కావ్యములు శివతాండవము 'సరస్వతీపుత్ర' పుట్టపర్తి నారాయణాచార్యులు

ఓం
ఆఙ్గికం భువనం యస్య
        వాచికం సర్వవాఙ్మయం
ఆహార్యం చన్ద్రతారాది
        తం నమస్సాత్వికం శివమ్‌.


ఏమానందము
భూమీతలమున!
శివతాండవమట!
శివలాస్యంబట!
అలలై; బంగరు
కలలై, పగడపుఁ
బులుఁగులవలె మ
బ్బులు విరిసినయవి
శివతాండవమట!
శివలాస్యంబట!
వచ్చిరొయేమొ! వి
యచ్చరకాంతలు
జలదాంగనలై
విలోకించుటకు
శివలాస్యంబట!
యేమానందము
భూమీతలమున!
పలికెడునవె ప
క్షులు బ్రాఁబలుకులొ!
కల హైమవతీ
విలసన్నూపుర
నినాదములకు
న్ననుకరణంబులొ!
కొమ్మల కానం
దోత్సాహమ్ములు
ముమ్మరముగ మన
ములఁగదలించెనొ!
తలనూచుచు గు
త్తులుగుత్తులుగా
నిలరాల్చును బూ
వులనికరమ్ములు.
రాలెడు బ్రతి సుమ
మేలా నవ్వును!
హైమవతీ కుసు
మాలంకారము
లందునఁ దానొక
టౌదు నటంచునొ!
లలితా మృదు మం
జులమగు కాయము
బూవుల తాకుల
తో వసివాడదొ!
భారతియట పా
ర్వతికి నలంకా
రముఁ దీర్చెడునది!
రమణీయస్మిత
ములఁ గావించునొ
యలరుల మృదువులు!
చతురాననుఁడే
సవదరించునట
శర్వునకుత్తమ
సర్పవిభూషలు!
వీచె విశబ్దిత
కీచకములు మృదు
వీచులుగాఁ ద
ర్పితలోకమ్ములు
మారుతములు గో
టీ రితా బ్జుఁడగు
శివునకు సేసలు
జెల్లించుటకై
తకఝం తకఝం
తక దిరికిట నా
దమ్ములతో లో
కమ్ముల వేలుపు
నెమ్మిగ నిలఁబడి
నృత్యమాడునెడ
లయానుగతిఁ గ
మ్రముగా శ్రుతిఁ బ
ట్టుటకో! గొంతులు
సవదరించు ను
త్కటభృంగమ్ములు.
ఈ సెలకన్నెల
కెవ్వరుజెప్పిరొ!
యాసర్వేశ్వరు
నభినయమహమును
కుచ్చెళులెల్లెడ
విచ్చలవిడిగా
దుసికిళ్ళాడఁగ
నసమునఁ బరుగిడు -
ఓ హో హో హో!
యూహాఽతీతం
బీయానందం
బిలాతలంబున!
సంధ్యాసతి! యీ
సంభ్రమ మేమిటె
నవకుసుంభరా
గవసన మేమిటె!
ఆకుంచత తి
ర్యక్ప్రసారి ల
జ్జామధుర కటా
క్షపాతమేమిటె!
విలాసవక్రిత
విచలన్మధ్యం
బునహ్రీమతి! నీ
వునువలెనేజిఱు
పలకనిమేఖల
వాలకమేమిటె!
యెవ్వరికోసర
మీబిబ్బోకము!
శివపూజకొ! యో
చెలువా! యీకథ
లెవ్వరు జెప్పిరె?
యిలాతలంబే
ఆడెడునట నా
ర్యాప్రాణేశ్వరుఁ
డోదినమణి! నిలు
రా! దినమంతయుఁ
బడమటి దేశపు
వారలకీకథ
నెఱిగించుటకై
బరుగెత్తెదవో!
అలమృగములు గ
న్నుల బాష్పమ్ములు
విడిచెడునెందుకు!
విశ్వేశ్వరునకు
నడుగులుగడగుట
కై పాద్యంబో!!
గుసగుసమని యీ
కిసలయములు స
మ్మదపూరముగా
మాటలాడునెదొ!!
యేమున్నది! లో
కేశ్వరునాట్యమె
ఓ హో హో హో!
యూహాఽతీతం
బీయానందం
బిలాతలంబున!!


నందినాంది
అర్థేందూత్ఫుల్లకేశం స్మితరుచిపటలీదంశితం గౌరవర్ణం
తార్తీయీకం వహంతం నయన, మహికుల ప్రత్నభూషావితానం
వృత్తారంభాఽట్టహాస ప్రవిచలితకకుప్చక్ర, మానందకందం
తం వందే నీలకంఠం త్రిదశపతి శిరశ్చుంబిపాదాఽబ్జపీఠం.
వ్యాఖ్యానానాం స్వయంభుప్రముఖపరిషదాం దూరతోవర్తమానై
ర్లోకాఽఽలోకోత్సవైస్తై రవిదితగతిభిర్విభ్రమైస్తారతారైః
కుర్వంతం దేవకాంతాహృదయవలభిషున్యాస ముద్రాంస్మరస్య
త్రైలోక్యాఽఽనందదాన ప్రవణ, ముపనిషత్ప్రాణ మీశం భజామః.
పాటలజటాఘటిత జూటరుచికోటిభృశపాటిత తమిస్రవలయం
కూటశబరం పటునిశాటకుల ఝాటసుఖమోటనరసైకనిలయం
కోటిశతకోటి సమకోటి నయనోత్థిత కృపీటభవ దగ్ధమదనం
నాటితభువం ప్రళయనాటక మహారచన పాటవచణం హృదిభజే.
మత్తగజకృత్తియుతముత్తమమహర్షి గణచిత్త వనకోకిలమజం
నిత్యసుఖదం త్రిదశకృత్యఫలదం, భువనమర్త్యపరిరక్షణచణం
భావపరిముగ్ధగిరిజావనజతుల్యపదయావకరసాఽక్త శిరసం
పీవరభుజం ప్రమథజీవనమముం సకలపావనతనుం హృదిభజే.
గంగాతరంగకణసంగ వికాసిజూటం
సంధ్యాంతరిక్ష మివతారకితం దధానః
నృత్యత్పదాఽగ్ర పరికల్పిత వేదజాతః
కుర్యాద్దయాం, త్రిభువనాఽఽలయదీపఏషః.
దధన్నేత్రం గౌరీ ప్రణయముకురం మండనవిధౌ
ప్రసన్న స్మేరాఽస్యం లలితలలితం చాంద్రశకలం
మహాసంవిద్రూపం భుజగపతి భూషం శ్రుతిసతీ
వతంసం శంసామః కిమపి కిమపి బ్రహ్మసరసం.
గౌరీకటాక్ష రేఖా
చంద్రకితం వక్షఆదధానాయ
పింగళజూటాయనమో
గంగాకమనాయ, వేదవేద్యాయ.
కాష్ఠాఆస్ఫోటయంతం కహకహనినదైర్భీషణై రట్టహాసైః
హస్తవ్యాక్షేపభంగైః ప్రసభమపద్రుతంవ్యోమ కుర్వంత ముచ్చైః
పాదాఽఽఘాతై రధోగాం సవనగిరిగుహాకోటి ముత్కంపయంతం
ధిం ధిం ధిం శబ్దఘోరం హృదివికటమహాకాల మాలోకయామః
ఛటచ్ఛటనదచ్చిఖాపటలపోషణం భీషణం
బహిర్హుతవహం సృజన్విషమలోచనాఽభ్యంతరాత్‌
ప్రమత్తఇవ నృత్యతిప్రచలితాఽఖిలాంగస్సయ
స్సమాఽఽపతతు మానసే తుహినశైల కూటోచ్ఛ్రితః.
బధ్నన్‌ నృత్తాంఽతరాంతః ప్రగళితమహిపాఽఽకల్పితం పట్టబంధం
సంబాధోద్భిన్నఘోరశ్వసిత హుతవహాఽఽదీప్తదంష్ట్రావిటంకం
ప్రోత్తాలస్వైరధీరైః పదయుగలమహాఽఽస్ఫోటనైః కల్పయంతం
నానాభంగాన్‌ లయాఽబ్ధౌ భ్రుకుటితనిటలం శూలినంసంస్మరామః.
జయ జయ శంకర! శత్రుభయంకర!
జయ జయ ప్రమథపిశాచవశంకర!
జయ జయ తాండవ సంభ్రమసుందర!
జయ జయ ధైర్యవిచాలితమందర!
జయ జయ శీతలచంద్రాఽఽభరణా!
జయ జయ కరుణా శరణాఽఽచరణా!
జయ గగనాంబర! శాతత్రిశూలా!
జయ శుభంకరా! జయ మహాకాలా!
ఢక్కారవములు బిక్కటిల్ల దశ
దిక్కుల మారుత దీర్ఘీకృతములు
ఝణుఝణుఝణుత స్వనములకును బ్రతి
నినదము లీఁనగ వనధి భంగములు
శూలంబొన నాభీలత లేవఁగఁ
గీలాచయములు లేలిహానములు
ధగధగితములై నిగుడఁగ నగవులు
గగన తలస్థులు బెగడ దేవతలు
నీ నృత్తములో నిఖిల వాఙ్మయము
తానముగా మఱిగానము గాగను
తాండవింపఁగాఁ దరుణంబై నది
ఖండేందుధరా! గదలుము నెమ్మది.
జయ నాదలయాఽఽసాదితమూర్తీ!
జయ జయ తాండవ సంభృతకీర్తీ!
జయ గగనాంబర! శాతత్రిశూలా!
జయ శుభంకరా! జయ మహాకాలా!


శివతాండవము
క.        శ్రీరమణీ లలిత కటా
        క్షాఽఽరోపణ చంపక ప్రసవమాలా శృం
        గారిత వక్షుండు దయా
        వీరుఁడు బరదైవ మెడఁద వెలిఁగెడుఁ గాతన్‌.
ఉ.        కన్నులఁ గల్వచూపులు వికస్వరముల్గగనాంచలంబులన్‌
        దన్నఁగ ధింధిమి ధ్వనులు దట్టములై ప్రతిశబ్దమీన, నా
        సన్న గుహాంతరాళముల సాంధ్యలఁదాండవమాడు దుఃఖితా
        పన్న శరణ్యుఁ డీశ్వరుఁడు భావమున న్జిగిరించుఁ గావుతన్‌.
తలపైనిఁ జదలేటి యలలు దాండవమాడ
నలలత్రోపుడులఁ గ్రొన్నెల పూవు గదలాడ
మొనసి ఫాలముపైన ముంగుఱులు చెఱలాడఁ
గనుబొమ్మలో మధుర గమనములు నడయాడఁ
గనుపాపలో గౌరి కసినవ్వు బింబింపఁ
గనుచూపులను తరుణకౌతుకము జుంబింపఁ
గడఁగి మూడవకంటఁ గటికనిప్పులు రాలఁ
గడుఁబేర్చి పెదవిపైఁ గటికనవ్వులు వ్రేల
ధిమిధిమిధ్వని సరిద్గిరి గర్భములు తూఁగ
నమిత సంరంభ హాహాకారములు రేగ
        ఆడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు
కిసలయజటాచ్ఛటలు ముసరుకొని వ్రేలాడ
బుసలుగొని తలచుట్టు భుజగములు బారాడ
మకరకుండలచకాచకలు చెక్కులఁ బూయ
నకలంక కంఠహారాళి నృత్యము సేయ
ముకుజెఱమలో శ్వాసము దందడింపంగఁ
బ్రకటభూతిప్రభావ్రజ మావరింపంగ
నిటలతటమునఁ జెమట నిండి వెల్లువగట్టఁ
గటయుగమ్మున నాట్యకలనంబు జూపట్ట
తకఝణుత ఝణుత యను తాళమానము తోడ
వికచనేత్రస్యంది విమలదృష్టుల తోడ
        ఆడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు
భుగభుగ మటంచు నిప్పులు గ్రుమ్మ నూరుపులు
ధగధగిత కాంతి తంద్రములుగాఁ గకుభములు
దంతకాంతులు దిశాంతముల బాఱలు వాఱఁ
గాంత వాసుకి హస్త కటకంబు డిగజాఱ
భావోన్నతికిని దాపటి మేను వలపూఱ
భావావృతంబు వల్పలిమేను గరుపాఱ
గజకృత్తి కడలొత్తి భుజముపై వ్రేలాడ
నజుఁడు గేల్గవమోడ్చి "హరహరా" యని వేడ
ఝణుత తధిఝణుత తదిగిణతో యను మద్దెలల
రణనంబు మేఘ గర్భముల దూసుక పోక
        ఆడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు
ఎగుభుజమ్ములు దాచి నగుమొగమ్మునఁ జూచి
వగలురమ్మునఁ దూచి భావాభిరతి నేచి
తరళతంద్రమ్ము మధ్యమ్ము కిటకిటలాడ
వనసాంధ్యకిమ్మీర ప్రభలు దనువునఁ గూడ
కుణియునెడ వలయంపు మణులు చిందఱలాఁడ
కిణుకిణు మటంచుఁ బదకింకిణులు బిరుదాఁడ
శృంఖలారుండములు చెలగి తాండవమాఁడ
శంఖావదాత లోచనదీప్తి గుమిగూడ
వలగొన్న యెముక పేరులు మర్మరము సేయఁ
బులకింపఁగా నొడలు మురజంబులును మ్రోయ
        ఆడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు
మొలక మీసపుఁగట్టు, ముద్దుచందురు బొట్టు
పులితోలు హొంబట్టు, జిలుఁగు వెన్నెల పట్టు
నెన్నడుమునకు చుట్టు క్రొన్నాగు మొలకట్టు
క్రొన్నాగు మొలకట్టు గురియు మంటల రట్టు
సికపై ననల్పకల్పక పుష్పజాతి, క
ల్పక పుష్పజాతిఁ జెర్లాడు మధురవాసనలు
బింబారుణము కదంబించు దాంబూలంబు
తాంబూల వాసనలఁ దగులు భృంగ గణంబుఁ
గనుల పండువు సేయ, మనసు నిండుగఁ బూయ
ధణధణధ్వని దిశాతతి బిచ్చలింపంగ
        ఆడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు
సకల భువనంబు లాంగికముగా శంకరుఁడు
సకల వాఙ్మయము వాచికము గాఁగ మృడుండు
సకల నక్షత్రంబులు గలాపములు గాఁగ
సకలంబు దనయెడఁద సాత్త్వికంబును గాఁగ
గణనఁ జతుర్విధాభినయాభిరతిఁ దేల్చి
తన నాట్యగరిమంబుఁ దనలోనె తావలచి
నృత్యంబు వెలయించి నృత్తంబు ఝళిపించి
నృత్త నృత్యములు శబలితముగాఁ జూపించి
లాస్యతాండవ భేద రచనాగతులు మీఱి
వశ్యులై సర్వదిక్పాలకులు దరిఁజేర
        ఆడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు
అంగములు గదురఁ బ్రత్యంగంబులునుఁ జెదర
హంగునకు సరిగా నుపాంగంబులును గుదురఁ
తత సమత్త్వాదు లంతఃప్రాణదశకంబు
నతి శస్తములగు బాహ్యప్రాణ సప్తకము
ఘంటాసదృక్కంఠ కర్పరము గానంబు
కంఠగాన సమాన కరయుగాభినయమ్ము
కరయుగము కనువైన కనులలో భావమ్ము
చరణములఁ దాళమ్ము చక్షుస్సదృక్షమ్ము
ఒరవడిగ నిలువంగ నురవడిఁ దలిర్పంగఁ
బరవశత్వమున శ్రీపతియున్‌ జెమర్పంగ
        ఆడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు
కర ముద్రికల తోనె గనులఁ జూపులు దిరుగఁ
దిరుగు చూపులతోనె బరుగెత్త హృదయమ్ము
హృదయమ్ము వెనువెంటఁ గదిసికొన భావమ్ము
కుదిసి భావము తోనె కుదురుకోగ రసమ్ము
శిరము గ్రీవమ్ము పేరురము హస్త యుగమ్ము
సరిగాగ మలచి గండరువు నిల్పిన యట్లు
తారకలు జలియింపఁ దారకలు నటియింపఁ
గోరకములై గుబురు గొన్న జూటము నందు
నురగాలినలి రేఁగి చొక్కి వీచిఁన యట్లు
పరపులైపడఁ గల్పపాదపంబులఁ బూవు
        ఆడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు
మొగ్గలై ప్రేమంపు బుగ్గలై యమృతంపు
నిగ్గులై దమలోన మొగ్గరంబులు గట్టి
