కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన తృతీయాశ్వాసము
వసంత వైభవము
చ. సరసిజనేత్ర! చూచితె వసంతుఁడు నీవనవాటికా రమా
తరుణియుఁ బాణిపీడన విధా సమయంబునఁ గేలుదోయి నొం
డొరుపయి సమ్మదంబు లిగురొత్తఁగ మాటికిఁ జల్లు సేసఁ బ్రా
ల్నెరసె ననఁగ వ్రాలెఁ గుహళీ విగళ న్నవకోర కావళుల్‌.
53
చ. చిలుకలు వాఁడి చంచువులఁ జించినచో లవలీదళంబుల\న్‌
ఫలరసరేఖ లంటి కనుపట్టెడుఁ జూడుము చైత్రుఁ డీలతా
లలనల గండ దర్పణతలంబులఁ గుంకుమ పత్రభంగము
ల్చెలువుగ వ్రాసెనో యన నళిప్రకరాద్వయ వాది కైశికా!
54
ఉ. పాదప నూత నాంబుధర పంక్తి విముక్త మరంద వర్షసం
పాదిత శక్రగోపముల భావము నందుచు నోయదృష్ట సిం
హోదర సన్నివేశ! కడు నొప్పెడు దాడిమబీజము ల్మదో
న్మాదిత రాజకీర వదన త్రుటి తోరు ఫల చ్యుతంబులై.
55
క. తలిరాకు మెఱుఁగు వాతెఱ
కలకంఠవిటుండు గమియఁగాఁ జూత లతా
లలన విదిర్చెను గంటివె!
యలి కంకణ ముఖర విటప హస్తముల సతీ!
56
చ. తనుఁ గనుఁ బ్రామి యొండొకలతం బతి వేఱొక తేఁటిబోటిపొ
త్తున విరిదేనె గ్రోలఁగని తాలుచు సంపఁగితావి వెల్లిలోఁ
గనలునఁ గూలఁబోవు నలికామిని సాహస మేమి సెప్ప! న
య్యనుఁగుఁ బ్రియుండు నెచ్చెలులు నాఁగిన మాన దరాళకుంతలా!
57
చ. అనుచుఁ బ్రియాంసపీఠి నిజహస్తతలంబున నూఁది కల్పకా
వనిజ దుకూల మార్జనల వంజుల పుష్ప మరంద సేచన\న్‌
దనదు విహార వైఖరికి నందనదేవత యాయితంబు సే
సినగతి నొప్పు దివ్య వనసీమ ముదంబున సంచరించుచు\న్‌.
58
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )