కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన చతుర్థాశ్వాసము
సంధ్యాకాల వర్ణనము
క. దిన రా జత్తఱిఁ బంకజ
వనములఁ జరియించు కాంతివర్గము దాను\న్‌
వనధి జనకేళి సలుపఁగఁ
జనియె నన న్వారుణీ దిశా తటిఁ బొల్చె\న్‌.
42
తే. వేల్పుఁ జిగురాకుఁబోఁడుల వీఁగుఁజన్నుఁ
గవలపైఁ గుంకుమచ్ఛాయ గడలు కొలిపి
పసిఁడిగట్టున కొకవింత మిసిమి నించి
నెఱసెఁ గడసావి ముదుసలి తెఱప యెండ.
43
ఆ. వేల్పుగట్టు గవుల వెలువడి వడదేఱఁ
జదలు వాఁక నీట జలక మాడి
వైజయంత హర్మ్య వలభి నీడంబులఁ
గ్రందుకొనియెఁ గిన్నర ద్వయములు.
44
క. ఘన సాంధ్యరాగ వినతా
తనయ గరు త్సమితి కడిఁది తాఁకువ ధర వ్రా
లిన గగన ఫణి ఫణామణి
యన రవిమండలము పశ్చిమాంబుధిఁ గ్రుంకె\న్‌.
45
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )