కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన చతుర్థాశ్వాసము
దిక్పాలురు యుద్ధమునకు వెడలుట
ఉ. ఏడుకరంబుల న్వరుస నెత్తిన తోమర శక్తి చాప శ
స్త్రీ డమరు స్రువ వ్యజన దివ్య మహత్తర సాధనంబు లా
మ్రేడితకాంతితో నిజశరీర రుచిం బచరింప వచ్చె న
య్యేడిక రాచ తత్తడిపయి\న్‌ హుతవాహుఁ డుదగ్రమూర్తియై.
79
శా. బాహా సంభృత కాలదండ జనిత స్ఫార స్ఫులిం గాళికి
న్సాహాయ్యంబు ఘటించి కోప రస ఘూర్ణ న్నేత్ర దీప్తు ల్పయో
వా హాంతర్గత వైద్యుతప్రభల లేవం జోప వాహ ద్విష
ద్వాహోత్తంసము నెక్కి పోరి కడరె\న్‌ వైవస్వతుం డుద్ధతి\న్‌.
80
శా. భీమాకారులు కామరూపధరు లాభీలక్రియా పాదనో
ద్దాము ల్పుణ్యజను ల్భజింపఁ గుముద స్తంబేరమం బగ్రతో
భూమిం బల్లన గట్టి రా నసి రుచి స్ఫూర్తు ల్విజృంభింప సం
గ్రామేచ్ఛం బలలాశి యేఁగె మనుజ స్కంధాంత రారూఢుఁడై.
81
చ. మకర కుళీర కచ్ఛప సమానములైన ముఖంబుల న్భయా
నక రస ముప్పతిల్లఁ గెలన న్నిజకింకర వీరదానవ
ప్రకరము కొల్వ బాహు శిఖరంబునఁ బాశము పూని వార్ధిఁనా
యకుఁ డని కేఁగుదెంచెఁ గలహంస తురంగ రథారూఢుఁడై.
82
ఉ. అంద సుగంధము ల్నిజభటాలి పథశ్రమము\న్‌ హరింప ను
త్తుంగ గదా పరిభ్రమ విధూతములై ఘనము ల్దిగంత మా
తంగ విశాల కర్ణములఁ దార్కొని చామరలీలఁ జూప సా
రంగహయంబు నెక్కి సమరంబున కేఁగె సమీరుఁ డుద్ధతి\న్‌.
83
క. నలకూబర మణికంఠులు
బలముల నడిపింప నర్థపతి తురగముపై
ధళధళిత చంద్రహా సో
జ్జ్వలిత భుజుం డగుచు నడచె వాసవు మ్రోల\న్‌.
84
ఉ. ఆసనసీమఁ గ్రోధ జని తారుణ దీధితి ఫాలభాగనే
త్రానల కీలలం బెనుప హస్తమున న్నిశిత త్రిశూలముం
బూని మదించి ఱంకెలిడు పోఁటరి గిబ్బలఱేని నెక్కి యీ
శానుఁడు వచ్చెఁ బారిషద సైన్యముతో రనకౌతుకంబున\న్‌.
85
ఉ. ఆయుధగర్భితంబు లగు నంజలు లెత్తి పులోమకన్యకా
నాయక! యేన యేన యని నాక నివాసులు మ్రొక్కి సూరెలం
బాయక కొల్చి రా దిగధిపాలురతో "నల నందసూనుఁ డా
హా యిటు సేయునే!" యని మహాహమికం బలుమాఱు పల్కుచు\న్‌.
86
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )