కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన ద్వితీయాశ్వాసము
ఇంద్రపురీ వైభవము
చ. కనక మహీధ రేంద్రు నలిక స్థిత పర్వతరాజ పట్ట బం
ధనమును బోని కోటయు, ఘనంబగు తన్మకుటంబు కైవడిం
దనరెడు వైజయంతమును, దవ్వులఁ గానఁగవచ్చెఁ జూచితే
యనిమిష రాజధాని యిది హాయనమాత్ర కురంగ లోచనా!
97
ఉ. శ్రీలఁ జెలంగు నీ సురపురిం గమనీయ మహానుభావతం
బోలఁగ లేక యోటములఁ బొంది భజింపఁగ వచ్చినట్టు లు
త్తాల దుకూలకల్పిత పతాకలతోఁ గడు నొప్పు నన్య ది
క్పాలపురంబులో యనఁగఁ బార్శ్వములం దివిషద్విమానముల్‌.
98
చ. మరలక జన్యభూమి నణుమాత్రభయంబును లేనివీరు, ల
ధ్వరము లనేకము ల్విధియుతంబుగఁ జేసిన భూసురేంద్రు, లు
ద్ధుర భవపాశ బంధములఁ ద్రుంచిన యోగి కులావతంసు, లీ
సురపుర కామినీ వదన చుంబన మాత్ర కృతార్థ మానసుల్‌.
99
శా. సారంగాక్షుల చూపుచోఱగముల\న్‌ జన్గొండల న్మోహ దు
ర్వా రావర్తముల న్మునింగి దరిఁ జేరన్రాక యుప్పొంగు సం
సారాంభోనిధి సత్క్రియా తరణి నిశ్శంక న్సముత్తీర్ణుఁ డై
చేరు న్సజ్జన నావికుండు మదిరాక్షీ! యీపుర ద్వీపము\న్‌.
100
క. అని నాకపుర మహత్త్వము
వనితకుఁ దెలుపుచును హర్షవశ మానసుఁడై
దనుజకులవైరి చని యొ
య్యనఁ గాంచన మేదినీ ధరాగ్ర క్షోణి\న్‌.
101
చ. పతగవిభుండు మింటిపయి భంజలికా మురళీ సుఢాల వ
ల్గితములఁదా నెదుర్పడిన ఖేచరవర్గము లోసరించి య
ద్భతముగ మ్రొక్క లేనగవుతోఁ గనుఁగొంచు వదాన్య నైచికీ
శిత ఖుర టంక చంద్రకిత సిద్ధసరిత్తట మార్గసీమల\న్‌.
102
క. సరస బిస విసర ముహు రా
హర ణోద్ధుర హంస సంస దారవ దీర్ఘీ
కరణ చణ గంధవహములు
శరీరముల సేద దేర్పఁ జనుదెంచె రహి\న్‌.
103
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )