కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన పంచమాశ్వాసము
నారదుని యానంద నృత్యము
చ. "ఇతని కితండె సాటి యగు, నీతని కీతఁడె సాటి వచ్చుఁ గా
కితరులు వీరిఁ బోలఁగలరే!" యను చారణ సిద్ధ సాధ్య సం
స్తుతులు సెలంగె, నా రణము చూచి రణాశన మౌని నింగిపైఁ
గుతుక రసాతిరేకమునఁ గుంచియ వీచి నటించె నయ్యెడ\న్‌.
29
సీ. కినిసి బిడౌజుఁ డాగ్నేయాస్త్ర మడరింప - నది శార్ఙ్గి తేజంబునందు డిందెఁ,
గనలి వృద్ధశ్రవుం డనిలాస్త్ర మేసిన - నది యదూద్వహు నూర్పునందు డిందె,
నలిగి బలారి సౌరాస్త్రంబు నిగిడింప - నది శౌరి వలచూడ్కియందు డిందె,
నడరి యింద్రుండు బ్రహ్మాస్త్రంబు పయికొల్ప - నది మురాంతకు నాభియందు డిందెఁ,
 
ఆ. బాకదమన ముక్త పాశుపతాస్త్రంబు
హరి నిజార్ధ తనువునందు డిందె,
నేమి సేయవచ్చు! నీశ్వరుం డఖిలాత్ముఁ
డతని గెల్వఁ దనకు నలవి యగునె!
30
చ. తఱి గని యంతలోన మధుదైత్యహరుండు మహేంద్రు శింజినిం
గొఱనెల తూపునం దునిమి క్రూరతరంబగు భల్ల మొక్కట
న్నఱికినఁ గూలెఁ దద్ఘన ఘనాఘన కల్పితమైన టెక్కియం
బొఱలుచు నోరుగాలి మొదలూడఁగఁ గూలెడు మ్రాని కైవడి\న్‌.
31
శా. భుగ్న భ్రూకుటి దుర్ముఖుం డగుచు నాస్ఫోటించుచు న్లోని రో
షాగ్నిజ్వాలలు బాహ్యనిర్గతము లైన ట్లుత్క టారుణ్య ని
ర్మగ్నంబై కనుపట్టు లోచనసహస్రం బొప్ప మౌర్వీలతా
భగ్నం బైన శరాసము న్విడిచి జంభద్వేషి యత్యుగ్రత\న్‌.
32
చ. కుల వసుధా ధరావలికిఁ గుంటితనం బొదవించె నెద్ది యా
బలితపుఁ గైదువుం గొని సుపర్వకులాగ్రణి వేయుఁగన్నులం
దలకొని కౌస్తుభ స్తబకితంబగు శౌరియురంబు సూచిన
న్జలజ దళోద రోదకము చాడ్పున నల్లలనాడె లోకముల్‌.
33
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )