కావ్యములు మను చరిత్రము ప్రథమాశ్వాసము
ప్రవరుని సౌశీల్యాది ప్రశంస
ఉ. ఆ పురిఁ బాయకుండు మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి, భా
షాపరశేషభోగి, వివిధాధ్వర నిర్మల ధర్మకర్మ దీ
క్షాపరతంత్రుఁ, డంబురుహగర్భ కులాభరణం, బనారతా
ధ్యాపన తత్పరుండు, ప్రవరాఖ్యుఁ డలేఖ్య తనూవిలాసుఁడై.
51
ఆ. వానిచక్కఁదనము వైరాగ్యమునఁజేసి
కాంక్షసేయు జార కామినులకు
భోగబాహ్య మయ్యెఁ, బూచిన సంపెంగ
పొలుపు మధుకరాంగనలకుఁ బోలె.
52
ఉ. యౌవనమందు యజ్వయు ధనాఢ్యుఁడునై కమనీయకౌతుక
శ్రీవిధిఁ గూఁకటుల్‌ గొలిచి చేసిన కూరిమి సోమిదమ్మ సౌ
ఖ్యావహయై భజింప, సుఖులై తలిదండ్రులు గూడి దేవియు\న్‌
దేవరవోలె నుండి యిలుదీర్పఁగఁ, గాపుర మొప్పు వానికి\న్‌.
53
సీ. వరణాతరంగిణీ దరవికస్వర నూత్న, కమల కషాయగంధము వహించి,
ప్రత్యూషపవనాంకురములు పైకొనువేళ, వామనస్తుతి పరత్వమున లేచి,
సచ్ఛాత్త్రుఁ డగుచు నిచ్చలు నేఁగి యయ్యేట, నఘమర్షణస్నాన మాచరించి,
సాంధ్యకృత్యము దీర్చి సావిత్రి జపియించి, సైకతస్థలిఁ గర్మసాక్షి కెఱఁగి,
 
తే. ఫల సమిత్కుశ కుసుమాది బహుపదార్థ
తతియు, నుదికిన మడుఁగుదోవతులుఁ గొంచు
బ్రహ్మచారులు వెంటరా, బ్రాహ్మణుండు
వచ్చు నింటికిఁ బ్రజ తన్ను మెచ్చి చూడ.
54
శా. శీలంబున్‌, గులము\న్‌, శమంబు, దమముం, జెల్వంబు లేఁబ్రాయముం
బోలం జూచి యితండె పాత్రుఁ డని యే భూపాలుఁ డీ వచ్చిన\న్‌
సాలగ్రామము మున్నుగాఁ గొనఁడు మాన్యక్షేత్రముల్‌ పెక్కు చం
దాలన్‌ బండు నొకప్పుడుం దఱుఁగ దింటం బాఁడియు\న్‌ బంటయున్‌.
55
తే. వండ నలయదు వేవురు వచ్చిరేని
నన్నపూర్ణకు నుద్దియౌ నతనిగృహిణి
యతిథు లేతేర నడికిరేయైనఁ బెట్టు
వలయు భోజ్యంబు లింట నవ్వారి గాఁగ.
56
సీ. తీర్థసంవాసు లేతెంచినారని విన్న, నెదురుగా నేఁగు దవ్వెంతయైన,
నేఁగి తత్పదముల కెఱఁగి యింటికిఁ దెచ్చుఁ, దెచ్చి సద్భక్తి నాతిథ్యమిచ్చు,
నిచ్చి యిష్టాన్న సంతృప్తులఁగాఁ జేయు, జేసి గూర్చున్నచోఁ జేరవచ్చు,
వచ్చి యిద్ధరఁ గల్గు వనధి పర్వత సరి, త్తీర్థమాహాత్మ్యముల్‌ దెలియ నడుగు,
 
తే. నడిగి యోజన పరిమాణ మరయు నరసి
పోవలయుఁ జూడ ననుచు నూర్పులు నిగుడ్చు
ననుదినము తీర్థసందర్శనాభిలాష
మాత్మ నుప్పొంగ నత్తరుణాగ్నిహోత్రి.
57
క. ఈ విధమున నభ్యాగత
సేవాపరతంత్ర సకల జీవనుఁడై భూ
దేవకుమారకుఁ డుండం
గా విను మొక నాఁడు కుతప కాలమునందున్‌.
58
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - manu charitramu - prathamAshvAsamu ( telugu andhra )