను మఱిమఱి సంభావింతును.

మిత్రులు, సుగృహీత 'కరుణశ్రీ' నామధేయులు శ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రిగారు. వారిసాయము లేక యీప్రకాశనము జరిగెడిదే కాదు. వారికిని, ముద్రణము నింత సుందరముగ నిర్వహించిన వెల్‌కం ప్రెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వారికిని నా యభినందనములు.

'విశాఖసాహిత్యవేదిక' యీ 'గంగాలహరీ' పఠనముతో నవతరించినది. పావనులును ప్రసన్నగంభీరులును నగు శ్రీ తెన్నేటి విశ్వనాథులు ప్రాపుగ, నా సాహిత్యవేదిక విస్తరిల్లుగాత.

ఇదియు జగన్నాథోదిత
సదమల పీయూషలహరి, సాంధ్రము; దీనిన్‌
జదివిన చదురులు సుఖసం
పదలఁ బొదలి గాంగపద నిభంబులె యౌతన్‌.

రామచంద్ర కౌండిన్య
సిరిపురం, విశాఖపట్టణము
8-8-1961.

AndhraBharati AMdhra bhArati - padya kAvyamulu - gaMgAlahari - rAmachaMdra kauMDinya - OrugaMTi rAmachaMdrayya - Ramachandra Kaundinya - Oruganti Ramachandrayya - jagannAtha paMDitarAya gangAlaharI - Jagannadha Pandita gangalahari Panditaraya Gangalahari ( telugu kAvyamulu andhra kAvyamulu)