కావ్యములు పెన్నేటి పాట - విద్వాన్‌ విశ్వం మొదటి సర్గ
మొదటి సర్గ
కలమ పాలికల యాలల మేలి పాటల
        జుమ్మని మ్రోయు మించుల సితారు;
తెనుగు పెద్దన్నల గొనబు పల్కుల, గుబా
        ళించిన జాజి మల్లెల గుడారు;
జిలుగు జరీబుటా వలువ సింగారింపు
        మెలకువ లూర్చు నిగ్గుల కొఠారు;
తలకు మించిన సత్యముల లోతులను జీల్చు
        చును వోవు తెల్వి యంచుల కఠారు;
కడిది మొనగాని
        ఎడద చిక్కనకు పేరు;
కటిక ఱాలను కవ్వించి
        గజ్జకట్టి
చిందు ద్రొక్కించు
        మాయల జిలుగు తేరు
కలదు
        రాయలసీమ పచ్చల బజారు.
అచట నొకనాడు పండె
        ముత్యాల చాలు;
అట నొకప్పుడు నిండె
        కావ్యాల జాలు;
అచ్చట నొకప్డు కురిసె
        భాష్యాల జల్లు;
విరిసె నట నాడు
        వేయంచు విచ్చుకత్తి.
ఇది గతించిన కథ;
        వినిపింతు నింక
నేటి రాయలసీమ
        కన్నీటి పాట
కోటి గొంతుల
        కిన్నెర మీటుకొనుచు
కోటి గుండెల
        కంజరి కొట్టుకొనుచు.
అదే పెన్న! అదే పెన్న!
        నిదానించి నడు!
విదారించు నెదన్‌, వట్టి
        ఎడారి తమ్ముడు!
ఎదీ పెన్న? ఎదీ పెన్న?
        ఎదీ పినాకినీ?
ఇదే పెన్న! ఇదే పెన్న!
        ఇదే పినాకినీ!
ఎదీ నీరు? ఎదీ హోరు?
        ఎదీ నీటి జాలు?
ఇదే నీరు! ఇదే హోరు!
        ఇదే ఇసుక వాలు!
అదే పెన్న! అదే పెన్న!
        నిదానించి నడు!
విదారించు నెదన్‌, వట్టి
        ఎడారి తమ్ముడు!
పార చేబట్టుకొని
        వంగి చీరు దనుక,
ఇట్టె చెమ్మట
        కాలువ గట్టు దనుక,
ఇసుక పాతర లోతుల
        కేగు దనుక,
నీకు కన్పించ దీయేటి
        నీటిచుక్క!
కుండపోతల వానలు
        గుఱియ నేమి?
పట్టుమని పదినాళ్ళలో
        పారబోసి,
ఇసుక బొక్కసమున
        మిగులెల్ల దాచి,
పెన్న పడుకొను
        నీ నేల దిన్నెమీద!
చిటపట వానలకే, ఒ
క్కట నోరుం దెఱచి, నురుగు గ్రక్కుకొనుచు,
త్కటమై, దరు లొఱసి, రటత్‌
కటు ప్రవాహముల నింగికై పరువెత్తు\న్‌.
జఠర లుఠ ఝ్ఝషమై, క
ర్మఠులై దరిజేరు జీవరాశుల మ్రింగున్‌;
హఠ మెంతని! ఇది చేయని
హఠాత్‌ కఠోర క్రియా విహారము కలదా!
కాని, ఈ ఏటి నీటిలో
        క్రమ్మదనము లూరుచుండును;
దోసిట నొక్కమారు
        పుక్కిలించిన జాలు
నీ పుట్టువునకు,
        సార్థకత్వమ్ము
నిష్కల్మషత్వ మబ్బు!
గుండె జలదరింపజేయు;
రండతనము డుల్చివేయు
ఖండిత వాదిని జేయును
దండి తల్లి సు మ్మీ నది!
కండలేక ఎండిపోయి
బెండు వారినా సరే!
తిండిలేక, తుండులేక,
పండవారినా సరే!
నిండు మనసు, నిజాయితీ,
పండు వయసు, పట్టుదలా,
దండిచేయి, ధర్మదీక్ష
        పండించును గుండెలలో.
రండు రండు! చేతు లెత్తి
దండము తల్లీ యని, కై
దండల దండలతో, నీ
రెండ నిలిచి కొలుచి పొండు!
ఇంత మంచి పెన్నతల్లి
        ఎందు కెండి పోయెనో?
ఇంతమంది కన్న తల్లి
        ఎందు కిట్లు మారెనో?
        వంతలతో, చింతలతో
        కంతలువడి పోయెనో!
        సంతుకోస మేడ్చి ఏడ్చి,
        గొంతు కారిపోయెనో!
ఇంతమంది కన్న తల్లి
        ఎందు కిట్లు మారెనో?
ఇంత మంచి పెన్నతల్లి
        ఎందు కెండి పోయెనో?
ఈ యేటి కాల్వ లోతుల
పాయలుగా పారు, నీటి ప్రతి బొట్టున, నీ
చాయల రైతుల నెత్తుటి
చాయలు సమ్మిళితమై విచారము గొల్పున్‌.
ఈ యేటి దరుల దిన్నెల
పాయక దిరుగాడు నక్కబావలె యెపుడున్‌;
వేయారు పీన్గు లిచ్చట
నే యంత్యక్రియల బొందు నెప్పటి కపుడే.
సుర గరుడోరగ విద్యా
ధర కిన్నర సిద్ధ సాధ్య దైవత తరుణీ
చరణారుణ పంకేరుహ
వర రేఖలు లేవు; వట్టి వఱడులె తిరుగున్‌.
నాగ కన్యక లిచట
        కన్పడరు గాని,
నాగుబాములు చక చక
        సాగు నిచట;
గరుడ గంధర్వ కామినుల్‌
        కానబడరు గాని,
బొంత గద్దలు
        గుంపుగట్టు, నిచట!
ఏలా లతాజాల డోలిక లిట లేవు
        తిప్పతీగెల తలతిక్కెగాని,
తరుణ ప్రవాళ లతా కుంజములు లేవు,
        రేణగంపల పొదరిండ్లెగాని;
లలి లవంగ కుడుంగ లాలిత్యములు లేవు,
        తుమ్మతోపుల ముండ్లదొరులె గాని;
నారికేళాది వనాంతరస్థలి లేదు,
        చిట్టీత డొంకల చేటెగాని --
ఇట గులాబీలు
        తలసూప వెపుడు; వట్టి
తంగెడుల్‌ బోదగడ్డి గాదములె
        పెరుగు!
సరస సుకుమార తృణ
        సమాచ్ఛదము లేదు,
పాడు పల్లెరుగాయల
        బీడెగాని!
శుక పిక శారికా రవ
        రుచుల్‌ వినిపింపవు; గూబమూల్గు, లొ
క్కొ కతఱి గుండె పీల్చును;
        దిగుల్‌ వడ జేయును తీతువుల్‌; సము
త్సుక వృక జంబుకమ్ములు
        మతుల్‌ సెడ గుయ్యిడు; వల్లకాడు పె
న్నకు నిరుగట్టులందు
        పులినస్థలి పుఱ్ఱెలు పండు మెండుగన్‌.
బల్లులు, తొండలు, నెలుకలు,
పిల్లులు, కుక్కలును, చెవుల పిల్లులు కొల్లల్‌;
కొల్లలు తేళ్ళుం జెఱ్ఱులు -
ఇల్లూ వాకిలి యిదే ఫణీంద్రుల కెల్లన్‌.
పుట్టలు గుట్టలు గుట్టలు;
పట్టెడు పట్టెడు నిజమ్ము పాపరకాయల్‌
పుట్టెడు పుట్టెడు జులుకులు -
కట్టా! ఇదియేటి యేటిగట్టు తమ్ముడా!
నిట్రాళ్ళకు చెట్రాళ్ళకు
బేట్రాళ్ళకు కొదువలేదు; బిసబిస నడువన్‌
కుట్రెళ్ళి వచ్చు, నీ తల
పేట్రేగును సుమ్ము ముందు వెనుకల్‌ గనుమా!
ఆ చింతచెట్టు కొమ్మే - చిన్నగాని యీ
        పిరి దీసివేసిన యురికి బ్రాపు;
ఆ తుమ్మచెట్టు దిమ్మే - సీతిగాని కా
        ఱకు జేర వేసిన ఱాలుగాయ;
ఆ యీతచెట్టు పట్టే - యెంకి కడియాల
        నూడ్చిన తీర్పులో నొక్క సాక్షి;
ఆ బోదపోచ రెమ్మే - బుఱ్ఱ ఎరుకల
        సాని చండా లూడ్పజాలు జాణ
ఆ ఇసుక దిబ్బయే -
చలమన్న బండి బడక
నమ్మించినట్టి మ్రుక్కడి కసాయి -
అక్కటక్కట! ఇక్కడ అడుగు దీసి
అడుగు బెట్టుటకే
గుండె లవిసిపోవు.
విడుగుచుండె తిమిర మదే
తొడుగుచుండె నరుణకాంతి
తడబడ పనిలే దిక అ
క్కడ నేదో కోడికూత?
వడి వడిగా నడు! నడు!! క
న్పడు నేదో పల్లె యొకటి -
విడుగుచుండె తిమిర మదే
తొడుగుచుండె నరుణకాంతి.
అటు నిటు కల్లకంప
తరుణారుణ దీప్తులు దూరనేర విచ్చట!
నడుమన్‌ గలట్టిది విశాల మహాధ్వము
మూడు మూళ్ళు;
చిక్కటి యిసుకన్‌ పదమ్ములు
కకావికలై చను;
నీడ్వలేక ఎంతటి బిగిగిత్తలైన
దగ తల్లడిలున్‌ - మన మింక లెక్కయా?
ఈడొంక - పెండ్లిండ్ల కేగు వారల
        నెన్ని తూరులు దొంగలు దోచుకొనిరొ?
ఈడొంక - నిండు బండ్లెన్ని మారులు
        బరువెక్కుట యిరుసు పుటుక్కు మనెనొ?
ఈడొంక - నెన్ని సార్లెందరు మొనగాండ్ల
        కాలుసేతుల యెముకలు విఱిగెనొ!
ఈడొంక - మంచినీళ్ళెత్తుకవచ్చు
        కొంగ్రొత్త కోడం డ్రెంత కుళ్ళుకొనిరొ!
ఇచట మునిమాపులం దెన్ని యెన్ని
మోజుకతలలో రసపట్టులు కాటువడెనొ!
ఇచట నెండప్రొద్దుల పసు లెన్ని యెన్ని
ఇంత విశ్రాంతికై
        తపియించినవియొ!
ఇది విడిది ఆలమందకు,
నిదియే గొఱ్ఱెలకు తావు, నింక మేకలన్‌
గదుముక వత్తు రిచటికే,
ఇది పులులకు రేవు నీటి యెద్దడి యయినన్‌.
వంక ఇదియె
        కొండ వాగుతో నేర్పడె!
వాన వచ్చినపుడు
        వంక పాఱు;
దీని లోన
        ప్రక్కగా నున్నదే కాల్వ,
బాట దరిని
        మంచినీటి చెలమ!
అదిగో! పారల నెత్తిపట్టుకొని
వేయార్మంది, యీ కాల్వనే
పదిలంబుం బొనరింప వత్తు;
రిది కుప్పల్‌గొట్టు కాలమ్ముదాక
దినమ్మున్‌ బ్రతిరైతు సేయవలె;
సర్కా రూరకే పన్ను వేయుదు రంతే -
ఒకనాడు మానిన
పొలా లుత్తుత్తవై పోయెడి\న్‌.
ఆ గుంపులోన వచ్చు
రాగమ్మున యాలపాడు రంగన్న కిదే
యాగము, యోగము, భోగము,
రోగమ్మును గూడ నిదియే
        రోజులు గడవన్‌.
ఇది మొదటి సర్గ
AndhraBharati AMdhra bhArati - kaavyamulu - pennETi pATA - Vidvan Viswam - Vidvan Visvam( telugu andhra )