కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన చతుర్థాశ్వాసము
ఇంద్రుఁడు యుద్ధమునకు వెడలుట
ఉ. మానసవేగ రథ్యమును మాతలి సారథికంబు నగ్రసం
దానిత నీలనీరద పతాకమునైన రథంబుపై శచీ
జాని పులోమ వృత్ర బలజంభ శర ప్రవిఘాత కారణం
బైన తనుత్రముం దొడిగె నాహవ దోహల మానసంబున\న్‌.
76
సీ. గతి మ్రుచ్చిలఁగ వేచుగాలిఁ ద్రావఁగఁ బాము - నిడిన కైవడిఁ గాలికడియ మమర,
నల దేవమణికిఁ గ్రావలియిడ్డ ప్రహరి నా - గళమున ఘంటికావళులు మెఱయఁ,
బన్నగాశికి నెదుర్పడ వెండిఱెక్కలు - ధరియించె ననఁగఁ బక్కెర సెలంగఁ,
బారిజా తాహృతి ప్రభవ రోష మనంగ - గతి రోధ జనిత ఫూత్కృతులు నిగుడ,
 
తే. ఖరముఖ క్షుణ్ణ కాంచనక్షోణి రజము
పర్వి సంధ్యారు ణేందుబింబంబుఁ బోల
వాహకోత్తముఁ డైన రేవంతుఁ డమర
వల్లభునిమ్రోల నుచ్చైశ్శ్రవంబు నిలిపె.
77
శా. చండ స్థూల రదద్వయద్వయ మహా స్తంభంబులం బూని యు
ద్దండ స్ఫార పతాకికా సహితమై దానచ్ఛటా చిత్రవ
ద్గండాభోగ విశాల కుడ్యములచేఁ గన్పట్టు నద్దేవతా
శుండాలం బరుదెంచె సంగర రమా శుద్ధాంత సౌధం బన\న్‌.
78
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )