కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన పంచమాశ్వాసము
శ్రీకృష్ణుఁడు పారిజాత తరువుతో నిజనగరి కేతెంచుట
చ. కనకగిరీంద్రముం గడచి గ్రక్కున రైవతకాద్రి పొంత ని
ల్చిన యదు వృష్ణి భోజ నృపసింహులు సేనలతోడఁ దన్నెదు
ర్కొన నగరంబుఁ జొచ్చె మణిగోపుర సంస్థిత పౌరభామినీ
జనములు సేసముత్తెములు సల్లఁగ నుల్లసితాంతరంగుఁడై.
43
తే. పురబహిర్ద్వారములు దాఁటి భుజగశాయి
రాజమార్గంబు దఱియ హేరాళ మగుచు
బుగులుకొనియె ననాఘ్రాత పూర్వకములు
పారిజాత మహీజాత పరిమళములు.
44
ఉ. ఆ మహిజాతముం గనిన యంతటిలో ధన ధాన్యరాశితో
సామజ ఘోటికా మహిత శాలలతో మణిసౌధ పంక్తితో
గో మహిషీ శతాంగ భట కోటులతో మఱిభూషణాలితోఁ
దామరతంపరై తనరెఁ దత్పురిఁ గింపచ గేహ వాటికల్‌.
45
మ. బెరసె\న్‌ మేన నిగిడ్చినట్లు వళు, లుబ్బె న్దుర్బలాంగంబు, లం
కురము ల్సూపె రదంబు, లంఘ్రుల వడంకు ల్దీఱె, వాలారులై
కరజంబు ల్సిగిరించెఁ, గేశ వితతు ల్గప్పారె, వృద్ధాళికి\న్‌
మరలం బ్రాయము వచ్చెఁ దత్తరు చల న్మందాని లాసంగతి\న్‌.
46
క. విన నేర్చిరి బధిరులు, గనుఁ
గొన నేర్చిరి యంధకులు, లఘుత్వము మీఱ\న్‌
జన నేర్చిరి వికలాంగకు
లనిమిష తరు కుసుమసౌర భావేశమున\న్‌.
47
క. విస్మయముగ నీగతి ముర
ఘస్మరుఁడు నికేతన ప్రఘాణమున భుజం
గ స్మయ హర వాహము డిగి
సస్మితముఖుఁ డగుచు నరిగె సమ్మోదమున\న్‌.
48
సీ. వరభక్తి దేవకీవసుదేవులకు మ్రొక్కి - బలభద్రునకు నట్ల ప్రణతి సేసి,
గురు పురోహిత బంధుకోటికి వినయంబు - గావించి, మిత్రులఁ గౌఁగిలించి,
సుత సోదరామాత్య తతి నతుల్గయికొని - యాప్త వర్గంబుల నాదరించి,
గారవంబునఁ బెక్కుగతుల మన్నించుచు - వినతా తనూభవు వీడుకొలిపి,
 
తే. ప్రేయసియుఁ దానుఁ గూడి తదీయమంది
రమున కేఁగి సుఖాలాప రచన మెఱయఁ
బ్రతిన వచ్చెఁ గదా యిదె పారిజాత
మనుచు నర్పింప నద్దేవి హర్షమంది.
49
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )