కావ్యములు విజయ విలాసము ప్రథమాశ్వాసము
గంగా తీరమున నాగకుమారి యులూచి యర్జునుని గాంచి మరులు గొనుట
క. భోగవతి నుండి యెప్పుడు
భాగీరథి కడకు వచ్చి భాసిలు మున్నే
నాగకుమారిక యయ్యెల
నాగ యులూచి తమి నొక్కనాఁ డటఁ జెంతన్‌
58
ఆ. హిమ రసైక సైకతమునందు విహరించు
కైరవేషు వేషు ఘన నిభాంగు
నెనరు దవుల దవులనే చూచి క్రీడిగా
నెఱిఁగి యౌర! యౌర గేందువదన
59
క. మును ద్రౌపదీ స్వయంవర
మున కేఁగిన కామరూప భోగులవలనన్‌
వినియున్న కతనఁ దమకము
మనమునఁ బెనఁగొనఁగఁ జేరి మాయాన్వితయై
60
ఉ. గుట్టసియాడ గబ్బి చను గుట్టలపైఁ బులకాంకురావళుల్‌
తెట్టువ గట్టఁ, గోరికలు తేటలు వెట్టఁగ, వేడుకల్‌ మదిన్‌
దొట్టికొనంగ, నచ్చెరువు తొంగలి ఱెప్పల వీఁగ నొత్తఁగాఁ
బెట్టిన దండ తీయక విభీత మృగేక్షణ చూచె నాతనిన్‌
61
క. ఏణాక్షి నపుడు వెడ సిం
గాణిన్‌ గొని యలరుఁ దూపుగమిఁ జక్కెరయే
ఖాణముగాఁ గలిగిన కం
ఖాణపు దొర పింజపింజ గాడఁగ నేసెన్‌
62
ఉ. పై పయిఁ గౌతుకంబు దయివాఱి యిటుండఁగ నంత మజ్జనం
బై పువుఁ జప్పరమ్మున నొయారముగాఁ గయిసేసి, దానలీ
లా పరతంత్రుఁడై కలకలన్‌ నగుచుండెడి సవ్యసాచి, నిం
ద్రోపలరోచిఁ జూచి, తలయూఁచి యులూచి రసోచితంబుగన్‌.
63
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - vijaya vilAsamu - prathamAshvAsamu - chEmakUra vEMkaTa kavi( telugu andhra )