నును సిగ్గుతో ముడిచుకొని పోయెడు విధానఁ
బెను వెఱపుతో రాలి వణకాడెడు విధానఁ
బలపలని వెన్నెలలు జిలికించెడు విధాన
రోసంబు గ్రసియింప రూక్షమైన విధాన
వేసరికతో సరిగ వికసింపని విధాన
అచ్చెరువుతో స్తబ్ధమై నిల్చిన విధానఁ
గుచ్చులుగఁ దిగ కన్నుఁ గొనలఁ జూపులు బెనఁగ
        ఆడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు
తరితీపు వెన్నెలలు విరిసికొన్న విధాన
నెఱ జాదులవి కుప్ప నెఱసికొన్న విధానఁ
దెలిబూది పూఁత దెట్టులు గట్టిన విధానఁ
జలికొండ మంచు గుప్పలుగూర్చిన విధానఁ
బొసఁగ ముత్తెపుసరు ల్బోహళించు విధాన
నసదృశము నమృతంబు నామతించు విధాన
ఘనసారమును దెచ్చి కలయఁ జల్లు విధాన
మనసులో సంతతము గనులఁ జాఱు విధాన
గులుకునీలపుఁ గండ్లఁ దళుకుఁ జూపులు బూయ
ఘలుఘల్లుమని కాళ్ళఁ జిలిపి గజ్జెలు మ్రోయ
        ఆడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు
మబ్బుగము లుబ్బికొని ప్రబ్బికొన్న విధాన
నబ్బురపు నీలములు లిబ్బి సేరు విధాన
నల్లగలువలు దిక్కు లెల్ల విచ్చు విధాన
మొల్లముగఁ దుమ్మెదలు మొనసికొన్న విధాన
వగలు కాటుకగొండ పగిలి చెదరు విధాన
దగిలి చీకటులు గొప్పగఁ గప్పెడు విధాన
దనలోని తామసము కనులఁ జాఱు విధాన
దనలోని వక్రతయె కనులఁ దీఱు విధానఁ
గులుకునీలపుఁ గండ్లఁ దళుకుఁ జూపులు బూయ
ఘలుఘల్లుమని కాళ్లఁ జిలిపిగజ్జెలు మ్రోయ
        ఆడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు
తమ్ములై, ఘటితమోదమ్ములై, సుకృతరూ
పమ్ములై, శాస్త్రభాగ్యమ్ములై, నవకోర
కమ్ములై, వికచపుష్పమ్ములై, దుమ్మెదల
తమ్ములై, భావమంద్రమ్ములై, హావఫు
ల్లమ్ములై, నూత్న రత్నమ్ములై, వల్గుహా
సమ్ములై, గన్గొనలసొమ్ములై, విశ్రాంతి
దమ్ములై, రక్తకిసలమ్ములై, రక్తిచి
హ్నమ్ములై, తంద్రగమనమ్ములై గెడఁగూడి
కులుకునీలపుఁగండ్లఁ దళకుజూపులు బూయ
ఘలుఘల్లుమని కాళ్ళఁ జిలిపిగజ్జెలు మ్రోయ
        ఆడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు
తరగలనుఁ జిఱుగాలి పొరలు వేచిన యట్లు
చిరుగాలిలోఁ దమ్మి విరులు గదలిన యట్లు
విరులలో నునుఁదావి తెరలు వేచిన యట్లు
తెరలపైఁ జిత్రాలు పరిఢవించిన యట్లుఁ
గమ్మకస్తురివీణె గడఁగి విరిసిన యట్లు
నెమ్మి దనపింఛమ్ము నెమ్మి విప్పిన యట్లుఁ
జిగురుటాకులు గాలి వగలు వోయిన యట్లు
నగవులో లేవలపు బిగువు జారిన యట్లుఁ
గులుకునీలపుఁ గండ్లఁ దళుకుఁ జూపులు బూయ
ఘలుఘల్లుమని కాళ్ళఁ జిలిపిగజ్జెలు మ్రోయ
        ఆడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు
మొగలిపూవులు దావిఁ బుక్కిలించిన యట్లుఁ
దొగకన్నె నీలంపునగవు జార్చిన యట్లు
నవవసంతపుశోభ భువిఁ గప్పికొన్నట్లు
శివుచెంత శర్వాణిసిగ్గు జారిన యట్లుఁ
గన్నెమదిఁ గోరికల కలలు దూకిన యట్లు
సన్నజాదుల తేరు సంధాన మైనట్లుఁ
బచ్చిసంపెంగపూలు బరపులై బడినట్లు
అచ్చెరువు రూపుకొని యాక్రమించిన యట్లు
గులుకునీలపుఁగండ్ల దళుకుఁ జూపులు బూయ
ఘలుఘల్లుమని గాళ్ళఁ జిలిపిగజ్జెలు మ్రోయ
        ఆడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు
నగవులే నగవులై, బిగువులే బిగువులై
సొగసులే సొగసులై, జూడ్కులే జూడ్కులై
దొలుకారు మెఱపుల్లు దోబూచులాడినటుఁ
దొలిచూలికన్నె కోర్కులు విచ్చికొన్న యటుఁ
దొలుసారి రతి వింతసొలపు గ్రమ్మినయట్లుఁ
దొలిగట్లుపైజొత్తు బులకరించిన యట్లుఁ
దొలుసంజలోఁ దెల్వి దూకివచ్చిన యట్లు
మలుసంజలోఁ గాంతి మరలిపోయిన యట్లు
గులుకునీలపుఁగండ్లఁ దళుకుజూపులు బూయ
ఘలుఘల్లుమని గాళ్ళఁ జిలిపిగజ్జెలు మ్రోయ
        ఆడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు
తీగలై, సోగలై, దీరుకొని బారులై
మూగికొని జొంపమై, మురిపెంపు దారులై
మలకలై, మొలకలై, మలపుఁగొని నేరులైఁ
పొలపంబు వెలయించి పూల దొలుకారులై
ముడులుగొని సుడులుగొని, మొగుడుకొని మొగ్గలై
జడిమగొని దడ బడుచు వడకి గడుఁ దగ్గులై
పిలపిలమటంచుఁ దావులుమూఁగ బాగులై
గులుకునీలఁపుగండ్ల దళుకుఁజూపులు బూయ
ఘలుఘల్లుమని గాళ్ళఁ జిలిపిగజ్జెలు మ్రోయ
        ఆడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు
మలక మెఱపులు గొన్ని, నిలువు మెఱపులు గొన్ని
సొలపు మెఱపులు గొన్ని, సూది మెఱపులు గొన్ని
కోల మెఱపులు గొన్ని, క్రొత్త మెఱపులు గొన్ని
చాలు మెఱపులు గొన్ని, జాఱు మెఱపులు గొన్ని
ప్రక్క మెఱపులు గొన్ని, సొక్కు మెఱపులు గొన్ని
నిక్కు మెఱపులు గొన్ని, నిండు మెఱపులు గొన్ని
క్రేళ్ళు మెఱపులు గొన్ని, క్రేటు మెఱపులు గొన్ని
సుళ్ళ మెఱపులు గొన్ని, త్రుళ్ళు మెఱపులు గొన్ని
కులుకునీలఁపుగండ్ల దళుకుఁజూపులు బూయ
ఘలుఘల్లుమని గాళ్ళఁ జిలిపిగజ్జెలు మ్రోయ
        ఆడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు
గరులుగల యంపగమి కరణిఁ దిరిగెడుఁ గొన్ని
యఱమోడ్పు కనుదోయి నణగిపోవును కొన్ని
ఉయ్యాలతూఁగులై యూగులాడెడుఁ గొన్ని
లేయెండవలె దట్టమై యేఁచు మఱిఁ గొన్ని
పందెపు గురాలవలెఁ బరుగులాడును గొన్ని
మందముగ మంచువలె మలసితిరుగును గొన్ని
గ్రిందుమీదై యీడిగిలఁ బడును మఱికొన్ని
సందుసందున నక్కి సాగిపోవును గొన్ని
కులుకునీలఁపుగండ్ల దళుకుఁజూపులు బూయ
ఘలుఘల్లుమని గాళ్ళఁ జిలిపిగజ్జెలు మ్రోయ
        ఆడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు
కరశాఖలను నూర్మికలు వోలె లగియించి
కరబంధములనుఁ గంకణములై జిగి నించి
కరరుహంబుల యావకపుజొత్తు బండించి
యఱుత నూతన తారహారములు నిండించి
చరణముల మంజీరసౌందర్యములు గూర్చి
యురముపై నెఱఁబూఁత నెఱసినటు రుచిఁ జేర్చి
యవలగ్నమున మేఖలవలెఁ జఱ్ఱునఁ జుట్టి
శ్రవణములఁ గుండలవిలాససంపద గట్టి
కులుకునీలఁపుగండ్ల దళుకుఁజూపులు బూయ
ఘలుఘల్లుమని గాళ్ళఁ జిలిపిగజ్జెలు మ్రోయ
        ఆడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు
ఎలగాలిపైఁ దేలి పొలయు గీతిక వోలె
నెలపాప బెదవిపై మలయు నవ్వును వోలె
కులపాలికా ముగ్ధ కిలికించితము వోలె
జలదాంగనా లలితసంచారములు వోలె
ప్రణయరథమునఁ తూగిపడు కింకిణులు వోలె
ప్రణయార్ద్రహృదయమునఁ బారాడు వెలుఁగువలె
సెలకన్నె యెడఁదలోఁ దలఁపు గలగలల వలె
చలివెలుఁగు వెన్నెలల మొలకతుంపరల వలె
కులుకునీలఁపుగండ్ల దళుకుఁజూపులు బూయ
ఘలుఘల్లుమని గాళ్ళఁ జిలిపిగజ్జెలు మ్రోయ
        ఆడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు
చిఱునవ్వు పొరలపై నొఱసి జారుఁడు గొన్ని
యరుణ గండములపై నంటి యాడును గొన్ని
నెమిలిపింఛము వోలె నెఱసి విరియును గొన్ని
కుముదముల ఱేకులై కలుకు వోవును గొన్ని
యిలయు నాకాశమ్ము ఁ గొలఁత వెట్టును గొన్ని
తళతళలు వెలయించి తఱచుఁ గప్పును గొన్ని
యడ్డంబు నిడువులై యమరి నిల్చును గొన్ని
యడ్డమాఁకయు లేక యాడిపోవును గొన్ని
కులుకునీలఁపుగండ్ల దళుకుఁజూపులు బూయ
ఘలుఘల్లుమని గాళ్ళఁ జిలిపిగజ్జెలు మ్రోయ
        ఆడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు
సమశీర్షకముతోడ సమదృష్టి ఘటియించి
సమపాద విన్యాస చాతుర్యము లగించి
వరపతాకమ్ము దాపటి కేల నెసకొల్పి
వామహస్తం బధో వక్త్రముగ సంధించి
త్రిపతాకమూని యర్థపతాకమును బట్టి
చపలదృష్టులు దిశాంచలములను మోపట్టి
ధూతమస్తము జెల్వు దోబూచు లాడంగ
వీతరాగులు ఋషులు వినుతులను సేయంగ
నిలయెల్ల చెలువు రూపెత్తి నిల్చిన యట్లుఁ
గలలెల్ల నిజములై గానుపించిన యట్లు
        ఆడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు
హంసాస్యమును రెండు హస్తంబులను నించి
అంసభాగంబులకు నానించి చూపించి
కలికి చూపుల చంపకములు బై జల్లించి
కెలఁకులకుఁ గంఠమ్ము మెలఁపులో నాడించి
కనుగ్రుడ్లు గనులఁ జక్రముజుట్టి చుట్టిరా
ధనువులై బొమలు దద్దయుఁ గాంతిఁ జూపరా
నొకకాలు దివిఁగొల్వ నొకకాలు భువినిల్వఁ
బ్రకటముగ దేవతావరులు భక్తినిఁ గొల్వ
నిలయెల్ల చెలువు రూపెత్తి నిల్చిన యట్లు
గలలెల్ల నిజములై గానుపించిన యట్లుఁ
        ఆడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు
ఒకసారి దిరములై యుండి కాంతులు గ్రుమ్ము
నొక్కసారి గంట వేసికొని ఫూత్కృతిఁ జిమ్ము
నొకసారి మనుబిళ్ళ యోజఁ జెంగుల దాటు
నొకసారి వ్రేలు వాడిన బూలరేకులై
యొకసారి దుసికిళ్ళు వోవుఁ జిఱుచేపలై
యొకసారి ధనువులై యుబ్బుఁ గన్నుల బొమ్మ
లిలయెల్ల చెలువు రూపెత్తి నిల్చిన యట్లుఁ
గలలెల్ల నిజములై గానుపించిన యట్టు
        లాడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు
కనుదోయి సైగలకుఁ గనుబొమలె బదు లొసఁగ
మనసులో నూహలకుఁ దనువె బులకలు దాల్పఁ
బ్రతిపులకలోఁ దీవ్ర భావములు వాసింపఁ
బ్రతియడుగులో లయోన్నతి దూగి శోభింప
నవ్వులకుఁ గింకిణుల నాదములె బ్రతినవ్వ
నవ్వులే మువ్వలై నాట్యమున నెలుఁగివ్వ
నెలుఁగులను శ్రుతిరుతులు నెలయు నంఘ్రులగతులు
గలసియో! గలియకో! గడుఁ గ్రొత్త రుచి నివ్వ
నిలయెల్లఁ జెలువు రూపెత్తి నిల్చిన యట్లుఁ
గలలెల్ల నిజముగా గానుపించిన యట్టు
        లాడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు
స్తంభయుగమో! నీప శాఖాద్వయమొ! మత్త
కుంభికరకాండములొ! గొనబైన దీగెలో!
సుమ దామములొ! శిరీషములె నిల్చిన విధమ్మొ!
కమల రజములు రూపుగట్టి వచ్చిన మెలపో!
తటి దుదంచిత కాంతి తాండవంబో! యనఁగ
నటువైపు నిటువైపు నమల హస్తములూగి
కనవచ్చుచును మందగతిని గదలినయప్డు
గనరాకయును శీఘ్రగతినిఁ బరుగిడినప్డు
నిలయెల్లఁ జెలువు రూపెత్తి నిల్చిన యట్లుఁ
గలలెల్ల నిజముగా గానుపించిన యట్టు
        లాడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు
పడగలెత్తును నాగుబాములై యొకసారి
ముడిచికొనుఁ గమలంపు మొగ్గలై యొకసారి
జ్ఞానముద్రికలఁ బక్షము లెత్తు నొకసారి
దీనదీనంబులైఁ దేలాడు నొకసారి
కటకాముఖంబులై గనుపట్టు నొకసారి
పటుముష్టిబంధసంపదఁ జూపు నొకసారి
శుకతుండ హస్తమున శోభిల్లు నొకసారి
ప్రకట భ్రమరీసరళి బరగించు నొకసారి
యటువైపు నిటువైపు నమల హస్తములూగి
యటమీఁద నిటఁగ్రింద నందములు జెల రేఁగి
        యాడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు
కైలాస శిఖరములు గడఁగి ఫక్కున నవ్వ
నీలిమాకాశంబు నిటలంబుపై నిల్వ
నందికేశ్వర మృదంగధ్వానములు బొదలఁ
దుందిలాఽకూపార తోయపూరము దెరలఁ
జదలెల్లఁ గనువిచ్చి సంభ్రమతఁ దిలకింప
నదులెల్లఁ మదిఁబొంగి నాట్యములు వెలయింప
వనకన్యలు సుమాభరణములు ధరియింప
వసుధయెల్లను జీవవంతమై బులకింప
        నాడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు
అదిగదిగో! జలదకన్యక జూచు నేమిటో?
సదమలంబై నట్టి శంకరుని నాట్యమ్ము
నవిగో! మయూరమ్ము లాలపించు నదేమి?
శివుని తాండవకేళి శివకరము షడ్జమము
చికిలిగొంతుకతోడఁ బికము గూయు నదేమి?
సకలేశ్వరుని శ్రుతి స్థాయికై బంచమము
వాయుపూరిత వేణు వర్గ మే మందించు?
నా యభవు దాండవముకై తార షడ్జమం
        బాడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు
ఒకవైపు నర్థచంద్రకరంబు బరగించి
యొకవైపు సూచీ ముఖోద్వృత్తిఁ జూపించి
క్రీగంటితో నవ్వు గ్రేళ్ళురుక వీక్షించి
మ్రాఁగన్ను వైచి తన్మయతఁ దా నటియించి
వామపాదము జక్కఁగా మహిని నాటించి
నేమమున దక్షిణము నింత మీఁదికి నెత్తి
యుయ్యాలతూఁగుతో నూగులాడఁగ మధ్య
మొయ్యనొయ్యన మువ్వ లూగి నవ్వులు నవ్వ
        నాడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు
కుడికాలి నంబువలెఁ గొంచెముగ మునువంచి
యెడమపాదము వైపు నింతశీర్షము వంచి
కమలనాళములు హస్తములు బారలు సాచి
ప్రమదమ్ముతో రెండువైపు లల్లనఁ జాచి
సవ్యవక్షము బులకచయముతో నుబ్బంగ
సవ్యేతరము సిగ్గుతో వెన్క కొదుగంగ
నొక గపోలము నగవు వికసించి రాగిల్ల
నొక గపోలము బిగువు బ్రకటించి తోపిల్ల
        నాడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు
ఎడమచేతినిఁ బ్రీతి నడుముపై సంధించి
కుడిచేతిలో నంచకొదమగుఱుతు లగించి
యంచముక్కున దృష్టి నంచితంబుగఁ జేర్చి
సంచాలితమొనర్చి సమశిరము ముందునకుఁ
బరివాహితముఁ జూపి పైపైనిఁ గాంతమ్ముఁ
బరగించి చూపు భావావేశ మధురమ్ము
నటుదూగి యిటుదూగి చటులమ్ము గజకృత్తి
నటనమధ్యమ్ములో నయముగాఁ గడకొత్తి
        యాడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు
ఒకకాలు వెనుకకై యొకకాలు ముందుకై
మొకమెల్లఁ జిరునవ్వు మురిపెముల ముద్దయై
గుడిచేతి యందు లఘుకోణత్వము ఘటించి
యొడికంబుగాఁ దలముఁ బడగవలెఁ గుంచించి
పెరచేత గురుకోణ మరుదుగాఁ దావలచి
కరశాఖలను వంచి శిరము వెన్కకుమలఁచి
వెనుకఁజూచిన యప్డు వెన్నెలలు జిలికించి
మునుముజూచిన యప్డు ముద్దులే బండించి
        యాడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు
హస్తంబు కనుదోయి కడ్డంబుగా నిలిపి
శస్తంబ రాళంపు సంజ్ఞ నెదురుగ మలపి
ధూతంబుశిరము సాకూతంబు కనుచూపు
ప్రీతిఁగావింప నిల్చిన దేవతల కెల్ల
నాభికెదురుగ దక్షిణంబైన హస్తమ్ము
శోభిలనుజల్లింప సోలపద్మపుముద్ర
యొకవైపు గటిభాగ మొయ్యారముగ నొత్తి
సకలలోకముల కాశ్చర్యంపు సిడమెత్తి
        ఆడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు
తకిటతక, తకతకిట, తకతకిట, తకిటతక
తకతదిగిణతొగిణతొ, కిటతకతదిగిణతొ
కిటతకతదిగిణతొ, కిటతకతదిగిణతొ
చటులంబులగు జతులు సరిగాఁగఁ దూగించి
ససరిరిస రిగరిరిస సరిగాగ రీగాగ
ధసగాగ గధపాప ధపసాస
.......
రిరిసరిస సరిగాగ రీగాగ రిగరిరిస
.......
సరిసాస పదపాప సరిగ నెత్తులుముడిచి
        ఆడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు
మేళకర్తల నెత్తి యాలాపనము దీర్చి
యాలాపనమ్ములో నక్షులను నఱమోడ్చి
సంవాదివాదు లనుస్వరములను జూపించి
గొవ్విరుల గుచ్ఛములు గునిసిపోయిన యట్లు
గమకములు వెలయించి కడఁగి జారులుబట్టి
ప్రమదమ్ముతోడఁ మూర్ఛనలెల్ల రాఁబట్టి
మంద్రమధ్యమతార మధురిమలు జూపించి
సాంద్రమ్ముగా గానసాగరమ్మును రేపి
        ఆడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు
వక్రరాగము నెత్తి, పాండిత్యధీరతో
పక్రమణమును బూని, ప్రక్కవాద్యముఁ జూచి
కనకాంగియే యంచుఁ గనుఁగోనలనె నవ్వి
వినిపించి, శుద్ధస్వరనిచయంబునె ద్రవ్వి
కాలువిడు పఱయు ముక్కాలుచోటుల నెత్తి
కోలుఁ జూపించి, నిక్కుగఁ బల్లవులఁ బాడి
కాలభేదములతోఁ గలితనం బెలయించి
సోలు నిర్జరమనస్సుల నెల్ల వంచించి
        ఆడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు
మధ్యమము రాగసామ్రాజ్యాధిదైవతము
శుద్ధమ్ముగాఁ బ్రతిగఁ జూపించి వణకించి
వణకులో నొకగ్రొత్త వాలకము గనుబరచి
తని పూవులను బుట్టలను దెచ్చిపోసినటు
గలగలమనంగఁ జిఱుగవ్వలను వెదికినటు
బలపలని యెండుటాకుల మర్మరములట్లు
నాదధేనువు బొదుగునందు దుగ్ధము జాఱ
భేదవాదము రాగవీథిలో బుడమార
        ఆడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు
స్వరకన్యకల గుబ్బచనులఁ బుల్కలురేపి
సురకాంతలకుఁ గోర్కె లెరయ నెమ్మదులూపి
లయపురుషు నానందరాశిలో మునిగించి
రయముతోఁ దాళముల రవణములు హత్తించి
ఝల్లరీముఖవాద్య చయముమేనులుదాల్చి
యుల్లములఁ బొంగెత్తి "యో" యంచు నెలుగివ్వఁ
దంబూర యానంద తరళసంఫుల్ల వ
క్త్రంబుతోఁ, దానుగా గళమువిచ్చుక పాడ
        ఆడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు
వల్లకీసుందరులు ఫుల్లరాగములీనఁ
గల్లోలమయిపోవ గంధర్వ హృదయములు
అచ్చరలగన్నులం దానందబాష్పములు
బెచ్చుగా గండముల విరిసికొన హాసములు
గిన్నరీహస్తముల సన్నజాజులు మురిసి
చెన్నుగాఁ బలుక నుజ్జీవములు బాటలను
పలుకుఁ పల్కున నమృత భరము తుంపెసలాఁడ
నిలువెల్ల గానమే నిండికొని వెలికూర
        ఆడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు
సరిగాగ రూపించి షడ్జమము వట్టంగ
శరజన్ము తేజి పింఛమువిప్పి నర్తింప
ఋషభస్వరంబు కుల్కించి పాడిన నంది
వృషభంబు చెలరేగి నియతిపై లంఘింప
నందంబుగా ధైవతాలాపనము సేయ
గంధర్వ లోకంపు గనులఁ బూవులు బూయఁ
బనిఁబూనుచు నిషాదస్వరము రక్తికిఁ దేఁగ
వెనకయ్యబృంహితము వెనుకఁ దరుముక రాగ
        ఆడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు
ఎత్తుగడ కెత్తుగడ కేరీతిఁ దోచునో!
గ్రొత్తతీరులను గ్రొంగ్రొత్తభావము లాచి
సరసిలో లేయలల తెరలవలె నుబుకునో!
స్వరపంపకములోన జాతులను వెసమార్చి
మానతైష్ణ్యం బదెంతటిదో! దాళము వేయఁ
బూని యమరులు దప్పిపోయినా రెచ్చటనొ!
శ్రుతిలయంబెంత పెచ్చుగ రేగెనో! సర
స్వతిగుండె కంపించి జలజలా బారంగ
        నాడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు
అఱపల్కు వచియించి యక్షులను బూరించుఁ
బూరించునర్థంబుఁ బొందించు హస్తముల
మొదలఁ గన్నులఁ గొంత ముచ్చటించును మిగులుఁ
గదియించు వాఙ్మయాఖండ పుణ్యము బండఁ
గనులసైగలు మాటఁ బెనవేసి చూపించు
వెనుక మాటలుబల్కి, మును దీర్చుఁ గన్నులను
వచియించిపల్కు, లావల నేత్రముల దిద్దు
ఖచరులెల్లరును దిగ్భ్రమ మొంది వీక్షింప
        ఆడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు
సంయుతకరంబులను శాస్త్రాను సారంబ
సంయుతకరంబులను జక్కఁగాఁ గదియించి
శాస్త్రమునుదాటి తన స్వాతంత్ర్యమును బూని
శాస్త్రకారులయూహ సాగుమార్గముఁ జూపి
భావరాగముల సంబంధంబు, రాగ లీ
లావిశేషంబు నుల్లాసంబు గదియింప
భావమే శివుఁడుగా బ్రమరి చుట్టెడు భంగి
భూవలయమెల్ల మదిఁ బొంగి యాడెడుభంగి
        నాడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు
స్థలపద్మములవోలె నిలుకడగ నిలువఁబడి
మెలఁగుకూర్మమువోలె మెల్లగాఁ జలియించి
యావైపు నీవైపు నల్లనల్లనఁ దిరిగి
భావింప గజగమనభంగి ముందుకు సాగి
వాలుగల కులుకు వలె వంకరలు జిత్రించి
వ్రాలి, నాగమువోలెఁ బార్ష్ణిభాగం బెత్తి
వెనుకభాగంబెత్తి, మునుము నేలకు నొత్తి
యనుకొనని యందమ్ము లలరింపఁ బదతలము
        లాడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు
ఎలగాలిఁ గదలు నాకులువోలెఁ దేలికై
యలలతూగుడులఁ దమ్ములపూవు లట్టులై
గన్నె కనుబొమలోని కలలబరు వట్టులై
మిన్ను గన్నట్టి చిఱుమేఘముల యట్టులై
కలికి బిగిగౌగిలింతల హాయిఁ గొల్లాడి
చెలిచెక్కుపై సిగ్గు చెలువంబు నుగ్గాడి
యవనీ కుచస్థలంబట్టుగా బిరుసెక్కి
వివిధరీతుల నేర్పు వెలయింపఁ బదతలము
        లాడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు
కోనలును కొండలును కోల్మసఁగి తలలూపఁ
కొనగోలువలికి సాకూతంబుగాఁ జూచి
డక్కచెక్కును గీటి డంబుగాఁ బలికించి
యెక్కడను దననాట్యమే మాఱు మ్రోయంగఁ
దానె తాండవమౌనొ! తాండవమె దానౌనొ!
యేనిర్ణయము దనకె బూనిచేయఁగరాకఁ
దామఱచి, మఱపించి తన్నుఁ జేరినవారిఁ
గామునిని దన మూఁడుగన్నులను సృష్టించి
        యాడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు
ఒకసారి దనుమఱచు నుప్పొంగునాట్యమున
నొకసారి మఱపించు నూది, తాండవకళనె
మఱచిమఱువక యొక్కపరి యాంగికము వట్టు
నెఱసంజవైపు గన్గిఱిపి సైగలుసేయు
నొకవైపు దాండవం బొకవైపు లాస్యమ్ము
నొకవైపు గాంభీర్య, మొకవైపు శృంగార
మొకవైపు భస్మంబు, నొకవైపు జిత్రకం
బొకవైపు భేదదృ, క్కొకవై పభేదమున
        నాడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు
నీలసూత్రము లోన నిక్కి యర్రులుసాచి
కూలంకషమ్ముగాఁ గూయు జిఱుగజ్జియలు
జిలిబిలి పదంబులను పలుకు నొక్కకసారి
కలకలమటంచు నవ్వులు జిల్కు నొకసారి
చెలువంబు వడబోసి చిఱు నవ్వు నొకసారి
కొలఁదిమీఱంగ ఫక్కున నవ్వు నొకసారి
మూఁగసైగలతోనె మురిపించు నొకసారి
రాగాలపనమందు రణియించు నొకసారి
        ఆడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు
జననాంతరంబులో సంసక్తమయి వచ్చి
మనసులోతుల నిల్చి, మాటాడువాసనలో!!
యమృతమయమై యాత్మనంటిన సుషుప్తిలోఁ
గ్రమముగా గప్పు నిర్జరమహచ్ఛాయలో!!
బ్రమదంబె రూపెత్తు బంగారుకలలలో
నమరకాంతలు సేయునట్టి గనుసైగలో!!
యన సూక్ష్మతమముగా, నటు సూక్ష్మతరముగా
వినఁబడియు, వినఁబడనివిధిగ మువ్వలుమ్రోఁగ
        నాడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు
కరుణఁ జూపినయప్డు దొరఁగుబాష్పమ్ముల
చ్చెఱువు జూపినయప్డు జిగినించు నిశ్చలత
వీరంబులో నగ్గి వెడలించుఁ దారకలు
ఘోరంబులోఁ గెలంకులఁ గొల్చుఁ గనుగ్రుడ్లు
వికృతంబులో వంగి వికటించుఁ గనుబొమలు
వికచంబులగును దారకలు హాస్యమునందు
శృంగారమున విలోలిత దృష్టిపాతంపు
భంగి, రౌద్రమున దుర్భరకటాక్షములతో
        నాడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు
భావాంబరమున కావల వెల్గు దైవంబు
భావగోపీనాథుఁడై వేడ్కఁ జెలఁగించి
రాగిణీవిభ్రమము లక్కడక్కడ దీర్చి
రాగాలపనజన్య రమణీయతలు బేర్చి
యొకయడుగు జననంబు, నొకయడుగు మరణంబు
నొకభాగమున సృష్టి, యొకవైపు బ్రళయంబుఁ
గనుపింపఁ దిగకన్నుఁగొనలు మిన్నుల నంట
మునిజనంబుల హృదయములు దత్పదం బంట
        నాడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు
సమమధ్యదృతగతులు జరణముల, ననుకూల
భ్రమణములు నడుములోఁ బ్రౌఢములు వ్యాకృతులు
బయిపైని గప్పికొను భావబంధంబులును
నూరేసిగజ్జియల నులివులో వేదములు
దీరైన నృకపాల హారములు గానములు
దొలుకాడు గంగమ్మ యలలలోఁ దానములు
మొలిపించి, జందురుని మొగముపైఁ జిఱునగవు
        లాడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు
భరతముని ముందుగాఁ బదపద్మములుబట్టి
"హరహరా!" యని ప్రమోదాయత్తుఁడై దూఁగఁ
దనసృష్టిగర్వంబు దలిఁగిపోఁగ విరించి
కనులలో బాష్పములు గట్ట డీల్పడి నిలువ
నావైపు నీవైపు నష్టదిక్పాలకులు
కేవలము రసమూర్తులై, విశ్వమును మఱువ
దన వేయికనులు జాలని బిడౌజుడు, గౌత
ముని శాపమున గొఱంతనుఁ గూర్చి చింతింప
        నాడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు
హరియె హరుఁడై, లచ్చి యగజాతయై, సరికి
సరి, దాండవములాఁడ సమ్మోదరూషితులు,
హరునిలోహరిఁ జూచి, హరియందు హరు జూచి
నెఱవేది దేవతలు విస్మితులు, మునులెల్ల
రధిగతానందభావావేశచేతస్కు
లెదవిచ్చి, యుప్పొంగి, యెగిరి స్తోత్రము సేయ,
భేదవాదములెల్లఁ బ్రిదిలిపోవఁగ, సర్వ
మేదినియు నద్వైతమే బ్రతిధ్వనులీన
        నాడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు
శోకమ్ము సంతోష మేకమ్ము, నరకంబు
నాకంబు నేక, మ్మనంత మాకాశమ్ము
పరిగతంబగు భూమి, నవనిధులు బల్వములుఁ,
తరులు బీజములుఁ, గ్రొవ్విరులుఁ గసిమొగ్గలును
జఠరాంధకారంబు పరిణాహిచంద్రికలు,
పరమఋషు, లజ్ఞాన భరితు, లందఱకు నేఁ
డద్వైత! మద్వైత! మని మాటి మాటి
కద్వయముగా నొత్తి, యఖిలలోకము లార్వ
        నాడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు
ప్రతితారకయు విచ్చి, ప్రత్యణువుఁ బులకించి
శితికంఠునకు నపుడు సెల్లించినది సేవ,
యానందసాగరం బంతటనుఁ గవిసికొన
మీనములుఁ దిమిఘటలు మేదినీజీవములు
బ్రతిప్రాణిహృదయమ్ము వల్లకీవల్లరిగ
మతిమఱచి పాడినది మధురసంగీతమ్ము,
జగమెల్ల భావంబె, సడియెల్ల రాగంబె
జగతియే యొక నాట్యసంరంభముఁనుగాగ
        నాడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు
చూచువా రెవ్వరా చోద్యంబు! నందఱును
సూచింత్రు దాండవము, సొక్కి సమ్మోదమున
శంకరుఁడె గెమ్మోవి సెలవులను జిఱునవ్వి
పంకించి తల, నటక వర్గంబు వీక్షించె
హరుఁజూచి హరినవ్వె, హరుఁడె హరియైనవ్వె
విరిసికొనె నొకవింతవెన్నెలలు లోకముల
శ్యామసాంధ్యస్ఫూర్తి జంద్రికలలో డాఁగెఁ
గామించెఁ బ్రకృతి జీకటులొ! జ్యోత్స్నాతతియె
        ఆడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు
నవజటాపటల సంధ్యాకాలవారిదాం
తవికాసచంద్ర మంద్రాతపార్ద్రశరీర!
నగకన్యకానేత్రయుగళనిర్యత్కటా
క్షగణతాపింఛ పింఛాధీనగురువక్ష!
నిగమదాసీ సమున్నిద్రసాహోనినా
ద! గణనీకృతనైకతారహారవిలాస!
భూతేశ! భూతభావాతీత! యనిపల్కి
స్తోత్రములఁ బఠియింపఁ జోద్యమున వైకుంఠుఁ
        డాడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు
పద్మామనోబ్జ యావకపుష్పితశరీర!
పద్మసుందరనేత్ర! భావాంబరాతీత!
మాయాసతీభుజా మధుపరీరంభాఽవి
షయవివేక! హృషీకసంచయాఽధిష్టాత!
శౌరి! నీ తేజమే సంక్రమించెను నన్నుఁ
బూరించెఁ దాండవముఁ బూర్ణచిత్కళతోడ!
నని నిటాలమునందు హస్తమ్ములను మొగిచి
వినతుఁడై శంకరుఁడు విష్ణువును నుతియించి
        యాడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు


విజయా ప్రార్థన
కలకలరణత్కాంచీ, పంచాస్త్ర జీవనమూలికా
నిగడితహరప్రేమా శ్యామా సదృక్షవపుస్స్థలీ
మునిజనమనఃపేటీ, చేటీకృతామరవల్లభా
జయతి కరుణాపాంగా, చంద్రావతంస సధర్మిణీ!
నిరావై ర్మాంజీరైః కిమపి కథయంతీవ మధురం
రహస్యంవేదానాం, లలిత లలితాన్‌ దృష్టివలయాన్‌
కిరంతీశ్యామాంగీ, కుచభర నమన్మధ్యలతికా
నటంతీ పాయాన్నః పరమపదసీమా, హరవధూః.
మరకతరుచా మైదంపర్యం, మునీశ్వరమండలీ
సుచరితఫలం, కాంతం, కటాక్ష తరంగితం
ప్రమదహృదయోపేతం, కదంబవనాశ్రయం
కిమపి సుభగం తేజశ్శివాఖ్య ముపాస్మహే.
నతానాం భక్తానాం నయనయుగబాలార్కసుషమా
మహార్షీణామాశా, త్రిదశతరుణీ కైశ్యఘటితా
స్వసంపర్కోత్సేకా త్సపది శివయంతీ శివతనుం
శివంకుర్యాన్మాతుః పదవనజపాటల్యలహరీ!
మదిరాఘార్ణితనేత్రా
మదగజగమనా, మనోజ్ఞతరవదనా!
మనసి మమ సన్నిధత్తాం
మాతంగీ! మధ్య నిక్వణత్కాంచీ!
అనుభవరసికై ర్ఞ్నేయా
మాదిమజననీం! హృదబ్జమధుధారాం!
నీలమణిసదృశ దేహాం
బాలాం, తా మాశ్రయే మహోరూపాం!


శివాలాస్యము
ఫక్కుమని నవ్వినది జక్కవల పెక్కువలఁ
జక్కడుచుచనుదోయి నిక్కఁ బార్వతి యపుడు
నిక్కుచనుదోయిలో నిబిడరోమోద్గమము!
దిక్కుదిక్కులనెల్ల దివ్యనేత్రోత్సవము!
తెగమిగులు దొగలు జిగి బుగులు గన్నులదోయి
నిగనిగలు మిట్టింప నిలచి చూచెను గౌరి
నిలుచువాలకములో నెలవంపు వంపులోఁ
గులికినది యమృతమో! గోటిసౌందర్యాలొ!
బంధూకపుష్పసంబంధు వగు చిరుపెదవి
నందముగ గదియించె నలసహాసం బార్య
యానవ్వులోఁ గదలె నచ్చరలసిగ్గులో!
గాని యీశ్వరు కలలో! కామధేనువుపాలొ!
స్థలపద్మములయొప్పు గల తామ్రతలపాద
ములఁ గదల్చెను దేవి మురిపెములు జిలికించి
కదలుకదలికలోనఁ గలకలా నవ్వెనఁట
గొదమగంటలొ! నిల్చికొన్న స్వరకన్యకలొ!
లలితముగఁ బలికిన మొలనూలు, గోయిలల
జిలుఁగుగొంతుక తీపి జలజలా పారించి,
యా వాకలో నిల్చె నాగమాంబురుహమ్ము
లావిరులపై నాడె నానందబ్రహ్మమ్ము!
జంకించినది లలిత చపల భ్రూలతలతో
శంకరునిశర్వాణి జలద సుందరవేణి
తటుకునను సూచిహస్తంబుతో, నాగేంద్ర
కటకునకు ధైర్యంబు గంపించిపోయినది!
అటుబండె నొకసారి యతివ కిలికించితం
బిటువిరిసె నొకసారి యింతి యుల్లోకితము
ప్రమదాకపోలమ్ము భావకిమ్మీరితము
కమనీయ మదరాగ కలికా విచుంబితము
కుణుకుణు క్వణనంబు లనుగతిగముగఁ బాడ
నణుమధ్య జూపినది యభినయ విభేదములు
వనములను, వనధికంకణములను, జగతిలో
నణువణువునను భావ మాక్రమించిన దపుడు
తరళలోచన వింత తానకంబుల నిలచి
కరపద్మముల నర్థకలనంబుఁ జూపించె
నా సృష్టి నందుకొన కమరులును దేవర్షు
లాశంకితులు, నద్భుతా క్రాంతమానసులు
గా నించినది దేవి, కలకంఠశృతివీధి
లో, నిత్యరమణీయలోకములు పొంగెత్తఁ
పలికినవి వల్లకులు కలకంఠిగానమ్ముఁ
పలికినవి వల్లకులొ! బరమేశ్వరియొ గాని!
తకఝణుత, ఝణుతతక, తకిటతది గిణతొత
గిణతొ తదిగిణతొ యను రణనములు మీఱంగఁ
బ్రతిగజ్జె యెడఁదలో భావములు బులకింపఁ
బ్రతిభావమున రసము వాఱిదిక్కుల ముంప.
ప్రియురాలి యూరువులు బ్రేరేప చషకమ్ము
పయి మందవలితమ్ములయి లేచు దరగలటు
బాలేందుఫాల, నగబాల, పార్వతి నిలిపి
లీలావిపర్యాప్త రేచిత భ్రూలతలు
పరివాహితము శిరము, చిఱునవ్వు, నెత్తమ్మి
విరికన్నుఁ గవలందు విభ్రమాలోకితము
కించిదాకుంచితము, చంచలము, బొమదోయి
పంచాస్త్రుబాణమ్ము, పర్వతేశ్వరు సుతకు
నవశిరోభేదములు నవకంబుగాఁ జూపి
భవురాణి యష్టగుణభావదృష్టులు మోపి
పదిరెండుహస్తములు బట్టి, మదిరాక్షి మఱిఁ
బదిలంబుగాఁగ గ్రీవాభేదములతోడ
ఆడినది గిరికన్నె యలసమారుత మట్లు
బాడినది సెలకన్నె పకపకా నవ్వినటు
లాటపాటల తోడ నవశులై బ్రహ్మర్షి
కోటులెల్లెడ నమిత జూటులై సేవింప
శరదబ్జధూళిపింజరితముల చక్రముల
సరిదూగు లావణ్యభరిత కుచయుగ్మములు
చనుకట్టు నెగమీటి మినుఁ దాకునో! యనగ
వనజాక్షి, పై పైని వక్షమ్ము విరియించి
                        యాడినది గిరికన్నె
ఒకవైపు భ్రూభంగ మొదిగించి చూచినది
వికచసాకూతముగ విశ్వేశ్వరుని లలిత
యా చూచుచూపుతో నర్ధేందుభూషునకుఁ
బూచిపోవఁగ బుష్పముకుళములు నిలువెల్ల
                        నాడినది గిరికన్నె!
మేఖలా చంద్రికిత మృదుమధురమౌ మధ్య
మాకంపితఁ బయ్యె నగరాజప్రియపుత్రి
కా కంపితంబులో నలసవ్రీడాభరం
బాకేకరితదృష్టి యనురాగసూచకం
                        బాడినది గిరికన్నె!
సవ్యహస్తం బర్ధచంద్రాఽభినయముతో
దివ్యలీలనునిలిపి, దేవి నడుమునయందుఁ
గొనగోట నుదుటఁ గమ్మిన జెమ్మటల మీటి
కొనచూపులనె శివుని గోర్కె లోతులు దూటి
                        యాడినది గిరికన్నె!
కోపఘూర్ణితమైన కొదమనాగము వోలె
దీపులగునూరుపులు దెసలెల్ల జల్లించి
యలసవలితములు జేతుల భంగిమలతోడ
జలజారిమకుట గన్నుల నాస లెసకొల్పి
                        యాడినది గిరికన్నె!
నడునొసలిపై నున్న నాభినామము కరఁగి
వడిజాఱి కనుబొమల వంకలను నిలువంగఁ
గ్రొత్తఁదోమిన దంతకోరకంబుల గాంతి
గుత్తులుగ గుత్తులుగ హత్తికొన శివుపైని
                        యాడినది గిరికన్నె!
సమపాదయుతమైన స్థానకస్థితి నిలచి
క్రమముగాఁ జూపులను గంజాక్షి విరజిమ్మి
ఘలుఘల్లుఘలు మనెడి వలయునాదములతోఁ
జిలిపినవ్వుల సుమాంజలి వట్టి శివునికై
                        యాడినది గిరికన్నె!
వెలయంగఁ దొమ్మిదగు విధములను చెలువముగ
నలినాక్షి భూచారినాట్యములు జూపించి
పదునాఱగు ఖచారిపద్ధతుల నెసగించి
మదిరాక్షి గతిచారి మధురిమలు బొసఁగించి
                        యాడినది గిరికన్నె!
శిరము చూపులు మించు చెక్కిళ్ళు కనుబొమలు
తరుణాధరము పయోధరములును దంతములు
ముఖరాగచిబుకములు మొదలైన వావగలు
సకియ, భావానుగుణ చాలనంబుల నెసఁగ
                        నాడినది గిరికన్నె!
శుకతుందనిభ కుచాంశుకము వదులుగ జాఱ
మొకముపై ముంగురులు ముసరుగొని విడఁబాఱఁ
బంచెవన్నెలకాసె వగలు గులుకఁగ విమల
చంచలాక్షులఁ గటాక్షాంచలమ్ములు మిగుల
                        నాడినది గిరికన్నె!
సమరూపములగు నంసములుఁ గటి కంఠములు
సమపాదములు నంగసమరూపచలనములు
నురుము పెక్కువయు, సుందర భావప్రకటనము
సరసీజముఖి నాట్యసౌష్ఠవమ్మును, జాట
                        నాడినది గిరికన్నె!
ఆవైపు నీవైపు నతిరయంబునఁ దూఁగ
భావభవు తరవారినా వెలయు కీలుజెడ
చలితనాట్యమున కాశ్చర్యపరవశుఁడగుచు
లలితేందుధరుడు దానిలువఁ దిన్నఁగనగుచు
                        నాడినది గిరికన్నె!
పూవుగుత్తులనడుమఁ బొలుచు గిసలయమువలె
దా విమలమర్దళాంతరమునను నిలుచుండి
పలుమారు నిలమీఁద లలితముగఁ గ్రుంగి, కిల
కిలకిల మటంచు, మేఖల నవ్వులనుఁ బొదల
                        నాడినది గిరికన్నె!
జరతపావిడ చెఱఁగు చలియింప, గంతసరి
గరము నటియింప, బంధుర శ్రోణి గంపింప
గరయుగంబుల ఘల్లుఘలుమంచు నెలుగించు
వరకంకణములతో భావభవు గంధగజ
                        మాడినది గిరికన్నె!
కలఁగఁ జెక్కిళ్ళపయిఁ గస్తూరి మకరికలు
మలఁగ నిటలంబుపైఁ దిలకంబు లలితంబు
నిడుదఁ గన్నులఁ దేరు నీలోత్పలములతోఁ
దడఁబడని లయతోడఁ గడువేగముగ నప్పు
                        నాడినది గిరికన్నె!
ధిమిధిమి యటంచు దుర్దిన వారిధరధీర
భ్రమబూన్చి మద్దెలలు బలుమాఱు ధ్వనియింప
జకితచకితాంగియగు సౌదామనియు వోలె
వికచాక్షి యజ్ఞాత విభ్రమంబులు జూపి,
                        యాడినది గిరికన్నె!
భవుని వక్షమునందుఁ బదలాక్షఁ జిత్రించి
నవరసంబులకుఁ బుణ్యపుఁ బంట జూపించి
భరతముని నానంద తరళితునిఁ గావించి
సర్వకన్యలకుఁ దత్తఱపాటుఁ గల్పించి
                        యాడినది గిరికన్నె!
కుచ్చెళులు భువిఁ గుప్పగూరియై నటియింప
ముచ్చెమటతో మొగము మురిపెముల వెలయింప
ముచ్చటగ నిరుప్రక్క ముక్కరయుఁ గంపింపఁ
బచ్చవిల్తునిపూన్కిఁ బారంబు జూపింప
                        నాడినది గిరికన్నె!
ప్రతిపదములో శివుఁడు బరవశతఁ దూగంగ
సతి జంద్రమకుటంబు సారెకుఁ జలింపంగ
వ్రతతి దూగాడినటు వాతధూతంబౌచు
శతపత్రమది ముక్తసరి విచ్చికొన్నట్టు
                        లాడినది గిరికన్నె!
గగన వనమున విచ్చికొనిన జలదంబట్లు
వనముననుఁ బారాడు వాతపోతంబట్లు
పోతమ్ము గల్లోలములపైనిఁ దూగినటు
శాతాక్షి గాయమ్ము సంచాలితమొనర్చి
                        యాడినది గిరికన్నె!
బ్రహ్మాణి యానంద పారిప్లవాంగియై
జిహ్మగాక్షముల వీక్షించి మిన్దాకంగ
సకలామరులు శిరస్స్థలకీలితాంజలులు
సకలేశ్వరునిఁ దన్ను సంస్తుతించుచుండ
                        నాడినది గిరికన్నె!
ప్రతిసుమముఁ తన్మయత్వమునఁ గిలకిల నవ్వఁ
బ్రతిపక్షి యున్మాద పరవశత నదియింపఁ
బ్రతిజీవి బులకింపఁ బదునాల్గు లోకముల
సతులితంబైనట్టి యద్వైతమే మ్రోగ
                        నాడినది గిరికన్నె!
తనలాస్యమును మెచ్చి తరుణచంద్రాభరణుఁ
డనుమోదమునఁ జేతులను గలిపి యాడంగ
శివశక్తులొక్కటిగఁ జేరినంతన మౌను
లవికృతేంద్రియు "లో!" మ్మటంచుఁ జాటింపంగ
                        లాడినది గిరికన్నె!
పలికిరంతటన గీర్వాణులెల్లరుఁ గూడఁ
జలితకంఠముల శివశక్తులకు మంగళము!
కచ్ఛపీవీణ యుత్కంఠతోడుత రాగ
గుచ్ఛముల నీన నాఘూర్ణితములుగ దిక్కు
                        లాడినది గిరికన్నె!
దేవాది దేవాయ! దివ్యావతారాయ!
నిర్వాణరూపాయ! నిత్యాయ! గిరిశాయ!
గౌర్యైనమో! నిత్యసౌభాగ్యదాయై!
తురీయార్ధదాత్ర్యై!! ధరాకన్యకాయై!!
AndhraBharati AMdhra bhArati - padya kAvyamulu - shivatAMDavamu - 'sarasvatIputra' puTTaparti nArAyaNAchAryulu - Shivatamdavamu - Saraswatiputra Puttaparti Narayanacharylu ( telugu kAvyamulu andhra kAvyamulu)