కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన చతుర్థాశ్వాసము
శ్రీకృష్ణుఁడు పారిజాత మహిమను సత్యకుఁ జెప్పుట
క. తరుణీ! యీతరుశాఖాం
తర లోల దుకూల మారుతము లింద్రాణీ
పరివార వారసతులకుఁ
బరువపు విరికోఁత బొడము బడలిక నడచు\న్‌.
4
ఉ. మానిని! దీని రత్నకుసుమ స్తబకమ్ముల కాంతిఁ గమ్మఁ బూ
దేనియ యంచుఁ గ్రోలఁ జనుదెంచిన యాయెలదేఁటి దాఁటు లో
నూనిన డప్పి మూఁగఁబడి యున్నత చంచల చంచుకోటిచే
నానెఁడు జూడు మంద గరు దంచల ఝంకృతు లుల్లసిల్లఁగ\న్‌.
5
క. ఈతరుశాఖల వ్రేలెడు
మే తొడవుల కాంతిలోన మెలఁగెడు పక్షి
వ్రాతము నెఱుఁగరు నిర్జర
కాతరలోచనలు పలుకఁగా వినకున్న\న్‌.
6
క. తనపాదు జలములోనం
గనుపట్టెడు నీడ నీనగము విలసిల్లు\న్‌
మనకన్న మున్న తా మే
దినికిం డిగి యేగుచున్న తెఱఁగునఁ దరుణీ!
7
ఉ. వారణరాజయాన! సురవల్లభుఁ డాశచి నంకపీఠముం
జేరిచి, సోగవెండ్రుకలఁ జిక్కులు వాపి, వియన్నదీ నవాం
భోరుహ నాళసూత్రములఁ బొందుగ దీనిలతాంతము ల్సరు
ల్గా రచియించి నించుఁ గుతుకంబున వీఁగుమెఱుంగు క్రొవ్వెద\న్‌.
8
మ. విను మింతుల్దిలకంబుఁ, జంపకముఁ, గ్రోవి, న్సిందువారంబుఁ, బ్రేం
కనము, న్మామిడి, గోఁగుఁ, బొన్నఁ, బొగడం, గంకేళి, నూహించి క
న్గొన, మోమెత్తఁగఁ, గౌఁగిలించుకొన, మూర్కోఁ, బాడఁ, జేనంటఁ, బ
ల్క, నగం, గల్లుమియంగఁ, దన్న, ననుచుం గల్పాగ మాయావిరుల్‌.
9
చ. కనఁ దిలకంబు, గేసరము గల్లుమియ, న్రహిఁబాడఁ బ్రేంకనం
బు, నిముర మావి, నవ్వ సురపొన్న, ముఖాంబుజమెత్తఁ జంపకం
బు, నెఱగవుంగిలం గొరవి, మూర్కొన వావిలి, దన్న వంజుళం
బు, నుడువ గోఁగునై తరుణి! పూచు సుర ద్రుమ మిన్నిపువ్వుల\న్‌.
10
ఉ. నావుడు సత్యభామ నిజనాథున కిట్లను నేల తామసం
బీ విబుధాధినాయక మహీరుహముం బెకలించి లోకసం
భావిత మైన నీ పలుకుఁ బంతము సెల్ల మదీయగేహ కే
ళీవనవాటి వేడుక దలిర్పఁగ నిల్పుము జీవితేశ్వరా!
11
మ. అనినం గైటభదైత్యవైరి దరహాసాంకూరము ల్మోవిపై
మొనయం గొండొక నిల్చి యివ్వనమున న్మోదంబుతో నిర్జరీ
జనము ల్గొల్వఁగఁ గ్రీడ సల్పి భవదిష్టం బేను గావింతు నం
గన! యం చారురత్న గుచ్ఛ మిడియెం గర్ణావతంసంబుగ\న్‌.
12
ఉ. ఈపగిది న్మురారి హృదయేశ్వరి నూఱఁడ బల్కి నిర్జరేం
ద్రోపవన స్థలంబునఁ బయోరుహనేత్రయుఁ దానుఁ జేరి పు
ష్పాపచయ ప్రమోద భరితాత్మకుఁడై చిదిమె న్లతాంతము
ల్గోపవధూ కుచ స్తబక లోల నిశాత నఖాంకురంబుల\న్‌.
13
మ. ఎలదేఁటు ల్దమవాలుఁ గన్గవలపై నిందీవర భ్రాంతిచే
మెలఁగం జేరలఁ గప్పుకో నలవి గామిం జీఁదఱ జెంది యి
చ్చలఁ గాక్షించిరి నిర్నిమేష జలజాస్య ల్మానుషత్వంబు న
య్యలిభీతి న్ముకుళీకృతాక్షియగు సత్యాకాంత నీక్షించుచు\న్‌.
14
ఉ. అంబరచారి పంకజదళాక్షులు చంపకపుష్ప రేణు జా
లంబులయందు సర్వ శుభలక్షణ రేఖలఁ బొల్చునట్టి బీ
తాంబరు పాదపంకజము లంటిన తావులు ద్రొక్క నోడి పా
ర్శ్వంబుల సంచరింతురు పరస్పర కేళివచః ప్రసంగతి\న్‌.
15
వృషభగతి రగడ. కొమ్మ! వేగిర మేటికే కొనగోర గోరఁటవిరులు గిల్లుము
తమ్మిపువ్వులమీఁద జలముల దార తారక యుండఁజల్లుము
మృగవిలోచన! మేను చుఱుకన మేలమే లత నిటులు వ్రేయఁగ
వగవ నేటికిఁ జూడుమీ గొరువంక వంకఁ బ్రియుండు డాయఁగ
నలుగ నేటికి ముడువుమీ చెలువార వారణయాన! మొల్లలు
పొలఁతి! సైఁపవు మాకు నీకయ పోలుఁ బో లుడివడిన కల్లలు
పన్నిదం బిడఁ బ్రేంకనము ననఁ బాడి పాడి దొఱంగి తెచ్చితిఁ
బొన్న మొగ్గలఁ గంటసరి పూఁబోఁడి పోఁడిమిగాఁగ గ్రుచ్చితి
వడుగ నేటికి దీని విరులు దురాశ రా శఫరీవిలోచన!
జడఁ బరాగము నిండెఁదుడువు రసాల సాల మరంద సేచనఁ
జామరో! సురపొన్నలకు నీ చాయఁ జాయలఁ బల్క నేటికి
భామ! కోయకు వేగపడి పూఁ బాళఁ బాళము గాదు నేఁటికి
మగువ! పలుమఱు దిగిచి చూచుట మానుమా నులివడియె దండలు
మగిడి చనుఁ డిఁకనేల! యీ యెల మావి మావిహరించు దండలు
పలుకకుము తుచ్ఛములు పలుమఱు బాల బాలకి యన్నఁ దిట్టితి
వలసగమనముఁ జూపి చెలి! నీ వంచ వంచన సేసి పట్టితి
తావి బుగులుగొనంగఁ దొడఁగె ఘృతాచి తాఁచితె! యీయశోకము
రావె తేనియ కంచుఁబలికెదు రంభ! రంభలలో ననేకము
ననలు వేఁడిన మొఱిఁగి తప్పుడు నాలి నాలికుచంబు ముట్టుకు
మెనయు ప్రాణపదంబుగాఁ దలఁ తీవ తీవ తలంగ మెట్టకు
మంజుఘోష! సువర్ణలత లనుమానమా నందనవనంబున
నంజ దిది యెలదేఁటి కననే మఱచె మఱచెదమే మనంబున
నమృత మధురములైన ఫలరస మాని మానిని; త్రుళ్ళె శుకములు
గుమురులగు లేమావి చిగురులు గోయఁ గోయని కూసెఁ బికములు
గుమగుమని వాసనల గేదఁగికొమ్మ కొమ్మకు నందె దోఁటికి
రమణి! గొజ్జఁగిపొదలు గడు దూరమ్ము రమ్ము చలమ్ము లేటికి.
16
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )