కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన ద్వితీయాశ్వాసము
శ్రీకృష్ణుఁడు సత్యభామకు మేరువు సోయగమును జూపుట
చ. కువలయపత్రనేత్ర! కనుగొంటివె! కన్నులపండువయ్యె రెం
డవ వినతా తనూభవుని యందమునం గమనీయ కాంచన
చ్ఛవి కవచీ కృతంబు కులిశ క్షత పక్షము నైన రత్నసా
నువు నిజ యామికీ కృత వినోద పరాయణ చంద్ర భానువు\న్‌.
85
సీ. జీర్ణ పర్ణ ద్రు సంకీ ర్ణాహి మణివిభా - మాయా కిసల వంచ్యమాన పికము,
శశికాంత రుచి మృషా సలిల సంస్ఫాలన - శ్లథ విషా ణోద్విగ్న సైరిభంబు,
గోమేధిక ప్రభాంకూర మిథ్యా మధు - ద్రవ లిలిక్షా మిళ ద్భల్లుకంబు,
నీల గండప్రస్త రాళీక గజ భేద - శీర్య న్నఖ క్షుబ్ధ సింహకులము,
 
తే. గారు డాశ్మ చ్ఛవి చ్ఛటా కపట యవస
పూలికా చర్వణ వ్యగ్ర బాలమృగ వి
లంఘ్యమా నాబ్జరాగ శిలా వితాన
కూట దావాగ్ని యా మరు త్కుధర మబల!
86
ఉ. వంచనఁ బొంచి చేరువకు వచ్చిన చంద్రుని జింక నేసి హ
ర్షించియుఁ, ద త్సుధారస నిషేచనచే నది చావ కున్కి వీ
క్షించియు, నేటు దప్పె నని చేవిలు నమ్ములుఁ బాఱవైచి ల
జ్జించి చరించు చుండుదురు చెంచిత ల గ్గిరి సాను భూముల\న్‌.
87
వ. వెండియు నప్పసిండి కొండ గండ శిలా మండలంబుల నుద్దండ
వేదండంబు లొండొండ గండతలంబు లొరసికొన నిండిన మదజలాంజన
మషిం గొని వనదేవ తోపభుక్త ముక్త తాటంక తాళీ దళంబులం బ్రియ
సందేశంబులు లిఖియించు గంధర్వ సౌగంధిక గంధులవలన,
నత్యంత నిర్మల స్ఫటి కాధిత్యకలం గానవచ్చు పాతాళ వాతాశి ప్రతి బింబంబులం
గని మును తమ కఱచిన యురగంబులం బాఱ విడిచి వానిం దమ చంచుపుటంబులం
బొడిచియు గరు దంచలంబులం నడఁచియుఁ బదంబులం దాఁచియు
నేచిన కోపంబుల విఫల ప్రయత్నంబు లగు బాల శిఖావళంబులం
గని తమ వరులకుం జూపి పరిహసించు గరుడ తరుణీ నివహంబుల వలన,
సెలయేటి చిలుప చిలుప నీరు పగలు గగనమణి ధగధగని
కిరణములు మిగుల సెగ లెగయు రవికాంత శిలా తలంబులం
దెకతెక లుడుకెత్తి జాలువాఱఁ గరంగిన కఱ్ఱజవ్వాది కొలంకులం
బడి కెలంకులం దేలి తెట్టువలు గట్టి చపల కపి కుల చలిత తట
తరు పతిత కుసుమ విసర పరిమళ పరంపరావాసితం బై ఘుమఘుమం
బిసాళింప నలందుకొని రతి శ్రమంబు లపనయించు యక్షపక్ష్మలాక్షుల వలనఁ,
గేసరి కిశోర నఖముఖ విదారిత కుంభం బైన వనగజంబును,
వనగజ దంతఘాత యాతనా భ్రాంత వరాహంబును, వరాహ
దంష్ట్రాటంక ఖండిత కీచక నిచయంబును, గీచకశిఖా జర్జరిత
పర్జన్యంబును, బర్జ న్యోదర పరిచ్యుత శంఖ శుక్తి సంఘంబును,
నొక్క యెడనపడఁ దత్త దుత్పన్నంబు లగు మౌక్తికంబుల వేఱు వేఱ నేఱి
పేరులు గ్రుచ్చు సాధ్య మిథ్యామధ్యల వలనను, నభిరామం బై;
మఱియు నొక్కొకచోట సురపతి తఱుచు మెఱుఁగు లడరు
కఱకు భిదురముఁ గొని తఱిమి యెఱుకలు విఱుగ నఱికినయెడల
సెలలకు విడిన జలగల పొలుపునం జఱుల నెరగొని పొరలు జర
దజగర నికరంబులును, ఖచర గణ గోష్ఠీ స్థానంబులం బరచిన
రత్నకంబళంబుల విధంబున విశాల శిలా తలంబుల నిద్రించు
శార్దూలంబులును, మృగాంక మండలంబు సగము కబళించిన
రాహు గ్రహ భూమికల చందంబున నందంద తిరుగు బొల్లి
మోరల భల్లూకంబులును గలిగి; సుధర్మా ప్రదేశంబునుంబోలె శక్రపుర
మహిళాలికుచలి కుచ చందన సుగం ధాగురు వాత పోత మేదురంబును,
జలనిధియునుం బోలె నీల నల పనస కీలిత తుంగ సేతు సహితంబును,
వల్లకియునుం బోలె లలిత ప్రవాళ కకుభంబును, భారతంబునుం బోలె
శతపర్వ చమత్కృతంబును, సమరతలంబునుం బోలెఁ గలి
తానేక పాటనంబును, శబ్దశాస్త్రంబునుం బోలె ధాతు గణ విద్యోతి
తంబును, సంగీతంబునుంబోలె నిషాద భరితంబు నయి,
గ్రావ నిబద్ధ ఘనౌఘం బయ్యును నగ్రావ నిబద్ధ ఘనౌఘంబై,
గవయ స్థానం బయ్యును నగ వయ స్స్థానంబై, వైణ వారవాసితం బయ్యు,
నవైణ వారావాసితంబై, మెఱయు నిది; మఱియును!
88
ఉ. కిన్నరకంఠి! చూచితివె కిన్నరులం గలధౌత భూధరా
భ్యున్నత శృంగ భాగముల నుత్పలగంధులుఁ దాముఁ గల్ప కో
త్పన్న మధు ప్రసంగతులఁ బాడెద రింద్రునిమీఁది గీతముల్‌
కిన్నర లొయ్యనొయ్యఁ బలికించుచుఁ దారతర స్వనంబుల\న్‌.
89
ఉ. ఆయత భూర్జపత్రముల నామర ధేను దధి ప్రయుక్త పా
థేయము లారగించి వడ దేఱఁగ శీతల కల్పక ద్రుమ
చ్ఛాయల నిల్చి నిల్చి సరసంబులు పల్కుచు వెండికొండకుం
బాయక కూడి యేఁగెదరు భామిని! చూడుము సిద్ధపాంథుల\న్‌.
90
శా. ఏణీ శాబ విలోల నేత్ర! కనుఁగొంటే! వీరు విద్యాధరుల్‌
మాణిక్యోజ్జ్వల రత్న కుండలులు సంబద్ధాసిధేనుల్‌ రణ
ద్వీణాపాణులు చంద్రి కామల శిరోవేష్ణుల్‌ త్రిపుండ్రాంకితుల్‌
నాణీయ స్తర తార హారులు శివ ధ్యానైక నిష్ఠా పరుల్‌.
91
మ. కనుఁగొంటే! సక లేందు బింబ ముఖి! యీ గంధర్వులం బంకజా
సన గేహి న్యుపదిష్ట గీత రచనా సర్వంకష ప్రజ్ఞులం
గన దుత్తంగ విమాన చారులఁ దురంగ గ్రీవుల న్నిర్జరీ
జనతా నృత్త సహాయ లాలసుల యక్ష గ్రామ వాస్తవ్యుల\న్‌.
92
సీ. యక్షులు వీర లోయతివ! మేళము గూడి - పాడుచుండుదురు దిక్పాల సభల,
గుహ్యకు ల్వీర లోకొమ్మ! హాస్య రసాధి - నాయకుల్‌ భృంగీశ నర్మసఖులు,
గరుడులు వీర లోతరుణి! విష్వక్సేన - పరిచితుల్నాగారి పరమ హితులు,
చారణు ల్వీర లోసతి! విచిత్ర కథేతి - హాసజ్ఞు లఖిల లోకాధ్వనీను,
 
తే. లమరపతిఁ గొల్వఁ జనువార లతివ! యెపుడు
నుబుసు పుత్తురు వివిధోపయోగ్య కళల,
మనలఁ జూచెద రాశ్చర్య మగ్ను లగుచు
వీరిఁ గనుఁగొంటె! గంభీరవేది గమన!
93
లయగ్రాహి. అంగన! కనుంగొనుమనంగహర మౌళి తట
రంగనటి జహ్ను మునిపుంగమ విశాలో
త్సంగ శిశువుం గపిలు నింగలపుఁ జూపుసెక
లం గలయు నా సగరు వంగడము మోక్షో
త్తుంగ మణిసౌధమునకుం గడపుఁ దాఁప గగ
నాంగణ మహీతల భుజంగ నిలయంబుల్‌
జంగగొను నేర్పరిఁ బతంగజ యనుంగుఁ జెలి
యం గనఖలాచలయుగంగ సురగంగ\న్‌.
94
మ. అవె దివ్యర్షి నికేతనంబు, లనసూ యారుంధతీ కర్ణపూ
ర వివృ ద్ధార్భక కృష్ణసార గతి సంరంభంబు, లింద్ర ద్రుమో
ద్భవ నానావిధ వల్క లాంచిత బహి ర్ద్వార ప్రదేశంబు, లా
హవనీ యాది హుతాశ ధూమ పటల శ్యామీభవ త్ప్రాంతముల్‌.
95
ఉ. అచ్చర పువ్వుఁ బోండ్లు సరసామృత ధారయుఁ గల్పవాటియు\న్‌
లచ్చియుఁ జందమామయుఁ దలంపుల మానికముం దలంపఁ బై
పెచ్చులు దీనికి న్నెమరు వెట్టుచు నందిని యఱ్ఱు నాకుచుం
బచ్చికఁ బండి యున్నయది భామిని! వేలుపు టావుఁ జూచితే!
96
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )