కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన ప్రథమాశ్వాసము
నారదుఁడు పారిజాత ప్రసూనమును శ్రీ కృష్ణున కర్పించుట
వ. అని యిట్లు బహు ప్రకారంబులం బ్రశంసించి యవ్విరించినందనుం
డమందానందంబు డెందంబునం గ్రందుకొన నిజ వాసనా బిరుద
గాథా కథన వందిబృందాయమానేందిందిరంబును, నుచితోపయోగ జని
తానంద బాష్ప సందోహ శంకావహ మకరంద బిందు తుందిలంబును,
నిఖిల మనోరథ ప్రదాన కీర్తి శంకాకర విశద ప్రభా నిచుళితంబును నగు
పారిజాతంపుఁ గ్రొన్నన మిన్నేటి పసిండి నెత్తమ్మి చిగురుటాకునం బొదివి యిచ్చిన,
52
క. వినయంబు విస్మయంబును
మనమునఁ బెనఁగొనఁగ నపుడు మాధవుఁ డా క్రొ
న్ననఁ గయికొని భీష్మక నం
దనఁ గనుగొని సత్యభామ తలఁపున నిలువన్‌
53
మ. "యిది భోజాత్మజ కిచ్చినం, గినుకతో నేమంచు నూహించునో
మది సాత్రాజితి; దాని కే నిపుడు ప్రేమం బంపినన్‌ దీని నె
ల్లిదముం జేసినజాడ దోఁచునొకొ! యౌలె మ్మిందు నేనున్కిఁ జె
ల్లదువో యేరికిఁ బంపగా" ననుచు లీలన్‌ రుక్మిణీ కాంతకున్‌
54
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )