కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన ద్వితీయాశ్వాసము
అంధకార వర్ణనము
సీ. దిన వారిరాశి మా పను మౌని గ్రోలంగ - నడుగునఁ గనుపట్టు నస లనంగఁ,
గ్రుంకుమె ట్టడవిఁ గార్కొనిన సంధ్యా వహ్నిఁ - బొడమిన దట్టంపుఁ బొగ యనంగఁ,
దన మణి పడిపోవ ధరణీ తలంబున - నెమకంగ వచ్చిన నింగి యనఁగ,
నల చుక్క లనియెడి వలరాజు గెలుపు వ్రా - ల్దెలియఁ బూసిన మషీ లేప మనఁగ,
 
తే. వృద్ధ వారవిలాసినీ విసరమునకు
నపలితంకర ణౌషధం బనఁగ, జార
నలినముఖుల కదృశ్యాంజనం బనంగ,
నంధకారంబు జగమెల్ల నాక్రమించె.
34
సీ. చిలుక తేరును, నల్ల చెఱకు విల్లును, గల్వ - విరితూపు, నిత్తుము మరుఁడ! నీకు
వనమాలికయు, నూత్న వంశనాళమును, బిం - ఛము సమర్పింతుము శౌరి! నీకుఁ,
గప్పుఁ గప్పడమును, గస్తూరియును, గాటు - కయు నివేదింతుము కాళి! నీకుఁ,
నేరేడుపండ్లు, వినీల చామరలు, దూ - ర్వలు, నొసంగుదు మిభవక్త్ర! నీకు,
 
తే. నిట్టి లోకోపకారికి నిరులుదొరకుఁ
జంద్ర సూర్యాది దుర్దోష శాంతి వొదలి
నిత్యత వహింపఁ జేయంగ నేర్తురేని
యనుచుఁ బ్రార్థించి రభిసారికాబ్జముఖులు.
35
చ. మొనసిన దీపికా నికరముల్‌ గృహ కార్య గతాభిసారికా
వనితల యూర్పు గాడ్పుల నెపంబునఁ గంపము నొంద నోడకుం
డని తిమిరంబు తా నభయహస్త మొసంగె ననంగ వానిపైఁ
గనుఁగొనఁ బొల్చె నంకురిత కజ్జలవన్నవధూమ మాలికల్‌.
36
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )