కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన పంచమాశ్వాసము
భీకర సంగరము
క. భిన్నాసురాస్రముల చవి
గన్న మురాహిత శిలీముఖము లపు డనిలో
మున్నెఱుఁగని సురవీరుల
క్రొన్నెత్తురు చవియు నెఱిఁగి క్రోలఁ దొడంగె\న్‌.
6
చ. అమరహితంబు గోరి యసురాంగకము ల్విదళించునట్టి మా
కమరులఁ ద్రుంపఁగా వలసె నక్కట నేఁడని సిగ్గుఁజెందు చం
దమునఁ గఠోర శార్ఙ్గ ప్రదరంబులు వైరిమర్మ భే
దము లొనరించి యుద్ధవసుధాస్థలిఁ దూఱఁగఁబాఱు నయ్యెడ\న్‌.
7
సీ. హరిబాణ లూనంబులై వచ్చు నమరాస్త్ర - ఖడ్గము ల్దూల్చుఁ బక్షముల జడిసి,
యమృత గంధాసక్త మగు చంచుపుటమున - వడి సింధురంబులఁ బొడిచి యెత్తు,
నధిపుఁ డేసినఁ బాఱు నాశుగంబులకంటె - మునుమున్న చని లక్ష్యముల దళించు,
భటులపై హరులపై బహురథాగ్రములపై - నొక్కఁ డయ్యును దోఁచు బెక్కుగతుల,
 
తే. నఖముఖంబుల నిఱికి గండ్రలుగఁ జేయు
దివిజ బిరుద ధ్వజంబు లుద్రేకవృత్తి
నిఖిలలోకాద్భు తావహ నిర్నిరోధ
విక్రమ స్ఫూర్తి ఖగరాజ చక్రవర్తి.
8
తే. సర్వతోముఖ మయి పేర్చు శార్ఙ్గి బాణ
వర్ష సమ్మర్ద దుర్దినవ్యాప్తి వలన
నప్పుడెదిరించి పన్నిద్ద ఱహిమకరులుఁ
గానఁ బడలేక తేజోవిహీను లైరి.
9
ఉ. చుక్కలరాణివాసముల సోయగపుం జనుదోయి త్రెక్కునం
జిక్కన యైన యక్కు యదుసింహుఁడు బాణపరంప రాహతి\న్‌
వ్రక్కలుసేయఁ గాఱు రుధిరంబున దోఁగుచు రేవెలుంగు గెం
పెక్కిన చాయ నభ్యుదయ మేదియుఁ దాల్చె రణాంగణంబున\న్‌.
10
తే. చోద్య మప్పుడు భవరోగ వైద్యుఁ డైన
యంబుజోదరు డాసిన యంతమాత్ర
నపగతాసాధ్య గదుఁ డయ్యె యక్షభర్త,
సొరిది రుద్రులు నిర్ముక్త శూలు లైరి.
11
సీ. నిర్భగ్న శృంగుఁడై నిజవాహనముఁ దాను - వైవస్వతుఁడు లాఘవంబు నొందె,
దళిత శాతకృపాణ దంష్ట్రమై నైరృత - భుజ భుజంగస్వామి పొల్లువోయె,
నిర్ధూతహేతియై నిలువు నీఱుగ నగ్ని - దేవుండు నిర్వాణ తేజుఁ డయ్యె,
భయ పలాయనవేళఁ బవమానునకు నాత్మ - జవసత్త్వముల కల్మి సఫల మయ్యె,
 
తే. వరుణునకు డాఁగికొనఁ జోటు వలఁతి యగుట
నుదధి నాయక భావంబు నుపకరించె,
జలరుహోదర సవ్యాపసవ్య ముక్త
నిష్ఠురాస్త్రంబు లొండొండ నిగుడునపుడు.
12
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )