కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన ప్రథమాశ్వాసము
సత్యకుఁ జెలికత్తె పారిజాత వృతాంతము సెప్పుట
క. అమ్మా! యేమని చెప్పుదు,
నెమ్మి న్నీ విభుఁడు రుక్మిణీసతి మణి సౌ
ధమ్మున నుండఁగ సురముని
క్రమ్మఱ నాకస్మికమ్ముగా నచ్చటికిన్‌
75
క. చనుదెంచి యమ్మురారికి
ననఘమ్మమరైక యోగ్య మతి సౌఖ్య కర
మ్మనితర సులభ మ్మిది యని
కొనియాడుచు నొక్క దివ్య కుసుమ మ్మొసఁగెన్‌
76
క. మిన్నంది వేగఁ గైకొని
కన్నుల నొత్తికొని మ్రొక్కి గారవ మెసఁగన్‌
వెన్నుఁడు రుక్మిణి కొసఁగెను
అన్నెలఁతయుఁ గొప్పులోన నవ్విరిఁ దాల్చెన్‌
77
తే. అంతలోనన యద్భుతం బావహిల్లఁ
గొలఁది యిడరాని యొక వింత చెలువు గలిగి
రాజ బింబాస్య రుక్మిణి తేజరిల్లె
సాన పట్టిన మకురాంకు శస్త్రమనఁగ
78
ఉ. ఆ కుసుమంబు దాల్చిన మహా మహిమంబునఁ దోడి కామినీ
లోకము మచ్చరంబు మదిలోనఁ దొఱంగి భజించుచుండ, న
స్తోక నిజ ప్రభావములు సూపెడు గద్దియ మీద నెక్కి ము
ల్లోకము దాన యేలు గతి లోలవిలోచన! యేమి సెప్పుదున్‌
79
ఉ. ఎంతకు లేఁడు నారదమునీంద్రుఁడు; శౌరి వినంగ, రుక్మిణీ
కాంత వినంగ, నేను వినఁగాఁ, బలికెం "బతిఁ గూర్చుదాన నా
యంతటి వారు లేరని యహంకృతి నెప్పుడు విఱ్ఱ వీఁగుచున్‌
వంతున వచ్చు సత్య గరువంబిఁకఁ జెల్ల" దటంచు మానినీ!
80
క. ఆ రణభోజను మతకము,
లా రుక్మిణి నటన, లా మురాంతకు చెయ్వుల్‌
చేరి కనుంగొనుచో నె
వ్వారికిఁ గోపంబు రాదు! వారిజనేత్రా!
81
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )