కావ్యములు మను చరిత్రము ప్రథమాశ్వాసము
సిద్ధుని తీర్థయాత్రాభివర్ణనము
ఉ. ఓ చతురాస్యవంశ కలశోదధి పూర్ణశశాంక! తీర్థయా
త్రాచణ శీలినై జనపదంబులుఁ బుణ్యనదీనదంబులు\న్‌
జూచితి నందు నందుఁ గల చోద్యములు\న్‌ గనుఁగొంటి నాపటీ
రాచల పశ్చిమాచల హిమాచల పూర్వదిశాచలంబుగ\న్‌.
70
శా. కేదారేశు భజించితి\న్‌, శిరమున\న్‌ గీలించితి\న్‌ హింగుళా
పాదాంభోరుహముల్‌, ప్రయాగనిలయుం బద్మాక్షు సేవించితి\న్‌,
యాదోనాథసుతాకళత్రు బదరీ నారాయణుం గంటి, నీ
యా దేశం బన నేల? చూచితి సమస్తాశావకాశంబులన్‌.
71
వ. అది యట్లుండె, వినుము గృహస్థరత్నంబ! లంబమాన రవిరథ
తురంగ శృంగార చారు చామరచ్ఛటా ప్రేక్షణక్షణోద్గ్రీవ
చమర సముదయంబగు నుదయంబునం గల విశేషంబులు శేష
ఫణికి నైన లెక్కింప శక్యంబె? యంధకరిపు కంధరావాస వాసుకి
వియోగభవ దుర్వ్యథాభోగ భోగినీ భోగభాగ పరివేష్టిత పటీర
విటపి వాటికావేల్ల దేలాలతావలయంబగు మలయంబునం గల
చలువకు విలువ యెయ్యది? యకటకట! వికట కూట కోటి
విటంక శృంగాటకాఢౌకమాన జరదిందు బింబ గళదమృత
బిందు దుర్దినార్ద్రీకృత సల్లకీ పల్లవ ప్రభంజన పరాంజన హస్తి
హస్తంబగు నస్తంబునం గల మణిప్రస్తరంబుల విశ్రాంతిఁ
జింతించిన మేనం బులక లిప్పుడుం బొడమెడు, స్వస్వప్రవర్ధిత
వర్ధిష్ణు ధరణీరుహ సందోహ దోహదప్రధానాసమాన ఖేల దైల
బిల విలాసినీ విలాస వాచాల తులాకోటి కలకలాహూయమాన
మానస మదాలస మరాళంబగు రజతశైలంబు నోలంబులం గాల
గళు విహారప్రదేశంబులం గన్న సంసృతిక్లేశంబులు వాయవే?
సతతమదజలస్రవణ పరాయణై రావణ విషాణ కోటి సముట్టంకిత
కటక పరిస్ఫురత్కురువింద కందళ వ్రాత జాతాలాతశంకాప
సర్ప దభ్రముభ్రమీవిభ్రమ ధురంధరంబగు మేరుధరాధరంబు
శిఖరంబుల సోయగంబులు గలయం గనుంగొనుట బహుజన్మ
కృత సుకృత పరిపాకంబునం గాక యేల చేకూఱ నేర్చు? నే
నిట్టి మహాద్భుతంబు లీశ్వరానుగ్రహంబున నల్పకాలంబునం
గనుంగొంటి ననుటయు, నీషదంకురిత హసన గ్రసిష్ణు గండ
యుగళుం డగుచుఁ బ్రవరుం డతని కిట్లనియె.
72
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - manu charitramu - prathamAshvAsamu ( telugu andhra )