కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన పంచమాశ్వాసము
ఇంద్రుఁడు వజ్రాయుధమును బ్రయోగించుట
ఉ. వీరుఁడ వౌదు, దీని బలువ్రేటున కోరిచి నిల్చి తేని యం
భోరుహనాభ! యంచు సురపుంగవుఁ డప్పుడు లోకభీకరా
కారత నిల్చి భీతి పరికంపితులై సుర లూహ లేది హా
హారవము ల్ఘటింపఁ గులిశాయుధరాజముఁ బూఁచివైచిన\న్‌.
34
మహాస్రగ్ధర. శతధారా జాయమాన జ్వలన ముఖశిఖాచ్ఛాది తాభ్రస్థలంబై,
వితతాభీలధ్వని శ్రీవిలసన బధిరోద్విగ్న దిగ్వారణంబై,
కృతలోకాలోక ముఖ్యాఖిలగిరి చలన క్షిప్తభూమండలంబై,
పతయాళు ద్వాదశాత్మ ప్రకరఖరకరౌపమ్యమై యేఁగుదేర\న్‌.
35
మ. కని నెమ్మోమునఁ బిన్ననవ్వు దొలఁకం గంసారి నిశ్శంకఁ దా
ర్క్ష్యుని నడ్డంబుగఁ ద్రిప్పి వేగ రవితేజో దుస్సహ స్ఫూర్తిమైఁ
దను డాయ న్శతకోటిఁ గేలి శతపత్రక్రీడఁ బట్టెం గటా
క్ష నిరీక్షాగతి నందకత్సరుకిణాంకంబైన హస్తంబున\న్‌.
36
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )