కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన తృతీయాశ్వాసము
దేవమాత యదితిని శ్రీకృష్ణుఁడు దర్శించుట
సీ. తొడలపైఁ జాఁచిన యడూగుఁ గెందామర - లొయ్యనఁ బౌలోమి యెత్తుచుండఁ,
బార్శ్వభాగంబునఁ బంకేరుహాసను - కామినీరత్నంబు కతలు సెప్పఁ,
బనిఁ బూని యంతంత వినయావనత వృత్తి - సప్తర్షికాంతలు సంచరింప,
వీజన చామర వీటీకరండాది - కములు దిక్పతిసతీ గణము దాల్ప,
 
తే. విమల చింతామణీమయ వేదిమీఁదఁ
గల్పక లతాంత కల్పిత తల్పసీమ
నధివసించిన నిఖిల లోకైకవంద్య
నమర మౌక్తిక శుక్తి నయ్యదితిఁ గనియె.
24
మ. కని సత్యారమణీ యుతంబుగ నమస్కారంబు గావించి భౌ
మ నిశా టాహృత కుండలద్వయము నాత్మ స్వర్ణచేలాగ్ర బం
ధనము న్వీడ్చి యొసంగ నందుకొని మోదంబంది యా నందనం
దను దీవించుచుఁ జెంగట న్నిలిపెఁ జింతారత్న పీఠంబున\న్‌.
25
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )