కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన చతుర్థాశ్వాసము
ఇంద్రపురి సమర సన్నాహములు
ఉ. కోణపరంప రాహతులఁ గూరిన వేదననో సమస్త ని
ర్మాణ భృతి ప్రణాశకరు మాధవునిం జెనకంగఁబోవు గీ
ర్వాణులఁ బోకుఁడంచు మొఱవైచెనొకో! యన మ్రోసె నంత ని
స్సాణము పాకశాసను హజారమునం గదనాభిశంసి యై.
64
మ. అపు డాబద్ధ ఖలీన కాశ్వచయ మై, యందూ పరిభ్రంశిత
ద్విప మై, దివ్యర థాగ్ర కేతు పటసంథిత్సా మిళ త్సూత మై,
యపరాభూత భుజావలేప భట వీరాలాపమై, జంభవై
రిపురం బంతయు మందర క్షుభిత వార్ధింబోలె ఘూర్ణిల్లుచు\న్‌.
65
ఉ. నీయనుజన్ముఁడ న్సఖుఁడ నీకని యింటికి వచ్చి జంభదై
తేయవిరోధిచే నపుడు తేజము లన్నియుఁ గాంచి చేసె న
న్యాయము పారిజాతహరణంబునఁ గృష్ణుఁడు మంచిచుట్ట మౌ
రా! యని పల్కఁగా జనపరంపచే విని రెల్లవారలు\న్‌.
66
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )